షేక్ హసీనా: ప్రజాస్వామ్యవాది నుంచి కఠిన నియంతగా మారిపోయారా, ప్రత్యర్థులు ఆమె గురించి ఏమన్నారు...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అన్బరసన్ ఎతిరాజన్, టెస్సా వాంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
విద్యార్థి సంఘాల నేతల నాయకత్వంలో వారాల తరబడి సాగిన పోరాటాలు, ప్రాణనష్టం, దేశవ్యాప్తంగా అశాంత పరిస్థితులతో... షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
దీంతో దీర్ఘకాలం బంగ్లాదేశ్‌ను పాలించిన ప్రధానిగా గుర్తింపు పొందిన హసీనా శకం ముగిసింది. 1996లో తొలిసారి ప్రధాని అయిన ఆమె, 2009 నుంచి వరసగా నాలుగుసార్లు అధికారం చేపట్టారు. 20 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించారు.
బంగ్లాదేశ్‌ను ఆర్థికంగా అభివృద్ధి చేసిన ఘనత దక్కించుకున్న హసీనా, ప్రజాస్వామ్య చిహ్నంగా తన రాజకీయ జీవితం ప్రారంభించారు.
అయితే ఇటీవలి కాలంలో ఆమె నియంతగా మారారని, తన పాలనను వ్యతిరేకించేవారిని, ప్రతిపక్షాలను అణచివేశారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. హసీనా పాలనలో రాజకీయ ప్రేరేపిత అరెస్టులు, హక్కుల కార్యకర్తలు అదృశ్యం, హత్యలు, ఇతర నేరాలు పెరిగాయి.
జనవరిలో నాలుగోసారి ఎన్నికల్లో గెలుపొంది బంగ్లాదేశ్ ప్రధాని అయ్యారు షేక్ హసీనా. అయితే ఆ ఎన్నికలు బూటకమని విమర్శకులు ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు పోటీ చెయ్యలేదు.

ఫొటో సోర్స్, Getty Images
షేక్ హసీనా అధికారంలోకి ఎలా వచ్చారు..?
కుటుంబ వారసత్వంగా హసీనా రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె1947లో తూర్పు బెంగాల్‌లో ఓ ముస్లిం కుటుంబంలో జన్మించారు.
బంగ్లాదేశ్ పితామహుడిగా ప్రజలు పిలిచే షేక్ ముజిబుర్ రెహమాన్ హసీనా తండ్రి. పాకిస్తాన్ నుంచి వేరు పడటానికి జరిగిన బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటానికి ఆయన నాయకత్వం వహించారు. 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటయిన తర్వాత తొలి అధ్యక్షుడు ఆయనే.
ఆ సమయానికి షేక్ హసీనా ఢాకా యూనివర్శిటీలో విద్యార్థి నాయకురాలిగా గుర్తింపు పొందారు.
1975లో జరిగిన సైనిక తిరుగుబాటులో హసీనా తండ్రితో పాటు ఆమె కుటుంబ సభ్యులను హత్య చేశారు. ఆ సమయంలో విదేశాలకు ప్రయాణిస్తున్న హసీనా, ఆమె చెల్లి మాత్రమే సురక్షితంగా తప్పించుకున్నారు.
భారత్‌లో ప్రవాస జీవితం గడిపిన తర్వాత 1981లో ఆమె తిరిగి బంగ్లాదేశ్ వెళ్లారు. తండ్రి స్థాపించిన అవామీ లీగ్ పార్టీ పగ్గాలు చేపట్టారు.
జనరల్ హుస్సేన్ ముహమ్మద్ ఎర్షాద్ సైనిక పాలనకు వ్యతిరేకంగా, ఇతర పార్టీలతో కలిసి ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం నిరసన ప్రదర్శనలు చేశారు. అలా రాజకీయాల్లో వేగంగా ఎదిగారామె. జాతీయస్థాయి నాయకురాలిగా గుర్తింపు పొందారు.
