#గమ్యం: కామర్స్ + సర్టిఫికేషన్లు = ఉద్యోగం!

బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం.
చాలా మంది చదివిన చదువుకు ఏమాత్రం సంబంధం లేని ఉద్యోగం చేయడం మనందరం చూస్తూనే ఉంటాం. ఇష్టమైన ఉద్యోగం రాక, రాజీపడి ఏదో ఒక ఉద్యోగంలో చేరడం అనేది ఎంతో మంది యువత జీవితంలో జరిగేదే.
కామర్స్‌పై ఆసక్తి ఉన్నా మిగిలిన విద్యార్థులను చూసి కావచ్చు, తల్లిదండ్రుల ఒత్తిడి కావచ్చు... ఈ రోజుల్లో అందరూ ఇంజనీరింగ్, మెడిసిన్ అంటూ సైన్స్ గ్రూపుల వెనకే పరిగెత్తడం చూస్తూనే ఉన్నాం. అయినా సరే కామర్స్ చదవాలని నిర్ణయించుకుంటే ఉద్యోగం దొరకడం ఇప్పుడున్న రోజుల్లో కొద్దిగా కష్టమే అని చెప్పవచ్చు.
మరి మీ ఆసక్తికి అనుగుణంగా ఈ పోటీ ప్రపంచంలో మీ కామర్స్ డిగ్రీకి మరి కొంచెం విలువ పెరిగి, ఉద్యోగావకాశాలు మెరుగవ్వాలంటే ఏం చేయాలి?
కామర్స్ విద్యార్థులు చేయదగిన ప్రత్యేక కోర్సులు, రాయదగిన పరీక్షల వివరాలను ఈ వారం గమ్యంలో వివరిస్తున్నారు Careers360.com డైరెక్టర్ రామలక్ష్మి పేరి. మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి.
చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ)
ఇది రెండు స్థాయుల్లో ఉంటుంది. ఫౌండేషన్ కోర్సు, ఇంటర్మీడియట్. ప్లస్ 2 లేదా ఇంటర్ పాసైన విద్యార్థులు ఫౌండేషన్ కోర్సు చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ కోర్సుకు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు అర్హులవుతారు. దీంతోపాటు ఆర్టికల్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ కోర్సు పూర్తిచేయాలి. దీంతో మీరు చార్టర్డ్ అకౌంటెంట్ అవుతారు.
కంపెనీ సెక్రటరీషిప్ (సీఎస్)
ఇంటర్ లేదా ప్లస్ 2 పూర్తి చేస్తే రెండేళ్ల ఫౌండేషన్ కోర్సుకు అర్హులవుతారు. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఒకవేళ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక సీఎస్ కోర్సు చేయాలనుకుంటే నేరుగా ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో చేరవచ్చు. ఆ తర్వాత ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కంపెనీ సెక్రటరీషిప్ వెబ్‌సైట్లో మీ పేరు నమోదు చేసుకుని సభ్యుడు కావాలి. దీని ద్వారా మీకు ఇంటర్నల్ ఆడిట్, జీఎస్టీ, వాల్యుయేషన్, ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్... వంటి మరిన్ని సర్టిఫికేషన్లు చేసే అవకాశం దొరుకుతుంది. మరిన్ని వివరాలు వెబ్‌సైట్లో ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
చార్టర్డ్ వర్క్ అకౌంటెన్సీ (సీడబ్ల్యూఏ)
దీన్ని కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ అని కూడా అంటారు. ఐసీడబ్ల్యూఏఐ అందించే ఈ కోర్సులో చేరాలంటే మొదట ఫౌండేషన్, తర్వాత ఇంటర్మీడియట్, చివరగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. ప్లస్ 2 లేదా ఇంటర్ తర్వాత ఫౌండేషన్‌లో ప్రవేశం తీసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారైతే నేరుగా ఇంటర్మీడియట్ కోర్సులో చేరవచ్చు.
యాక్చురీస్ మేనేజ్‌మెంట్
బీమా రంగంలో వ్యక్తికి ఉన్న రిస్క్‌ని అంచనా వేయడమే యాక్చురీస్ నిపుణుల పని. ఇది చాలా ప్రత్యేకమైన, డిమాండ్ ఉన్న రంగం. అన్ని రకాల బీమాలపై ఈరోజుల్లో అవగాహన పెరుగుతోంది. దీనికి తగ్గట్లుగానే యాక్చురీస్‌కు డిమాండ్ పెరుగుతోంది. బీమారంగంలో ఉద్యోగం కావాలంటే ఇది చేయడం మంచిది. లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్... ఇవి మీ బలాలైతే యాక్చురీస్ మేనేజ్‌మెంట్‌ను పరిశీలించవచ్చు. ఈ పరీక్షలు చాలా కష్టంగా ఉంటాయి కానీ నిపుణులకు మంచి భవిష్యత్ ఉంటుంది.
సర్టిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్
గ్రాడ్యుయేషన్ పూర్తైనవారు దీనికి అర్హులు. ఈ కోర్సును అందించే విద్యాసంస్థలు చాలానే ఉన్నాయి.

