ట్రంప్ vs ట్విటర్: ట్రంప్ ట్వీట్లపై ట్విటర్ హెచ్చరికలు - ట్విట్టర్ లక్ష్యంగా ట్రంప్ ఉత్తర్వులు

ట్విటర్

ఫొటో సోర్స్, Getty Images

ట్విటర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికలకు కల్పించిన కొన్ని చట్టపరమైన రక్షణలను తొలగించటం లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ శుక్రవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సంతకాలు చేశారు.

దానికిముందు.. ట్రంప్ చేసిన ఒక ట్వీట్‌ను ట్విటర్ హైడ్ చేసింది. అమెరికా అధ్యక్షుడు చేసిన ఒక ట్వీట్‌ను హైడ్ చేయటం ఇదే మొదటిసారి. దీంతో.. అమెరికా అధ్యక్షుడికి - సోషల్ మీడియా దిగ్గజానికి మధ్య వివాదం మరింతగా ముదిరినట్లయింది.

యూజర్ల అభిప్రాయాలను సెన్సార్ చేయటానికి, ఎడిట్ చేయటానికి సోషల్ మీడియా సంస్థలకు అదపులేని అధికారాలు ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ట్విటర్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు సంప్రదాయ స్వరాలను నొక్కివేస్తున్నాయని ట్రంప్ తరచుగా ఆరోపిస్తున్నారు.

ఈ వారంలో ట్రంప్ చేసిన రెండు ట్వీట్లకు.. ట్విటర్ ‘ఫ్యాక్ట్-చెక్’ చేసుకోవాలనే సూచనలు జతచేసిన నేపథ్యంలో ట్రంప్ తాజా ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులను కోర్టులో సవాలు చేయవచ్చు.

పోస్టల్ ఓట్లలో భారీ స్థాయి మోసం జరుగుతోందంటూ ట్రంప్ చేసిన ట్వీట్లకు.. ‘ఆ ట్వీట్లలో నిజాలను తనికి చేసుకోవాలనే’ ఫ్యాక్ట్ చెక్ సూచనను ట్విటర్ జతచేర్చింది. దీంతో అవి ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందని ట్రంప్ బుధవారం నాడు ఆరోపించారు.

ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను ట్విటర్, ఇతర సోషల్ మీడియా వేదికలు ఖండించాయి.

ట్రంప్

ఫొటో సోర్స్, Twitter

ఇదిలావుంటే.. శుక్రవారం ఉదయం ట్రంప్ చేసిన ఒక ట్వీట్‌.. హింసను కీర్తించటానికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తోందంటూ ట్విటర్ హైడ్ చేసింది.

అమెరికాలోని మిన్నీపోలిస్ నగరంలో పోలీసుల కస్టడీలో ఒక నల్లజాతి వ్యక్తి మరణించటం పట్ల రెండు రోజులుగా జరుగుతున్న హింసాత్మక నిరసనల గురించి ట్రంప్ ట్వీట్ చేశారు.

అంటే.. ట్వీట్‌ను తొలగించటానికి బదులు.. దానికి ఒక హెచ్చరికను చేర్చి దాచేస్తుంది. దానిని క్లిక్ చేసి ట్వీట్‌ను చూడొచ్చు.

‘‘ఈ ట్వీట్ అందుబాటులో ఉండటం ప్రజలకు ప్రయోజనకరం కావచ్చునని ట్విటర్ నిర్ధారించింది’’ అని హెచ్చరిక పేర్కొంది.

ట్విటర్‌కు - అమెరికా అధ్యక్షుడికి మధ్య ముదురుతున్న వివాదంలో ఇది తాజా ఉదంతం.

ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఏముంది?

అమెరికన్ చట్టం కమ్యూనికేషన్స్ డీసెన్సీ చట్టం ద్వారా ఆన్లైన్ సోషల్ మీడియా సంస్థలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, యు ట్యూబ్ లకి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చట్టపరమైన రక్షణ లభిస్తుంది.

