కాకోరీ రైలు దోపిడీ: బ్రిటిష్ ప్రభుత్వాన్ని కుదిపేసిన భారీ దొంగతనం, ఆజాద్ ఒక్కరే దొరకలేదు

కాకోరీ దోపిడీ

ఫొటో సోర్స్, Indian Railways

ఫొటో క్యాప్షన్, షాజహాన్‌పూర్ రైల్వే మార్గంలో లఖ్‌నవూ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న స్టేషన్ కాకోరీ
    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1925 నాటికి, స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ఉద్యమకారుల ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది. ప్రతి పైసాకు ఇతరులపై ఆధారపడాల్సి వచ్చేది.

ఎవరికీ సరైన బట్టలు కూడా లేవు. దానికితోడు అప్పులు.

ఆ పరిస్థితుల్లో ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం మినహా మరోమార్గం లేదు.

అప్పుడే, ప్రభుత్వ ఖజానాను ఎందుకు దోచుకోకూడదనే ఆలోచన చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు

రైలు గార్డు కంపార్ట్‌మెంట్‌లో ఉన్న ఇనుప పెట్టెలో పన్నుల సొమ్ము ఉన్నట్లు గమనించానని రామ్‌ప్రసాద్ బిస్మిల్ తన ఆత్మకథలో రాసుకున్నారు.

''ఒక రోజు లఖ్‌నవూ స్టేషన్‌లో గార్డు కంపార్ట్‌మెంట్ నుంచి ఒక ఇనుప పెట్టెను పోర్టర్లు కిందకు దించడం చూశా. దానికి గొలుసు కానీ, తాళం కానీ లేవు. దానిపై చెయ్యి వేయాలని అప్పుడే అనుకున్నా'' అని ఆయన రాశారు.

రామ్‌ప్రసాద్ బిస్మిల్ ఆత్మకథ

ఫొటో సోర్స్, Sri Ganesh Prakashan

ఫొటో క్యాప్షన్, రామ్‌ప్రసాద్ బిస్మిల్ తన ఆత్మకథలో కాకోరీ రైలు దోపిడీ గురించి వివరంగా రాశారు

మొదటి ప్రయత్నం విఫలం

ఈ మిషన్ కోసం బిస్మిల్ 9 మంది ఉద్యమకారులను ఎంచుకున్నారు. రాజేంద్ర లాహిరీ, రోషన్ సింగ్, సచీంద్ర బక్షి, అష్ఫాకుల్లా ఖాన్, ముకుందీ లాల్, మన్మథ్‌నాథ్ గుప్తా, మురారీ శర్మ, బన్వారీ లాల్, చంద్రశేఖర్ ఆజాద్ వారిలో ఉన్నారు.

ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టేందుకు షాజహాన్‌పూర్ మార్గంలో లఖ్‌నవూకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న రైల్వేస్టేషన్ కాకోరీని బిస్మిల్ ఎంచుకున్నారు.

మిషన్ కోసం రెక్కీ నిర్వహించేందుకు ముందుగా అందరూ కాకోరీ వెళ్లారు. 1925 ఆగస్టు 8న రైలు దోపిడీకి విఫలయత్నం చేశారు.

దీని గురించి బిస్మిల్ తన ఆత్మకథలో ఇలా రాశారు. ''మేం లఖ్‌నవూలోని ఛేదిలాల్ సత్రంలో వేర్వేరు గదుల్లో ఉన్నాం. అనుకున్న సమయానికి లఖ్‌నవూ రైల్వేస్టేషన్‌కి బయలుదేరాం. ప్లాట్‌ఫాంపైకి వెళ్లేప్పటికి అప్పుడే రైలు బయలుదేరింది. ఇది ఏ రైలు అని అడిగాం. మేం ఎక్కాల్సిన 8 డౌన్ ఎక్స్‌ప్రెస్ అదేనని తెలిసింది. మేం 10 నిమిషాలు ఆలస్యంగా స్టేషన్‌కి వచ్చాం. దీంతో చేసేదేమీ లేక తిరిగి సత్రానికి వచ్చేశాం.''

