ఇజ్రాయెల్‌తో యుద్ధం ఆగిన తరువాత ఇరాన్‌లో వరుస మరణశిక్షలు.. కారణమేంటి?

ఇజ్రాయెల్, ఇరాన్, ఉరిశిక్ష, నిఘాసంస్థలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేశారన్న ఆరోపణలతో అనేకమందిని ఇరాన్ అరెస్టు చేస్తోంది.

ఇజ్రాయెల్‌తో ఇటీవలి సంక్షోభం ముగిసిన తరువాత ఇరాన్‌లో వరుస అరెస్టులు, మరణశిక్షలు ప్రారంభమయ్యాయి.

ఇజ్రాయెల్ నిఘా సంస్థలతో సంబంధాలున్నాయన్న అనుమానంతో అనేక మందిని ఇరాన్ అధికారులు అరెస్టు చేసి ఉరితీశారు.

ఇజ్రాయెల్ ఏజెంట్లు ఊహించని స్థాయిలో తమ నిఘా సంస్థలోకి ప్రవేశించారని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.

ఇంటెలిజెన్స్ ఏజెంట్లు అందించిన సమాచారం వల్లే ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ ఉన్నత స్థాయి నాయకులను హతమార్చగలిగిందని అధికారులు అనుమానిస్తున్నారు.

తాజా సంక్షోభ సమయంలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్‌జీసీ)కి చెందిన అనేక మంది సీనియర్ కమాండర్లు, అణు శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ హతమార్చింది.

ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ఏజెంట్లు ఇరాన్‌లో పనిచేస్తున్నారని, వారే ఈ హత్యలకు బాధ్యులని ఇస్లామిక్ రిపబ్లిక్ భావిస్తోంది.

ఇరాన్ నాయకులు, అణు శాస్త్రవేత్తలపై కచ్చితత్వంతో ఇజ్రాయెల్ చేసిన దాడుల స్థాయి ఇరాన్ అధికారులను వణికించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇజ్రాయెల్, ఇరాన్, ఉరిశిక్ష, నిఘాసంస్థలు

ఫొటో సోర్స్, Getty Images

విదేశీ నిఘాసంస్థలకు సమాచారమిచ్చినందుకు ఉరిశిక్ష?

ఇప్పుడు అధికారులు విదేశీ నిఘా సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్టు అనుమానమున్న ప్రతి ఒక్కరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు.

అయితే అసమ్మతి స్వరాలను అణచివేయడానికి, ప్రజలను నియంత్రణలో ఉంచడానికి ఇదంతా జరుగుతోందని చాలామంది భయపడుతున్నారు.

12 రోజుల సంఘర్షణలో, ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేశారని ఆరోపిస్తూ ముగ్గురిని ఇరాన్ అధికారులు ఉరితీశారు.

కాల్పుల విరమణ జరిగిన ఒక రోజు తర్వాత బుధవారం(జూన్ 25), ఇలాంటి ఆరోపణలపై మరో ముగ్గురిని ఉరితీశారు.

దేశవ్యాప్తంగా వందలాది మంది అనుమానితులను గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు చేసినట్టు ప్రకటించారు.

అదుపులోకి తీసుకున్న వారు నేరం చేసినట్టు అంగీకరించడాన్ని ప్రభుత్వ టెలివిజన్ కూడా ప్రసారం చేసింది.

ఈ పరిణామాలపై మానవ హక్కుల సంఘాల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇరాన్‌లో నేరం చేసినట్టు బలవంతంగా అంగీకరింపజేస్తారని.. విచారణలు సక్రమంగా సాగవని విమర్శలున్నాయి. దీంతో భవిష్యత్తులో మరిన్ని మరణశిక్షలు అమలవుతాయన్న ఆందోళన నెలకొంది.

సీఐఏ, మొసాద్, ఎం16 వంటి పాశ్చాత్య, ఇజ్రాయెల్ నిఘా సంస్థలకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్నట్టు ఇరాన్ నిఘా మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇజ్రాయెల్, ఇరాన్, ఉరిశిక్ష, నిఘాసంస్థలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్‌ దాడిలో చనిపోయిన మిలటరీ కమాండర్లు, అణుశాస్త్రవేత్తలు

జర్నలిస్టులు, వారి కుటుంబాలపై కఠిన చర్యలు

బీబీసీ పర్షియన్, లండన్‌కు చెందిన ఇరాన్ ఇంటర్నేషనల్ సహా విదేశాలలో పర్షియన్ మీడియా సంస్థల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులపైనా ఇరాన్ ప్రభుత్వం ఒత్తిడి పెంచింది.

