జార్జి ఫ్లాయిడ్: అమెరికాలో ప్రాణాలు తీసే పోలీసులు శిక్షల నుంచి ఎలా తప్పించుకుంటున్నారు

ఫొటో సోర్స్, EPA
- రచయిత, పాబ్లో ఉచోవా
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
అమెరికాలో ఏటా పోలీసుల చేతుల్లో 1200 మంది ప్రాణాలు కోల్పోతారని అంచనా. అయితే ఇప్పటి వరకు సుమారు 99శాతం కేసుల్లో ఒక్క అధికారిపై కూడా ఎలాంటి నేరం నిరూపణ కాలేదు.
జార్జి ఫ్లాయిడ్ విషయంలో మాత్రం సర్వత్రా ఒత్తిడి నెలకొనడం, ఆందోళనలు మిన్నంటడంతో ఈ సారి వారిపై కేసులు నమోదు చేశారు.
మే 25 మినియాపోలిస్ నగరంలో జార్జి ఫ్లాయిడ్‌కు పోలీసులకు జరిగిన పెనుగులాటలో ఫ్లాయిడ్ ముఖం నేలపై ఉండగా మెడపై మోకాలితో నొక్కి పెట్టిన పోలీసు అధికారిపై హత్యా నేరం కేసు నమోదు చేశారు.
ఆ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న మిగిలిన ముగ్గురు పోలీసు అధికారులపై నేరం చేసేందుకు ప్రేరేపించారంటూ కేసులు నమోదు చేశారు. వారు నలుగురు జూన్ 8న కోర్టులో హాజరుకావాల్సి ఉంది.
విధుల్లోఉండగా ప్రాణాలు తీస్తున్న పోలీసులకు సంబంధించిన చట్టాల విషయంలో ఫ్లాయిడ్ మరణం సమూల మార్పులను తీసుకొస్తుందని ఆందోళనకారులు ఆశిస్తున్నారు. ఎందుకంటే చట్టం దృష్టిలో ఈ కేసు చాలా ప్రత్యేకమైనది.
ఇప్పటి వరకు మెజార్టీ అమెరికన్ పోలీసులు విధుల్లో ఉండగా ఎవర్ని చంపినా, వారు దోషులని తేలినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అమెరికా చట్టంలో వారికి అటువంటి రక్షణ కల్పించడమే అందుకు కారణం.

ఫొటో సోర్స్, AFP
అభియోగాల నుంచి రక్షణ
ద మ్యాపింగ్ పోలిస్ వయెలైన్స్ అనే ప్రాజెక్టు లెక్కల ప్రకారం అమెరికన్ పోలీసుల చేతుల్లో 2013-19 మధ్య కాలంలో 7,666 మంది అధికారికంగానే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 92శాతం కేసుల్లో ఎవరికీ ఎలాంటి శిక్షలు పడలేదని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.
కేవలం 99కేసుల్లో మాత్రమే పోలీసులపై కేసులు నమోదయ్యాయి. అంటే మొత్తంగా కేవలం 1.3% మరణాల విషయంలో మాత్రమేనన్నమాట. వారిలో 25 మంది మాత్రమే దోషులుగా తేలారు.
“ఫ్లాయిడ్ విషయంలో పోలీసుల అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం అత్యంత అరుదైన విషయం” అని వాషింగ్టన్‌లోని కాటో ఇనిస్టిట్యూట్ క్రిమినల్ జస్టిస్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్న క్లార్క్ నీలె వ్యాఖ్యానించారు.
పోలీసు అధికారులతో కలిసి ప్రాసిక్యూటర్లు పని చేయాల్సి ఉంటుంది. కొన్ని కేసుల్ని వెలికి తీయడంలోనూ, అలాగే విచారణలో సాక్ష్యం ఇచ్చే సమయంలోనూ వారిపై ఆధారపడాల్సి ఉంటుంది. వాళ్లపై క్రిమినల్ నేరాలు మోపకుండా ఒక్కోసారి పోలీసులు వారిపై మారణాయుధాల్ని కూడా ప్రయోగించవచ్చు.
