ట్విటర్‌: డోనల్డ్ ట్రంప్‌ ట్వీట్‌కు ఫ్యాక్ట్‌ చెక్‌ హెచ్చరిక.. అమెరికా అధ్యక్షుడి ఆగ్రహం

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, 2020 అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి ట్విటర్ ప్రయత్నిస్తోందని ట్రంప్ ఆరోపించారు

మొట్టమొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్‌ ట్రంప్‌ పోస్టుకు ట్విటర్‌ ఫ్యాక్ట్‌ చెకింగ్‌ లేబుల్‌ తగిలించింది

''దేర్‌ ఈజ్‌ నో వే(జీరో) దట్‌ మెయిల్‌-ఇన్‌ బ్యాలట్స్‌ విల్‌ బి ఎనీథింగ్ లెస్‌ దేన్‌ సబ్‌స్టాన్షియల్లీ ఫ్రాడ్యులెంట్‌'' అంటూ ట్రంప్‌ ఇటీవల ట్వీట్ చేశారు.

మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్‌కు ఒప్పుకునేదే లేదని, అవి అక్రమాలకు నిలయాలని పేర్కొంటూ ట్రంప్‌ ట్విటర్‌లో కామెంట్‌ చేశారు.

అయితే తప్పుదారి పట్టించే సమాచారంపై తీసుకున్న కొత్తవిధానంలో భాగంగా డోనాల్డ్‌ ట్రంప్‌ పోస్ట్‌కు ఒక హెచ్చరిక నోట్‌ను తగిలించింది ట్విటర్‌.

దీనిపై స్పందించిన ట్రంప్‌, ''భావ ప్రకటనా స్వేచ్ఛను ట్విటర్‌ పూర్తిగా హరించివేస్తోంది'' అంటూ రీట్వీట్‌ చేశారు.

అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన పోస్ట్ కింద నీలిరంగు ఆశ్చర్యార్ధకంతో ఒక లేబుల్‌ను తగిలించింది ట్విటర్‌. ''మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్ గురించి వాస్తవాలు తెలుసుకోండి'' అంటూ పాఠకులకు సూచించింది.

ట్రంప్‌ పోస్టుల గురించి ట్విటర్‌ ఏం చెబుతోంది?

మెయిల్‌-ఇన్ బ్యాలెట్స్‌ మీద ట్రంప్‌ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారంలేదని ట్విటర్‌ ప్రకంటించింది. దీనికి సంబంధించి సీఎన్‌ఎన్‌, ది వాషింగ్‌టన్‌ పోస్ట్ రాసిన కథనాలను చదవాల్సిందిగా సూచించింది.

దానికి కిందనే 'వాట్‌ యు నీడ్‌ టు నో '' (''మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే'') అన్నసెక్షన్‌లో ప్రెసిడెంట్‌ ట్రంప్‌ చేసిన తప్పుడు ఆరోపణలేంటో, వాటి వెనక నిజాలెంటో వెల్లడించింది.

తప్పుడు సమాచారాన్ని ఎప్పటికప్పుడు గుర్తించి వాటికి ఫ్యాక్ట్ చెక్‌ లేబుల్స్‌ తగిలిస్తామని ట్విటర్‌ ఇంతకు ముందే ప్రకటించింది.

అయితే అమెరికా అధ్యక్షుడిపై చర్యలకు ట్విటర్‌ వెనకాడుతోంది. తప్పుదోవ పట్టించే సమాచారానికి వార్నింగ్‌ లేబుల్స్‌ తగిలించడంపై ట్విటర్‌ ఈ నెలలోనే నిర్ణయం తీసుకుంది.

ప్రెసిడెంట్ ట్రంప్‌ స్పందన ఏంటి?

ఈ ఏడాది నవంబర్‌ల జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తలదూర్చేందుకు ట్విటర్‌ ప్రయత్నిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోపించారు.

''భావ ప్రకటనా స్వేచ్ఛను హరించి వేసేందుకు ట్విటర్‌ ప్రయత్నిస్తోంది. అధ్యక్షుడిగా నేను ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోను'' అని ట్రంప్‌ చెప్పారు.

ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి మేనేజర్‌గా వ్యవహరిస్తున్న బ్రాడ్‌ పార్‌స్కేల్‌ కూడా ట్విటర్‌పై విమర్శలు గుప్పించారు.

''తన రాజకీయ ఉద్దేశాలు, అబద్ధపు విశ్వసనీయత బైటపడకుండా ఫ్యాక్ట్‌ చెకర్స్‌ అనే ముసుగు తగిలించుకోడానికి ట్విటర్‌ ప్రయత్నిస్తోంది. ట్విటర్‌ నుంచి మేం అడ్వర్టయిజ్‌మెంట్లను వెనక్కి తీసుకోడానికి అనేక కారణాలున్నాయి. వారి రాజకీయ పక్షపాత ధోరణి అందులో ఒకటి'' అని పార్‌స్కేల్ ట్వీట్‌ చేశారు.

డోనల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్.. దానికి ఫ్యాక్ట్ చెక్ ట్యాగ్ తగిలించిన ట్విటర్

ఫొటో సోర్స్, Twitter

Presentational grey line

ట్విటర్‌కు ఇది తొలి పరీక్ష

జో థామస్‌

బీబీసీ టెక్నాలజీ రిపోర్టర్‌

రాజకీయ ప్రత్యర్ధుల మీద, సెలబ్రిటీల మీద విమర్శలతో యుద్ధం చేయడానికి డోనల్డ్ ట్రంప్‌ ట్విటర్‌ను విరివిగా ఉపయోగించుకుంటారు. కాని ఇప్పుడు దానితోనే ఆయన పోరాడుతున్నారు.

