ఇరాన్ ‘రెడ్‌లైన్’ దాటిందని ట్రంప్ ఎందుకంటున్నారు, గతంకన్నా ఈ ఆందోళనలు ఎందుకు ప్రత్యేకం..

ఫొటో సోర్స్, MAHSA/Middle East Images/AFP via Getty Images
ఇరాన్ విషయంలో జోక్యం చేసుకోవడంపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మరోసారి తన హెచ్చరికలను పునరుద్ఘాటించారు. ఇరాన్ అధికారులతో సమావేశం కావడానికి ముందే తాను చర్యలు తీసుకోవచ్చని అన్నారు.
ఇరాన్ అధికారులు తనను ''చర్చల కోసం’’ పిలిచినట్లు తెలిపారు.
అయితే, ఎలాంటి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారో మాత్రం చెప్పలేదు.
డిసెంబర్ 28 నుంచి ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనల్లో 500 మందికి పైగా మరణించినట్లు అమెరికా అబ్జర్వర్ గ్రూప్ తెలిపింది.
ఇరాన్‌లో నిరసనలు తెలుపుతున్న ఆందోళనకారులను హతమార్చాలనుకుంటే వారిని రక్షించడానికి అమెరికా రంగంలోకి దిగుతుందని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్ రెడ్‌లైన్‌ను దాటిందా అని అడిగినప్పుడు, ''అవును, దాటినట్లే కనిపిస్తోంది'' అని అన్నారు.
''ఈ విషయాన్ని మేం చాలా సీరియస్‌గా చూస్తున్నాం. సైన్యం కూడా దీన్ని నిశితంగా పరిశీలిస్తోంది. మేం కొన్ని చర్యల గురించి ఆలోచిస్తున్నాం. నిర్ణయం తీసుకుంటాం'' అని ట్రంప్ చెప్పారు.
ఇరాన్ రాజధాని తెహ్రాన్ శివారులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఒక శవగారానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
అక్కడకు తమ ఆప్తుల కోసం చాలామంది ఇరాన్ ప్రజలు వచ్చినట్లు కనిపిస్తోంది. తెల్లటి వస్త్రంలో చుట్టిన 180 శవాలు అక్కడ ఉన్నట్లు బీబీసీ టీమ్ గుర్తించింది.
ఇరాన్‌లో ఆందోళనలు ఉద్రిక్తంగా సాగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వమే చనిపోయినవారికి అంత్యక్రియలు నిర్వహిస్తోంది.
ఇరాన్ అధికారిక టీవీ వివరాల ప్రకారం.. 10 ప్రావిన్స్‌లలో భద్రతా బలగాల, సామాన్య పౌరుల శవపేటికలను మోస్తూ ప్రజలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే ఈ మరణాలకు కారణమని ఇరాన్ నిందిస్తోంది.

ఇరాన్‌లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చాలా ఉధృతంగా మారాయని, ఇరాన్ విప్లవం తర్వాత 47 ఏళ్ల చరిత్రలో ఇలాంటివి మునుపెప్పుడూ చూడలేదని నిపుణులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా నగరాల్లోని ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ నిరసనలు తెలుపుతున్నారు.
ఇరాన్‌లో నిరసనలు తెలుపుతున్న ఆందోళనకారులను హతమార్చాలనుకుంటే ''వారిని రక్షించడానికి అమెరికా రంగంలోకి దిగుతుంది'' అని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
ఇరాన్ పాలనను వ్యతిరేకిస్తోన్న వారికి సాయం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు.
ఒకవేళ ఇలా జరిగితే, ఈ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలపై, వారికి సహకరించేవారిపై దాడుల చేస్తామని ఇరాన్ అధికారులు హెచ్చరించారు.
ఇరాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న నిరసనలు ఈసారి ఎందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి? దేశంలో అంతకుముందు ఆందోళనలతో పోలిస్తే.. ఈసారి జరుగుతున్న వాటికి ఇరాన్ ప్రభుత్వ స్పందన ఎందుకింత సీరియస్‌గా ఉంది?

దేశవ్యాప్తంగా నిరసనలు
ఇరాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనల పరిధి, తీవ్రత చరిత్రాత్మకమైందని నిపుణులు భావిస్తున్నారు.
''ఇరాన్ ప్రముఖ నగరాల్లో ర్యాలీలు జరుగుతున్నప్పుడే, చిన్న పట్టణాలకు కూడా ఇవి విస్తరించాయి. ఈ పట్టణాల పేర్లను అంతకు ముందెప్పుడూ చాలామంది విని ఉండకపోవచ్చు'' అని సోషియాలజీ రీసెర్చర్ ఎలి ఖోర్సాంద్‌ఫర్ చెప్పారు.
