గవర్నర్‌ విషయంలో పాటించాల్సిన ప్రోటోకాల్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం ఏంటి?

కేసీఆర్, తమిళసై సౌందర రాజన్

ఫొటో సోర్స్, PIB

    • రచయిత, సురేఖ అబ్బూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య ఉన్న వార్, వరి కొనుగోళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు కూడా ఇప్పుడు బహిరంగమవుతున్నాయి. తాజాగా గవర్నర్ భద్రాచలం పర్యటించినప్పుడు స్వాగతించడానికి కలెక్టర్, ఎస్పీ హాజరు కాలేదు. దానిపై గవర్నర్ ఆగ్రహంగా ఉన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ విషయంలో పాటించాల్సిన ప్రోటోకాల్స్ పట్టించుకోక పోవడంపై బీజేపీ ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే వస్తోంది. దీనిపై ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత తక్కువ మాట్లాడమే మంచిదన్న వ్యూహాన్ని పాటిస్తోంది. అయితే, అసలు ప్రోటోకాల్ వివాదం ఏంటి? గవర్నర్‌ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఎందుకు గౌరవించాలి? ఇప్పుడు ఈ అంశం ఎలా రాజకీయంగా మారింది? అనే విషయాలు చూద్దాం.

గవర్నర్ ప్రోటోకాల్ వివాదం ఎలా మొదలైంది?

రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య గత కొన్ని నెలలుగా విభేదాలు ఒక్కటిగా బయటికి వస్తున్నాయి. కొంత కాలంగా ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య విభేదాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ, గవర్నర్ ప్రసంగం లేకుండానే రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించటం నుంచి ఈ విభేదాలు బహిరంగమయ్యాయి. దానికి ముందే.. గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నప్పటికీ, గవర్నర్ దానికి అంగీకరించక పోవడం నుంచి అసలు వివాదం మొదలైంది.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గత ఏడాది అక్టోబర్ సమావేశాలకు కొనసాగింపు కాబట్టి గవర్నర్ ప్రసంగం అవసరం లేదని ప్రభుత్వం మెలిక పెట్టడంతో.. ఆనవాయితీగా గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యే బడ్జెట్ సమావేశాలు.. ఈసారి అది లేకుండానే జరిగిపోయాయి. దీనిపై గవర్నర్ తమిళసై సౌందర రాజన్ అభ్యంతరం తెలిపారు.

సాంకేతిక కారణాలను చూపుతూ తన ప్రసంగాన్ని రద్దు చేశారని, కానీ గత ఏడాదికి సంబంధించి ప్రభుత్వ పని తీరును చర్చించే అవకాశాన్ని కోల్పోయారని గవర్నర్ అన్నారు.

తెలంగాణ గవర్నర్ తమిళసై, ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, PMO

మరోవైపు ప్రభుత్వం దీనిపై తన వైఖరిని చెప్పకనే చెప్పింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక మెసేజ్ లీక్ చేశారు. అందులో అది ఎవరు చెప్పారో చెప్పకుండా 'గవర్నర్‌తో మొదటి రెండు ఏళ్లు సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ ఆ తరువాత ఎన్నోసార్లు ప్రభుత్వంతో గవర్నర్ విభేదించారు. కౌశిక్ రెడ్డిని గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా చేస్తూ రాష్ట్ర మంత్రివ‌ర్గం సిఫార్సు చేసింది. దీనిపై ఏ నిర్ణయం తీసుకోకుండా చాలా రోజులు తన వద్దే ఉంచుకున్నారు గవర్నర్. ఉభ‌యస‌భ‌ల‌ను ఉద్దేశించి గవర్నర్ ప్ర‌సంగించినా 26 జ‌న‌వ‌రి నాడు జెండా ఎగుర‌వేసి మాట్లాడినా ప్ర‌భుత్వం (మంత్రి మండ‌లి) ఆమోదించిన ప్ర‌సంగాన్ని మాత్ర‌మే చ‌దవాలి. సొంతంగా ప్ర‌సంగం చేయ‌డానికి వీల్లేదు. రాజ్యాంగం ఒప్పుకోదు. ఈసారి జ‌న‌వ‌రి 26న గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం పంపించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగాన్నే చ‌దివారు. వాస్త‌వానికి జ‌న‌వ‌రి 26వ తేదీ ప్ర‌సంగానికి సంబంధించి ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ఎలాగూ బ‌హిరంగ స‌భ లేదు కాబ‌ట్టి ప్ర‌సంగాలు వ‌ద్ద‌నుకున్నారు. కానీ, గ‌వ‌ర్న‌ర్ అనూహ్యంగా 26 జ‌న‌వ‌రి నాడు ప్ర‌సంగించారు. 2021-2022 గ‌వ‌ర్న‌ర్ బ‌డ్జెట్ ప్ర‌సంగంలో రాష్ట్ర మంత్రిమండ‌లి ఆమోదించ‌ని కొన్ని పేరాల‌ను సొంతంగా చ‌దివారు. అప్పుడు ప్ర‌భుత్వం కూడా దాన్ని పెద్ద సీరియ‌స్‌గా తీసుకోలేదు. ఇక శాస‌న‌మండ‌లికి ప్రొటెం చైర్మన్‌గా ఎంఐఎం స‌భ్యుడు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు అమీనుల్ జాఫ్రీని రిక‌మండ్ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఫైల్‌ను గ‌వ‌ర్న‌ర్‌కు పంపించింది. అయితే గ‌వ‌ర్న‌ర్ దానిపై నిర్ణ‌యం తీసుకోకుండా నాన్చివేత ధోరణితో వ్య‌వ‌హ‌రించారు. ప్రొటెం చైర్మన్ దేనికి, డైరెక్ట్‌గా చైర్మన్ ఎన్నిక పెట్టండి.. అని గ‌వ‌ర్న‌ర్ ఉచిత స‌ల‌హాను ప్ర‌భుత్వానికి ఇచ్చారు. ఇది ప్రభుత్వం వైపు నుంచి వినిపిస్తున్న వాదన.