అష్పాకుల్లా ఖాన్, రామ్‌ప్రసాద్ బిస్మిల్ పేరుమీద పోస్టల్ శాఖ స్టాంప్ విడుదల చేసింది

ఫొటో సోర్స్, indiapost.in

ఫొటో క్యాప్షన్, అష్పాకుల్లా ఖాన్, రామ్‌ప్రసాద్ బిస్మిల్ పేరుమీద పోస్టల్ శాఖ స్టాంప్ విడుదల చేసింది

చైన్ లాగి రైలు ఆపేయాలని ప్లాన్..

మరుసటి రోజు మధ్యాహ్నం, అంటే ఆగస్టు 9న మళ్లీ అందరూ కాకోరీకి బయలుదేరారు. వాళ్ల దగ్గర నాలుగు మౌజర్ పిస్టల్స్, రివాల్వర్లు ఉన్నాయి. ''రామ్.. ఒకసారి ఆలోచించు.. ఇది సరైన సమయం కాదు.. తిరిగి వెళ్లిపోదాం'' అని అష్ఫాక్ బిస్మిల్‌ని ఒప్పించే ప్రయత్నం చేశారు.

''ఎవరూ ఏమీ మాట్లాడొద్దు'' అంటూ బిస్మిల్ గట్టిగా మందలించారు. ఇవేమీ తమ నాయకుడిని ప్రభావితం చేయలేవని అష్ఫాక్‌కు అర్థమవడంతో, ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడిలా ఆయనకు సహకరించాలని నిర్ణయించుకున్నారు.

అందరూ షాజహాన్‌పూర్‌లో రైలెక్కి కాకోరీ దగ్గరకు రాగానే చైన్ లాగాలని ప్లాన్ చేశారు. చైన్ లాగి రైలు ఆగిపోయిన తర్వాత, గార్డు క్యాబిన్‌‌కి వెళ్లి ఖజానాలో దాచిన డబ్బును స్వాధీనం చేసుకోవాలి.

''ఎవరికీ హాని కలిగించకూడదని అనుకున్నాం. అక్రమంగా ఆర్జించిన ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టేందుకు వచ్చినట్లు రైల్లో ప్రయాణికులతో చెప్పాలి. ఆయుధాలు వాడడంలో అనుభవమున్న ముగ్గురం గార్డు క్యాబిన్ దగ్గర నిల్చుని అప్పుడప్పుడూ కాల్పులు జరుపుతూ ఉండాలి, దీంతో క్యాబిన్ దగ్గరికి ఎవరూ రారు'' అని రామ్ ప్రసాద్ బిస్మిల్ తన ఆత్మకథలో రాశారు.

రామ్‌ప్రసాద్ బిస్మిల్‌

ఫొటో సోర్స్, PIB

ఫొటో క్యాప్షన్, కాకోరీ ఘటనలో రామ్‌ప్రసాద్ బిస్మిల్‌కి అష్పాకుల్లా ఖాన్ ప్రధాన సహాయకుడిగా ఉన్నారు

అనుకున్న చోటే చైన్ లాగారు..

ఒకవేళ చైన్ లాగిన చోట రైలు ఆగకపోతే ఏం చేయాలి? అని చంద్రశేఖర్ ఆజాద్ అడిగారు.

అలాంటి పరిస్థితి ఎదురవకుండా ఉండేందుకు, ఒక ఉపాయాన్ని సూచించారు బిస్మిల్. ''రైలు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్‌లో ఎక్కుతాం. ఒకరు చైన్ లాగిన తర్వాత రైలు ఆగకపోతే, మరో బోగీలో ఉన్నవారు చైన్ లాగి రైలు ఆగేలా చేస్తారు'' అని చెప్పారు.