ఈ చట్టంలో ఉన్న సెక్షన్ 230 ప్రకారం సోషల్ నెట్వర్క్ లలో నెటిజన్లు పోస్ట్ చేసే సమాచారానికి ఆయా సంస్థలు బాధ్యత వహించవు. అయితే ఏదైనా సమాచారం అభ్యంతరకరంగా, అసభ్యకర రీతిలో కానీ, హింసించే విధంగా గానీ ఉన్నప్పుడు దానిని తొలగించే అధికారం వాటికి ఉంటుంది. ఈ సెక్షన్ ద్వారా ఆన్లైన్ వేదికలకి లభించే చట్టపరమైన రక్షణని తొలగించాలని ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సూచిస్తోంది.

దీని పై అటార్నీ జనరల్ విలియం బార్ వెంటనే చట్టాన్ని రూపొందిస్తారని, దాని పై కాంగ్రెస్ వోట్ చేస్తుందని ట్రంప్ తెలిపారు.

అలాగే, సంస్థ వెబ్ సైట్లో పేర్కొనలేని నిబంధనలకు వ్యతిరేకంగా ఏదైనా సమాచారాన్ని తొలగించడం కానీ, నిర్బంధించడం కానీ చేయడాన్ని కూడా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తప్పుగా పరిగణిస్తోంది.

ఒక వేళ ఈ సంస్థలు సమాచార వేదికలుగా కాకుండా ఆన్లైన్ ప్రచురణ కర్తలుగా వ్యవరించాలనుకుంటే చట్టంలో సంస్థలకున్న వెసులుబాట్లు వర్తించవని రిపబ్లిక్ పార్టీ కి చెందిన సెనేటర్ మార్కో రూబియో పేర్కొన్నారు.

ఏ విధమైన సమాచారాన్ని సంస్థ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్బంధిచడం మోసపూరితమవుతుందో కూడా నిర్వచించాలని ఈ ఆర్డర్ పేర్కొంది.

ఆన్లైన్ ప్లాట్ఫారంలలో ప్రభుత్వ ప్రకటనలని పరిశీలించి, ఒక వేళ ఆ సంస్థలు కొన్ని వర్గాల అభిప్రాయాల కనుగుణంగా మాత్రమే ఉండేలా ప్రకటనలని కూడా నియంత్రిస్తున్నాయో లేదో పరిశీలించాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పేర్కొంది.

ట్విట్టర్ కి ట్రంప్ కి మధ్య వివాదానికి దారి తీసిన పరిస్థితులేమిటి?

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ట్విట్టర్ కి ట్రంప్ కి మధ్య వివాదానికి దారి తీసిన పరిస్థితులేమిటి?

ఈ ఆర్డర్ ఎంత వరకు ప్రభావం చూపిస్తుంది?

ఆంథోనీ జర్కర్

బీబీసీ నార్త్ అమెరికా రిపోర్టర్ విశ్లేషణ

ట్రంప్ చేసిన రెండు పోస్టులపై ట్విట్టర్ పెట్టిన ఫ్యాక్ట్ చెక్ సందేశం పట్ల ఆ సంస్థ తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.

వాక్ స్వాతంత్రానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్న ఈ సంస్థల గుత్తాధిపత్యం పట్ల తీవ్ర చర్యలు తీసుకుంటానని ట్రంప్ హెచ్చరించినప్పటికీ ఇవి కార్య రూపం దాల్చి అమలులోకి రావడానికి చాలా సమయం పడుతుంది.

స్వతంత్ర ప్రభుత్వ సంస్థలు ఫెడరల్ చట్టాలని పరిశీలించి కొత్త ప్రతిపాదనలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటి పై వోటింగ్ జరగాలి. వీటన్నితో పాటు న్యాయ స్థానంలో వారి ప్రతిపాదనలను సమర్ధించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా జరిగేసరికి ఈ ఏడాది నవంబర్లో రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా అయిపోతాయి.

ఈ కారణాల రీత్యా ట్రంప్ దీనికి కాంగ్రెస్ ఆమోదంతో సోషల్ మీడియా కంపెనీల పట్ల అమెరికా అవలంబించే విధానాన్ని మార్చాలని ఆలోచన చేస్తున్నట్లు అర్ధం అవుతోంది.

ట్రంప్ తీసుకున్నఈ చర్య వలన ట్విట్టర్లో ట్రంప్ పోస్ట్ చేసిన ఏదైనా సమాచారాన్ని మార్చినప్పుడు గాని, తొలగించినప్పుడు గాని, ట్విట్టర్ ఒకటికి రెండు సార్లు అలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

ట్రంప్ తన సందేశాల్ని ప్రజలకి పంపించడానికి ట్విట్టర్ ని సాధనంగా వాడతారు. ఆయన ఇచ్చిన సందేశాన్ని ట్విట్టర్ వెనక్కి నెట్టేస్తే అటువంటి చర్యలు సంస్థకి నష్టం చేకూర్చే అవకాశం ఉంది.

