దుబాయి: ఇది ఒకప్పుడు భారత్ సామ్రాజ్యంలో భాగమని తెలుసా, ఎలా విడిపోయిందంటే..

బ్రిటిష్ ఇండియా, గల్ఫ్ , భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Corbis via Getty Images

ఫొటో క్యాప్షన్, 1967వ సంవత్సరంలో తీసిన దుబాయ్‌ సముద్ర తీరం ఫోటో
    • రచయిత, శామ్ డాల్రింపుల్
    • హోదా, రచయిత

‘‘ఖతార్‌కు చెందిన ఓ వృద్ధుడికి తన చిన్నతనంలో భారతీయులంటే ఎంతో క్రేజ్ ఉండేది. అదే సమయంలో కోపం కూడా. తానెప్పుడూ చూడని ఓ ఆరెంజ్‌ను భారత అధికారి నుంచి దొంగలించినందుకు తనను కొట్టారని ఆ కోపం. పెరిగి పెద్దయ్యాకా ఆ కోపం కొనసాగింది. కానీ కొన్నేళ్ల తర్వాత ఒకప్పుడు తాను క్రేజీగా భావించిన భారతీయులు, కార్మికుల్లా గల్ఫ్ దేశాలకు వస్తుండడం చూసి ఆ కోపం చల్లారింది’’

ద టైమ్స్ ప్రతినిధి డేవిడ్ హోల్డన్ 1956 చలికాలంలో బహ్రెయిన్ ఐలాండ్‌ వెళ్లారు. అప్పటికి అదింకా బ్రిటిష్ నియంత్రణలోనే ఉంది.

కొంతకాలం జాగ్రఫీ టీచర్‌గా పనిచేసిన హోల్డన్, కొత్త ఉద్యోగంపై గల్ఫ్‌కు వెళ్లారు. తాను చేయబోయే ఆ కొత్త ఉద్యోగంపై ఆయన చాలా ఆసక్తిగా ఉన్నారు.

అయితే, గల్ఫ్‌లో దుబాయి, అబుదాబి, ఒమన్ వంటి ఏ ప్రాంతాలకు వెళ్లినా అక్కడ ఆయనకు ‘బ్రిటిష్ ఇండియా’ తాలూకు గుర్తులు కనిపించేవి.

బ్రిటిష్ ఇండియా ప్రభావం ఊహించని రీతిలో గల్ఫ్‌పై ఉందని హోల్డన్ రాశారు.

‘‘అనేక అసాధారణ విషయాలు, ఈ కాలానికి చెందని సంప్రదాయాలతో గల్ఫ్ నిండి పోయింది. పనిమనుషులను బేరర్లు అని, చాకలివాళ్లను ధోబీ అని, వాచ్‌మెన్‌ను చౌకీదార్ అని పిలుస్తారు. ఆదివారాలు అతిథులకు అనేక రకాల కూరలతో మధ్యాహ్న భోజనం తయారుచేస్తారు. ఇది బ్రిటిష్ ఇండియా సంప్రదాయం’’ అని హోల్డన్ రాశారు.

రాజస్థాన్‌లో చదువుకున్న ఒమన్ సుల్తాన్‌కు అరబిక్ కన్నా ఉర్దూపై ఎక్కువ పట్టుంది. ఇప్పుడు తూర్పు యెమెన్ అయిన క్వైటీలో సైనికులు, వాడుకలో లేని హైదరాబాదీ ఆర్మీ యూనిఫాంలతో మార్చ్ నిర్వహించారు.

ఒక సందర్భంలో ఏడెన్ గవర్నర్ కూడా

''ఇక్కడి పరిస్థితులను చూస్తే...కాలం 70 ఏళ్ల క్రితం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. బ్రిటిష్ రాజ్యం అత్యున్నత స్థాయిలో ఉన్న సమయం. క్వీన్ విక్టోరియా పరిపాలన, గిల్బర్ట్, సులివాన్ మ్యూజిక్ కొత్తగా, ఉత్తేజకరంగా ఉంది. దిల్లీ నుంచి హైదరాబాద్ ద్వారా దక్షిణ అరేబియా తీరానికి సంబంధం చాలా బలంగా ఉంది'' అని ఏడెన్ గవర్నర్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బ్రిటిష్ ఇండియాలో సంస్థానాల వరస క్రమం అబుదాబీతో మొదలు

ఇప్పుడు ఎవరికీ గుర్తులేకపోయినప్పటికీ 20వ శతాబ్దం ప్రారంభంలో అరేబియా ద్వీపకల్పంలో దాదాపు మూడింట ఒక వంతు బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.

