అమెరికా: న్యూయార్క్ సబ్‌వే స్టేషన్‌లో కాల్పులు, 16 మందికి గాయాలు

అధికారి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 36 స్ట్రీట్ సబ్‌వే స్టేషన్ వద్ద పోలీసు అధికారి

న్యూయార్క్ సబ్‌వే స్టేషన్‌లో ఉదయం రద్దీగా ఉండే సమయంలో జరిగిన కాల్పుల ఘటనలో 16 మంది గాయపడ్డారు. వీరిలో అయిదుగురికి తుపాకీ గాయాలయ్యాయి.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం సన్‌సెట్ పార్క్‌లోని 36వ స్ట్రీట్ స్టేషన్‌లో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.30 గంటలకు తుపాకీ పేలుళ్ళు సంభవించాయి.

ఘటనా స్థలం వద్ద తీసిన ఫోటోలలో కొందరు ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్ మీద రక్తపు మడుగులో పడిపోయి కనిపించారు. అక్కడ పేలకుండా పడి ఉన్న బాంబులు కూడా కనిపించాయి.

కాల్పులకు పాల్పడిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. నారింజ రంగు టీషర్టు వేసుకున్న ఆ వ్యక్తి మాస్కు కూడా ధరించినట్లు చెబుతున్నారు. కాల్పులు జరిపిన వెంటనే ఆ వ్యక్తి పరారైనట్లు భావిస్తున్నారు. అయితే, అతడు ఇలా ఎందుకు చేశాడన్నది తెలియలేదు.

కాల్పులు జరిగిన ప్రాంతం
ఫొటో క్యాప్షన్, కాల్పులు జరిగిన ప్రాంతం

మేయర్ ఎరిక్ ఆడమ్స్ అధికార ప్రతినిధి, "ఈ ప్రాంతానికి ప్రజలు దూరంగా ఉండాలి" అని పిలుపునిచ్చారు. సహాయం అవసరమైన వారికి చేయూతనిచ్చేందుకు వీలుగా ప్రజలు అక్కడి నుంచి తప్పుకోవాలని సూచించారు.

ఈ దారిలో నాలుగు రైళ్ళ రాకపోకలు ఈ ఘటన వల్ల ఆలస్యమయ్యాయి.

ఆగంతుకుడు ప్లాట్‌ఫారమ్ మీద నుంచి కాల్పులు జరిపాడని, అప్పుడే స్టేషన్లోకి వచ్చిన 'ఆర్' లైన్ ట్రైన్‌లోకి పొగ బాంబును విసిరేశాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

గాయపడిన ప్రయాణికులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గాయపడిన ప్రయాణికులు

న్యూయార్క్ ఫైర్ డిపార్ట్‌మెంట్, "మాకు మొదట స్టేషన్లో పొగలు కమ్ముకున్నాయని సమాచారం అందింది" అని వెల్లడించింది.

కానీ, ఆ తరువాత కొంతమంది బులెట్ గాయాలతో అక్కడ పడి ఉండడాన్ని అధికారులు చూశారు.

ప్రస్తుతం స్టేషన్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసు అధికారులు తెలిపారు.

న్యూయార్క్ కాల్పులు

ఫొటో సోర్స్, Reuters

అమెరికా అధ్యక్షుడు బైడెన్, న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్‌లకు తాజా పరిస్థితిని అధికారులు వివరించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)