అంతకుముందు కూడా ఇరాన్‌లో ఆందోళనలు జరిగాయి. 2009 నాటి ''గ్రీన్ మూవ్‌మెంట్'' ఎన్నికల్లో మోసం జరిగినట్లు ఆరోపిస్తూ.. మధ్యతరగతి ఉద్యమంగా జరిగింది. ఇది పెద్ద ఎత్తున జరిగినప్పటికీ, కేవలం ప్రధాన నగరాలకే పరిమితమైంది.
2017, 2019లో దేశంలో పేద ప్రాంతాలకే పరిమితమైన ఆందోళనల తీరుకు కూడా ప్రస్తుత నిరసనలు భిన్నంగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుత నిరసనలకు అత్యంత దగ్గర పోలికలున్న నిరసనలు ఇటీవల కాలంలో 2022లో నెలకొన్నాయి.
22 ఏళ్ల మహసా అమినీ మరణానంతరం 2022లో ఈ తిరుగుబాటు చెలరేగింది.
మహసా అమినీ ఒక యువ కుర్దీ మహిళ. హిజాబ్ సరిగా ధరించలేదన్న కారణంగా ఇరాన్ మోరల్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. వారి కస్టడీలోనే ఆమె చనిపోయారు.
అమినీ చనిపోయిన తర్వాత చెలరేగిన నిరసనలు.. ఆరు రోజుల తర్వాత తీవ్ర స్థాయికి చేరుకున్నట్లు పలు కథనాలు పేర్కొన్నాయి.
దీనికి విరుద్ధంగా.. ప్రస్తుత ఆందోళనలు చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 28న ఇవి ప్రారంభమైనప్పటి నుంచి ఈ నిరసనలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఫొటో సోర్స్, Ameer Alhalbi/Getty Images
'నియంత నాశనం కావాలి'
2022 నిరసనల మాదిరిగానే.. ప్రస్తుత ఆందోళనలు కూడా ఒక నిర్దిష్ట సమస్య కారణంగా జరుగుతున్నాయి. పాలనలో సమగ్రమైన మార్పు కోసం నిరసనకారులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు.
''2022 ఉద్యమం మహిళల సమస్యలతో ప్రారంభమైంది. కానీ, ఈ ఉద్యమం ఎన్నో సమస్యలను తెరపైకి తీసుకొచ్చింది. డిసెంబర్ 2025లో నిరసనలు ఆర్థిక సమస్యలపై ప్రారంభమయ్యాయి. స్వల్ప వ్యవధిలోనే.. మునపటి నిరసనల తరహా డిమాండ్లనే ఇవి కూడా వినిపిస్తున్నాయి'' అని ఖోర్సాంద్‌ఫర్ చెప్పారు.
డిసెంబర్ చివరిలో, సెంట్రల్ తెహ్రాన్ మార్కెట్లోని ట్రేడర్లు సమ్మెకు దిగారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇరాన్ రియాల్ మారకం రేటులో చాలా ఒడిదొడుకులు ఉంటున్నాయని అన్నారు.
దేశంలోని పశ్చిమ ప్రాంతంలోని అత్యంత పేద ప్రాంతాలకు కూడా ఈ నిరసనలు వ్యాప్తి చెందాయి.
తీవ్ర ఆర్థిక సంక్షోభం, వేగంగా పెరుగుతోన్న ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ప్రజలతో పాటు, లక్షల మంది ఇరాన్ ప్రజల కోసం డిసెంబర్ చివరిలో వేలాది మంది నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
అప్పటి నుంచి.. ''నియంత దిగిపోవాలి!'' అంటూ నినాదాలు చేస్తూ వీధుల్లో నిరసనలు ప్రదర్శనలు చేస్తున్నారు. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీని, మతపరమైన పాలనను అంతం చేయాలని నిరసనకారులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రెజా పహ్లావిని పాలకుడిగా చేయాలని నిరసనకారులు కోరుకుంటున్నారా?
2022లో నిరసనలకు నేతలెవరూ నేతృత్వం వహించలేదు. అందుకే చాలా వేగంగా ముగిసిపోయాయి.
కానీ, దీనికి భిన్నంగా ప్రస్తుత నిరసనల్లో రెజా పహ్లావి వంటి ప్రముఖ నేతలు చురుకుగా ఉన్నారు.
1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత తన తండ్రి రెజా షా పహ్లావిని అధికారం నుంచి తొలగించారు.
ప్రస్తుతం దేశ బహిష్కరణలో ఉన్న రెజా పహ్లావి దూరం నుంచే ఈ ఉద్యమాన్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే, ఈ నిరసనలు ఎక్కువ కాలం జరుగుతున్నట్లు కనిపిస్తోంది.