ఏడెన్ నుంచి కువైట్ వరకు, అరేబియా ప్రాంతాల సమూహపు పాలన దిల్లీ నుంచి సాగేది. భారత రాజకీయ విభాగం అక్కడి రాజకీయాలను పర్యవేక్షించేది. భారత బలగాలు భద్రత కల్పించేవి. వారంతా భారత వైస్రాయ్‌కు జవాబుదారీగా ఉండేవారు.

1889 ఇంటర్‌ప్రిటేషన్ యాక్ట్ ప్రకారం, ఈ ప్రాంతాలన్నీ చట్టపరంగా భారత్‌లో భాగంగా పరిగణించేవారు.

జైపూర్ వంటి భారత రాజసంస్థానాల జాబితా అక్షర క్రమంలో అబుదాబితో ప్రారంభమయ్యేది. ఒమన్‌ను "లస్ బేలా లేదా కెలాట్ (ప్రస్తుత బలూచిస్తాన్) లాంటి భారత సామ్రాజ్యంలోని స్థానిక రాష్ట్రంగా" పరిగణించాలని కూడా వైస్రాయ్ లార్డ్ కర్జన్ సూచించారు.

భారత పాస్‌పోర్టులు యెమెన్‌లోని ఏడెన్ వరకు జారీ చేసేవారు. ఇది భారతదేశం పశ్చిమ రేవుగా ఉండేది. బొంబాయి ప్రావిన్స్‌లో భాగంగా పరిపాలన సాగేది. 1931లో మహాత్మాగాంధీ ఆ నగరాన్ని సందర్శించినప్పుడు, చాలామంది యువ అరబ్బులు తమను భారత జాతీయవాదులుగా భావించుకుంటున్నట్టు గుర్తించారు.

బ్రిటిష్ ఇండియా, గల్ఫ్ , భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Royal Geographical Society via Getty Images

ఫొటో క్యాప్షన్, 1931లో ఏడెన్‌లోని అరబ్ పోర్ట్

భారత్ నుంచి విడిపోయిన ఏడెన్

హోల్డన్ పర్యటన సాగే సమయానికి బ్రిటిషర్లు, భారతీయుల్లో చాలా మందికి బ్రిటిష్ ఇండియాలో గల్ఫ్ దేశాలు భాగమన్న విషయం తెలుసు.

అయితే భారత సామ్రాజ్యం మొత్తం పరిధి చూపించే మ్యాప్‌లను అత్యంత రహస్యంగా ఉంచారు. ఆనాటి ఓటోమన్‌లను, ప్రస్తుత సౌదీలకు ఆగ్రహం కలగకుండా అందరికీ కనిపించే ప్రభుత్వ డాక్యుమెంట్లలో అరేబియా భూభాగాలను ప్రచురించేవారు కాదు.

"అసూయాపరుడైన షేక్ తన ప్రియమైన భార్యకు ముసుగు వేసినట్టే, బ్రిటిష్ అధికారులు అరబ్ దేశాల పరిస్థితులను చాలా రహస్యంగా కప్పివేసి ఉంచేవారు'' అని రాయల్ ఆసియాటిక్ సొసైటీలో పని చేసే ఒక లెక్చరర్ అన్నారు.

1920ల నాటికి, రాజకీయాలు మారిపోయాయి. భారత జాతీయవాదులు భారతదేశాన్ని సామ్రాజ్య నిర్మాణంగా కాకుండా, మహాభారత భౌగోళిక సంస్కృతిగా భావించడం ప్రారంభించారు. భారతీయుల ఈ భావనలో సరిహద్దులను మార్చే అవకాశాన్ని లండన్ గమనించింది. 1937 ఏప్రిల్ 1న, మొదటి సామ్రాజ్య విభజన అమలులోకి వచ్చింది. ఏడెన్ భారతదేశం నుండి విడిపోయింది.