ఆగస్టు 9న అందరూ షాజహాన్‌పూర్ స్టేషన్‌కు చేరుకున్నారు. వేర్వేరు మార్గాల్లో స్టేషన్‌కు వచ్చిన వీరంతా కనీసం ఒకరినొకరు చూసుకోలేదు. రోజూ వేసుకునే సాధారణ దుస్తులే ధరించారు. తమ ఆయుధాలను దుస్తుల లోపల దాచారు. రైలు ఆగగానే కిందకు దిగడానికి ఎక్కువ సమయం పట్టకుండా చైన్‌ లాగే దగ్గరే కూర్చున్నారు.

బిస్మిల్ తన ఆత్మకథలో, కూత వేస్తూ రైలు స్టేషన్ నుంచి బయలుదేరగానే.. ''నేను ఒక్కసారి కళ్లు మూసుకుని గాయత్రీ మంత్రం జపించా. కాకోరీ స్టేషన్‌లోని సైన్‌బోర్డు చూడగానే, శ్వాస వేగం పెరిగింది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అకస్మాత్తుగా పెద్ద శబ్దం వచ్చింది. మేం అనుకున్న చోటే రైలు ఆగింది'' అని రాశారు.

ముందుగా అనుకున్నట్లుగా, అదే ప్రదేశంలో చైన్ లాగారు.

''నేను వెంటనే నా పిస్టల్ తీసి గట్టిగా అరిచా. అందరూ నిశ్చింతగా ఉండండి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మన దగ్గరి నుంచి తీసుకున్న సొమ్మును తీసుకెళ్లడానికి వచ్చాం. మీరు మీ సీట్లలోనే కూర్చుని ఉంటే ఎవరికీ ఎలాంటి హానీ జరగదు'' అని ఆయన రాశారు.

చంద్రశేఖర్ ఆజాద్

ఫొటో సోర్స్, Kamal

ఫొటో క్యాప్షన్, చంద్రశేఖర్ ఆజాద్ మినహా మిగిలిన వారంతా అరెస్టయ్యారు

నగల పెట్టె పోయిందనే సాకు..

రైలు అక్కడ ఆగకముందు మరో డ్రామా జరిగింది. అష్ఫాక్, రాజేంద్ర లాహిరీ, సచీంద్ర బక్షి సెకండ్ క్లాస్ టిక్కెట్లు కొనుగోలు చేశారు.

తన 'మై రెవల్యూషనరీ లైఫ్' పుస్తకంలో సచీంద్ర బక్షి ఇలా రాశారు, 'నా నగల పెట్టె ఎక్కడుంది? అనగానే, అష్ఫాక్ వెంటనే 'ఓహ్, కాకోరీలో మర్చిపోయా' అని బదులిచ్చాడు.''

అష్ఫాక్ ఆమాట అనగానే బక్షి రైలు చైన్ లాగారు. రాజేంద్ర లాహిరీ కూడా అటువైపు నుంచి చైన్ లాగారు. ముగ్గురూ వెంటనే కిందకు దిగి కాకోరీ వైపు నడవడం మొదలుపెట్టారు. కొంచెం దూరం నడిచాక రైలు గార్డు కనిపించారు. చైన్ ఎవరు లాగారని అడిగారు.

అక్కడే ఆగండి అంటూ గార్డు సైగ చేశారు. అయితే, నగల పెట్టె కాకోరీలో మర్చిపోయాం, దానిని తీసుకురావడానికి వెళ్తున్నామని సమాధానమిచ్చారు.

బక్షి ఇంకా ఇలా రాశారు. ''అప్పటికే మా సహచరులందరూ రైలు దిగి అక్కడికి వచ్చేశారు. పిస్టల్స్‌తో గాల్లోకి కాల్పులు జరపడం మొదలుపెట్టాం. ఆ వెంటనే రైలు బయలుదేరడానికి గార్డు గ్రీన్ లైట్ చూపించడం చూశా. పిస్టల్‌ తీసి అతని ఛాతీమీద పెట్టి చేతిలో ఉన్న లైట్ లాక్కున్నా. దయచేసి నా ప్రాణాలు తీయొద్దు అని అతను చేతులు జోడించి వేడుకున్నాడు. నేను అతన్ని నెట్టి కిందపడేశా.''

