కడం ప్రాజెక్ట్: వరదలొచ్చిన ప్రతిసారీ తెలంగాణ ప్రజలను ఎందుకు భయపెడుతోంది?

ఫొటో సోర్స్, P.Srinivas
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
వరదలొచ్చిన ప్రతిసారీ కడం ప్రాజెక్టు కొట్టుకుపోతోందన్న వదంతులు రావడం పరిపాటిగా మారింది. భారీ సాగునీటి ప్రాజెక్టులతో పోలిస్తే చిన్నదైన కడం ప్రాజెక్ట్ నిర్వహణ తెలంగాణ ఇరిగేషన్ శాఖను కలవరపెడుతోంది.
గత మూడేళ్లుగా వర్షాకాలంలో ఈ ప్రాజెక్టును పలుమార్లు ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) ముంచెత్తాయి.
ప్రాజెక్టు నీటి విడుదల సామర్థ్యానికి దాదాపు రెట్టింపు స్థాయి (సుమారు 6 లక్షల క్యూసెక్కులు) వరద రావడంతో, ఇటు ప్రాజెక్టుకీ, అటు స్థానికులకీ నష్టం కలగకుండా వరద నీరు దిగువకు పంపడం ఇరిగేషన్ యంత్రాంగానికి సవాల్‌గా మారింది.
ఇలాంటి పరిస్థితి ఏర్పడిన ప్రతిసారీ ప్రాజెక్టు కొట్టుకుపోతోందన్న వదంతులు రావడం, సమీపగ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం పరిపాటి అవుతోంది.


ఫొటో సోర్స్, UGC
‘మిమ్మల్ని దేవుడే కాపాడతాడన్నారు’
‘’నిరుడు వరుసగా ఆరు రోజులు వర్షం కురిసింది. డ్యామ్ తెగిపోతుందని, ఊరు ఖాళీ చేయాలని అనౌన్స్ చేశారు. కుటుంబంతో ఎత్తైన ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో రాత్రంతా తలదాచుకున్నాం. ఏం జరుగుతుందోనన్న భయంతో బతికాం. ఇన్ ఫ్లో తగ్గాకే ఊపిరి పీల్చుకున్నాం.’’ అని కడంకు చెందిన రాచకొండ రవీందర్ వరదల సమయంలో తన అనుభవాలను బీబీసీకి వివరించారు.
‘’వరదలతో వరుసగా రెండేళ్లు క్యాంపులకు వెళ్లాల్సి వచ్చింది. నిరుడు డ్యామ్ గేట్లు పైకి లేవలేదు. రెండు రోజులు పిల్లాపాపలతో ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నాం. మంత్రిని నిలదీస్తే, మిమ్మల్ని దేవుడే కాపాడుతాడని అంటే ఇక ఏం మాట్లాడతాం. ప్రాజెక్టులో పూడిక తీయాలి. ఈ ఏడాది ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. జరగాల్సిన మరమ్మతు పనులు ఇంకా ఉన్నాయి.’’ అని స్థానికుడైన బొలిశెట్టి రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, P.Srinivas
కడం నారాయణరెడ్డి ప్రాజెక్ట్
గోదావరికి ఉపనది అయిన కడం వాగుపై ప్రాజెక్ట్ నిర్మించి ఉత్తర తెలంగాణ భూములకు సాగు నీరు అందించాలన్నది నిజాం కాలం నాటి ఆలోచన.
సంస్థానాల విలీనం తర్వాత ‘హైదరాబాద్ స్టేట్’ ప్రభుత్వం 1949లో ప్రస్తుత నిర్మల్ జిల్లా కడం వద్ద తొమ్మిది గేట్లు, 2.50 లక్షల క్యూసెక్కుల వరద నిర్వహణ సామర్థ్యంతో (డిజైన్డ్ డిశ్చార్జ్) చేపట్టిన ప్రాజెక్ట్ పనులు1958లో పూర్తయ్యాయి.
అయితే, అదే ఏడాది వచ్చిన వరదల్లో డ్యామ్‌లో కొంత భాగం కొట్టుకుపోయింది. ఆ తర్వాత డ్యామ్ మరమ్మతు, విస్తరణ పనులు 1969 వరకు జరిగాయి.
అదే సమయంలో డ్యామ్ పూర్తి నీటి నిల్వ స్థాయి (ఎఫ్ఆర్ఎల్)తో పాటు డిశ్చార్జి కెపాసిటీని 3.82 లక్షల క్యూసెక్కులకు పెంచారు. అదనంగా మరో 9 గేట్లను (అప్పటి జర్మన్ టెక్నాలజీ గేట్లు) ఏర్పాటు చేశారు.
ఇలా రెండు దఫాల్లో ఇరవై ఏళ్లపాటు కడం ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగింది.
ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలు. పూడిక, ఇతర కారణాలతో ప్రస్తుత వాస్తవ నిల్వ 4.8 టీఎంసీలకు తగ్గింది.
ఖానాపూర్, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలో 68 వేల ఎకరాలకు సాగునీరు అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ప్రధానంగా వరి సాగుకు ఇది ఉపయోగపడుతుంది.

