ప్రపంచ ఆకలి తీర్చే గోదుమ ‘జన్యుపటం‘

గోధుమ జన్యుపటం జన్యువుల

ఫొటో సోర్స్, IGOR STEVANOVIC / SCIENCE PHOTO LIBRARY

వాతావరణ మార్పులను తట్టుకొనే విధంగా పంటలను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇది సాధ్యమైతే ప్రపంచంలో ఆకలి కేకలకు అంతం పలికే అవకాశం ఉంది.

అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం గోదుమలోని ఒక లక్షకు పైగా జన్యువులను గుర్తించింది.

ఈ జన్యుపటం రూపొందితే వాతావరణ మార్పుల వల్ల వచ్చే వడగాలులను తట్టుకొని నిలిచే గోదుమ పంటను అభివృద్ధి చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా తయారు చేసిన పంట తక్కువ నీటితో అధిక దిగుబడిని ఇస్తుందని అంటున్నారు. వీరి పరిశోధన వివరాలు సైన్స్ జనరల్‌లో ప్రచురితమయ్యాయి.

'గోదుమ జన్యుపట ఆవిష్కరణ సాధ్యమైతే సాగు దశ మారుతుంది' అని నోర్విచ్‌లోని జాన్ ఇన్నెస్ సెంటర్‌లో క్రాప్ జెనెటిక్స్ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ క్రిస్టోబల్ అన్నారు.

''వాతావరణ మార్పులు, డిమాండ్ పెరుగుతున్న క్రమంలో ఈ సమస్యలను పరిష్కరించేందుకు గోధుమల ఉత్పత్తికి మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

''చాలా ఏళ్లుగా దీని కోసం ఎదురు చూస్తున్నాం. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. భవిష్యత్తు అవసరాలను తీర్చే గోదుమ జాతుల కోసం శాస్త్రవేత్తలు, సాగుదారులు ఎదురుచూస్తున్నారు.'' అని ఆయన అన్నారు.

దక్షిణ సూడాన్‌ ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

ఇది ఎందుకంత ముఖ్యం?

2050 నాటికి గోదుమల ఉత్పత్తిని 60 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి అనుబంధ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏవో) అంచనా వేసింది.

గోదుమల దిగుబడిని పెంచేందుకు మెక్సికో కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ మొక్కజొన్న మరియు గోధుమ జాతుల అభివృద్ది కేంద్రం (సీఐఎంఎంవైటీ) కృషి చేస్తోంది.

కొత్త రకాలను అభివృద్ధి చేయడంతో పాటు, పేద దేశాల్లో దిగుబడిని పెంచి రైతులకు చేయూతనందించడానికి ఈ కేంద్రం సహాయం చేస్తోంది.

''గోదుమ పంట పెరిగే దశలో రాత్రిపూట ఒక్క డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినా దిగుబడి 8 శాతానికి పడిపోతుంది. అందుకే వాతావరణ మార్పులను తట్టుకునేలా కొత్త వంగడాలను సృష్టించడం మా ముఖ్యమైన పని'' అని సీఐఎంఎంవైటీ అధ్యక్షుడు డాక్టర్ రవి సింగ్ తెలిపారు.

జన్యుపటం ప్రపంచం ఆకలిని ఎలా తీర్చుతుంది?

సంకర విధానంతో శాస్త్రవేత్తలు ఏటా కొత్త గోదుమ వంగడాలను సృష్టిస్తున్నారు. ఈ విధానం బాగానే ఉన్నా.. అధికంగా వ్యయం అవుతోంది. ఒక్కోసారి కొత్త వంగడాన్ని సృష్టించి రైతులకు అందించాలంటే 10 నుంచి 15 ఏళ్లు పడుతోంది.

ప్రస్తుతం గోదుమలకు సంబంధించి సుమారు లక్షకు పైగా జన్యువులను, వాటి డీఎన్‌ఏ స్థానాలను పరిశోధకులు గుర్తించారు.

జన్యుపటం పూర్తైతే.. కరువు పరిస్థితులను ఎదుర్కొనేలా, పోషక విలువలు, దిగుబడి పెంచేలా కొత్త వంగడాలను సృష్టించే అవకాశం ఉంది. జన్యుపటాన్ని సవరించి వాటి లక్షణాలను త్వరితగతిన మార్చే ఆస్కారం ఉంది.

జన్యుపటంలోని రసాయన బంధాలు

ఫొటో సోర్స్, Getty Images

జన్యు పటం రూపొందించడం ఎంత కష్టమంటే?

గోదుమల జన్యుపటం రూపొందించడం అనేది భారీ ప్రయత్నమనే చెప్పాలి. 20 దేశాలకు చెందిన 73 సంస్థల నుంచి వచ్చిన 200 మంది శాస్త్రవేత్తలు గోదుమ జన్యు రచన పనిలో నిమగ్నమై ఉన్నారు. వీళ్లందరూ కలసి ఇప్పటి వరకు గోదుమలకు సంబంధించి 21 క్రోమోజోములు, 1,07,891 జన్యువులను గుర్తించారు.

గోదుమ డీఎన్‌ఏలో 16 బిలియన్ల రసాయన బంధాలున్నాయి. మానవుని జన్యువులతో పోల్చితే ఇవి ఐదు రెట్లు ఎక్కువ.

అంతేకాదు, గోదుమల్లో మళ్లీ మూడు ప్రత్యేక ఉప జన్యువులు ఉన్నాయి. ఇందులోని ప్రతి ఉప జన్యువును తీసుకొని వాటిని విశ్లేషించడం, సరైన క్రమంలో అమర్చడం శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)