సచీంద్ర బక్షి పుస్తకం 'మై రెవల్యూషనరీ లైఫ్'

ఫొటో సోర్స్, Unistarbooks

ఫొటో క్యాప్షన్, సచీంద్ర బక్షి పుస్తకం 'మై రెవల్యూషనరీ లైఫ్'

ఇనప్పెట్టె పగలగొట్టే ప్రయత్నంలో అష్ఫాక్..

మీరు మాకు సహకరిస్తే మిమ్మల్ని ఏమీ చేయమని అష్ఫాక్ గార్డుతో అన్నారు.

''కొద్దికొద్ది నిమిషాల విరామంతో మా సహచరులు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. డబ్బులున్న ఇనుప పెట్టె చాలా బరువుగా ఉంది. దానిని తీసుకుని పారిపోలేం. దీంతో, అష్ఫాక్ సుత్తితో దానిని పగలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎంతసేపు కొట్టినా అది తెరుచుకోలేదు'' అని బిస్మిల్ రాశారు.

అందరూ ఊపిరి బిగపట్టుకుని అష్ఫాక్ వైపు చూస్తున్నారు. అప్పుడు అక్కడున్న ఉద్యమకారులు జీవితాలను శాశ్వతంగా మార్చేసే ఒక సంఘటన జరిగింది.

అష్ఫాకుల్లా ఖాన్

ఫొటో సోర్స్, Photo Division

ఫొటో క్యాప్షన్, అష్ఫాకుల్లా ఖాన్

సాధారణ ప్రయాణికుడిపై కాల్పులు

రెండు బోగీలకు ముందు నుంచి, అహ్మద్ అలీ అనే ప్రయాణికుడు తన బోగీ నుంచి దిగి గార్డు క్యాబిన్ వైపు నడుచుకుంటూ వస్తున్నారు. ఎవరో ఒకరు ఇలాంటి సాహసం చేస్తారని వీళ్లు ఊహించలేదు.

నిజానికి, అహ్మద్ తన భార్య కూర్చుని ఉన్న లేడీస్ కంపార్ట్‌మెట్ వైపు వెళ్తున్నారు. రైలు ఆగడంతో అక్కడ ఆమె ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నారు. రైలులో ఏం జరుగుతుందో నిజంగానే ఆయనకు తెలియదా?

దీని గురించి బిస్మిల్ ఇలా రాశారు, ''అసలు విషయం అర్థం చేసుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. కానీ, నా ఇతర సహచరులు అంత త్వరగా దానిని అంచనా వేయలేకపోయారు. మన్మథ్‌నాథ్ చాలా చురుగ్గా ఉండేవాడు. కానీ, ఆయుధాలు వాడడంలో పెద్దగా అనుభవం లేదు. గార్డు క్యాబిన్‌ వైపు వస్తున్న వ్యక్తిని చూడగానే మన్మథ్‌నాథ్ ఆయనపై గురిపెట్టాడు. నేను చెప్పేలోపే, మన్మథ్ ట్రిగ్గర్ నొక్కాడు. అహ్మద్ అలీ చనిపోయారు. అక్కడే నేలపై కుప్పలకూలిపోయారు.''

మరోవైపు అష్ఫాక్ పెట్టె బద్దలు కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు, కానీ పగలగొట్టలేకపోయారు. చివరికి, ఆ సుత్తిని బిస్మిల్ తీసుకుని పెట్టె తాళంపై బలంగా కొట్టారు. తాళం విరిగి కిందపడింది. డబ్బులన్నీ బయటకు తీసి దుస్తుల్లో కట్టారు. కానీ, ఇంతలోనే మరో సమస్య ఎదురైంది.

దూరం నుంచి రైలు శబ్దం వినిపించింది. దీనిని చూసి ఎదురుగా వస్తున్న రైలు డ్రైవర్‌కు అనుమానం వస్తుందేమోనని అంతా భయపడ్డారు. దోపిడీ జరిగిన రైలులోని ప్రయాణికులు కూడా అటూఇటూ కదలడం మొదలుపెట్టారు.

