జిన్నా ఇంటి మీద ‘గోరక్ష సంఘ్’ జెండా - స్వాతంత్ర్యానికి వారం రోజుల ముందు ఏం జరిగింది?

మొహమ్మద్ అలీ జిన్నా, భారత్- పాకిస్తాన్, స్వాతంత్ర్య పోరాటం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ అలీ జిన్నా
    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందడానికి ఏడు రోజుల ముందు మొహమ్మద్ అలీ జిన్నా తన సోదరి ఫాతిమాతో కలిసి కేడీ సీ-3 డకోటా విమానంలో దిల్లీ నుంచి కరాచీ వెళ్లారు.

విమానంలోకి వెళ్లడానికి మెట్లపైకి చేరుకున్న జిన్నా ఆకాశం వైపు చూస్తూ ‘బహుశా నేను దిల్లీని చూడటం ఇదే చివరిసారేమో’ అని మెల్లగా గొణిగారు.

కరాచీ వెళ్లే ముందు, ఆయన 10 ఔరంగజేబ్ రోడ్‌లోని తన ఇంటిని హిందూ పారిశ్రామికవేత్త సేఠ్ రామకృష్ణ డాల్మియాకు 3 లక్షల రూపాయలకు విక్రయించారు.

అక్కడికి కొన్ని గంటల తరువాత.. ఎన్నో ఏళ్లుగా ముస్లింలీగ్‌కు చెందిన ఆకుపచ్చ, తెల్ల రంగుల జెండా ఎగిరిన ఆ ఇంటిపై గోరక్ష సంఘ్ జెండా రెపరెపలాడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

డొమినిక్ లాపియర్, లారీ కాలిన్స్ రాసిన 'ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్' పుస్తకంలో దిల్లీని వీడినప్పుడు జిన్నా ఎలా ఉన్నారో వివరించారు.

‘మెట్లు ఎక్కేటప్పుడు జిన్నా చాలా ఒత్తిడికి లోనయ్యారని, ఆయన భారంగా ఊపిరి తీసుకుంటూ తన సీటులో కూర్చున్నారని జిన్నా ఏడీసీ(ఎయిడ్ డీ క్యాంప్) సయ్యద్ అహ్సాన్ మాకు చెప్పారు’ అని వారు రాశారు.

‘జిన్నా వెళ్లాల్సిన ఆ విమానం ఇంజిన్‌ను బ్రిటిష్ పైలట్ స్టార్ట్ చేసిన సమయంలో జిన్నా శూన్యంలోకి చూస్తున్నారు. ఎవరినీ ఉద్దేశించి మాట్లాడకుండా ఆయన లోగొంతుకతో ‘‘కథ ముగిసింది’’ అని గొణిగారు.

భారత్, పాకిస్తాన్, మొహమ్మద్అలీ జిన్నా, స్వాతంత్ర్య పోరాటం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1947 ఆగస్టు 17న పాకిస్తాన్ గవర్నర్ జనరల్‌గా ప్రమాణ స్వీకారం చేసిన జిన్నా

కరాచీలో జిన్నాకు అపూర్వ స్వాగతం

విమానం కరాచీ పైన ఎగురుతున్నప్పుడు, జిన్నా ఏడీసీ సయ్యద్ అహ్సాన్ కిటికీలోంచి కిందికి చూశారు. కింద ఉన్న జనం ఆయనకు సముద్రంలా కనిపించారు.

విమానం ల్యాండ్ అయి, ఆగే సమయానికి జిన్నా తన సీటులోంచి లేవలేనంతగా అలసిపోయారు.

సయ్యద్ ఆయన్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు, కానీ జిన్నా ఆ సహాయం తీసుకోవడానికి నిరాకరించారు. కొత్తగా ఏర్పడిన తమ దేశ భూభాగంపై వేరొకరి సహాయంతో అడుగుపెట్టడానికి ఆయన సిద్ధంగా లేరు.

ఆ సమయంలో వేలాది మంది అభిమానులు ఆయన కోసం విమానాశ్రయంలో ఎదురు చూస్తున్నారు. భారతదేశం నుంచి వచ్చిన శరణార్థుల కారణంగా, కరాచీ జనాభా కొన్ని నెలల్లో రెట్టింపైంది.

స్టాన్లీ వోల్పర్ట్ తన పుస్తకం 'జిన్నా ఆఫ్ పాకిస్తాన్'లో ఇదంతా రాశారు. ‘విమానాశ్రయం నుంచి ప్రభుత్వ నివాసానికి వెళ్లే సమయంలో రోడ్డుకు రెండు వైపులా వేలాది మంది జిన్నాకు స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు. గతంలో సింధ్ గవర్నర్ నివసించిన ప్రభుత్వ గృహం ఇప్పుడు జిన్నా బంగ్లాగా మారబోతోంది’ అని స్టాన్టీ తన పుస్తకంలో రాశారు.

