రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్: రాత్రయితే చాలు వేధించే రుగ్మత, నూటికి పది మందిలో కనిపించే ఈ సిండ్రోమ్‌కు మీరూ బాధితులేనా?

- రచయిత, హోవార్డ్ టింబెర్‌లేక్
- హోదా, బీబీసీ రీల్
‘‘ఇది ఎప్పుడు మొదలైందో తెలియదు. కానీ కాళ్లు, చేతులు నా ఆధీనంలో లేనట్లుగా అనిపించేవి. అర్ధరాత్రి లేచి పరిగెత్తాలని అనిపించేది. నిద్ర మధ్యలో లేచి టెన్నిస్ ఆడాలని అనిపించేది. అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. నేను కెఫీన్‌ను ఎక్కువ తీసుకుంటున్నానా? నాకెందుకు ఇలా అనిపిస్తోంది’’అని రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్‌తో బాధపడిన హోవార్డ్ టింబెర్‌లేక్ వివరించారు.
ఇది చాలా మందిని వేధించే సమస్య. అయితే, దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.
ఇదొక నాడీ రుగ్మత. దీన్నే విలిస్-ఎక్బోమ్ వ్యాధి అని కూడా అంటారు. ప్రపంచంలో దాదాపు పది శాతం మందిని ఈ వ్యాధి పీడిస్తోంది.
ఈ రుగ్మత చుట్టుముట్టిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? దీనికి చికిత్స ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.

లక్షణాలు ఎలా కనిపిస్తాయి?
‘‘ఈ రుగ్మత లక్షణాలు ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ సమయంలో భరించలేని స్థాయిలో కాళ్లలో నొప్పి మొదలవుతుంది. అదృష్టవశాత్తు నాకు లక్షణాలు అంత తీవ్రంగా కనిపించలేదు’’అని ఈ వ్యాధితో బాధపడుతున్న హోవార్డ్ టింబెర్‌లేక్ చెప్పారు.
‘‘ఈ రుగ్మత వల్ల నిద్ర నాణ్యత కూడా దెబ్బ తింటుంది? ముఖ్యంగా లక్షణాలు తీవ్రంగా ఉండే వారి నిద్రపై మరింత ప్రభావం పడుతుంది’’అని ఆయన అన్నారు.
దీని వెనుకున్న కారణాలపై జర్మనీలోని గెట్టింజెన్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీకి చెందిన క్లాడియా ట్రెంక్‌వాల్డెర్ పరిశోధన చేపట్టారు.
‘‘రెండు కారణాల వల్ల ఈ రుగ్మత చుట్టుముడుతుంది. వీటిలో మొదటిది జన్యుపరమైన నేపథ్యం. అంటే కుటుంబంలో ఎవరికైనా ఈ రుగ్మత ఉంటే మీకు అది వచ్చే ముప్పు ఎక్కువ. దీనికి కారణమయ్యే 23 జన్యువులను ఇప్పటివరకు పరిశోధకులు గుర్తించారు. వీటిలో ఒకటి లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ జన్యువులు ఉంటే ఈ రుగ్మత చుట్టుముట్టే ముప్పు ఉంటుంది’’అని క్లాడియా చెప్పారు.
‘‘కొన్నిసార్లు మనం పుట్టిపెరిగిన వాతావరణం కూడా ఈ వ్యాధి వచ్చేందుకు కారణం అవుతుంది’’అని ఆమె వివరించారు.