కింగ్ జార్జ్- 6నుంచి వచ్చిన టెలిగ్రామ్‌లో ఇలా ఉంది:

"దాదాపు 100 సంవత్సరాలుగా బ్రిటిష్ ఇండియన్ పరిపాలనలో భాగంగా ఏడెన్ ఉంది. నా భారత సామ్రాజ్యంతో ఆ రాజకీయ సంబంధం ఇప్పుడు తెగిపోతోంది. ఏడెన్‌కు వలస రాజ్యంలో సుస్థిర స్థానం ఉంటుంది" అని ఆ టెలిగ్రామ్‌ పేర్కొంది.

బ్రిటిష్ ఇండియా, గల్ఫ్ , భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Sam Dalrymple

ఫొటో క్యాప్షన్, యెమెన్‌లోని ఏడెన్ వరకు భారతీయ పాస్‌పోర్టులు జారీచేసేవారు.

భారత స్వాతంత్ర్యానికి కొన్ని నెలల ముందు విడిపోయిన గల్ఫ్ దేశాలు

గల్ఫ్ ప్రాంతం మరో దశాబ్దం పాటు భారత ప్రభుత్వ పరిధిలోనే ఉంది.

స్వాతంత్ర్యం తర్వాత ‘పర్షియన్ గల్ఫ్‌’ను భారతదేశం లేదా పాకిస్తాన్‌లో భాగం చేయొచ్చా అని బ్రిటిష్ అధికారులు చర్చించారు.

"గల్ఫ్ అరబ్బుల వ్యవహార బాధ్యతలను భారతీయులు లేదా పాకిస్తానీయులకు అప్పగించడం సరికాదు'' అని అప్పట్లో గల్ఫ్ నివాసి అయిన విలియం హే అన్నారు.

బ్రిటిష్ ఇండియా భారతదేశం, పాకిస్తాన్‌గా విడిపోయి స్వాతంత్ర్యం పొందడానికి కొన్ని నెలల ముందు దుబాయ్ నుంచి కువైట్ వరకు గల్ఫ్ దేశాలు ఏప్రిల్ 1, 1947న భారత్ నుంచి విడిపోయాయి.

కొన్ని నెలల తర్వాత, భారతదేశం, పాకిస్తాన్ అధికారులు వందలాది రాజసంస్థానాలను కొత్త దేశాలలో విలీనం చేయడం ప్రారంభించినప్పుడు, గల్ఫ్‌లోని అరబ్ దేశాలు ఆ జాబితాలో లేవు.

ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. 75 సంవత్సరాల తర్వాత కూడా, దాని ప్రాముఖ్యత భారత్‌లోగానీ, గల్ఫ్‌లోగానీ ఎవరికీ పూర్తిగా అర్థం కాలేదు.

ఈ చిన్న అధికార బదిలీయే లేకపోతే, ఉపఖండంలోని ఇతర రాజసంస్థానాల తరహాలో పర్షియన్ గల్ఫ్ రెసిడెన్సీ దేశాలు స్వాతంత్ర్యం తర్వాత భారత్ లేదా పాకిస్తాన్‌లో భాగమయ్యేవి.

బ్రిటిష్ ఇండియా ఆఖరి అవశేషం

బ్రిటిష్ ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ బ్రిటిష్ భారతదేశంతోపాటు, అరేబియన్ భూభాగాల నుంచి కూడా వైదొలగాలని ప్రతిపాదించినా, దానికి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో గల్ఫ్‌లో మరో 24 సంవత్సరాలు బ్రిటన్ పాలన కొనసాగింది. అక్కడి ప్రభుత్వం భారత వైస్రాయ్‌కు కాకుండా వైట్‌హాల్‌కు జవాబుదారీగా మారింది.

"గోవా పోర్చుగీస్ ఇండియా చివరి అవశేషం, పాండిచ్చేరి ఫ్రెంచ్ ఇండియా చివరి భాగంలా, పర్షియన్ గల్ఫ్ అన్నది భారత సామ్రాజ్యం చివరి కోట" అని గల్ఫ్ స్కాలర్ పాల్ రిచ్ అన్నారు.

హోల్డన్ పర్యటన నాటికి అక్కడ అధికారిక కరెన్సీ భారత రూపాయి. సులభమైన రవాణా మార్గం 'బ్రిటిష్ ఇండియా లైన్' (షిప్పింగ్ కంపెనీ), 30 అరేబియా రాజసంస్థానాలను భారత్‌లో కెరీర్ నిర్మించుకున్న 'బ్రిటిషర్లు' పరిపాలించారు.

