అమెరికా నిరసనలు: శాంతియుత నిరసనలు హింసాత్మకంగా ఎందుకు మారతాయి? పోలీసులతో జనం ఎందుకు ఘర్షణకు దిగుతారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హిలియల్ షెంగు
- హోదా, బీబీసీ ప్రతినిధి , వాషింగ్టన్
నిజానికి అమెరికాలో ఆందోళనలు శాంతియుతంగానే మొదలయ్యాయి. కొన్ని చోట్ల ఇప్పటికీ శాంతియుతంగానే కొనసాగుతున్నాయి కూడా. అయితే అదే సమయంలో చాలా చోట్ల ఆందోళకారులు పోలీసులతో ఘర్షణలకు దిగి పోలీసు వాహనాలకు నిప్పంటించారు. ఆస్తులను ధ్వంసం చేశారు. షాపుల్ని లూటీ చేశారు.
దేశంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వినియోగించే అమెరికా రిజర్వు సైనిక దళం నేషనల్ గార్డ్.. 15 రాష్ట్రాల్లో ఐదు వేల మంది సిబ్బందిని రంగంలోకి దింపినట్టు తెలిపింది.
ఈ పరిస్థితిని 2011లో బ్రిటన్లో జరిగిన అల్లర్లతో పోలుస్తున్నారు చాలా మంది నిపుణులు. అప్పట్లో బ్రిటన్ పోలీసులు ఓ వ్యక్తిని కాల్చి చంపడంతో తలెత్తిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దేశ వ్యాప్తంగా చాలా చోట్ల భవనాలకు నిప్పంటించిన ఆందోళనకారులు ఆ పై అనేక దుకాణాల్లో లూటీకి పాల్పడ్డారు.
“ఫ్లాయిడ్ మరణం తర్వాత తలెత్తిన ఇలాంటి పరిస్థితులు పోలీసులకు - నల్లజాతీయులకు మధ్య ఉన్న సంబంధాలపై మెజార్టీ ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని తెలియజేస్తాయి” అని కీలి యూనివర్శిటీలో క్రౌడ్ బిహేవియర్ అండ్ పబ్లిక్ ఆర్డర్ పోలిసింగ్ వ్యవహారాల నిపుణులు ప్రొఫెసర్ క్లిఫర్డ్ స్టాట్ అన్నారు.
ముఖ్యంగా సమాజంలో వ్యవస్థీకృత అసమానతలు ఉన్నప్పుడు ఇలాంటి ప్రతిఘటనలు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు.
2011లో బ్రిటన్లో జరిగిన అల్లర్లను కూడా ప్రొఫెసర్ స్టాట్ అధ్యయనం చేశారు. అల్లర్లు అనేక నగరాలకు వ్యాపించడానికి ప్రధాన కారణం వివిధ నగరాలకు చెందిన ఆందోళనకారులు ప్రతి ఒక్కరూ ఆ పోరాటాన్ని తమ జాతి పోరాటంగా భావించినట్లు ఆయన అధ్యయనంలో తేలింది.
పోలీసుల మీద ఆందోళనకారులు పైచేయి సాధించినట్లు కనిపించినపుడు.. వివిధ జిల్లాల్లో అల్లర్లకు పాల్పడేవారు తాము రెచ్చిపోవచ్చునని భావించారు.

ఫొటో సోర్స్, EPA
పోలీసుల ప్రతిస్పందన ఎలా ఉందనేది ముఖ్యం
స్థానిక ప్రజలతో పోలీసులకు సత్సంబంధాలు ఉన్నప్పుడు హింసాత్మక ఆందోళనలకు పెద్దగా చోటు ఉండదు. అయితే ఆందోళనలు జరిగిన రోజు పోలీసులు ఎలా స్పందించారన్నది కూడా ముఖ్యమైన అంశమని నిపుణులు చెబుతున్నారు.
“అల్లర్లు సాధారణంగా పరస్పర సంబంధాలపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా ఆందోళనకారులతో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఎక్కువగా ఇది ఆధారపడి ఉంటుంది” అని ప్రొఫెసర్ స్టాట్ అభిప్రాయపడ్డారు.
