వయనాడ్ ల్యాండ్‌స్లైడ్స్: ఇండియన్ ఆర్మీ సహాయానికి, సాహసానికి సెల్యూట్ చేస్తున్న ప్రజలు

భారత ఆర్మీ

ఫొటో సోర్స్, Twitter@DefencePROkochi

ఫొటో క్యాప్షన్, వయనాడ్ జిల్లాలో సహాయ చర్యల్లో ఇండియన్ ఆర్మీ

కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వరదలకు కొట్టుకుపోయిన వంతెన స్థానంలో భారత ఆర్మీ రికార్డు సమయంలో కొత్త వంతెన నిర్మించింది.

వంతెనను నిర్మించిన తరువాత సైనికులు సంతోషంతో నినాదాలు చేశారు. ముండక్కై గ్రామానికి వెళ్లేందుకు ఈ వంతెన ఏర్పాటు చేశారు.

ఈ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాక శిథిలాల్లో చిక్కుకున్నవారిని రక్షించడంలో, సహాయ చర్యలు చేపట్టడంలో సైనిక దళాలు కీలక పాత్ర పోషించాయి.

ఘటన జరిగిన తరువాత కొన్ని గంటల వ్యవధిలోనే అక్కడికి చేరుకున్న ఆర్మీ సిబ్బంది వెంటనే సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత ఆర్మీ

ఫొటో సోర్స్, Twitter@DefencePROkochi

ఘటన తీవ్రత తెలిసే కొద్దీ దేశంలోని వివిధ ఆర్మీ కేంద్రాల నుంచి సిబ్బందిని, సామగ్రిని రప్పిస్తూ వచ్చారు.

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ , కోస్ట్ గార్డుల బృందాలు ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి.

ఇక ఎన్డీఆర్ఎఫ్, కేరళ ఫైర్ డిపార్ట్‌మెంట్, కేరళ పోలీసులు సహా అనేక కేంద్ర, రాష్ట్ర బలగాలు ఇందులో చురుగ్గా పాల్గొన్నాయి.

అయితే, కీలక పాత్ర సైన్యానిదే అని చెప్పొచ్చు.

మోహన్‌లాల్

ఫొటో సోర్స్, Twitter@DefencePROkochi

ఫొటో క్యాప్షన్, లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో వయనాడ్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మోహన్‌లాల్

నీటిలో, బురదలో చిక్కుకున్న వారిని రక్షించడం, బతికున్న వారి కోసం వెతకడం, శిక్షణ పొందిన కుక్కలను, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత సైన్యం వాడింది.

మట్టిలో కూరుకుపోయిన వారి కోసం వెతకడం, అక్కడి సిబ్బందికి వైద్య సహాయం అందించడం, హెలికాప్టర్లలో వెళ్లి రక్షించడం, మృతదేహాలను వెలికి తీయడం, మిగిలిన సహాయక సిబ్బంది ఘటన జరిగిన ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా దారి ఏర్పాటు చేయడం.. ఇలాంటివన్నీ సైనిక బృందాలు చేపట్టాయి.

వంతెన నిర్మాణం

ఫొటో సోర్స్, Southern Command INDIAN

ఫొటో క్యాప్షన్, వంతెన నిర్మించిన మద్రాస్ ఇంజనీర్స్ గ్రూప్(ఎంఈజీ)

ఈ మొత్తం సహాయక కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించిన అంశం వంతెన నిర్మాణం.

కొండల పైనుంచి కొట్టుకు వచ్చిన వరద, మట్టి, రాళ్ల తాకిడికి చూరల్మలై – ముండక్కై గ్రామాల మధ్య ఉన్న వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో, ముండక్కైకి వెళ్లి సాయం చేసే పరిస్థితి లేకుండా పోయింది.

సైనికులు అప్పటికప్పుడు 24 టన్నుల బరువును తట్టుకునే ఇనుప వంతెనను ఏర్పాటు చేశారు. భారత సైన్యానికి చెందిన మద్రాస్ ఇంజినీర్స్ గ్రూప్, ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్ కలసి ఈ వంతెనను నిర్మించాయి.