తమకు జరిగిన నష్టం విషయంలో పరిహారం పొందేందుకు సివిల్ కోర్టులో పోలీసులపై దావా వెయ్యాలా? వద్దా? అన్నది బాధితులు, వారి బంధువులపైనే ఇష్టాయిష్టాలపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఈ విషయంలో కోర్టు తలుపులు తరచు మూసే ఉంటాయని అన్నారు నీలె. కారణం “క్వాలిఫైడ్ ఇమ్యూనిటీ” అన్న న్యాయ సూత్రం. దీని ప్రకారం ప్రభుత్వాధికారులు, బాధితుల హక్కుల్ని హరించారన్న విషయంలో స్పష్టమైన ఆధారాలు ఉంటే తప్ప, వారు ఎలా ప్రవర్తించినా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండదు.
దీన్ని బట్టి నష్టపరిహారం కోసం ప్రభుత్వ అధికారులపై దావా వెయ్యడం దాదాపు అసాధ్యం అన్న విషయం స్పష్టమవుతోందని నీలె అన్నారు.

ఫొటో సోర్స్, AFP
ఉల్లంఘనలకు ఫ్రీ పాస్
2014లో కొంత మంది సాయుధ పోలీసులు ఓ కేసులో నిందితుణ్ణి వెంటాడుతూ ఆమి కొర్బిట్ అనే మహిళ ఇంటి పెరట్లోకి ప్రవేశించారు. తాము వెంబడిస్తున్న నిందితుడు అక్కడే ఉన్నాడన్న కారణంగా ఆ సమయంలో ఆ ప్రదేశంలో ఆడుకుంటున్న ఆరుగురు చిన్నారుల్ని నేలపై పడుకోమని ఓ పోలీసు అధికారి ఆదేశించారు.
అయితే ఆ సమయంలో ఆమి పెంపుడు కుక్క వారికి అడ్డంగా వచ్చింది. దీంతో ఆ అధికారి ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే రెండు సార్లు కాల్చారు. ఆ కాల్పుల్లో ఆమి పెంపుడు శునకం తప్పించుకోగా ఆమె పదేళ్ల కుమారునికి ఆ బుల్లెట్ తగిలింది. ఆ చిన్నారికి ప్రాణాపాయం తప్పించుకున్నప్పటికీ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. మానసికంగానూ తీవ్రంగా కుంగిపోయాడు. ఈ విషయంలో తన బిడ్డకు న్యాయం జరగాలని ఆమి వేసిన పిటిషన్‌ను
కోర్టు తోసిపుచ్చింది. ఆ అధికారి ఉద్ధేశం కేవలం శునకాన్ని కాల్చాలనే తప్ప ఆ చిన్నారిని కాల్చాలని కాదని తేల్చి చెప్పింది.
మలైకా బ్రూక్స్.. అలాంటి మరో హై ప్రొఫైల్ కేసు ఇది. తన 11 ఏళ్ల కుమారుడు సాక్షిగా పోలీసులు ఆమెపై మూడు సార్లు టేజర్ గన్(తాత్కాలికంగా మనిషిని స్తంభింపజేసే ఆయుధం)ను ప్రయోగించారు. కారు నుంచి బయటకు ఈడ్చి, నేలపై ముఖాన్ని ఉంచి బేడీలు వేశారు. ఆ సమయంలో ఆమె 8 నెలల గర్భిణి కూడా. ఆమె చేసిన నేరం గంటకు 20 మైళ్ల వేగంతో ప్రయాణించాల్సిన చోట 32 మైళ్ల వేగంతో కారును డ్రైవ్ చెయ్యడమే. అంతేకాదు ఎక్కడ నేరం చేసినట్టు అంగీకరించాల్సి వస్తుందోనని భయపడి స్పీడింగ్ టిక్కెట్‌పై ఆమె సంతకం చేయలేదు.
