#RanbirAliaWedding: అలియా భట్, రణబీర్ కపూర్ ల లవ్‌స్టోరీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది?

అలియా, రణ్‌బీర్ కపూర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మధు పాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బాలీవుడ్‌ నటుడు రణబీర్ కపూర్, నటి అలియా భట్‌ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. దాదాపు నాలుగేళ్లుగా రణబీర్, అలియాల పెళ్లి గురించి ఊహగానాలు నడుస్తున్నాయి.

ఇప్పుడు ఆ గుసగుసలకు పుల్‌స్టాప్ పెడుతూ రణబీర్, అలియా ఒకింటి వారు కాబోతున్నారు. బుధవారం నుంచి వీరిద్దరి పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యాయి.

రణబీర్ కపూర్ తల్లి, మాజీ నటి నీతూ కపూర్ వివాహ వేడుకలను పర్యవేక్షిస్తున్నారు. రణబీర్ కపూర్ సోదరి రిధిమా కపూర్ సాహ్ని, బావ భరత్ సాహ్ని దిల్లీ నుండి ముంబై చేరుకున్నారు. పూజతో పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యాయి.

కపూర్ కుటుంబం బుధవారం నాటి పూజను బాంద్రాలోని పాలి హిల్‌లో ఉన్న వాస్తు భవనంలో నిర్వహించింది. ఈ భవనంలోనే రణబీర్ కపూర్ ఎనిమిదో అంతస్తులో, అలియా భట్ ఐదవ అంతస్తులో నివసిస్తున్నారు.

ఈ పూజలో కపూర్ కుటుంబం, భట్ కుటుంబానికి చెందిన సన్నిహితులు పాల్గొన్నారు. బుధవారం సాయంత్రంతో మెహందీ పూజలు పూర్తి అవుతాయి. మెహందీ తర్వాత, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు ఉంటాయి.

అలియా భట్

ఫొటో సోర్స్, FACEBOOK

వీరిద్దరు ఎప్పుడు ప్రేమలో పడ్డారు?

2012లో అలియా తొలిసారి నటించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమా వచ్చింది. మొదటి సినిమా విడుదలకు ముందే ఆమె రణ్‌బీర్ కపూర్ పై తనకున్న ప్రేమను బైటపెట్టారు.

ఆ తర్వాత నుంచి అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌ల ప్రేమ గురించి ఊహాగానాలు చాలాకాలం సాగాయి. వీరిద్దరు కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో, ఇక పెళ్లి ఎప్పుడని అడగడం మొదలైంది.

ఆ సీక్రెట్ కూడా ఇంతకు ముందే బైటికి వచ్చింది. ''ఏప్రిల్ 14న అలియా, రణబీర్‌లు పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి రిసెప్షన్ ఐదురోజుల పాటు అంటే ఏప్రిల్ 18 వరకు జరుగుతుంది. ఆర్కే హౌస్‌లో వివాహ వేడుకలు జరగనున్నాయి'' అని అలియా భట్ మామ రాబిన్ భట్ బీబీసీకి ధృవీకరించారు.

కపూర్, భట్‌ల కుటుంబంతో పాటు, వారి సన్నిహితులు కూడా వివాహ వేడుకకు హాజరుకానున్నారు.

అలియా, రణ్‌బీర్ కపూర్

ఫొటో సోర్స్, FACEBOOK

నీతూ కపూర్‌కి అలియా అంటే చాలా ఇష్టం

అలియా భట్ ఇప్పుడు కపూర్‌ల కుటుంబంలో కోడలిగా చేరబోతున్నారు. అయితే, అంతకు ముందు నుంచే ఆమెకు కపూర్‌ల కుటుంబంతో అనుబంధం ఉంది. కపూర్‌ లతో ఆమె పలు సినిమాల్లో నటించారు కూడా.

అలియా తన మొదటి చిత్రం 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'లో నటుడు రిషి కపూర్‌తో కలిసి పని చేశారు. ఆ తర్వాత రిషి కపూర్‌ తోనే 'కపూర్ అండ్ సన్స్' చిత్రంలో కూడా నటించారు.

వీడియో క్యాప్షన్, ప్రధాని మోదీ: ‘#TheKashmir Filesపై కుట్ర జరుగుతోంది.. వాస్తవాలను అంగీకరించట్లేదు’

రిషి కపూర్ తరచూ అలియా భట్ నటనను ప్రశంసించేవారు. ప్రస్తుతం ఉన్న యువనటులలో అలియా అత్యంత ప్రతిభావంతురాలని ఆయన చాలాసార్లు చెప్పారు.

రిషికపూర్‌తో మాదిరిగానే, రణబీర్ తల్లి, నటి నీతూ కపూర్‌తో కూడా అలియాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ''నాకు అలియా అంటే చాలా ఇష్టం. ఆమె అద్భుతమైన వ్యక్తి. చాలా అందమైనది కూడా. వీళ్లిద్దరూ కలిసి మంచి జోడీ అవుతారు. నేను వాళ్ల పెళ్లి కోసం ఎదురుచూస్తున్నాను'' అని నీతూ కపూర్ ఇటీవల వ్యాఖ్యానించారు.