విక్టోరియన్ శైలిలో నిర్మించిన ఈ తెల్లని భవనం మెట్లు ఎక్కుతున్నప్పుడు, జిన్నా తన ఏడీసీతో.. ‘ఈ జన్మలో పాకిస్తాన్ ఏర్పడుతుందని నేను ఊహించలేదు. మన లక్ష్యాన్ని చేరుకున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి’ అన్నారు.

జిన్నా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రసంగిస్తున్న జిన్నా

మైనారిటీలకు భరోసా

ఆగస్ట్ 11న, పాకిస్తాన్ రాజ్యాంగ సభ మొదటిసారి సమావేశమై ఏకగ్రీవంగా ఆయనను అధ్యక్షునిగా ఎన్నుకుంది.

ఆ సభలో ఆయన ప్రసంగించడం ప్రారంభించినప్పుడు.. సరోజినీ నాయుడు అన్నట్లు ఆయన రాత్రికి రాత్రి హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతినిధిగా మారిపోయినట్లు అనిపించింది.

జిన్నా తన ప్రసంగంలో.. ‘మీరు మీ మందిరాలకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు. మసీదులకు, ఇతర ప్రార్థనా స్థలాలకు వెళ్లేందుకైనా మీకు స్వేచ్ఛ ఉంది. మీరు ఏ కులం, మతం, విశ్వాసానికి సంబంధించినవారైనా సరే ప్రభుత్వానికి దాంతో ఎలాంటి సంబంధం లేదు’ అన్నారు.

"మేం ఏ రెండు వర్గాల పట్ల ఎలాంటి వివక్ష లేని పాలన అందిస్తాం. దేశంలోని ప్రజలంతా సమానమే అనే ప్రాథమిక సూత్రంతో మొదలుపెడుతున్నాం’ అన్నారు జిన్నా.

సోదరి ఫాతిమాతో కలిసి కరాచీలోని గవర్నమెంట్ హౌస్ లాన్‌లో జిన్నా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సోదరి ఫాతిమాతో కలిసి కరాచీలోని గవర్నమెంట్ హౌస్ లాన్‌లో జిన్నా

‘జిన్నా ప్రసంగం ముస్లిం లీగ్‌కు నచ్చలేదు’

ఆయన ప్రసంగం వినగానే ముస్లిం లీగ్ వర్గాల్లో నిశ్శబ్దం నెలకొంది.

ఖలీద్ అహ్మద్ తన పుస్తకం ‘పాకిస్తాన్ బిహైండ్ ది ఐడియలాజికల్ మాస్క్’లో ఇలా రాశారు: ‘తర్వాత రోజుల్లో, ఆ ప్రసంగం ఏ ప్రభుత్వ ప్రచురణలోనూ కనిపించలేదు. తరువాత పాకిస్తాన్ అధ్యక్షుడైన జనరల్ జియా-ఉల్-హక్.. జిన్నా ఆ మాటలు చెప్పినప్పుడు తెలివిలో లేడంటూ కొంతమంది చరిత్రకారులతో ప్రచారం చేయించారు’

ఈ ప్రసంగాన్ని ప్రశంసించినందుకు భారతీయ జనతా పార్టీ అధినేత లాల్ కృష్ణ అడ్వాణీ రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

‘ఆ సమయంలో జిన్నా కుమార్తె దీనా వాడియా న్యూయార్క్‌లో నివసిస్తున్నారు, ఆమెను సంప్రదించి జిన్నా ఆహారపు అలవాట్లను గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు’ అని ఖలీద్ తన పుస్తకంలో రాశారు.

‘ఉదాహరణకు.. ఆయన మద్యం సేవించరు, పంది మాంసం తినరు. కానీ, జిన్నా కుమార్తె ఆయన ఆహార అలవాట్లు చెప్పడానికి నిరాకరించారు’ అని ఆ పుస్తకంలో రాశారు.

బ్రిటిష్ సామ్రాజ్యం, భారత దేశం, స్వాతంత్ర్య పోరాటం, మహాత్మ గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లార్డ్ మౌంట్ బాటన్ దంపతులతో జిన్నా

మౌంట్‌బాటన్ దంపతుల గౌరవార్థం విందు

గవర్నర్ జనరల్‌గా జిన్నాతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు 1947 ఆగస్టు 13న మౌంట్‌బాటన్ కరాచీకి చేరుకున్నప్పుడు జిన్నా ఆయనను స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి వెళ్లలేదు. సింధ్ గవర్నర్ సర్ గులాం హుస్సేన్ హిదాయతుల్లా, తన ఏడీసీ సయ్యద్ అహ్సాన్‌లకు ఈ బాధ్యతలు అప్పగించారు.