సోషల్ మీడియా సంస్థలు ఎలా ప్రతిస్పందించాయి?

అమెరికాలో భావ స్వాతంత్రానికి రక్షణ కల్పించే సెక్షన్ 230 ని తొలగించడం కేవలం ఆవేశాత్మకంగా, రాజకీయ ఉద్దేశ్యంతో తీసుకున్న చర్య అని ట్విట్టర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఈ చట్టంలో మార్పు తేవడం ద్వారా అమెరికా ఆర్ధిక వ్యవస్థకి మాత్రమే కాకుండా ఇంటర్నెట్ స్వాతంత్య్రం విషయంలో ప్రపంచ అధిపతిగా ఉన్న అమెరికా స్థానానికి కూడ కూడా నష్టం వాటిల్లుతుందని, గూగుల్ పేర్కొంది,

"సమాచారం ప్రచురించే విధానంలో తమకి కచ్చితమైన విధానాలు ఉన్నాయని, రాజకీయ అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా తాము సమాచారాన్ని ప్రచురిస్తామని గూగుల్ బీబీసీ తో వ్యాఖ్యానించింది.

సమాచారాన్ని నియంత్రణ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫారంల మీద సెన్సార్ నిబంధనలు విధించడం సరైన పద్దతి కాదని ఫేస్ బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్బర్గ్ ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

ఆన్లైన్లో ప్రజలు వ్యక్తపరిచే ప్రతి విషయాన్ని నిజమో కాదో నిర్ధరించే బాధ్యత తమ సంస్థలకి లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సోషల్ మీడియా కంపెనీల వాక్ స్వాతంత్య్ర హక్కుల పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కాటో ఇన్స్టిట్యూట్ కి చెందిన మాత్యు ఫీనీ అన్నారు

“కేవలం రాజకీయ పరమైన సమాచారం మీద మాత్రమే నిబంధనలు అమలు చేయడం ద్వారా సంస్థలు ఇతరత్రా నిర్మూలించే పోర్నోగ్రఫీ, హింసాత్మక, జాతి వివక్ష ని పెంచే సమాచారాన్ని తొలగించడం ఆపేయవచ్చని” ఆయన అభిప్రాయపడ్డారు.

వివాదానికి దారి తీసిన పరిస్థితులేమిటి?

ట్రంప్ కి సోషల్ మీడియా సంస్థల మధ్య ఎప్పటి నుంచో రగులుతున్న స్పర్ధలు మంగళవారం మళ్ళీ తెర పైకి వచ్చాయి. ట్విట్టర్ ట్రంప్ చేసిన రెండు పోస్టులకి ఫ్యాక్ట్ చెక్ లేబుళ్ళని జత చేసింది.

ఆయన ఎటువంటి ఆధారాలు లేకుండా 'మెయిల్ ద్వారా వేసిన ఓట్లు మోసపూరితమని" ట్వీట్ చేశారు.

ఈ ప్రకటన ఆధార రహితమంటూ ఆ పోస్ట్ కి ట్విట్టర్ హెచ్చరిక లేబుల్ ని జత చేసింది.

దీంతో, సోషల్ మీడియా సంస్థల్ని నియంత్రిస్తానంటూ ట్రంప్ బుధవారం హెచ్చరికలు జారీ చేశారు.

ట్విట్టర్ భావ స్వాతంత్రాన్ని హరిస్తోందని ఆయన అంతకు ముందు ట్వీట్ చేశారు.

అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికల గురించి ప్రచురితమయ్యే తప్పుడు సమాచారాన్ని ట్విట్టర్ ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఎదుర్కొంటుందని ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సీ చెప్పారు.

ట్రంప్ ఇదే విధమైన పోస్ట్ ని ఫేస్ బుక్ లో కూడా చేసినప్పటికీ అక్కడ ఆయనకి ఎటువంటి వ్యతిరేకత ఎదురవ్వలేదు.

ట్విట్టర్ లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సంస్థ విధానాలని ఇటీవల కాలంలో పటిష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)