ఫొటో సోర్స్, UGC
ఫ్లాష్ ఫ్లడ్స్‌కు కేరాఫ్ అడ్రస్
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలో 2,590 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో కడం వాగు క్యాచ్‌మెంట్ ఏరియా (నీటివనరు విస్తీర్ణం) ఉంది. ఇందులో ఎక్కువగా (57% మేర) అటవీ ప్రాంతాల గుండా సాగుతుంది.
కడం వాగుతో పాటు దాని ప్రధాన నీటి వనరులైన కుప్టి వాగు, చిక్‌మన్ వాగులు డెడ్రా, నాగులమల్యాల అటవీ ప్రాంతం గుండా ప్రవహిస్తాయి.
సాగునీటి నిపుణులు చెప్పినదాని ప్రకారం...కడం ప్రాజెక్టుకు తరచూ ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం వెనుక ఈ క్యాచ్‌మెంట్ ఏరియా ఆకృతి (షేప్) ప్రధాన కారణం.
కడం ప్రాజెక్ట్ క్యాచ్ మెంట్ ఏరియాను ‘ఫ్యాన్ షేప్’ అంటారు.
క్యాచ్‌మెంట్ ఏరియా ఆకారం అందులో ప్రవహించే నీటి మొత్తాన్ని నియంత్రిస్తుంటుంది.
ఈ తరహా పరీవాహక ప్రాంతాల్లో... ప్రధాన ప్రవాహంలో కలిసే ఉప ప్రవాహాలు ఆకారంలో చిన్నవి. దాదాపు సమానమైన పొడవులో ఉంటాయి.
దీంతో వర్షం నీరు తక్కువ సమయంలో, ఒకేసారి ఎక్కువ మొత్తంలో ప్రధాన వనరులో చేరడంతో ప్రవాహం పెరగడం, తగ్గిపోవడానికి ఎంతో సమయం పట్టదు.

ఆధునికీకరణ పనులు
1995, 2018లో వచ్చిన వరదలకు కడం ప్రాజెక్ట్ గేట్లు (కౌంటర్ వెయిట్) ప్రవాహంలో కొట్టుకుపోయాయి. నిరుడు భారీ ప్రవాహానికి ఆనకట్టకు, కాలువకు గండ్లు పడ్డాయి. వరద వదిలే సమయంలో కొన్నిగేట్లు మొరాయించాయి.
కడంకు వరద ముప్పు తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి సూచనలను ఇచ్చేందుకు గత ప్రభుత్వం రెండు కమిటీలను నియమించింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలోని కమిటీ ఇందులో ఒకటి.
ఎక్కువ మొత్తంలో వరదను దిగువకు పంపేలా ఆనకట్టలో మార్పులు, ఆధునికీకరణ పనులు, ఎగువ భాగంలో మరో డ్యామ్ నిర్మాణం చేయాలన్న సూచనలు వచ్చాయి.
గత అనుభవాల నేపథ్యంలో లోపాలను సవరిస్తూ ఈ ఏడాది ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టారు. అవి దాదాపుగా పూర్తి కావొచ్చాయి.
మరమ్మతుల సందర్భంగా ప్రాజెక్టు కింద రబీ పంటకు క్రాప్ హాలిడే ప్రకటించారు.
ఈ ఏడాది పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటామని నిర్మల్ జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు బీబీసీతో అన్నారు.