పహ్లావి కుటుంబం తిరిగి రావాలని డిమాండ్ చేసే నినాదాలు అంతకుముందు కంటే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అమెరికాలో ఉంటోన్న పహ్లావి తనకు తాను ఇరాన్ షాగా ప్రకటించుకున్నారు.
ప్రజలను వీధుల్లోకి రావాలని పిలుపునిస్తూ, ''నేను దేశానికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నా, త్వరలోనే మిమ్మల్ని కలుస్తా'' అని పహ్లావి చెప్పారు.
ప్రజలు వీధుల్లోకి వచ్చి, నినాదాలు చేయాలని పిలుపునిచ్చిన ఆయన సందేశాన్ని ఇరాన్‌లో చాలామంది విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
ఈ నిరసనల్లో చేరాలని సోషల్ మీడియా ద్వారా యువత ఒకరినొకరు పరోక్షంగా ప్రోత్సహించుకుంటున్నారు.
తెహ్రాన్ వంటి నగరాల్లో ఇటీవల జరుగుతోన్న ఆందోళనల తీవ్రత, పహ్లావి అభ్యర్థన ఎంత ప్రభావవంతంగా ఉందో నిరూపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Chip Somodevilla/Getty Images
ఇరాన్‌లో జోక్యం చేసుకుంటానని ట్రంప్ బెదిరింపులు
2022లో జరిగిన నిరసనలకు, ప్రస్తుతం జరుగుతోన్న నిరసనలకు మరో వైవిధ్యమైన అంశం అమెరికా.
మునుపటి నిరసనల మాదిరిగా కాకుండా, ప్రస్తుత ఏడాది జరుగుతోన్న నిరసనల్లో వైట్ హౌస్ నుంచి మద్దతు అందుతున్నట్లు కనిపిస్తోంది.
నిరసనలు తెలిపే ఆందోళనకారులకు మద్దతు తెలుపుతూ, అవసరమైతే ప్రభుత్వ టార్గెట్లపై దాడి చేస్తానని ట్రంప్ బెదిరిస్తున్నారు. అంతకుముందు ఇది జరగలేదు.
2009లో ఇరాన్ అధ్యక్షుని ఎన్నికల్లో మోసం జరిగిందని ఆరోపిస్తూ జరిపిన నిరసనల్లో.. ''ఒబాబా, ఒబామా.. మీరు వారితోనా, మాతోనా..'' అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు.
2009లో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు.
ఈ సమయంలో వీధుల్లోని నిరసనకారులకు బహిరంగంగా మద్దతు ఇవ్వకపోవడం పట్ల ఆయన తర్వాత తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ నిరసనలను ఇరాన్ శత్రువులు తమకు అనుకూలంగా మార్చుకుంటూ, మానిపులేట్ చేస్తున్నారని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు.
ఇటీవల కాలంలో ఇరాన్ మిత్రదేశాల సంఖ్య తగ్గిపోయింది. ఇది ఆ దేశానికి మరో సమస్య.

ఫొటో సోర్స్, Morteza Nikoubazl/NurPhoto via Getty Images
'యుద్ధ ప్రయోజనాన్ని పొందలేకపోయిన ప్రభుత్వం’
2022 నిరసనల మాదిరిగా కాకుండా.. ఈ ఏడాది నిరసనలు ఇజ్రాయెల్‌తో 12 రోజుల యుద్ధం, ఆ తర్వాత ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత వెంటనే ప్రారంభమయ్యాయి.
‘‘ఈ పరిణామాలు.. ఇరాన్ ప్రజల్లో ఒక రకమైన ఐక్యతను, సమైక్యతను పెంపొందించే అవకాశాన్ని ఇరాన్ అధికారులకు ఇచ్చాయి. కానీ, ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకోవడంలో విఫలమైంది'' అని జర్నలిస్ట్ అబ్బాస్ అబ్ది అభిప్రాయపడ్డారు.
గత ఏడాది మిలటరీ ఎదుర్కొన్న భారీ ఎదురు దెబ్బలు.. ఇరాన్ ప్రజల దృష్టిలో దేశ ప్రధాన సైన్య సంస్థగా ఉన్న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) ప్రతిష్ఠను, పేరును దెబ్బతీశాయని కొందరు నిపుణులు అంటున్నారు.
2022 నిరసనల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ.. ప్రస్తుత నిరసనల అణచివేతలో శాశ్వత మార్పును ఖోర్సాంద్‌ఫర్ చూస్తున్నారు.
బీబీసీ పర్సియన్ సర్వీస్, బీబీసీ గ్లోబల్ జర్నలిజం, మిడిల్ ఈస్ట్ జర్నలిస్ట్ నేదా సానీజ్ అనలసిస్, రిపోర్టింగ్‌తో ఈ కథనం అందిస్తున్నాం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