టీవీ ప్రజెంటర్లలో ఒకరి తల్లి, తండ్రి, సోదరుడిని ఐఆర్‌జీసీ అరెస్టు చేసిందని ఇరాన్ ఇంటర్నేషనల్ తెలిపింది

దీంతో ఆ ప్రజెంటర్ ఇరాన్-ఇజ్రాయెల్ సంక్షోభ వార్తలందించడం ఆపేశారు.

అలా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయన్న హెచ్చరిక వచ్చింది.

ఇరాన్-ఇజ్రాయెల్ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి, బీబీసీ పర్షియన్ జర్నలిస్టులు, వారి కుటుంబాలకు బెదిరింపులు తీవ్రమయ్యాయి.

యుద్ధం జరిగితే తమ కుటుంబ సభ్యులను బందీలుగా తీసుకుంటామని ఇరాన్ భద్రత అధికారులు చెప్పినట్టు జర్నలిస్టులు తెలిపారు.

జర్నలిస్టులను మొహ్రిబ్ అని పిలిచారు. అల్లాకు వ్యతిరేకంగా యుద్ధం చేసే వారికి మొహ్రిబ్ అని పేరు పెట్టారు. ఇరానియన్ చట్టం ప్రకారం, ఈ ఆరోపణ రుజువైతే, మరణశిక్ష పడొచ్చు.

మనోటో టీవీ ఇలాంటి కేసుల గురించి వెల్లడించింది. ఉద్యోగుల కుటుంబాలను బెదిరించి, ఉద్యోగులను చానల్‌తో సంబంధాలను తెంచుకోవాలని కోరారని తెలిపింది.

జర్నలిస్టుల బంధువులు కొందరిపై ఇరాన్ అధికారులు ''గూఢచర్య ఆరోపణలు'' చేశారు.

ఈ అభియోగాలకు ఇరాన్ చట్టాల ప్రకారం మరణశిక్ష విధించే అవకాశం ఉంది.

ఇజ్రాయెల్, ఇరాన్, ఉరిశిక్ష, నిఘాసంస్థలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంటర్నెట్ యాక్సెస్‌పై ఇరాన్‌లో ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి.

బహిష్కరణకు గురయిన జర్నలిస్టులను బెదిరించడానికి జరుగుతున్న పెద్ద ప్రణాళికలో ఈ వ్యూహాలు భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు.

పదుల సంఖ్యలో కార్యకర్తలు, రచయితలు, కళాకారులను భద్రత దళాలు అరెస్టు చేశాయి. చాలా మందిపై ఎలాంటి అభియోగాలు లేవు.

"మహిళలు, జీవితం, స్వేచ్ఛ" పేరుతో 2022 నిరసనల సమయంలో మరణించిన వారి బంధువులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

యుద్ధ సమయంలో, ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ యాక్సెస్‌పై చాలా కఠినమైన ఆంక్షలు విధించింది. కాల్పుల విరమణ తర్వాత కూడా ఆ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ వంటి చాలా సోషల్ మీడియా నెట్‌వర్క్‌లతో పాటు బీబీసీ పర్షియన్ వంటి వార్తా వెబ్‌సైట్‌లపై ఇప్పటికే ఇరాన్‌లో నిషేధం ఉంది.

1980లలో ఇరాన్-ఇరాక్ యుద్ధంలో రాజకీయ వ్యతిరేకతను ఇరాన్ అధికారులు క్రూరంగా అణిచివేసిన విధానాన్ని ఇటీవలి ఘటనలు గుర్తుకు తెస్తున్నాయని మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

సామూహిక అరెస్టులు, ఉరిశిక్షలు, కఠినమైన అణచివేత వంటి చర్యలు ఉండవచ్చని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

1988లో ''డెత్ కమిషన్లు''గా పిలిచేవాటితో రహస్య విచారణలు జరిపి అనేకమందిని ఉరితీసినట్టు మానవ హక్కుల సంస్థలు తెలిపాయి.

అనేకమందిని సామూహిక సమాధుల్లో ఖననం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)