#గమ్యం: డీఆర్‌డీవోలో సైంటిస్టు ఉద్యోగం పొందడం ఇలా...

ఫొటో సోర్స్, DRDO
- రచయిత, అనిల్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం.
ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం అంటే అంత సులభమేమీ కాదు. మరో విషయం... ప్రభుత్వ ఉద్యోగాలు అంటే టీచర్లు, గ్రూప్ సర్వీసెస్, సివిల్ సర్వీసెస్... ఇలాంటివే సాధారణంగా అందరికీ మదిలో మెదులుతాయి. కానీ పరిశోధనలపై ఆసక్తి ఉన్నవాళ్లకోసం ఎన్నో సంస్థల్లో అవకాశాలు ఎదురుచూస్తూనే ఉంటాయి. అయితే వాటిలోకి ఎలా ప్రవేశించాలి, ఏ పరీక్షలు రాయాలి, అప్లికేషన్లు ఎక్కడ లభిస్తాయి వంటివి చాలామందికి తెలియదు.
డీఆర్‌డీవో, బార్క్, ఇస్రో... వంటి ఎన్నో సంస్థలు పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారికి అవకాశాలు కల్పిస్తున్నాయి. వీటిలో ఒక్కొక్కదానిలో ప్రవేశాలు ఎలా అనేదాని గురించి వివరిస్తున్నారు Careers360.com ఇంజనీరింగ్ ఎడిటర్ ప్రభ ధవళ. దీనిలో భాగంగా ఈ వారం డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)లో ఉద్యోగావకాశాల గురించి తెలుసుకుందాం.
మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి.
సైంటిస్ట్ (బి) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
డీఆర్‌డీవోలో ఉద్యోగాల భర్తీని రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (ఆర్ఏసీ) పర్యవేక్షిస్తుంది. ప్రధానంగా ఇంజనీరింగ్ చదివినవారు సైంటిస్ట్ (బి) ఉద్యోగాల్లో ప్రవేశాలకు అర్హులు. ఇవి ప్రారంభదశ సైంటిస్ట్ ఉద్యోగాలు అని అనుకోవచ్చు. ఏరోనాటికల్, అగ్రికల్చరల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వంటి విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసినవారు లేదా సైన్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు దీనికి అర్హులు. దీంతో పాటు గేట్‌లో సాధించిన స్కోరు కీలకం.
ఎంబీఏ, వెటర్నరీ సైన్స్ ఉత్తీర్ణులకు కూడా దీనిలో అవకాశాలున్నాయి.
సైంటిస్ట్ (సి), సైంటిస్ట్ (డి) కేటగిరీ ఉద్యోగాలకు కూడా రిక్రూట్‌మెంట్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇవి ఆయా రంగాల్లో అనుభవజ్ఞులకు ఉద్దేశించినవి.

ఫొటో సోర్స్, RAC
కేవలం సైన్సెస్ లేదా ఇంజనీరింగ్ వారికే కాదు, ఆర్ట్స్, ఇతర గ్రూపుల్లో చదివినవారికి కూడా డీఆర్‌డీవోలో ఉద్యోగావకాశాలున్నాయి. మ్యాథమ్యాటిక్స్, స్టాటిస్టిక్స్, ఆపరేషనల్ రిసెర్చ్, సైకాలజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రథమ శ్రేణి (ఫస్ట్ క్లాస్)లో ఉత్తీర్ణులైనవారు వీటికి అర్హులు. కానీ వీటిలో అవకాశాలు సైంటిస్ట్ ఉద్యోగాల మాదిరిగా ప్రతి సంవత్సరం ఉండవు. కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఆర్ఏసీ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకుంటూ ఉండటం మంచిది.
ప్రస్తుతం 41 సైంటిస్ట్ (బి) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

ఫొటో సోర్స్, DRDO
సైంటిస్ట్ (బి) ఉద్యోగానికి అర్హతలేమిటి?
దీనికి గేట్ స్కోరు ప్రధాన ప్రాతిపదిక. 2016, 2017, 2018 సంవత్సరాల్లోని గేట్ స్కోరు ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
వయసు 28 సంవత్సరాలకు మించి ఉండకూడదు. (ఓబీసీలకు 31 సంవత్సరాలు, ఎస్సీ లేదా ఎస్టీలకు 33 సంవత్సరాలు)
ఇంజనీరింగ్‌లో ప్రథమ శ్రేణి లేదా 6.75 సీజీపీఏ స్కోరు ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేయవచ్చు. కానీ ఆగస్టు చివరి నాటికి మీ ఫలితాలు వెలువడాలి. లేదంటే మీరు అనర్హులవుతారు.
అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు కూడా వీటికి దరఖాస్తు చేయవచ్చు. కానీ వారు పనిచేస్తున్న విభాగం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి. ఇది లేకపోతే డీఆర్‌డీవోలో చేరలేరు.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్... ఈ రెండు విభాగాల్లో విద్యార్హతలున్నవారికోసం ప్రస్తుతం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలకోసం ఆర్ఏసీ వెబ్ సైట్ చూడండి.
రూ.100/- ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన తర్వాత ఆర్ఏసీ షార్ట్ లిస్ట్ విడుదల చేస్తుంది. ఎంపికైనవారికి ఇంటర్వ్యూ ఉంటుంది. దీనిలో కూడా ఉత్తీర్ణులైతే సైంటిస్ట్ (బి) ఉద్యోగంలో చేరడానికి మార్గం సుగమమైనట్లే. వీరికి ప్రారంభంలోనే నెలకు రూ.80000/- వరకూ జీతం ఉంటుంది.
మరిన్ని వివరాలకు... డీఆర్డీవోలో ఉద్యోగ ప్రకటన లింకును చూడండి.
ఇవి కూడా చదవండి:
- #గమ్యం: వైజ్ఞానిక పరిశోధకులకు అండ.. కేవీపీవై స్కాలర్షిప్
- #గమ్యం: సైన్స్ పరిశోధనలకు ప్రోత్సాహం... ఇన్స్పైర్ స్కాలర్షిప్
- #గమ్యం: 2020 తర్వాత ఐటీ, సైన్స్ కాకుండా మరే రంగాలైతే బెటర్?
- #గమ్యం: బీటెక్ తర్వాత ఏం చేయాలి? ఎంబీఏ-ఎంటెక్-జాబ్!?
- #గమ్యం : 2020 తర్వాత వైద్యరంగంలో ఈ కోర్సులదే హవా
- #గమ్యం: సెలవుల్లో ఇంటర్న్షిప్ - ఉద్యోగ వేటలో మెరుగైన అవకాశాలు
- #గమ్యం: డిగ్రీలు లేకుండా ఇంటర్నెట్లో డబ్బు సంపాదించడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









