వైసీపీ ఎంపీ నందిగం సురేశ్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సహా 49 మందికి హైకోర్టు నోటీసులు

నందిగం సురేశ్

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో బాపట్ట ఎంపీ నందిగం సురేశ్(ఎడమ)

న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై 49 మందిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు పెట్టి, నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.

వారిలో వైయస్సార్సీపీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు.

కోటు ధిక్కరణ చట్టంలోని 10, 12 సెక్షన్లు, కోర్టు ధిక్కరణ నిబంధనలు 5 ప్రకారం జిడిషియల్ రిజిస్ట్రార్ ఈ నోటీసులు జారీ చేశారు. మే 22 నుంచి 24 మధ్య హైకోర్టు రిజిస్ట్రార్‌కి మెయిల్స్, ఫోన్ ద్వారా కొన్ని వీడియోలు, పత్రికా క్లిప్పింగులూ వచ్చాయనీ, పలు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులకు స్పందనగా హైకోర్టుపైనా, హైకోర్టు జడ్జీలపైనా, సుప్రీం కోర్టు న్యాయమూర్తులపైనా కులం, అవినీతి, లేని ఉద్దేశాలు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేశారనీ ఆ ఉత్తర్వుల్లో ఉంది.

చంద్రబాబు హైకోర్టును మేనేజ్ చేస్తున్నారనీ, తీర్పులు పదినిమిషాల ముందే తెలిసిపోతున్నాయంటూ ఎంపీ నందిగం సురేశ్ చేసిన వ్యాఖ్యలను నోటీసులో ప్రస్తావించారు.

హైకోర్టు జడ్జీలను ముక్కలు చేయాలంటూ ఒక వ్యక్తి రాసిన ట్వీట్ గురించీ, జడ్జీలందరినీ కరోనా పేషెంట్ ఉన్న గదిలో ఉంచాలన్న ట్వీట్‌ను, న్యాయమూర్తులను బూతులు తిట్టి నాపై సీబీఐ ఎంక్వైరీ వేసుకోండి అన్న ఫేస్ బుక్ మెసేజీని ప్రస్తావించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

గతంలో హైకోర్టు జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తిపై కొందరు చేసిన కామెంట్లపై ఏప్రిల్ 6న, 17న రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేశారనీ, తాజా అంశాలపై కూడా 24న రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేశారనీ, దీనిపై స్పందించిన ఛీఫ్ జస్టిస్ కోర్టు ధిక్కరణ కేసు పెట్టాలని ఆదేశించినట్టుగా ఆ ఉత్తర్వుల్లో ఉంది.

ఈ కేసును సుమోటోగా తీసుకుంటున్నట్టు ప్రకటించారు జ్యుడిషియల్ రిజిస్ట్రార్.

గత కొంతకాలంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న పలు విధాన నిర్ణయాలపై పలువురు కోర్టులకు వెళ్లడం, కోర్టులు వాటికి వ్యతిరేక తీర్పులు ఇవ్వడం జరుగుతోంది.

ఇంగ్లిష్ మీడియం, సచివాలయాలకు రంగులు, డా. సుధాకర్ అరెస్టు వంటివి అందులో కొన్ని. ఈ క్రమంలో వైయస్సార్సీపీ నాయకులు కొందరు కోర్టులపై వ్యాఖ్యలు చేశారు.

హైకోర్టు తీర్పులు ముందే చంద్రబాబుకు తెలిసిపోతున్నాయంటూ విలేకర్ల సమావేశంలో వ్యాఖ్యానించారు సురేశ్.

''హైకోర్టు ఇచ్చే తీర్పు పది నిమిషాల ముందే చంద్రబాబుకు తెలుస్తుంది. మొదట చంద్రబాబును విచారించాలి. ఆయన కాల్‌లిస్టు బయటపెట్టాలి. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌చేసుకుంటూ తిరుగుతున్నాడు. హైకోర్టును మేనేజ్‌చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఈ రోజున తీర్పు వస్తే ప్రభుత్వానికి చెంపపెట్టు అంటున్నాడు. ఎంతసేపు మేనేజ్‌మెంట్లతోనే ఒడ్డు ఎక్కే చంద్రబాబు 26 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు.'' అని అన్నారు సురేశ్.

ఆమంచి కృష్ణమోహన్

ఫొటో సోర్స్, facebook/AmanchiKrishnamohan

ఫొటో క్యాప్షన్, ఆమంచి కృష్ణమోహన్

డాక్టర్ సుధాకర్ తరపున వేసిన పిటిషన్‌ను సమర్ధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదన్నారు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.

''కోర్టు సామాన్య విషయాలకు సైతం సీబీఐ విచారణకు ఆదేశిస్తుంటే ప్రతి పోలీస్టేషన్ ఉన్న చోటా సీబీఐ ఆఫీసును ఏర్పాటు చేయాల్సి వస్తుంది. డాక్టర్ సుధాకర్ ది ఒక పెటీ కేసు. కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదు. కానీ ఇలాంటి తీర్పులతో న్యాయస్థానాలపై నమ్మకం పోతోంది. కరోనా లేకపోతే హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఆందోళన చేసి ఉండేవాడిని''. అన్నారు కష్ణమోహన్.

ఈ నోటీసులపై బీబీసీ తెలుగుతో మాట్లాడారు ఎంపీ నందిగం సురేశ్, ఆమంచి కృష్ణమోహన్‌లు. తాను ఒక సామాన్యుడిగా తన బాధను చెప్పుకున్నాను తప్ప, కోర్టులను ధిక్కరించే ఉద్దేశం తనకు లేదని ఆయన అన్నారు.

''మేం మాట్లాడిన దాంట్లో ధిక్కరించాలనీ, ఇబ్బంది పెట్టాలనీ, లాయర్లు, జడ్జీలను కామెంట్ చేయాలన్న ఆలోచన లేదు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, టీడీపీ వారు మైక్ పక్కన పెట్టిన వెంటనే మాట్లాడేది ఏంటి? వాళ్ల సోషల్ మీడియా చూడండి. వాళ్ల ఉద్దేశాలు కనిపిస్తాయి. ''మీరిక్కడ పాలిస్తే, మేం కోర్టుల్లో పాలించగలం'' అంటూ వారు రెచ్చగొట్టారు. ''మేమెక్కడున్నా పాలించగలమని మాట్లాడారు.'' ఇలా మాట్లాడితే ఎవరికైనా బాధే కదా? నాపై దాడి చేసినప్పుడు స్టే ఇచ్చి, తరువాత స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అది ఎంత బాధాకరం? సహజంగా, ఒక సామాన్యుడిగా నాకుండే బాధ నాకుంది. కోర్టును తప్పు పట్టాలని కాదు. ఆ ఉద్దేశం కూడా ఎప్పుడూ లేదు. కానీ న్యాయం ఇవాళ కాకపోతే రేపు, ఏదో ఒక రోజు, ఏదో ఒక రూపంలో గెలుస్తుంది.'' అన్నారు సురేశ్.

తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.

''నేనేమీ న్యాయమూర్తిపై వ్యక్తిగతంగా కామెంట్ చేయలేదు. అబ్యూజ్ చేయలేదు. అదే సమయంలో నా ప్రాథమిక హక్కు అయినటువంటి, నాకు నచ్చని ఒక విషయాన్ని నేను వ్యక్తీకరించాను. ప్రజల ముందు నేను ఏం చెప్పానో దానికి నేను వంద శాతం కట్టుబడి ఉన్నాను.'' అన్నారు ఆమంచి కృష్ణమోహన్.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)