ఆ సమయంలో ఎవరైనా రైలు దిగి పారిపోవచ్చు, కానీ ఎవరూ అంత సాహసం చేయలేదు. మరోవైపు బిస్మిల్ తన చేతిలో లోడ్ చేసి వున్న మౌజర్‌ని గాల్లో ఊపుతూ ఉన్నారు.

తమ ఆయుధాలను దాచిపెట్టమని ఆయన తన సహచరులకు చెప్పారు. సుత్తిని విసిరేయమని అష్ఫాక్‌కి చెప్పారు. అది పంజాబ్ మెయిల్. ఆగకుండా వెళ్లిపోయింది.

ఈ మొత్తం ఆపరేషన్ పూర్తవ్వడానికి అరగంట కూడా పట్టలేదు.

బిస్మిల్ తన ఆత్మకథలో ఇలా రాశారు, “ఒక అమాయకుడి మరణానికి ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. అనుకోకుండా ఆ సమయంలో అతను అక్కడ ఉండడమే అతని తప్పు. ఒక అమాయకుడిని కాల్చి చంపినందుకు మన్మథ్‌నాథ్ తనపై తాను కోపంగా ఉన్నాడు. అతని కళ్లు వాచి ఎర్రగా మారాయి. ఏడుస్తున్నాడు."

బిస్మిల్ ముందుకొచ్చి మన్మథ్‌నాథ్‌ని దగ్గరికి తీసుకున్నారు.

మన్మథ్‌నాథ్ గుప్తా

ఫొటో సోర్స్, Social Media/X

ఫొటో క్యాప్షన్, కాకోరీ ఘటనలో మన్మథ్‌నాథ్ గుప్తా ఒక ప్రయాణికుడిపై కాల్పులు జరిపారు

దేశవ్యాప్తంగా ప్రభావం చూపిన దోపిడీ

ఈ దోపిడీ దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపింది. ఉత్తరప్రదేశ్‌లో రైలుపై దాడి జరిగిందని బయటికి తెలియడంతో, ఎందుకు జరిగిందనే చర్చ మొదలైంది.

చాలా తక్కువ మంది కలిసి ఈ దాడి చేశారని, ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడమే వారి ఉద్దేశమని తెలియడంతో ప్రజలు మా ధైర్యానికి ముగ్గులయ్యారని బిస్మిల్ రాశారు. ప్రభుత్వ సొమ్ముని తప్ప మరే ఇతర వాటి జోలికి వెళ్లకపోవడం ప్రజలకు నచ్చింది.

బిస్మిల్ ఇలా రాశారు, ''దేశంలోని చాలా పత్రికలు మమ్మల్ని హీరోలుగా ప్రకటించాయి. ఆ తర్వాత కొన్ని వారాల్లోనే మాతో కలిసి పనిచేసేందుకు యువత పోటీపడ్డారు. దీనిని ప్రజలు దోపిడీగా భావించలేదు. భారత దేశంలో స్వాతంత్ర్య పోరాటాన్ని మరింత ఉధృతం చేసే ఘటనగా దీన్ని పరిగణించారు.''

బిస్మిల్

ఫొటో సోర్స్, Social Media/X

ఫొటో క్యాప్షన్, కాకోరీ మిషన్ కోసం బిస్మిల్ 9 మంది ఉద్యమకారులను ఎంపిక చేసుకున్నారు

మరుసటి రోజు వార్తాపత్రికల్లో..

గోమతి నది ఒడ్డున కొన్ని మైళ్లు నడుచుకుంటూ వెళ్లి, వారు లఖ్‌నవూ నగరంలోకి ప్రవేశించారు.

