#గమ్యం: పైలట్ కావాలని అనుకుంటున్నారా..

ఫొటో సోర్స్, TSAviationAcademy
- రచయిత, అనిల్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం.
ఎయిర్ హోస్టెస్ ఎలా కావాలి? ఆ ఉద్యోగానికి కావలసిన అర్హతలు ఏమిటి? శిక్షణ ఎలా ఉంటుంది? వంటి అంశాలను గతవారం చర్చించాం. ఈ వారం 'గమ్యం'లో విమానయాన రంగానికే చెందిన మరో ముఖ్యమైన ఉద్యోగం... పైలట్ గురించి వివరిస్తున్నారు Careers360.com డైరెక్టర్ రామలక్ష్మి పేరి. మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్‌గా పోస్ట్ చేయండి.
విమానం నడపడం అంటే సాధారణ ప్రక్రియ కాదు. చాలామందికి అదో పెద్ద కల. అసలు కాక్‌పిట్ ఎలా ఉంటుంది? పైలట్లకు ఆకాశంలో మార్గం ఎలా తెలుస్తుంది? రాత్రి పూట డ్రైవింగ్ ఎలా చేస్తారు? ఇలాంటివన్నీ చాలామందికి తీరని సందేహాలే. అందువల్ల పైలట్ ఉద్యోగం అంటే ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ శిక్షణకు అయ్యే ఖర్చును పరిగణనలోకి తీసుకుంటే... ఇది సామాన్యులకు అందని ద్రాక్షే అని చెప్పవచ్చు.
పైలట్ కావడానికి మూడు మార్గాలున్నాయి.
1)ఎన్డీఏ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ) పరీక్ష రాసి, వైమానిక దళంలో చేరడం
2)ప్రైవేటుగా సొంత విమానం ఉంటే దానికోసం లైసెన్స్ తీసుకోవడం
3)కమర్షియల్ పైలట్ శిక్షణ తీసుకోవడం
పైలట్ ఉద్యోగాన్ని వృత్తిగా స్వీకరించాలనుకునేవారు తీసుకోవాల్సింది... కమర్షియల్ పైలట్ శిక్షణ. దీనిగురించి తెలుసుకుందాం.
పౌరవిమానయానానికి సంబంధించిన అన్నిరకాల కార్యకలాపాలు డీజీసీఏ పరిధిలోనే ఉంటాయి. పైలట్ శిక్షణకు భారత్‌లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆమోదించిన 30 సంస్థలున్నాయి. వీటన్నింట్లో ముఖ్యమైనది ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ దగ్గరలో ఉన్న ఇందిరాగాంధీ ఉడాన్ అకాడమీ. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కమర్షియల్ పైలట్ శిక్షణ సంస్థ.

ఫొటో సోర్స్, TSAviationAcademy
కమర్షియల్ పైలట్ కావాలంటే అర్హతలేంటి?
అభ్యర్థులకు కనీసం 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్లస్ 2 లేదా ఇంటర్‌మీడియట్‌లో గణితం (మ్యాథ్స్), భౌతికశాస్త్రం (ఫిజిక్స్) కచ్చితంగా చదివి ఉండాలి. కెమిస్ట్రీ మాత్రం తప్పనిసరి కాదు.
ఇందిరాగాంధీ ఉడాన్ అకాడమీలో ప్రవేశాలకు ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రకటన వస్తుంది. మేలో ప్రవేశ పరీక్ష, జూన్‌లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ అకాడమీ ఒక్కటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థ. మిగిలినవన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలు లేదా ప్రైవేటు శిక్షణ సంస్థలు.
ఇది చాలా ఖరీదైన కోర్సు అని చెప్పవచ్చు. ఇందిరాగాంధీ అకాడమీలో శిక్షణలో చేరాలంటే దాదాపు రూ.45లక్షలు ఫీజు చెల్లించాలి. దీనికి ఎలాంటి స్కాలర్‌షిప్పులూ ఉండవు. కేవలం సొంత డబ్బుతోనే శిక్షణలో చేరాలి. బ్యాంక్ లోన్ సౌకర్యం ఉంటుంది.
శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. వినికిడి, చూపు స్పష్టంగా ఉండాలి. కళ్లజోడు ఉండకూడదు అనే నిబంధన ఏమీ లేదు. కళ్లజోడు వాడుతున్నా చూపులో స్పష్టత ఉంటే చాలు.
ఈ కోర్సు వ్యవధి 18 నెలల నుంచి 24 లేదా 30 నెలల వరకూ ఉంటుంది. నిబంధనల ప్రకారం పూర్తి చేయగలిగితే 18 నెలల్లోనే లైసెన్స్ పొందవచ్చు.