బ్రిటిష్ వారు 1971లో సూయజ్‌కు తూర్పున వలస పాలన బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించి గల్ఫ్ నుంచి చివరకు వైదొలగారు.

"బ్రిటన్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రోజుల నుంచీ మొదటిసారి, గల్ఫ్ చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాలు బ్రిటిష్ జోక్యం, భయం లేకుండా తమ సొంత మార్గాలు వెతుక్కోవడంలో స్వేచ్ఛగా ఉన్నాయి. ఇది బ్రిటిష్ ఇండియా చివరి అవశేషం. ఇది ఇలాగే ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా కాస్త అస్పష్టంగా, మరికాస్త ఆకర్షణీయంగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు ముగిసిపోయాయి'' అని డేవిడ్ హోల్డన్ రాశారు.

బ్రిటిష్ ఇండియా, గల్ఫ్ , భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గల్ఫ్ ప్రాంతం భారత సామ్రాజ్యంలో భాగమని చాలా మందికి తెలియదు.

దిల్లీ కేంద్రంగా పాలన జరిగిన సంగతి తెలియదు

సామ్రాజ్యం పతనం తర్వాత పుట్టుకొచ్చిన జాతీయ భావనలతో, బ్రిటిష్ ఇండియాతో తమ సంబంధాలను చెరిపివేయడంలో గల్ఫ్ దేశాలు సక్సెస్ అయ్యాయి.

బహ్రెయిన్ నుంచి దుబాయ్ వరకు, చాలామందికి బ్రిటన్‌తో గత సంబంధాలు గుర్తున్నాయి. కానీ దిల్లీ నుంచి సాగిన పరిపాలన తెలియదు. ఊహాత్మక కథనాలతో రాజవంశాల ఉనికి ముందు తరాలకు తెలుస్తోంది. అయితే గల్ఫ్ దేశాల్లో సామాజిక, ఆర్థికపరంగా జరిగిన భారీ మార్పుల తర్వాత కూడా వ్యక్తిగత జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి.

గల్ఫ్ స్కాలర్ పాల్ రిచ్ 2009లో ఖతార్‌కు చెందిన ఒక వృద్ధుడితో మాట్లాడారు. ''ఏడు లేదా ఎనిమిదేళ్ల చిన్న వయసులో, బ్రిటిష్ ఏజెంట్ అయిన భారతీయ ఉద్యోగి నుంచి నేనెప్పడూ చూడని ఆరెంజ్ పండును దొంగిలించినందుకు నన్ను కొట్టారు. నాకు ఆ కోపం చాలా కాలం ఉంది'' అని ఆ వృద్ధుడు చెప్పారు.

తన యవ్వనంలో భారతీయులంటే ఎంతో క్రేజ్ ఉండేదని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయి వారు గల్ఫ్‌కు కార్మికులుగా వస్తుండడం చాలా సంతోషం కలిగించిందని చెప్పారు.

ఒకప్పుడు భారత సామ్రాజ్యంలో ఏ మాత్రం ప్రాధాన్యత లేని ప్రాంతంగా ఉండే దుబాయ్, ఇప్పుడు పశ్చిమాసియాలో దేదీప్యమానంగా వెలిగిపోతోంది.

హైదరాబాద్, జైపూర్ లేదా బహావల్పూర్‌లాగా, చమురు సంపన్నమైన గల్ఫ్ భారత్ లేదా పాకిస్తాన్‌లో అంతర్భాగంగా ఉండేదని అక్కడ నివసించే మిలియన్ల మంది భారతీయులు లేదా పాకిస్తానీయులలో చాలామందికి తెలియదు.

సామ్రాజ్యం మసకబారుతున్న సమయంలో ఒక అధికారపరమైన నిర్ణయం ఆ సంబంధాన్ని తెంపేసింది. అప్పటి జాడలు మాత్రమే మిగిలున్నాయి.

షాట్టర్డ్ ల్యాండ్స్: ఫైవ్ పార్టీషీయన్స్ అండ్ ది మేకింగ్ ఆఫ్ మోడ్రన్ ఆసియా రచయిత శామ్ డాల్రింపుల్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)