మన్మథ్‌నాథ్ గుప్తా తన పుస్తకం 'దే లివ్డ్ డేంజరస్‌లీ'లో ఇలా రాశారు. ''మేం కూడలి నుంచి లఖ్‌నవూ చేరుకున్నాం. అది లఖ్‌నవూలోని రెడ్‌లైట్ ఏరియా, 24 గంటలూ రాకపోకలు ఉండేవి. కూడలి దగ్గరికి చేరుకునే ముందు ఆజాద్ తమ వద్దనున్న ఆయుధాలు, మొత్తం డబ్బుని బిస్మిల్‌కి అందజేశారు. ఈ రాత్రికి ఇక్కడే పార్కులో బెంచీలపై పడుకోవచ్చు కదా అని ఆజాద్ సూచించారు. చివరికి పార్కులో ఒక చెట్టు కింద పడుకున్నాం. పొద్దున్నే సూర్యోదయం, పక్షుల శబ్దాలు.''

పార్కులో నుంచి బయటికి రాగానే న్యూస్ పేపర్లు అమ్మే వ్యక్తి, 'డెకాయిటీ ఇన్ కాకోరీ, డెకాయిటీ ఇన్ కాకోరీ' అని అరుస్తున్నాడు. అప్పుడు వారంతా ఒకరినొకరు చూసుకున్నారు. కొద్దిగంటల్లోనే ఈ వార్త సర్వత్రా వ్యాపించింది.

మన్మథ్‌‌నాథ్ గుప్తా పుస్తకం

ఫొటో సోర్స్, People's Publishing House

ఫొటో క్యాప్షన్, మన్మథ్‌‌నాథ్ గుప్తా పుస్తకం 'దె లివ్ డేంజరస్‌లీ'

అక్కడ వదిలేసిన వస్త్రమే పట్టించింది..

ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలూ వదిలేయలేదని అందరూ అనుకున్నారు. కానీ, రైలులో గందరగోళంలో అక్కడ ఒక వస్త్రం వదిలేసినట్లు వారు గ్రహించలేదు. ఆ వస్త్రంపై షాజహాన్‌పూర్‌కి చెందిన రజకుల గుర్తు ఉంది.

దానితో దోపిడీకి పాల్పడిన వారిలో కొందరు షాజహాన్‌పూర్‌కి చెందిన వారని పోలీసులకు అనుమానం వచ్చింది. షాజహాన్‌పూర్‌లో ఆ రజకుడిని పోలీసులు గుర్తించారు.

అలా, ఆ వస్త్రం హిందుస్తాన్ రిపబ్లికన్ ఆసోసియేషన్ (హెచ్‌ఆర్‌ఏ) సభ్యుడిదని తెలిసింది.

ఇది మాత్రమే కాకుండా ఉద్యమకారుల సహచరులు కూడా వారికి ద్రోహం చేశారు. రామ్‌ప్రసాద్ బిస్మిల్ తన పుస్తకంలో ఇలా రాశారు. ''దురదృష్టవశాత్తూ, మన మధ్యలో ఒక పాము కూడా ఉంది. సంస్థలో నేను గుడ్డిగా నమ్మిన ఓ వ్యక్తికి అతను చాలా సన్నిహితుడు. కాకోరీ టీమ్ అరెస్టు అవడానికి మాత్రమే కాకుండా, మొత్తం సంస్థను నాశనం చేయడానికి ఆ వ్యక్తే కారణమని నాకు తర్వాత తెలిసింది.''

బిస్మిల్ తన ఆత్మకథలో అతని పేరు రాయలేదు. కానీ, ప్రాచీ గార్డ్ పుస్తకం ''కాకోరీ ది ట్రైన్ రాబరీ దట్ షేక్ ది బ్రిటిష్ రాజ్''లో ఇలా రాశారు. ''బన్వారీ లాల్ భార్గవ హెచ్ఆర్ఏ సభ్యుడు. కాకోరీ దోపిడీ ఘటనలో ఆయుధాల సరఫరా వరకూ అతని పాత్ర ఉంది. తర్వాత విచారణ సందర్భంగా మరణశిక్ష నుంచి తప్పించుకోవడం కోసం, ప్రభుత్వ ధన సాయం కోసం సాక్షిగా మారాడు.''