ఉదాహరణకు భారీ సంఖ్యలో ఆందోళనకారులు గుమికూడినప్పుడు వారిలో కొద్ది మంది.. పోలీసులతో తలపడినపుడు ఉద్రిక్తతలు మొదలుకావచ్చునని స్టాట్ తెలిపారు.
అయితే పోలీసులు సాధారణంగా ఆందోళనకారులందరి విషయంలో ఒకే విధంగా ప్రతిస్పందిస్తారు. పోలీసులు తమపై బల ప్రయోగం చెయ్యడం అన్యాయమని జనం భావిస్తే వాళ్లలో “మేము Vs వాళ్లు” అనే మానసిక భావన పెరిగిపోతుంది.
ఇది.. హింస గురించి, ఘర్షణ గురించి జనం ఆలోచనా సరళిని మార్చేయగలదు. ఉదాహరణకు కొన్నిసార్లు అటువంటి పరిస్థితుల్లో తాము హింసకు పాల్పడటం న్యాయబద్ధమేనని భావించడం మొదలుపెట్టొచ్చు.
అమెరికాలో “ఈ వారంతంలో పోలీసుల బలప్రయోగాన్ని మరింతగా పెంచార”ని లాస్ ఎంజెల్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా సోషల్ సైన్స్ విభాగం డీన్ డార్నెల్ హంట్ అభిప్రాయపడ్డారు.
“జాతీయ భద్రతా దళాలను రంగంలోకి దించడం, రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే వినియోగించడం వంటి పోలీసు చర్యల వల్ల అప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితులు మరింత ముదిరిపోయాయి” అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, REUTERS
ఈ తరహాలో జరిగిన మరిన్ని ఆందోళనలను కూడా ప్రపంచంలోని వివిధ దేశాల్లో మనం చూడవచ్చు. ఉదాహరణకు 2019లో హాంకాంగ్‌లో తలెత్తిన ఘర్షణల్ని చూస్తే దాదాపు 7 నెలల పాటు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. నిజానికి మొదట్లో అవి చాలా శాంతియుతంగానే జరిగాయి. కానీ చివరికి మాత్రం అవి హింసాత్మకంగా మారాయి.
సాధారణంగా కొన్ని ఆందోళనలు ఎందుకు హింసాత్మకంగా మారుతాయన్న విషయాన్ని వివరించడంలో మోరల్ సైకాలజీ ఉపయోగపడుతుందని రైస్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్గనైజేషనల్ బిహేవియర్ విభాగంలో సహాయ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న మార్లూన్ ముజిమ్యాన్ అన్నారు.
ఓ వ్యక్తి యొక్క నైతిక భావన అన్నది ఆ వ్యక్తి తనను తాను ఎలా చూసుకుంటున్నారన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. కనుక “ఏదైనా ఒక విషయం మనకు అనైతికం అనిపించినప్పుడు అది మనలో బలమైన భావనల్ని పుట్టిస్తుంది. ఎందుకంటే మనం అర్థం చేసుకున్న నైతికతకు తగిన రక్షణ ఉండాలని మనం భావిస్తాం”
“శాంతియుతంగా ఉండాలన్న ప్రజల ఆలోచనల్నిఇవి అధిగమిస్తాయి” ఎందుకంటే ఒక సారి వ్యవస్థ విచ్ఛిన్నమవుతోందని మీరు భావించినట్టయితే, అది సరి కాదని చెప్పేందుకు మీరు నిజాయతీగా ఏదో ఒకటి బలంగా చెయ్యాలనుకుంటారు.”
ఇది వారి వారి విస్తృత నమ్మకాలపై కూడా ఆధారపడవచ్చు. ఉదాహరణకు అబార్షన్ అన్నది నైతికంగా దుర్మార్గం అని ఎవరైతే భావిస్తారో అలాంటి వ్యక్తులు అబార్షన్ క్లినిక్‌పై బాంబు వేస్తే తప్పు లేదు అనుకోవచ్చు. అని మార్లూన్ చెప్పుకొచ్చారు.