ఆ రాత్రి మౌంట్‌బాటన్ దంపతుల గౌరవార్థం జిన్నా విందు ఏర్పాటు చేశారు.

ఈ విందులో జిన్నా మౌనంగా ఉన్నారు. విందు సమయంలో మౌంట్‌బాటన్ ఫాతిమా జిన్నా, బేగం లియాఖత్ అలీ మధ్య కూర్చున్నారు.

‘మరుసటి రోజు అర్ధరాత్రి దిల్లీలో జరిగే వేడుక గురించి ఇద్దరూ నన్ను ఆటపట్టించారు, ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం జ్యోతిష్యులు నిర్ణయించిన ముహూర్తాన్ని అనుసరించడం వింతగా ఉందని అన్నారు’ అంటూ మౌంట్‌బాటన్ రాసుకొచ్చారు.

‘అప్పుడు రంజాన్ మాసం అని జిన్నాకు గుర్తులేదు. మొదట కరాచీలో విందును మధ్యాహ్నం ఏర్పాటు చేయాలనుకున్నారని.. కానీ, రంజాన్ మాసం అని తెలియగానే చివరి నిమిషంలో దాన్ని రాత్రి విందుగా మార్చారని నేను వాళ్లకు సమాధానం ఇచ్చాను’

బ్రిటిష్ సామ్రాజ్యం, భారత దేశం, స్వాతంత్ర్య పోరాటం, మహాత్మ గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ

ఫొటో సోర్స్, Getty Images

జిన్నా కుర్చీని ఎత్తుపై ఉంచడంపై వివాదం

ప్రమాణస్వీకార కార్యక్రమంలో, జిన్నా పాకిస్తాన్ గవర్నర్ జనరల్, పాకిస్తాన్ రాజ్యాంగ సభ అధ్యక్షునిగా ఉన్నందున మౌంట్‌బాటన్ కుర్చీ కంటే తన కుర్చీ ఎత్తుపై ఉండాలని పట్టుబట్టారు.

ఖాన్ అబ్దుల్ వలీ ఖాన్ తన పుస్తకం 'ఫాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్'లో ఇలా రాశారు: ‘జిన్నా అభ్యర్థనకు బ్రిటిషర్లు ఆశ్చర్యపోయారు. మౌంట్‌బాటన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాతే జిన్నా గవర్నర్ జనరల్ పదవిని చేపడతారని వాళ్లు ఆయనకు స్పష్టం చేయాల్సి వచ్చింది’

జిన్నా, భారత్- పాకిస్తాన్, స్వాతంత్ర్యపోరాాటం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జిన్నా ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు

జిన్నాపై హత్యాయత్నం? ఇంటెలిజెన్స్ నివేదిక

ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లేటప్పుడు కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు కానీ కొందరు వ్యక్తులు జిన్నాపై బాంబు విసిరి హత్య చేసేందుకు ప్రయత్నిస్తారని సీఐడీకి సమాచారం అందింది.

జిన్నా ఓపెన్ కారులో వెళ్లాలని పట్టుబడుతున్నారని మౌంట్‌బాటన్‌కు సీఐడీ అధికారి తెలిపారు. కారు నెమ్మదిగా కదులుతుంది కాబట్టి దాడి జరిగితే జిన్నాను రక్షించే అవకాశాలు తక్కువ ఉంటాయని, ఊరేగింపుగా వెళ్లే ఆలోచనను విరమించుకునేలా జిన్నాను ఒప్పించాలని ఆ అధికారి మౌంట్ బాటన్‌ను కోరారు. కానీ జిన్నా మౌంట్‌బాటన్ మాట వినలేదు.

కరాచీ వీధుల్లో ఓపెన్ టాప్ కారులో కాకుండా లోపల కూర్చుని వెళ్లడం పిరికితనంగా భావిస్తారని ఆయన అన్నారు. ఇలాంటి పనులు చేయడం ద్వారా కొత్తగా ఏర్పడిన దేశానికి తలవంపులు తీసుకు రాదలచుకోలేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో భారీ రక్షణతో ఆయనను రాజ్యాంగ సభ హాలుకు తీసుకెళ్లారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జిన్నా తెల్లటి నేవీ యూనిఫారం ధరించిన మౌంట్‌బాటన్ పక్కన కూర్చున్నారు. మౌంట్‌బాటన్ తన ప్రసంగంలో బ్రిటన్ రాజు తరఫున కొత్త దేశాన్ని అభినందించారు.

జిన్నా మాట్లాడుతూ, ‘'పాకిస్తాన్ రాజ్యాంగ సభ తరపున, నా తరఫున రాజుకు ధన్యవాదాలు. మేం స్నేహితులుగా విడిపోతున్నాం’’ అన్నారు.