ఫొటో సోర్స్, TSAviationAcademy
శిక్షణ ఎలా ఉంటుంది?
శిక్షణలో భాగంగా ఎయిర్‌క్రాఫ్ట్ నేవిగేషన్, ప్లానింగ్, ఏవియేషన్ మీటియొరాలజీ, రెగ్యులేషన్స్, కాక్‌పిట్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లపై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తారు. దీనితోపాటు పైలట్ ఇన్ కమాండ్‌గా 100 గంటల పాటు ఫ్లయింగ్ అవర్స్, 20 గంటల పాటు దేశ వ్యాప్తంగా నడపడం, ఇన్‌స్ట్రుమెంటల్ స్టడీకి 10 గంటలు, రాత్రిపూట విమానం నడపడంపై 5 గంటల పాటు ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది.
ఏ సంస్థలో శిక్షణ పూర్తి చేసినా... చివర్లో లైసెన్స్ కోసం రాసే పరీక్ష మాత్రం డీజీసీఏనే నిర్వహిస్తుంది. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతేనే మీకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ లభిస్తుంది. ఈ పరీక్ష ఏడాదిలో మూడుసార్లు జరుగుతుంది.
తెలంగాణలో ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థ, రెండు ప్రైవేట్ సంస్థలు కమర్షియల్ పైలట్ శిక్షణను అందిస్తున్నాయి. వీటిలో ఫీజు రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఉంటుంది. శిక్షణ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం విమానయాన సంస్థలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, IGRUK
శిక్షణ తర్వాత అవకాశాలు ఎలా ఉంటాయి?
చాలా సంవత్సరాల క్రితం భారత్‌లో తగిన సంఖ్యలో పైలట్లు లేకపోవడంతో... విదేశాలనుంచి తీసుకొచ్చి మన దేశీయ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాల్లో చేర్చుకునేవారు. ఈ కొరతను తీర్చడానికే ఇందిరాగాంధీ ఉడాన్ అకాడమీని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఎన్నో ప్రైవేట్ విమానయాన సంస్థలు మార్కెట్లో ఉన్నాయి. అందువల్ల ఉద్యోగావకాశాలకు కొదవ లేదు. కమర్షియల్ పైలట్ శిక్షణ ఎంత ఖర్చుతో కూడుకున్నదో... వీరి జీతభత్యాలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల శిక్షణకోసం ఎక్కువగా ఖర్చు పెట్టినా... బాధపడవలసిన అవసరం ఉండకపోవచ్చు.

ఫొటో సోర్స్, IGRUA
విదేశీ లైసెన్సులు ఇక్కడ పనికొస్తాయా?
కొందరు విదేశాల్లో కమర్షియల్ పైలట్ శిక్షణ తీసుకుని ఇక్కడకు వచ్చి పనిచేయాలనుకుంటారు. ఇది సాధ్యమే. కొందరు అమెరికా, ఆస్ట్రేలియాల్లో శిక్షణ తీసుకోవడానికి వెళ్తుంటారు. ఎందుకంటే అక్కడ 6 నెలల్లోనే శిక్షణ పూర్తి చేసుకుని, లైసెన్స్ పొందవచ్చు. కానీ వారు భారత్‌కు వచ్చి పనిచేయాలంటే ఇక్కడ డీజీసీఏ నిర్దేశించిన మరొక పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు డీజీసీఏ వెబ్‌సైట్‌లో ఉంటాయి.
కొన్ని విమానయాన సంస్థలకు సొంతంగా కూడా శిక్షణ సంస్థలున్నాయి. వాటిలో శిక్షణ పూర్తిచేస్తే వారి కంపెనీలోనే ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది. ఏ సంస్థ అయినా సరే... డీజీసీఏ అనుమతి పొందినదై ఉండాలి.
ఇవి కూడా చదవండి.
- #గమ్యం: ఎయిర్ హోస్టెస్ కావాలంటే కావాల్సిన అర్హతలివే
- #గమ్యం: డీఆర్డీవోలో సైంటిస్టు ఉద్యోగం పొందడం ఎలా?
- #గమ్యం: బార్క్‌లో సైంటిస్టు అయితే మీ భవిత బంగారమే
- #గమ్యం: ఇస్రోలో సైంటిస్ట్ కావాలంటే ఇదే మార్గం
- #గమ్యం: బ్యాంకింగ్ రంగ ఉద్యోగాలకు కంప్లీట్ గైడ్
- పాస్‌పోర్ట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- వైరల్: పాకిస్తాన్లో భద్రతపై తీసిన ఈ వీడియో భారత్‌లో హత్యకు కారణమైంది. ఇలా..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