ఒక దశలో గవర్నర్ 'నేను ఎవరికి భయపడను' అని అనడమే కాకుండా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి జరుగుతున్న పరిణామాల గురించి చెప్పారు. అయితే ఆ తరువాత కూడా పెద్దగా మార్పు రాకపోగా, భద్రాచలం వెళ్లిన గవర్నర్‌కి స్వాగతం పలకడానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా రాకపోవడం.. వివాదం ఎంత ముదిరిందో చెప్తోంది. వారు 48 గంటలు వ్యక్తిగత కారణాలు చెప్తూ సెలవులో వెళ్లారు.

రాజ్యాంగం ఏం చెప్తోంది?

గవర్నర్ అంటే ఒక వ్యక్తి కాదు. అది రాజ్యంగంలో ఉన్న ఒక పదవి. దానికి గౌరవం ఇవ్వాలి అన్నది వాస్తవం. 'శాసన సభ సభ్యులుగా మీరు వేరు కానీ, మంత్రులుగా ముఖ్యమంత్రిగా మీరు గవర్నర్‌కి బాధ్యులు. గవర్నర్ పేరుతో, గవర్నర్ చేత, గవర్నర్ కింద ప్రభుత్వం పని చేయాలి' అని రాజ్యాంగం చెబుతోంది. గవర్నర్ అంటే కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్‌గా, రాష్ట్రపతి ద్వారా ఎన్నుకోబడ్డ వ్యక్తి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఇదే విషయంపై రాజ్యాంగపరంగా గవర్నర్‌కి ఇవ్వాల్సిన గౌరవం గురించి సీనియర్ ఆడ్వకేట్ వేములపాటి పట్టాభిని బీబీసీ సంప్రదించింది. "శాసన సభ్యులుగా శాసనసభకి వెళితే వారు శాసనవ్యవస్థలో భాగం అవుతారు. కానీ అదే వాళ్ళు ముఖ్యమంత్రిగానో లేక మంత్రిగానో, సచివాలయానికి లేక ఆయా మంత్రిత్వశాఖలకు వెళ్లినప్పుడు వారు ఎగ్జిక్యూటివ్‌లో భాగం. ఎగ్జిక్యూటివ్ హెడ్‌గా ఉండేది గవర్నర్. మరి అలాంటి గవర్నర్ పేరుతో నడిచే ప్రభుత్వం లోని ముఖ్యమంత్రి మంత్రులు గవర్నర్‌కి వ్యతిరేకంగా ఎలా పని చేస్తారు? మనం ఇక్కడ వ్యక్తులు, పార్టీల ప్రతినిధులుగా పని చేయడం లేదు. రాజ్యాంగ పదవులు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇలా అగౌరవపర్చడం అంటే, రాజ్యాంగాన్నే అగౌరవించడం. అలానే గవర్నర్ కూడా నిష్పక్షపాతంగా వ్యవహించాలి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గవర్నర్ పోస్ట్ ఒక వృధా పోస్టని విమర్శించారు. అప్పటి గవర్నర్ కుముద్ బెన్ జోషి కేంద్రానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, నిష్పాక్షికంగా లేరని అన్నారు. అయితే సుప్రీంకోర్టులో జరిగిన కేసులు అన్నిట్లో కూడా, రాజ్యాంగంలో ఉన్నంత వరుకు నీవు గవర్నర్ గౌరవించాలి అని చెప్పింది'' అని ఆయన వివరించారు.

గవర్నర్ ప్రోటోకాల్ ప్రకారం ఎవరు స్వాగతం పలకాలి?