టేజర్ గన్ ఎలా ఉపయోగించాలన్న విషయంలో స్పష్టమైన ఆధారాలు లేవన్న కారణంతో ఆమె కేసును కోర్టు కొట్టివేసింది. సుమారు పదేళ్ల తర్వాత ఆమెకు 45వేల డాలర్లను పరిహారాన్ని చెల్లించడం ద్వారా ఆ సమస్యకు కోర్టు బయట పరిష్కారం లభించింది.
“కోర్టులు ఎటువంటి పరిస్థితుల్లో పోలీసులకు ఫ్రీ పాసులు ఇస్తున్నాయో చూస్తుంటే కచ్చితంగా ఆశ్చర్యం కల్గుతుంది. చట్టాలను అమలు చేయడంలో ఇది ఏ మాత్రం జవాబుదారీతనం లేకపోవడం అని నేను అంటాను” అని నిలె తన ఆవేదన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
జస్టిస్ ఫర్ ఫ్లాయిడ్
ఇక్కడ కూడ క్వాలిఫైడ్ ఇమ్యూనిటీ అన్న సూత్రమే ఫ్లాయిడ్ కుటుంబానికి న్యాయం జరగడంలో అడ్డంకిగా మారుతుందని నిలె అన్నారు.
ఈ విషయంలో అమెరికా నేషనల్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌ను బీబీసీ సంప్రదించింది. కానీ అనేక సార్లు ఫోన్ చేసినప్పటికీ ఈ కథనాన్ని ప్రచురించే క్షణం వరకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
ఆ సంఘం అధ్యక్షుడు మైఖేల్ మెక్‌హలె ఫ్లాయిడ్ కేసు విషయంలో అంతకు ముందు మాట్లాడుతూ.. “ జార్జ్ ఫ్లాయిడ్ విషయంలో దారుణం జరిగింది. ఈ విషయంలో చట్ట బద్ధంగా కానీ, నైతికంగా కానీ లేదా ఆత్మ రక్షణ పేరిట కానీ తాను చేసిన పనిని ఆ అధికారి సమర్ధించుకోలేరు” అని వ్యాఖ్యానించారు.
అటు వివిధ రాజకీయ నాయకుల స్పందన కూడా అలాగే ఉంది. “ ఎంతో మంది నల్లజాతీయులు, గోధుమవర్ణంలో ఉండే జాతులకు చెందిన వారు పోలీసు అధికారుల చేతుల్లో అన్యాయానికి గురయ్యారు” అంటూ పోలీసుల క్రూరత్వానికి నిరసనగా తీర్మానాన్ని ప్రవేశపెడుతూ మే 29 మసాచుట్స్ ప్రతినిధి అయనా ప్రెస్లీ ట్వీట్ చేశారు. “ఇలాంటి ఘోరమైన అన్యాయాల్ని మేం ఎంత మాత్రం సహించబోం” అని వ్యాఖ్యానించారు.
ఫ్లాయిడ్ కేసు విషయంలో ప్రజల ఒత్తిడి కీలక పాత్ర పోషిస్తోంది. అంతే కాదు మరింత లోతైన మార్పులు తీసుకురావాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది.
ఈ క్వాలిఫైడ్ ఇమ్యూనిటీ సిద్ధాంతానికి సరైన నిర్వచనాన్ని ఇవ్వాలని నిపుణులు, మీడియా సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరోవైపు తక్షణం పార్లమెంట్ Police Exercising Absolute Care with Everyone (PEACE) బిల్లును ఆమోదించాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.
మిలటరీ ఆయుధాలను పోలీసు విభాగాలకు సరఫరా చేయడాన్ని నిలిపేయాలన్న వాదనకు కొందరు పార్లమెంట్ సభ్యులు మద్దతు పలుకుతున్నారు.

ఫొటో సోర్స్, AFP
కొత్త పోలీసు వ్యవస్థ?
ప్రస్తుతం అమెరికా విషయంలో అంతకన్నా ఎక్కువే జరగాల్సి ఉందని అంటున్నారు అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్‌లోని జస్టిస్ డివిజన్ డైరక్టర్ యుది అఫర్. “పోలీసు పాత్ర పట్ల నెలకొన్న వైఖరిని, దాని సంస్కృతిని మార్చాలి. అమెరికా రాజ్యంగ వ్యవస్థలో పోలీసింగ్ అన్నది పూర్తిగా వికేంద్రీకృత వ్యవస్థ” అని అఫర్ అభిప్రాయపడ్డారు.