క్యాంప్‌బెల్ జాన్సన్ రాసిన ‘మౌంట్‌బాటన్’ అనే పుస్తకంలో.. ‘జిన్నా తన ప్రసంగాన్ని పూర్తి చేసి కూర్చున్న వెంటనే, ఎడ్వినా ఫాతిమా జిన్నా చేతిని ఆప్యాయంగా నొక్కారు. జిన్నా వ్యక్తిత్వంలో ఒక ఉదాసీనత, దూరంగా ఉండే తత్వం కనిపిస్తాయి, కానీ ఆయనలో ఒక ఆకర్షణ ఉంది’ అని పేర్కొన్నారు.

బ్రిటిష్ సామ్రాజ్యం, భారత దేశం, స్వాతంత్ర్య పోరాటం, మహాత్మ గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ

ఫొటో సోర్స్, Getty Images

‘మిమ్మల్ని సజీవంగా తీసుకొచ్చింది నేను’

జిన్నా, మౌంట్‌బాటన్‌లు కలిసి నడుచుకుంటూ అసెంబ్లీ హాలు నుంచి బయటకు వచ్చినప్పుడు, వారి కోసం ఒక నల్ల రంగు రోల్స్ రాయిస్ కారు వేచి ఉంది.

జిన్నాపై హత్యాయత్నం జరిగితే, ఆయన ఓపెన్ టాప్ కారులో ప్రభుత్వ నివాసానికి తిరిగి వెళ్లేటప్పుడే జరగవచ్చని మౌంట్‌బాటన్ భావించారు.

‘తానూ అదే వాహనంలో ప్రయాణించడమే జిన్నాను రక్షించడానికి ఉత్తమ మార్గం అని మౌంట్‌బాటన్ భావించారు. తనపై ఎవరూ బాంబు విసిరేందుకు ధైర్యం చేయరని ఆయన భావించడంతో జిన్నాతో పాటు వెళ్లారు’ అని ఆ పుస్తకంలో రాశారు.

డొమినిక్ లాపియర్, లారీ కాలిన్స్‌లు ఇలా రాశారు.. “కారు వెళ్తుండగా ప్రజలు రోడ్డుకు రెండు వైపులా ఇళ్ల పైకప్పులపై నిల్చున్న ప్రజలు పాకిస్తాన్ జిందాబాద్, జిన్నా, మౌంట్‌బాటన్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేస్తున్నారు. మౌంట్‌బాటన్ ఒకసారి బెంగాల్ గవర్నర్ సైనిక కార్యదర్శి తనపై విసిరిన బాంబును పట్టుకుని, హంతకుడిపైకి విసిరిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. అయితే తనకు క్రికెట్ బాల్‌ను ఎలా పట్టుకోవాలో కూడా తెలీదని ఆయనకు గుర్తొచ్చింది’

కారులో కూర్చున్న జిన్నా, మౌంట్‌బాటన్‌లు చిరునవ్వు వెనుక తమ ఆందోళనను దాచుకునే ప్రయత్నం చేశారు. కారు వెళుతున్నంత సేపు వాళ్లు ఒకరితో ఒకరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు.

“కారు గమ్యస్థానం చేరుకున్న వెంటనే, మొదటిసారిగా అలవాటుకు విరుద్ధంగా జిన్నా ముఖంపై చిరునవ్వు కనిపించింది, ఆయన మౌంట్‌బాటన్‌తో 'దేవుడికి ధన్యవాదాలు, మిమ్మల్ని సజీవంగా తీసుకురాగలిగాను' అన్నారు’’

దానికి సమాధానంగా మౌంట్‌బాటన్, "అది వదిలేయండి, మిమ్మల్ని ఇక్కడికి సజీవంగా తీసుకువచ్చింది నేను, మీరు కాదు," అన్నారు.

తాను లేకుంటే పాకిస్తాన్ ఏర్పడేది కాదని జిన్నా తన చివరి శ్వాస వరకు నమ్ముతూనే ఉన్నారు.

పాకిస్తాన్ అధ్యక్షుడైన ఇస్కందర్ మీర్జా ఒకసారి ఆయనతో.. 'ముస్లిం లీగ్‌ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, మనకు పాకిస్తాన్ వచ్చింది దాని వల్లనే’’ అన్నారు.

దానికి జిన్నా కోపంగా ‘మనకు పాకిస్తాన్‌ వచ్చింది ముస్లిం లీగ్ వల్ల అని మీకు ఎవరు చెప్పారు? నేను, నా స్టెనోగ్రాఫర్ వల్ల పాకిస్తాన్‌ ఏర్పడింది’ అని బదులిచ్చారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)