ఇదే విషయంపై సీనియర్ అడ్వకేట్ జంధ్యాల రవి శంకర్‌తో బీబీసీ మాట్లాడింది. "ప్రోటోకాల్ విషయంలో గవర్నర్లకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులు లేక మంత్రులు వెళ్లి స్వాగతం పలకాలి అని ఏమి లేదు. కాకపోతే ప్రధానమంత్రి వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎలాగయితే స్వాగతం పలకాలో అలానే గవర్నర్‌కి కలెక్టర్లు, ఎస్పీలు స్వాగతం పలకాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాలు సర్కారియా కమిషన్, వెంకటచల్లయ్య కమిషన్ అలానే పుంచి కమిషన్‌లో స్పష్టంగా పొందుపరిచారు. గవర్నర్‌కి స్వాగతం పలకడం వంటివి అధికారులు చేయవలసి ఉంటుంది. వారికి నివాస సదుపాయాలు లాంటివి కూడా చూసుకోవాలి. అంతే కానీ హెలికాఫ్టర్లు ఇవ్వాల్సిందే అనేది ఎక్కడా లేదు'' అని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అధికారుల పని తీరుపై మచ్చ

భద్రాచలంలో రెండు రోజులు పర్యటించారు తెలంగాణ గవర్నర్ సౌందర రాజన్. అయితే అక్కడ ఆవిడకి స్వాగతం పలకడానికి కలెక్టర్, ఎస్పీ రాకపోవడంలో కూడా రాజకీయం కోణం కనిపిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ సునీల్ దత్ రెండు రోజులు సెలవులో వెళ్లిపోయారు. గతంలో హెలికాప్టర్ ఇవ్వడానికి నిరాకరించడం కారణంగా, ఈసారి గవర్నర్ సికింద్రాబాద్ - మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో తనకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సలోన్‌లో స్టేషన్‌కు చేరుకొని, అక్కడ నుండి కారులో భద్రాచలం చేరుకున్నారు. అయితే స్టేషన్‌లో తమిళశైకి స్వాగతం పలకడానికి ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్, ఎస్‌పీ రాకపోగా అడిషనల్ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, ఇతర దక్షిణ మధ్య రైల్వే సీనియర్ అధికారులు వచ్చారు. అయితే ఈ విషయంపై గవర్నర్ మాట్లాడడానికి నిరాకరించారు.

ఈ విషయం పై మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చంద్రవదన్‌ని బీబీసీ సంప్రదించగా.. ''నాకు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం, భద్రాచలం కలెక్టర్, ఎస్‌పీలను రెండు రోజులు సెలవుల్లో వెళ్లిపొమ్మని ముఖ్యమంత్రి ఆఫీసు నుంచి చెప్పడం జరిగింది. ఇది అడ్మనిస్ట్రేటివ్ సిస్టంకి చాలా దౌర్భాగ్యమైన స్థితి అని చెప్పవచ్చు. ఇంత బహిరంగంగా ఇలా ప్రోటోకాల్ ఉల్లంఘించడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నడూ జరగలేదు. ఇలాంటి విషయాలలో కలెక్టర్ ఉండడం కారణంగా.. అల్ ఇండియా సర్వీసెస్ విభాగం వారు లేక కేంద్ర ప్రభుత్వం, డీఓపీటీ (డిపార్ట్మెంట్ అఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) వారు ఈ అధికారులను సంజాయషీ అడిగితే వీరు ఏమి సమాధానం ఇవ్వగలుగుతారు? రాష్ట్ర ప్రభుత్వాల పాలనా విభాగంలో పనిచేస్తున్నప్పటికీ ఐఏఎస్ అధికారులందరూ కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షించే డీఓపీటీ కంట్రోల్‌లో పనిచేస్తారు. అందుకే వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే ఆస్కారం కూడా లేక పోలేదు" అని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

రాష్ట్ర ప్రభుత్వం ఒక బలమైన సంకేతం పంపిస్తోంది...

గవర్నర్, ప్రభుత్వం ఇద్దరి వైపూ ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకుడు కటారి శ్రీనివాస్ అంటున్నారు. "గతంలోనూ రాష్ట్ర ప్రభుత్వ రోజు వారీ పనులలో గవర్నర్ జోక్యం చేసుకునే వారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్లు అనుకూలంగా ఉండేవారు. కానీ ఇలా బహిరంగంగా బయటకి వచ్చే పరిస్థితి ఏర్పడలేదు. విభేదాలను బహిరంగంగా బయటకి చెప్పే పరిస్థితి ఏర్పడలేదు'' అని శ్రీనివాస్ పేర్కొన్నారు.

గత కొన్నేళ్లుగా కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్, ప్రభుత్వాల మధ్య విభేదాలు ఎక్కువుగా కనపడుతున్నాయి. కేంద్రం ఎంపిక చేసిన గవర్నర్లు రాజకీయ పార్టీలకు సన్నిహితంగా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ల మధ్య విభేదాలను పెంచుతోంది. ప్రభుత్వాలు, గవర్నర్లు అలానే పాలనా వ్యవస్థలో ఉన్న అధికారులు వ్యక్తికి, రాజకీయ పార్టీకి కాదు వ్యవస్థకి గౌరవం ఇవ్వాలి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడైనా ఇబ్బంది తలెత్తినప్పుడు నిరసనలు తెలపడంలో తప్పు లేదు కానీ, రాజ్యాంగాన్ని అగౌరపరచడం తగదు అంటున్నారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు వేగంగా అంతరించిపోతోందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)