ఫొటో సోర్స్, Fanatic Studio
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కూడా కొన్ని సర్టిఫికేషన్లు అందిస్తోంది. కానీ నేరుగా కాకుండా కొన్ని సంస్థలతో కలిసి ఈ కోర్సులను ఆఫర్ చేస్తోంది. వీటిలో కొన్ని ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లు, అడ్వాన్సుడ్ ప్రోగ్రామ్‌లు కూడా ఉన్నాయి.
పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ డేటా అనలిటిక్స్
డిజిటల్ విప్లవం పెరిగిన తర్వాత డేటాకు, డేటా అనలిటిక్స్‌కు విపరీతమైన ప్రాముఖ్యం పెరిగింది. దీంతో పాటే డేటా అనలిస్ట్‌లకు అదే స్థాయిలో అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రతి కంపెనీకి ఇది తప్పనిసరి అవసరం అయిపోయింది.
ఇంటర్నేషనల్ కాంప్రెహెన్సివ్ ప్రోగ్రామ్ ఆన్ డీమ్యాట్ అండ్ డిపాజిటరీస్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ సర్వేలెన్స్ రిస్క్ మ్యానేజ్‌మెంట్ అండ్ సెక్యూరిటీ సెటిల్మెంట్స్... ఈక్విటీలు, షేర్లు... ఇతర షేర్ మార్కెట్ వ్యవహారాలు, లావాదేవీల గురించి అర్థం చేసుకోవాలంటే ఈ ప్రోగ్రామ్‌లు చేయడం ఉత్తమం.
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఇన్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యానేజ్‌మెంట్
ఇది దూరవిద్యావిధానం ద్వారా అందించే కోర్సు. ఉద్యోగం చేస్తున్నా, వేరే ఏదైనా పనిలో ఉన్నా కూడా ఇది చేయవచ్చు.

ఫొటో సోర్స్, Chattrawutt
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లాగానే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కూడా కొన్ని సర్టిఫికేషన్లు అందిస్తోంది.
ఫైనాన్షియల్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, కరెన్సీ డెరివేటివ్స్... ఇలా రకరకాల స్పెషలైజేషన్లు మొత్తం 11 ఉంటాయి. వీటితో పాటు మరో 15 అడ్వాన్సుడ్ మాడ్యూళ్లపై కూడా సర్టిఫికేషన్లు ఉన్నాయి. చివరగా ఎన్సీఎఫ్ఎం అనే ఆన్‌లైన్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ద్వారా మీ నైపుణ్యాలను పరీక్షించుకోవచ్చు.
సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (సీఎఫ్‌పీ)
దీన్ని ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. 34 అధీకృత కేంద్రాల ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 184 శాఖల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. కనీసం ప్లస్ 2 పాసైనవారు దీనికి అర్హులు.

ఫొటో సోర్స్, IIBF
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ఐఐబీఎఫ్)
ఐఐబీఎఫ్ చాలా సర్టిఫికేషన్లు ఆఫర్ చేస్తోంది. దీని నుంచి చేసే కోర్సులకు మార్కెట్లో విలువ బాగుంటుంది. కామర్స్ గ్రాడ్యుయేట్లకు ఇవి చాలా ఉపయుక్తం. వీటిలో కొన్ని కోర్సులు లేదా సర్టిఫికేషన్లు ఆన్‌లైన్‌లో కూడా పూర్తి చేయవచ్చు. రూరల్ బ్యాంకింగ్, ప్రివెన్షన్ ఆఫ్ సైబర్ క్రైమ్ అండ్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్, మైక్రో ఫైనాన్స్, ఫారిన్ ఎక్స్ఛేంజ్... వంటి ఎన్నో మంచి సర్టిఫికేషన్లు ఐఐబీఎఫ్ అందిస్తోంది. డిగ్రీ పూర్తి చేసినవారికి కొన్ని రెగ్యులర్ కోర్సులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
సాధారణ కామర్స్ డిగ్రీకి ఇలాంటి సర్టిఫికేషన్లు ఏవైనా జత కలిస్తే మార్కెట్లో మీ అభ్యర్థిత్వానికి విలువ పెరుగుతుంది.
ఇవి కూడా చదవండి:
- #గమ్యం: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ - ఎంటెక్కు ఏది బెస్ట్?
- #గమ్యం : 2020 తర్వాత వైద్యరంగంలో ఈ కోర్సులదే హవా
- #గమ్యం: సెలవుల్లో ఇంటర్న్‌షిప్ - ఉద్యోగ వేటలో మెరుగైన అవకాశాలు
- #గమ్యం: డిగ్రీలు లేకుండా ఇంటర్నెట్లో డబ్బు సంపాదించడం ఎలా?
- #గమ్యం: వైజ్ఞానిక పరిశోధకులకు అండ.. కేవీపీవై స్కాలర్షిప్
- #గమ్యం: ‘గేట్’ స్కోరుతో మీకు తెలియని ఉపయోగాలు
- #గమ్యం: 2020 తర్వాత ఐటీ, సైన్స్ కాకుండా మరే రంగాలైతే బెటర్?
- #గమ్యం: వైద్య అనుబంధ రంగాలు - అవకాశాలు ఎక్కువ, అభ్యర్థులు తక్కువ
- #గమ్యం: విదేశాల్లో మెడిసిన్ చదవాలన్నా నీట్ తప్పనిసరి
- #గమ్యం: ఎప్పటికీ వన్నె తరగని హోటల్ మేనేజ్‌మెంట్
- #గమ్యం: లా చదివితే లాయరే కానక్కర్లేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