ముందుగా ఒక నడకదారి వంతెన నిర్మించాయి. ఆ తరువాత వాహనాలు కూడా వెళ్లగలిగే మరో వంతెన పూర్తి చేశాయి.

మరికొన్ని రోజుల పాటూ సైన్యం ఇక్కడే ఉండి సహాయ చర్యలు చేపట్టనుంది.

భారత ఆర్మీ

ఫొటో సోర్స్, Twitter@DefencePROkochi

‘‘రాత్రి 2 గంటలకు కొండచరియలు విరిగిపడగా తెల్లవారుజామున 4.30 గంటలకు మాకు సమాచారం వచ్చింది. అదే రోజు మధ్యాహ్నానికల్లా ఇక్కడికి చేరుకున్నాం. మొదట కోజికోడ్, కన్నూర్‌‌ల నుంచి, ఆ తరువాత బెంగళూరు నుంచి సిబ్బందిని ఇక్కడికి రప్పించాం. ఇక్కడి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో రోడ్డు, వాయు మార్గాల ద్వారా ఎక్కువ మంది సిబ్బందిని సాధ్యమైనంత త్వరగా రప్పించి సహాయ చర్యలు ప్రారంభించాం’’ అని కర్ణాటక – కేరళ సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ వీటీ మాథ్యూ చెప్పారు.

‘‘500 మందికి పైగా సిబ్బంది ఇక్కడ సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రాథమికంగా ఎక్కువ మంది రెస్క్యూ ఆపరేషన్లలో ఉన్నారు. బెయిలీ బ్రిడ్జి నిర్మాణం కోసం పెద్ద సంఖ్యలో ఇంజినీర్ టాస్క్ ఫోర్స్ పనిచేసింది. వారితోపాటు డాగ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్ స్క్వాడ్‌లను రప్పించాం. పలు ప్రాంతాల నుంచి ప్రత్యేకమైన పరికరాలను తీసుకొచ్చాం. వాటి ద్వారా ఎవరైనా మట్టిలో కూరుకుపోయారా అనేది గుర్తించవచ్చు’’ అని తెలిపారు.

‘‘బయటికి వచ్చే మార్గం లేక చిక్కుకుపోయిన వారిని కాపాడాం. ఇప్పటివరకు 250 మందికి పైగా కాపాడాం. ఇందుకోసం హెలికాఫ్టర్‌లను కూడా వినియోగించాం’’ అని చెప్పారు.

భారత ఆర్మీ నిర్మించిన ఇనుప వంతెన

ఫొటో సోర్స్, Twitter@DefencePROkochi

ఫొటో క్యాప్షన్, ఆర్మీ నిర్మించిన వంతెన

బెయిలీ వంతెన గురించి..

ఆ బ్రిడ్జి ఎంత కీలకమైనదో మీకూ తెలిసే ఉంటుంది. ఆ ప్రాంతాలకు వెళ్లాలంటే మరో మార్గం లేదు. అందుకే మొదట 100 అడుగుల పొడవైన ఫుట్ బ్రిడ్జిని ఒక్క రాత్రిలోనే నిర్మించారు.

తరువాత 190 అడుగుల బ్రిడ్జిని రికార్డు టైమ్‌లో నిర్మించింది మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్. దీనివల్ల ఆ ప్రభావిత ప్రాంతానికి త్వరగా చేరుకోవడం సాధ్యమైంది.

రికార్డు సమయంలో వంతెన నిర్మించడం, సహాయక చర్యల్లో ఆర్మీ అందిస్తోన్న సేవలకు దేశ ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. ఆర్మీ గ్రేట్ అంటూ పొగుడుతున్నారు.

‘‘ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుతాలు చేసే సిబ్బంది నా బృందంలో ఉన్నందుకు, ప్రతిసారీ అద్భుతాలు చేసే భారత ఆర్మీలో భాగమైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను’’ అని మాథ్యూ తెలిపారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)