Kakori

ఫొటో సోర్స్, Srishti Publishers

ఆజాద్ ఒక్కరే దొరకలేదు..

కాకోరీ దోపిడీకి పాల్పడిని వారిని అరెస్టు చేసేందుకు రూ.5 వేల రివార్డు ప్రకటించింది ప్రభుత్వం. అన్ని రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్లలో పోస్టర్లు అతికించారు.

కాకోరీ ఘటన జరిగిన మూడు నెలల్లోనే అందులో పాల్గొన్న ఒక్కొక్కరి అరెస్టు మొదలైంది.

ఈ ఆపరేషన్‌లో కేవలం 10 మంది మాత్రమే పాల్గొన్నారు, కానీ, 40 మందికి పైగా అరెస్టు చేశారు.

అష్ఫాక్, రోషన్ సింగ్, రాజేంద్ర లాహిరీ, బన్వారీ లాల్ సహా అనేక మందిని అరెస్టు చేశారు. చంద్రశేఖర్ ఆజాద్‌ను మాత్రమే పోలీసులు అరెస్టు చేయలేకపోయారు.

అరెస్టు అయిన చివరి వ్యక్తి రామ్‌ప్రసాద్ బిస్మిల్. కాన్పూర్‌కు చెందిన 'ప్రతాప్' వార్తాపత్రిక 'నైన్ జెమ్స్ ఆఫ్ ఇండియా అరెస్టెడ్' అనే శీర్షికతో ఈ వార్తను ప్రచురించింది.

ఈ న్యూస్ పేపర్ సంపాదకులు గణేశ్ శంకర్ విద్యార్థి.

తుది విచారణ అనంతరం 1927లో తీర్పు వెలువడింది. అష్ఫాకుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరీ, రోషన్ సింగ్, రామ్‌ప్రసాద్ బిస్మిల్‌లకు మరణశిక్ష విధించారు. ఈ తీర్పుకు వ్యతిరేకంగా దేశమంతటా నిరసనలు జరిగాయి.

మదన్‌మోహన్ మాలవీయ, మోతీలాల్ నెహ్రూ, లాలా లజపతిరాయ్, జవహర్‌లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా ఉద్యమకారులకు మద్దతుగా నిలిచారు.

వారి మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని సెంట్రల్ అసెంబ్లీ వైస్రాయ్‌కు విజ్ఞప్తి చేసింది, కానీ, ఆ డిమాండ్‌ను ఆయన తిరస్కరించారు.

మదన్‌మోహన్ మాలవీయ

ఫొటో సోర్స్, @bjp4india

ఫొటో క్యాప్షన్, మదన్‌మోహన్ మాలవీయ

బిస్మిల్, అష్ఫాక్‌ను ఉరి తీశారు

1927న డిసెంబర్ 19న గోరఖ్‌పూర్ జైలులో రామ్‌ప్రసాద్ బిస్మిల్, రోషన్ లాల్, రాజేంద్ర లాహిరీలను ఉరితీశారు. ఉరి వేయడానికి రెండు రోజుల ముందు, ఆయన తన ఆత్మకథను పూర్తి చేశారు.

అదే రోజు ఫైజాబాద్ జైలులో అష్ఫాక్‌ను ఉరితీశారు.

మన్మథ్‌నాథ్ గుప్తా వయస్సు 18 ఏళ్లలోపే కావడంతో ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది.

మన్మథ్‌నాథ్‌

ఫొటో సోర్స్, Ananya Publications

ఫొటో క్యాప్షన్, మన్మథ్‌నాథ్‌కి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది

1937లో విడుదలైన మన్మథ్‌నాథ్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాయడం ప్రారంభించారు.

1939లో మరోసారి అరెస్టయ్యారు. స్వాతంత్య్రానికి ఏడాది ముందు 1946లో విడుదలయ్యారు.

అండమాన్ సెల్యులార్ జైలులో కూడా కొంతకాలం గడిపారు. 2000 సంవత్సరం, అక్టోబర్ 26న ఆయన తుదిశ్వాస విడిచారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)