ఒక్కోసారి హింసకు సామాజిక మాధ్యమాలు కూడా కారణమవుతాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, AFP
దోపిడీలు, విధ్వంసాలు లక్ష్యంగా చేసుకొనే జరుగుతాయా?
గత వారాతంలో అమెరికాలోని ముఖ్యంగా లాస్ ఏంజెల్స్‌లో చాలా వ్యాపార సముదాయాలను ధ్వంసం చేశారు. భారీ ఎత్తున దుకాణాల దోపిడి కూడా జరిగింది.
ఈ ఆందోళనలన్నీ ఏదో అసంబద్ధంగా, అస్తవ్యస్తంగా జరిగి ఉంటాయని ఊహించడం చాలా సులభం. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదంటున్నారు ప్రొఫెసర్ స్టాట్. నిజానికి అందులో పాల్గొన్న వారి దృష్టిలో అవి చాలా నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా జరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు.
“మరి కాస్త విస్తృతంగా ఆలోచిస్తే, దోపిడి అనేది ఓరకంగా తమ అధికారాన్ని వెల్లడి చేయడం. పోలీసుల దృష్టిలో తాము అధికారహీనులుగా ఉన్నామని నల్ల జాతీయులు భావించి ఉండవచ్చు. కానీ అల్లర్ల సందర్భానికొస్తే క్షణికావేశంలో ఉండే ఆందోళనకారులు పోలీసుల కన్నా మరింత శక్తిమంతమవుతారు” అని అన్నారు ప్రొఫెసర్ స్టాట్.
1992లో లాస్ ఏంజెల్స్‌లో జరిగి అల్లర్లను అధ్యయనం చేశారు ప్రొఫెసర్ హంట్. రాండే కింగ్ అనే నల్ల జాతీయుణ్ణి నలుగురు శ్వేతజాతికి చెందిన పోలీసులు తీవ్రంగా కొట్టినట్టు వీడియో సాక్ష్యం ఉన్నప్పటికీ నిర్దోషులుగా విడుదలయ్యారు. దాంతో రెచ్చిపోయిన ఆందోళన కారుల్ని పోలీసులు తీవ్రంగా అణచివేశారు.
“అయితే ఆందోళనకారులు ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారన్న విషయంలో కూడా చాలా పెద్ద చరిత్రే ఉంది. లాస్ ఏంజెల్స్‌లో జరిగిన విధ్వంసం, దోపిడీల ఘటనల్ని పరిశీలిస్తే మైనార్టీలకు చెందిన వ్యాపార సముదాయాలపై ఇవి మైనార్టీలకు చెందినవి అంటూ పెయింట్ వేసి ఉండటాని మనం గమనించవచ్చు. దాంతో ఆందోళనకారులు వాటిని విడిచి పెట్టేవారు.” అని ప్రొఫెసర్ హంట్ వివరించారు.
అయితే అల్లర్ల సమయంలో దోపిడీలు ఎందుకు జరుగుతాయన్న విషయాన్ని వివరించడం కాస్త సంక్లిష్టమైనదని ప్రొఫెసర్ స్టాట్, ప్రొఫెసర్ హంట్ ఇద్దరూ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అనేక మందికి అనేక రకాల అంశాలు ప్రేరణ కల్గిస్తాయని తెలిపారు. దోపిడికీ పాల్పడే వారిలో పేదరికంతో బాధపడేవారు ఉండవచ్చు లేదా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడేవాళ్లు కూడా ఉండవచ్చు అని వారు చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, AFP
హింసను ఎలా నిరోధించవచ్చు?
పోలీసులు ఆందోళనల్ని వీలైనంత వరకు చట్టబద్ధంగా చూడటం అలాగే ఆందోళనకారుల్ని చర్చలకు అంగీకరించేలా చేయడం అన్నది అత్యంత కీలకం అని ప్రజా వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు.
“మంచి పోలిసింగ్ విధానం మానసికంగా మేము-వాళ్లు అన్న భావనను తొలగించేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే ప్రజల దృష్టిలో చట్ట విరుద్ధంగా పోలీసులు వ్యవహరించవచ్చు అన్న భావనను తొలగించేందుకు ప్రయత్నించాలి” అని ప్రొఫెసర్ స్టాట్ అన్నారు.