‘కాఫీ విత్ కరణ్‌’ లో అలియా ఏం చెప్పారు?

అలియా భట్ 'కాఫీ విత్ కరణ్' షో లో రణబీర్ కపూర్ పట్ల తన ప్రేమను వెల్లడించారు. తన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమా ప్రమోషన్ కోసం తొలిసారి ఆమె ఈ షో కి వెళ్లినప్పుడు కరణ్ జోహార్ ఒక ప్రశ్న అడిగారు. ''మీకు స్వయంవరం నిర్వహిస్తే, ఏ ముగ్గురు హీరోలు ఆ స్వయంవరంలో ఉండాలని కోరుకుంటారు'' అని ప్రశ్నించారు.

దీనిపై అలియా మొదట రణబీర్ కపూర్ పేరే చెప్పారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్, ఆదిత్య రాయ్ కపూర్ ఉన్నారు. తర్వాత కరణ్ జోహార్ అడిగిన మరో రెండు ప్రశ్నలకు కూడా ఆమె రణబీర్ కపూర్ పేరే చెప్పారు.

నాగార్జున, రణ్‌బీర్, అలియా భట్

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, నాగార్జున, రణ్‌బీర్, అలియా భట్

అలియా, రణబీర్‌ల తొలిసారి ఎక్కడ కలుసుకున్నారు?

సంజయ్ లీలా బన్సాలీ సెట్స్‌లో అలియా భట్ లవ్ స్టోరీ ప్రారంభమైందని చాలా తక్కువ మందికి తెలుసు. రణబీర్ కపూర్‌ను 2005లో మొదటిసారి చూశానని, అప్పుడే తనకు రణబీర్‌ పై మొదటిసారి క్రష్ కలిగిందని అలియా భట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

''నేను సంజయ్ లీలా బన్సాలీ చిత్రం 'బ్లాక్' కోసం ఆడిషన్ చేస్తున్నప్పుడు, రణబీర్ అక్కడ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. అక్కడ తనను చూడగానే నేను మనసు పారేసుకున్నాను'' అని చెప్పారామె.

కలిసి ఎప్పుడు కనిపించారు?

అలియా భట్, రణబీర్ కపూర్ ఎఫైర్ గురించి చర్చలు అయాన్ ముఖర్జీ చిత్రం 'బ్రహ్మాస్త్ర'కి సంతకం చేయడంతో మొదలయ్యాయి. మొదట్లో 'బ్రహ్మాస్త్ర' సినిమా ప్రమోషన్‌లో ఇదంతా భాగమని భావించారు. కానీ, షూటింగ్‌ మొదలైనప్పటి నుంచి డేటింగ్‌లో ఉన్నారని గాసిప్‌లు మొదలయ్యాయి.

సోనమ్ కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో అలియా, రణబీర్ మొదటిసారి ఒకరి చేయి ఒకరు పట్టుకుని కనిపించడంతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. తర్వాత వారు చాలా అవార్డు ఫంక్షన్లలో కలిసి కనిపించారు.

అలియా భట్

ఫొటో సోర్స్, ALIA BHATT/TWITTER

కపూర్ ఫ్యామిలీతో అలియా

దీపికా, కత్రినా, సోనమ్ కపూర్ వంటి హీరోయిన్లతో రిలేషన్ ఉన్న బాలీవుడ్ హీరోలలో రణబీర్ కపూర్ ఒకరు. కానీ, రణబీర్ స్నేహితురాలు ఒకరు, ఆమె కుటుంబంతో కలిసి ఫ్యామిలీ ఫంక్షన్‌లలో కనిపించడం అలియాతోనే మొదలైంది.

అలియా భట్ తన తండ్రి మహేశ్ భట్, తల్లి సోనీ రజ్దాన్‌తో కలిసి కపూర్ కుటుంబం నిర్వహించిన అనేక ఫ్యామిలీ ఫంక్షన్లలో లంచ్‌లు, డిన్నర్‌లు చేస్తూ కనిపించారు. అంతేకాదు, శశికపూర్, రిషికపూర్ మరణాల సమయంలో కపూర్‌ల కుటుంబంతో కలిసి ఆ బాధను పంచుకున్నారు అలియా.

రణబీర్, అలియా అనేక టీవీ యాడ్స్‌లో కూడా కలిసి కనిపించారు.

పెళ్లి తర్వాత వీరిద్దరూ 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ చాలాకాలంగా సాగుతోంది. కరోనా కారణంగా ఈ చిత్రం పూర్తి కావడానికి చాలా సమయం పట్టింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణబీర్, అలియాతో పాటు, అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున కూడా నటిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, ఉత్తరాదిని ఊపేస్తున్న తెలుగు సినిమా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)