1996లో తొలిసారి ఆమె అధికారంలోకి వచ్చారు. భారత్‌తో చేసుకున్న జల ఒప్పందం, ఈశాన్య బంగ్లాదేశ్‌లో గిరిజన తిరుగుబాటుదారులతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందం షేక్ హసీనా ప్రతిష్ట పెంచాయి.
అయితే అదే సమయంలో ఆమె ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి.
హసీనా ప్రభుత్వం అనేక అవినీతి వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుందని, భారత్‌కు వీర విధేయత కనబరుస్తోందని విమర్శలు వినిపించాయి.

ఫొటో సోర్స్, EPA
2001 ఎన్నికల్లో షేక్ హసీనా నాయకత్వంలోని అవామీలీగ్... బేగమ్ ఖలీదా జియా నాయకత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చేతిలో ఓడిపోయింది. అవామీలీగ్‌కు ఒకప్పుడు మిత్రపక్షంగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తర్వాతకాలంలో ప్రత్యర్థిగా మారింది.
దేశంలో రెండు పెద్ద రాజకీయ కుటుంబాలకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఇద్దరు నాయకురాళ్లు మూడు దశాబ్దాలుగా బంగ్లాదేశ్‌కు నాయకత్వం వహిస్తూ వచ్చారు. వారి మధ్య సాగిన పోరాటాన్ని బంగ్లాదేశ్‌లో "బేగమ్స్ యుద్ధం"గా పిలుస్తారు.
ఇరు వర్గాల మధ్య నెలకొన్న పోటీ ఫలితంగా...బస్సు బాంబులు, కార్యకర్తలు, నేతల అదృశ్యం, హత్యలు వంటివి సర్వసాధారణంగా మారాయని పరిశీలకులు చెబుతారు.
2009లో ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్వహించిన ఎన్నికల్లో షేక్ హసీనా మళ్లీ గెలిచి అధికారంలోకి వచ్చారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేకసార్లు హసీనా అరెస్టయ్యారు. ఆమెపై అనేక హత్యాయత్నాలు జరిగాయి. 2004లో జరిగిన హత్యాయత్నంలో ఆమె వినికిడిశక్తి దెబ్బతింది.
దేశం నుంచి బహిష్కరించడానికి జరిగిన ప్రయత్నాల నుంచి ఆమె తప్పించుకోగలిగారు. అవినీతి ఆరోపణల్లో అనేక కేసులను ఎదుర్కొన్నారు.
1980లు, 1990ల ప్రారంభంలో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమంతో ఆదరణ పొందిన షేక్ హసీనా జాతీయ నాయకురాలిగా ఎదిగారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏం సాధించారు..?
షేక్ హసీనా నేతృత్వంలోని బంగ్లాదేశ్‌ది విభిన్న చిత్రం. ముస్లింలు అధికంగా ఉన్న ఈ దేశం ఒకప్పుడు ప్రపంచ పేద దేశాల్లో ఒకటిగా ఉంది. షేక్ హసీనా నాయకత్వంలో ఆర్థికంగా గణనీయమైన విజయాలు సాధించింది. 2009లో హసీనా దేశ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ మార్పులు కనిపించాయి.
ప్రస్తుతం బంగ్లాదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. వృద్ధిరేటుకు కొలమానంగా ఉండే అనేక సూచీల్లో పొరుగునే ఉన్న భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉంది.
గడచిన దశాబ్దంలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం మూడురెట్లు పెరిగింది. గడచిన 20 ఏళ్లలో రెండున్నర లక్షలమందికిపైగా బంగ్లాదేశీలు పేదరికం నుంచి బయటపడ్డారనేది ప్రపంచ బ్యాంకు అంచనా.
వస్త్ర పరిశ్రమ ద్వారా బంగ్లాదేశ్ చాలా వరకు ఆర్థికవృద్ధి సాధించింది. బంగ్లాదేశ్ మొత్తం ఎగుమతుల్లో ఎక్కువభాగం వస్త్ర పరిశ్రమ నుంచే జరుగుతాయి. ఇటీవలి దశాబ్దాల్లో ఈ పరిశ్రమ వేగంగా విస్తరించింది. యూరప్, ఉత్తర అమెరికా, ఆసియా దేశాలకు ఎగుమతులు సాగిస్తోంది.