అమెరికాలో ఆయుధాలు ధరించిన పోలీసులు చాలా విచిత్రమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తూ ఉంటారు. అవే ఒక్కోసారి సంక్షోభాలకు దారి తీస్తూ ఉంటాయి.
ఫెడర్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ లెక్కల ప్రకారం అమెరికాలో ప్రతి 3 సెకెన్లకు ఓ వ్యక్తి అరెస్ట్ అవుతుంటారు. కేవలం ఒక్క 2018 సంవత్సరంలోనే దేశ వ్యాప్తంగా సుమారు ఒక కోటి మూడు లక్షల మంది అరెస్ట్ అయ్యారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అయితే ఇందులో అరెస్ట్ అయిన వారిలో చాలా మంది ఎటువంటి హింసాత్మక నేరాల్లో దోషులుగా తేలరు అని అఫర్ అన్నారు. జార్జి ఫ్లాయిడ్ విషయంలో కూడా షాపులో నకిలీ నోటును మార్చే ప్రయత్నం చేశారన్నదే ఆయనపై వచ్చిన ఆరోపణ.
“పోలీసులు ఇలాంటి నేరాలకు పాల్పడకూడదని మేం భావిస్తున్నాం” అని అఫర్ వ్యాఖ్యానించారు.
“మేం లక్షల కోట్ల డాలర్లను పోలీసులపై ఖర్చు పెట్టలేం. ఆ సొమ్మును ఎన్నో ఏళ్లుగా పోలీసుల వేధింపులకు గురవుతున్న వెనుకబడిన వర్గాలపై తిరిగి ఖర్చు చేయాల్సి ఉంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రవేశ ప్రమాణాల్ని పెంచడం వంటి చర్యలు కొన్ని సార్లు పని చేసినప్పటికీ జవాబుదారీ వ్యవస్థ అన్నది బాహ్యాలంకరణగా మారిందని నిలె, అఫర్ ఇద్దరూ వ్యాఖ్యానించారు. ఓ వైపు కోవిడ్-19 భయం ఉన్నప్పటికీ ఆందోళనకారులు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. అమెరికన్ వీధుల్లో పొంగుతున్న ఆ ఆవేశాన్ని ఒక పరివర్త మార్పు దిశగా మార్చాలని సామాజిక కార్యకర్తలు కోరుకుంటున్నారు.
"పోలీసుల హింస, పోలీసుల జాత్యాహంకానికి సంబంధించి అమెరికాలో మాకు కొన్ని ప్రాథమిక సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ యుద్ధంలో మేం విజయం సాధించలేకపోయాం. ఓ పోలీసు అధికారిపై వ్యక్తిగత విచారణకు ఆదేశించినంత మాత్రాన మేం విజయం సాధించినట్టు కాదు ” అని అఫర్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
- ప్రపంచ ఆరోగ్య సంస్థతో అమెరికా తెగతెంపులు - ట్రంప్
- అమెరికా డాలర్ కనుమరుగవుతుందా? చైనా డిజిటల్ యువాన్ రాజ్యం చేస్తుందా?
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే
- ఏనుగు మరణం: కేరళ ఆలయాల్లో 600 ఏనుగులను చంపేశారని మేనకా గాంధీ ఆరోపణలు.. అది నిజమేనా?
- కరోనావైరస్తో కలిసి జీవించటం ఇలాగే ఉంటుందా? లాక్డౌన్ అనంతర ప్రపంచం ఎలా ఉందో చూపే ఫొటోలివీ...
- కరోనావైరస్: ‘గుజరాత్లో కరోనా కల్లోలానికి ప్రత్యక్ష సాక్షిని నేనే.. 20 ఏళ్ల కలల జీవితం మూడు రోజుల్లో కూలిపోయింది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