ఎన్ని రకాల రుగ్మతలు ఉన్నాయి?
రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వారిలో యూకేలోని ఆర్‌ఎల్‌ఎస్ చారిటీకి చెందిన వైద్యులు జూలియన్ స్పింక్స్ కూడా ఒకరు.
‘‘ఆర్ఎల్‌ఎస్ రుగ్మతలో రెండు రకాలు ప్రధానంగా కనిపిస్తాయి. మొదటి 20ల వయసులో వస్తుంది. ఇది జీవితాంతం వారిని వెంటాడుతుంది. రెండో రకం రుగ్మత ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఐరన్ లోపం, కిడ్నీ సమస్యలు చుట్టుముట్టినప్పుడు, గర్భం దాల్చినప్పుడు ఇది వస్తుంది. ఇది తర్వాత తగ్గిపోతుంది’’అని స్పింక్స్ చెప్పారు.
లాన్సెట్‌లో ఈ రుగ్మతపై ఇటీవల ఓ అధ్యయనం ప్రచురితమైంది. దీన్ని నిర్వహించిన వారిలో జూలీ గౌల్డ్ ఒకరు. బ్రిటన్‌లో ఈ రుగ్మతపై వైద్యుల్లో అవగాహన కల్పించేందుకు ఆమె కృషి చేస్తున్నారు.
‘‘మన శరీరాన్ని ఏదో గట్టిగా చుట్టేస్తున్నట్లు అనిపిస్తుంటుంది. అసలు ఉపశమనం అనేదే ఉండదు. ఈ నొప్పి భరించలేని స్థాయికి పెరిగిపోతుంది. ఈ ఒత్తిడి పోవాలంటే నా శరీరానికి నేనే హాని చేసుకోవాలని అనిపిస్తుంది. ఈ ఒత్తిడి కంటే నొప్పే నయం అని అనిపిస్తుంది. అది ఎలా ఉంటుందో మనం చెప్పలేం’’అని ఆమె వివరించారు.
చికిత్సా మార్గాలు ఏమైనా ఉన్నాయా?
ఈ వ్యాధి నుంచి ఉపశమనం కల్పించడంలో నిద్ర ప్రముఖ పాత్ర పోషిస్తుందని స్పింక్స్ చెప్పారు.
‘‘చల్లనీళ్లతో స్నానం కూడా కొంత వరకు పనిచేస్తుంది. డోపమైన్ స్థాయిలను పెంచే ఔషధాలను కూడా వైద్యుల సలహా మేరకు తీసుకుంటే ఉపశమనం వస్తుంది’’అని ఆయన చెప్పారు.
‘‘నాకు మొదట ఈ రుగ్మత ఉందని తెలిసినప్పుడు ఆరు వారాలపాటు డయాజొపామ్ ఇచ్చారు. అది బాగా పనిచేసింది కూడా. ఆ తర్వాత రిపెనిరాల్ ఇచ్చారు. అది కూడా అద్భుతంగా పనిచేసింది. నాకు హాయిగా నిద్ర కూడా పట్టింది’’అని జూలీ చెప్పారు.
ఈ వ్యాధి వల్ల మొదట్లో ఆందోళన, కుటుంగుబాటు కూడా తనను చుట్టుముట్టినట్లు ఆమె వివరించారు.
‘‘డోపమైన్ స్థాయిలను పెంచే ఔషధాల్లో రిపెనిరాల్ కూడా ఒకటి. దీన్ని తీసుకోవడంతో కాస్త ఉపశమనం ఉంటుంది’’అని హోవార్డ్ పేర్కొన్నారు.
అనుమానం వస్తే ఏం చేయాలి?
మనం ఈ లక్షణాలు ఉన్నాయని అనుమానం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మేలని హోవార్డ్ సూచించారు.
అయితే, ఈ రుగ్మత గురించి వైద్యుల్లోనూ అవగాహన తక్కువగా ఉందని స్పింక్స్ అన్నారు. ‘‘దురదృష్టవశాత్తు దీని గురించి వైద్య డిగ్రీల్లో ఎక్కడా చెప్పడం లేదు. జర్నల్స్‌లో చదివి దీని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది’’అని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా శరీరంలోని అన్ని మార్పులను, జన్యుపరమైన వ్యాధుల ముప్పును పరిశీలించిన తర్వాతే ఈ వ్యాధిని వైద్యులు నిర్ధారించాల్సి ఉంటుందని క్లాడియా చెప్పారు.
‘‘రోగులు వచ్చిన వెంటనే ఓ అవగాహనకు రాకూడదు. కొన్ని రోజులు జాగ్రత్తగా వారి లక్షణాలను పరిశీలించాలి. హాయిగా నిద్ర పట్టడానికి సహకరించే ఔషధాలను ముందు ఇవ్వాలి. వారాలు గడిచినా పరిస్థితిలో మార్పు లేకపోతే అప్పుడు చికిత్స మొదలుపెట్టాలి’’అని ఆమె అన్నారు.
‘‘చాలా మంది రోగులు పరిస్థితి తీవ్రం అయ్యేవరకు వైద్యుల దగ్గరకు వెళ్లరు. కానీ, అలా చేయడం సరికాదు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి’’అని స్పింక్స్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అంబేడ్కర్ రెండో పెళ్ళి కథ: 'ప్రియాతి ప్రియమైన షారూ... ప్రేమతో నీ రాజా'
- మానవ హక్కులపై అమెరికాకు జైశంకర్ దీటైన జవాబు: మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం మారిందా?
- మోహన్ భాగవత్: ‘‘15ఏళ్లలో అఖండ భారత్ కల సాకారం’’.. నెటిజన్లు ఏం అంటున్నారంటే..
- గవర్నర్‌కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఏంటి? ఎవరు ఇవ్వాలి? తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం ఏంటి?
- రిషి సునక్: భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధాని అవుతారా? భారత్‌లో పన్నులు చెల్లించే భార్య కారణంగా మంత్రి పదవి కూడా పోగొట్టుకుంటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