సొంత నిధులు, అప్పులు, అభివృద్ది సాయం ద్వారా హసీనా ప్రభుత్వం భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టింది. గంగానది మీద 2.9 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న పద్మ బ్రిడ్జి ఇందులో ఒకటి.

ఫొటో సోర్స్, Getty Images
షేక్ హసీనా చుట్టూ ఉన్న వివాదాలేంటి...?
2024 జనవరిలో బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఇటీవల జరిగిన హింసాత్మక ఆందోళనలు షేక్ హసీనాకు సవాల్‌గా మారాయి. వివాదాస్పదంగా జరిగిన ఎన్నికల్లో హసీనా పార్టీ వరుసగా నాలుగోసారి గెలుపొందింది.
రాజీనామా చేయాలంటూ షేక్ హసీనాపై ఒత్తిడి పెరిగినప్పటికీ....ఆమె పట్టించుకోలేదు. ఆందోళనకారులను ఆమె టెర్రరిస్టులుగా అభివర్ణించారు. అలాంటి వారిని కఠినంగా అణిచివేయడానికి సహకరించాలని కోరారు.
సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో కోటాను రద్దుచేయాలని ఢాకాతో పాటు ఇతర ప్రాంతాల్లో ఇటీవల మొదలైన ఆందోళనల తీవ్రత పెరిగి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారాయి.
కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో భారీగా పెరిగిన జీవన వ్యయంతో బంగ్లాదేశ్ సతమతమవుతోంది. ఇటీవల ద్రవ్యోల్బణం రాకెట్ స్పీడుతో దూసుకుపోయింది.
విదేశీ మారక నిల్వలు వేగంగా పడిపోయాయి. గత 8ఏళ్లలో విదేశీ రుణ భారం రెట్టింపయ్యింది.
హసీనా ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలవల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శకులు ఆరోపించారు.
గతంలో బంగ్లాదేశ్ సాధించిన ఆర్థిక పురోగతి హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నవారికి మాత్రమే సాయపడిందని, అవినీతి కారణంగానే ఇలా జరిగిందని కొందరు విమర్శించారు.
అభివృద్ధి పేరుతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని, మానవహక్కులను అణచివేశారని, హసీనా పాలనలో రాజకీయ ప్రత్యర్థులు, విరోధులు, మీడియాపై తీవ్రస్థాయి అణిచివేత జరుగుతోందని ఆమె వ్యతిరేకులు ఆరోపించారు.
అయితే, షేక్ హసీనా, అవామీలీగ్ ప్రభుత్వం ఆ ఆరోపణలను ఖండించాయి.
ఒకప్పుడు షేక్ హసీనా బహుళ పార్టీల ప్రజాస్వామ్యం కోసం పోరాడారు. కానీ ఇప్పుడామె పూర్తిగా మారిపోయారని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
హసీనా పాలనలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన అనేకమంది సీనియర్ నాయకులు ఇటీవలి నెలల్లో అరెస్టయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వేలమంది బీఎన్ఎస్ మద్దతుదారులూ అరెస్టు చేయించారు.
ఎంతోమంది కనిపించడం లేదంటూ నమోదయిన వందలకొద్దీ కేసులు, 2009 నుంచి భద్రతాబలగాలు హత్యలకు పాల్పడుతున్నాయని వచ్చిన ఆరోపణలపై హక్కుల సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి.
ఈ ఆరోపణలను హసీనా ప్రభుత్వం ఖండించింది. ఇలాంటి ఆరోపణలపై దర్యాప్తు చేయాలనుకున్న విదేశీ జర్నలిస్టులకు అనుమతి నిరాకరించింది.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