తప్పుదారి పట్టించే సమాచారంపై ట్విటర్‌ చేస్తున్న యుద్ధాన్ని ఆయన భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడంగా అభివర్ణిస్తున్నారు. దాన్ని అంగీకరించబోనని అంటున్నారు.

కానీ ట్విటర్‌ అనేది ఒక ప్రైవేటు సంస్థ. తన ప్లాట్‌ఫామ్‌ ఎలా ఉండాలో, దానిపై ఏమేమి ఉండాలో నిర్ణయించుకునే హక్కు ఆ సంస్థకు ఉంది.

అయితే, ఇక్కడ ఇబ్బంది ఏంటంటే...మంగళవారం వరకు అమెరికా అధ్యక్షుడో, మరో ప్రపంచ స్థాయి నేత మీదో ఆ సంస్థ తన రూల్స్‌ను అమలు చేయలేదు.

అయితే ఇవి కేవలం అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోపణలే కాదు. ఏ మాత్రం ప్రభావితం చేయలేని వ్యక్తులను మాత్రమే ట్విటర్‌ తన సైట్‌ నుంచి బ్లాక్‌ చేస్తుందన్న వాదన కూడా ఉంది.

ట్రంప్‌ తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఆయనకున్న 8 మిలియన్లమంది ఫాలోయర్స్‌ చెంతకు చేరాయి. ట్విటర్‌ వారందరినీ వదులుకోవాలని అనుకోవడం లేదు.

ఒకవైపు డోనల్డ్‌ ట్రంప్‌లాంటి వాళ్లు తాము చెప్పాల్సింది చెప్పుకోనివ్వడానికి అవకాశం కల్పిస్తూనే, పాఠకులు తప్పుదోవ పట్టకుండా ఉండేందుకు, ట్విటర్‌, లేబులింగ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

కోవిడ్‌-19 విషయంలో ఈ వ్యూహం బాగా పని చేసింది. నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాఠకులను తప్పుదోవ పట్టించే ఇలాంటి అంశాలు వెల్లువెత్తే అవకాశం ఉందని ట్విటర్‌ గుర్తించింది. అందుకే ఈ విధానాన్ని అమలు చేయడానికి ట్రంప్ ట్వీట్‌ను ఎంచుకుంది ట్విటర్‌.

Presentational grey line
పోస్టల్ బ్యాలెట్

ఫొటో సోర్స్, Reuters

మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్స్‌ అంటే ఏంటి?

మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్ అంటే పోస్టల్‌ ఓట్లు. వీటిని ముందు ప్రజలకు ఇస్తారు. ప్రజలు తమ ఓటును మెయిల్‌-ఇన్‌ బ్యాలట్‌ ద్వారా వినియోగించుకుంటారు.

ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో తాము పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటేయడానికి ఇబ్బందులు ఎదురవుతాయని ఇటీవల ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో 66%మంది అమెరికన్లు చెప్పారు.

ఇలాంటి అభిప్రాయం ఉన్నందువల్లే తమకు మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజల నుంచి రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది.

పోలింగ్‌ కేంద్రాలకు వస్తే తాము వైరస్‌ బారిన పడే ప్రమాద ముందని చాలామంది ఓటర్లు భయపడుతున్నారు.

సుదూర ప్రాంతాల్లో ఉండేవారు ఈ తరహాలో ఓటేసేందుకు అమెరికా ఎన్నికల విధానం అనుమతిస్తుంది. కానీ దీనికి అర్హత పొందాలంటే కొన్ని ప్రమాణాలుండాలి.

పశ్చిమ అమెరికాలోని వాషింగ్టన్‌, ఓరెగాన్‌, కొలరాడో సహా ఐదు రాష్ట్రాల్లో పూర్తిగా మెయిల్-ఇన్‌ బ్యాలెట్‌ మీదే ఆధారపడి ఎన్నికలు నిర్వహిస్తారు.

కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాలలో ఓటర్ల అభ్యర్ధన మేరకు ఈ అవకాశం కల్పిస్తారు. 17 రాష్ట్రాలలో ఈ తరహాలో ఓటేయాలంటే ఓటర్లు తాము వ్యక్తిగతంగా ఎందుకు పోలింగ్‌ కేంద్రానికి రాలేకపోతున్నామో స్ప్షష్టమైన కారణం చూపించాల్సి ఉంటుంది.

అబద్ధపు ఆరోపణల పోస్టును తొలగించడానికి నిరాకరించిన ట్విటర్‌

2001లో హత్యకు గురైన లోరి క్లాసుటిస్‌ అనే వ్యక్తికి సంబంధించిన కేసుపై ప్రెసిడెంట్ ట్రంప్‌ చేసిన ఆరోపణలను తొలగించడానికి ట్విటర్‌ ఒకప్పుడు నిరాకరించింది.

లోరీ క్లాసుటిస్‌ హత్య వెనక కుట్ర ఉందని, ఈ హత్యను ఎంఎస్‌ఎన్‌బిసి వ్యాఖ్యాత జో స్కార్‌బరోయే చేశాడంటూ ట్రంప్‌ పదేపదే ఆరోపణలు చేశారు.

అయితే ట్రంప్‌ చేసిన ఆరోపణలు పచ్చిఅబద్ధాలని, వాటిని వెబ్‌సైట్‌ నుంచి తొలగించాలని క్లాసుటిస్‌ భార్య టిమోతీ ట్విటర్‌కు విజ్జప్తి చేశారు. కానీ ట్విటర్‌ అందుకు నిరాకరించింది.

అయితే ప్రెసిడెంట్‌ ట్రంప్‌ చేసిన కామెంట్ల వల్ల మీకు కలిగిన బాధకు తాము తీవ్రంగా చింతిస్తున్నమంటూ క్షమాపణలు చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)