#గమ్యం: విదేశాల్లో మెడిసిన్ చదవాలన్నా నీట్ తప్పనిసరి
- రచయిత, అనిల్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం. గతవారం నీట్ (ఎన్ఈఈటీ - నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) నోటిఫికేషన్ విడుదలైంది. వైద్యవిద్యను అభ్యసించాలనుకునేవారికి, వైద్యరంగంలో స్థిరపడాలనుకునేవారికి ఇది చాలా ముఖ్యమైన పరీక్ష.
నీట్ ఎలా ఉండబోతోంది? దరఖాస్తు ఎలా చేయాలి? ఎలా సిద్ధం కావాలి? అర్హత సాధించడం ఎలా? ఆంధ్ర, తెలంగాణల విద్యార్థులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏమిటి?... ఇలాంటి అంశాలను వివరిస్తున్నారు Careers360.com ఛైర్మన్ అండ్ ఫౌండర్ మహేశ్వర్ పేరి. మీకు ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ చేయండి.

ఫొటో సోర్స్, K M Sainath
నీట్ రాయడానికి అర్హతలేమిటి?
ఒకప్పుడు మెడిసిన్ చదవాలంటే చాలా ప్రవేశ పరీక్షలుండేవి. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలతో అవన్నీ రద్దయిపోయాయి. వాటన్నింటి స్థానంలో నీట్ వచ్చింది.
మన దేశంలోనే కాదు, విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి ఇక్కడ వైద్యుడిగా స్థిరపడాలనుకున్నా నీట్ రాయడం తప్పనిసరి. ఈ పరీక్షకు హాజరు కావాలంటే అభ్యర్థి వయసు 17 సంవత్సరాలు నిండి 25 ఏళ్ల లోపు ఉండాలి. అంటే నీట్ రాయాలనుకుంటే కచ్చితంగా మే 7, 1993 తర్వాత జనవరి 1, 2002 ముందు పుట్టినవారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగులకు ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది.
ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న 65000 ఎంబీబీఎస్ సీట్లు, 25000 బీడీఎస్ సీట్లు భర్తీ అవుతాయి. దాదాపు 14 నుంచి 16 లక్షలమంది నీట్ రాస్తారని అంచనా.
ఈ సంవత్సరం నుంచి ఆయుర్వేదిక్ సైన్సెస్, యునానీ మెడిసిన్, హోమియోపతిక్ మెడిసిన్, యోగిక్ మెడిసిన్, సిద్ధ సైన్సెస్... వీటిలో ప్రవేశాలు కూడా నీట్ ద్వారానే జరగబోతున్నాయి. అంటే వైద్యపరమైన ఏ చదువు చదవాలన్నా నీట్ మాత్రమే ఆధారం.

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రా, తెలంగాణ విద్యార్థులకు ఏం ప్రయోజనం?
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఈ సంవత్సరమే ఆల్ ఇండియా కోటాలో చేరాయి. అంటే దేశవ్యాప్తంగా ఉన్న ఏ కాలేజీకైనా మీరు అడ్మిషన్ కోసం ప్రయత్నించవచ్చు.
ఒకప్పుడు నీట్ 11 భాషల్లోనే జరిగేది. వీటికి ఈ సంవత్సరం ఉర్దూ కూడా చేరింది. అంటే ఉర్దూ స్కూళ్లలో చదివినవారు కూడా ఈ పరీక్ష రాయవచ్చు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని కొందరు విద్యార్థులకు ఉపయోగపడుతుంది.
కనీసం 50శాతం మార్కులు వస్తే ప్రవేశానికి అర్హత సాధించవచ్చు. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు దీనిలో కొంత సడలింపు ఉంటుంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్రాల బోర్డులు... వీటన్నింట్లో ఎక్కడ నుంచి ప్లస్ 2 చదివినా నీట్ రాయడానికి అర్హత ఉంటుంది.
150 నగరాలు, పట్టణాల్లో దాదాపు 2 వేల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఇది 104 నగరాలకే పరిమితం.

ఫొటో సోర్స్, K M Sainath
ఓపెన్ స్కూలింగ్ విద్యార్థులు అనర్హులు
కానీ ప్రస్తుత నిబంధనల ప్రకారం... నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా ఇంటర్మీడియట్ లేదా ప్లస్ 2 చేసినవారు నీట్ రాయడానికి అనర్హులు.
నీట్ దరఖాస్తును ఆన్‌లైన్‌లోనే చేయాలి. ఈ ప్రక్రియ ఫిబ్రవరి 8న మొదలైంది. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 9, 2018. దరఖాస్తు చేయడానికి ఆధార్ నెంబరు తప్పనిసరి. కానీ కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ, కశ్మీర్‌లలో ఆధార్ లేదు కాబట్టి ఈ నిబంధన అక్కడి విద్యార్థులకు వర్తించదు. కానీ ప్రభుత్వం జారీ చేసిన ఏదో ఒక గుర్తింపు కార్డు ఉండాలి.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే... విదేశాల్లో మెడిసిన్ చదవాలన్నా నీట్ రాసి, అర్హత సాధించడం తప్పనిసరి. అంటే విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి, ఇక్కడ వైద్యుడిగా స్థిరపడాలనుకుంటే కుదరదు. ముందు నీట్ రాసి, అర్హత సాధించాలి. ఆ తర్వాతే విదేశాల్లో చదివిన డిగ్రీని పరిగణనలోకి తీసుకుంటారు. అప్పుడే ఇక్కడ వైద్య వృత్తిలో ఉండటానికి అర్హత లభిస్తుంది.
ఓ అభ్యర్థి ఎన్నిసార్లైనా నీట్‌కు హాజరుకావచ్చు. గతంలో అయితే దీనికి పరిమితి ఉండేది. ఈసారి దీన్ని తొలగించారు. కానీ గరిష్టంగా 8 లేదా 9 సార్లు కన్నా ఎక్కువసార్లు హాజరుకావడానికి అవకాశం లేదు.
పరీక్షకు వెళ్లడానికి ముందు దానికి సంబంధించిన అన్ని నిబంధనలు, సూచనలు క్షుణ్ణంగా చదువుకోండి.
నీట్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
- #గమ్యం: 2020 తర్వాత ఐటీ, సైన్స్ కాకుండా మరే రంగాలైతే బెటర్?
- #గమ్యం: ITలో ఈ 6 కోర్సులతోనే మంచి అవకాశాలు!
- #గమ్యం: ‘గేట్’ స్కోరుతో మీకు తెలియని ఉపయోగాలు
- #గమ్యం : 2020 తర్వాత వైద్యరంగంలో ఈ కోర్సులదే హవా
- #గమ్యం: జేఈఈలో విజయం సాధించడం ఎలా?
- #గమ్యం: జేఈఈ, ఎంసెట్... ఇంకా ఏమేం రాయొచ్చు?
- 2018: ఈ ఏడాదిలో అద్భుతాలు
- శ్రీహరి కోటలో ‘రాకెట్’ రహస్యం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