ప్రొపెసర్ హంట్ కూడా చర్చలే అత్యుత్తమ మార్గమని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు జరుగుతున్న చాలా ఆందోళనలకు నాయకులు లేకుండానే జరుగుతుండటం ప్రధాన సమస్య అని చెప్పుకొచ్చారు. అల్లర్లకు నాయకత్వం వహించే వారు ఎవరన్నది తెలుసుకోలేకపోతే, వాళ్లతో చర్చలు జరపడం అసాధ్యం అని హంట్ అన్నారు.
ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే సాధారణంగా చర్చల కోసం వారు అనుసరించే విధానాల వల్ల ఒక్కోసారి పరిస్థితి మెరుగు పడవచ్చు. లేదా మరింత అధ్వాన్నంగా తయారుకావచ్చు.
మొత్తంగా అల్లర్లు అనేవి లోతుగా పేరుకుపోయిన ఉద్రిక్తతల లక్షణాలు మాత్రమే కాదు సులభమైన పరిష్కారం దొరకని సంక్లిష్టమైన సమస్యలు కూడా.
1968లో మార్టిన్ లూథర్ కింగ్ హత్య సందర్భంలో జరిగిన ఆందోళనల తర్వాత అంత తీవ్రంగా జరుగుతున్న అల్లర్లు ఇవి అని ప్రొఫెసర్ హంట్ అభిప్రాయపడ్డారు.
“సమాజంలో నెలకొని ఉన్న అసమానతల గురించి కానీ, అవే ఇలాంటి ఘటనలకు కారణమవుతాయని కానీ ఏ మాత్రం ఆలోచించకుండా పోలీసులు కొన్ని వర్గాల విషయంలో ఎంత క్రూరంగా వ్యవహరిస్తారో మీరు ఏ మాత్రం ఊహించలేరు” అని ఆయన చెప్పారు.
“నిజానికి జార్జ్ ఫ్లాయిడ్ కేసులో విషయంలో తాజాగా జరిగిన ఘటనలు అంటే పోలీసుల హత్యలే ఈ ఆందోళనలకు కారణమని మీరు వాదించవచ్చు. కానీ అంతర్లీనంగా చూస్తే శ్వేత జాతీయుల ఆధిపత్య ధోరణి, జాతి వివక్ష ఇలా ఇప్పటికీ అమెరికా కొలిక్కి తీసుకొని రాలేకపోయిన అనేక సమస్యలు ఈ పరిస్థితి కారణం” అని హంట్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- పోలీస్ కాళ్ల కింద నల్లజాతి వ్యక్తి మృతి: భగ్గుమన్న జనం.. పోలీసులతో ఘర్షణ
- ఇండియాలో ఆన్లైన్ మోసాలు 600 శాతం పెరిగాయి.. ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకోండి.. మీరు మోసపోకుండా జాగ్రత్తపడండి
- జీ7 సదస్సు: భారత్‌ను ట్రంప్ ఎందుకు ఆహ్వానించారు.. ఈ గ్రూప్‌లో చైనా ఎందుకు లేదు
- కరోనావైరస్ లాక్డౌన్: కడలి మీద నెలల తరబడి కష్టాల నావలో చిక్కుకుపోయినవాళ్లు ఏం చేస్తున్నారు
- ప్రపంచ ఆరోగ్య సంస్థతో అమెరికా తెగతెంపులు - ట్రంప్
- డోనల్డ్ ట్రంప్: ‘భారత్, చైనాల సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా సిద్ధం’
- భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి.. ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది
- ‘మోదీతో కలిసి తింటే ఎంతో బాగుండేది’: సమోసాలు తయారు చేసి ట్వీట్ చేసిన ఆస్ట్రేలియా ప్రధాని
- ‘ఫాల్కన్’ రాకెట్ మీద ‘క్రూ డ్రాగన్’ అంతరిక్షయానం: నాసా ‘ప్రైవేటు’ మిషన్ గురించి 10 ప్రశ్నలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