‘’మెకానికల్ విభాగం పనుల్లో భాగంగా గేట్ రోలర్లు, ఎయిర్ పంప్స్, అలైన్‌మెంట్, కౌంటర్ వెయిట్‌లు, గ్రీసింగ్ పనులు పూర్తి చేశాం. ఎలక్ట్రిక్ విభాగంలో గేట్ల నిర్వహణ కోసం 500 కేవీ ట్రాన్స్‌ఫార్మర్, 160 కేవీ జనరేటర్ ఏర్పాటు చేశాం. ప్రాజెక్ట్ అవసరాల కోసమే 24 గంటల సరఫరా ఉండేలా ప్రత్యేక విద్యుత్ లైన్ వేశాం. వరద నిర్వహణ సాఫీగా సాగుతుందని ఆశిస్తున్నాం’’ అని నీటిపారుదల శాఖ నిర్మల్ సర్కిల్ ఎస్.ఈ (ఇంచార్జి) కె.రవీందర్ బీబీసీతో చెప్పారు.
క్యాచ్‌మెంట్ ఏరియాలోని అడవుల గుండా వచ్చే వరద ప్రవాహంలో కొట్టుకొచ్చే భారీ కలప దుంగలు, చెట్లు గేట్ల మధ్యలో ఇరుక్కుపోవడంతో అవి మొరాయించిన సందర్భాలున్నాయి.
ఇది గేట్ల అమరిక (అలైన్‌మెంట్)పై ప్రభావం చూపుతోందని ఎస్ఈ రవీందర్ అన్నారు. పాతకాలపు గేట్లు కావడంతో ప్రస్తుత మార్కెట్‌లో వాటి డిజైన్లు, విడి భాగాల లభ్యత కష్టంగా మారిందని, వాటిని ప్రత్యేకంగా తయారు చేయించాల్సి వస్తోందని ఆయన చెప్పారు.

‘మరమ్మతులు పరిష్కారం కాదు’
కడం ప్రాజెక్ట్ ఎదుర్కొంటున్న ఆకస్మిక వరదల సమస్యకు మరమ్మతులు శాశ్వత పరిష్కారం కాదని నీటిపారుదల నిపుణులు అంటున్నారు.
‘‘గేట్ల రిపేర్‌తో ప్రస్తుత ప్రాజెక్ట్ డిశ్చార్జి కెపాసిటీ మేరకు 3.5 లక్షల క్యూసెక్కుల నీటిని సాఫీగా కిందకు వదలొచ్చు. అయితే, గతంలో మాదిరి 5 లక్షల క్యూసెక్కుల వరద వస్తే మళ్లీ పరిస్థితి మొదటికొస్తుంది. డిశ్చార్జి కెపాసిటీ పెంచడం, ఎగువ భాగంలో కుప్టి ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గతంలో సూచించింది.’’ అని తెలంగాణ నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఉన్నతోద్యోగి శ్రీధర్ రావ్ దేశ్‌పాండే బీబీసీతో చెప్పారు.
‘‘కెపాసిటీ పెంచడమంటే, ఇప్పుడున్న 18 గేట్ల సంఖ్యను పెంచడం. అయితే, అక్కడ పెంచడానికి ఆస్కారం లేదు. ప్రపోజల్ ఏంటంటే, దిగువన కొద్ది దూరంలో ఇంకొక డ్యామ్ కట్టాలి. రిజర్వాయర్ అదే ఉంటుంది. దిగువ నిర్మించే కొత్త డ్యామ్ నుంచే గేట్లు ఆపరేట్ అవుతాయి. పాత డ్యామ్ కాంక్రీట్ నిర్మాణం రిజర్వాయర్‌లో అలాగే మునిగి ఉంటుంది’’ అన్నారు శ్రీధర్ రావ్ దేశ్‌పాండే.
‘‘ఎగువ నుంచి ఎంత వరద వస్తుందో కొలిచే రివర్ గేజ్ (వాటర్ గేజ్)పరికరాలు గతంలో లేవు. ఇప్పుడు కుప్టితోపాటు దాని దిగువన చిక్ మన్ వాగు వద్ద కూడా అవి ఏర్పాటు చేశారని తెలిసింది. దీంతో ఈ ఏడాది వరద నిర్వహణ సాఫీగా సాగుతుందని ఆశించవచ్చు.’’ అన్నారాయన.
‘‘వరద నిర్వహణలో చాలా సంక్లిష్టతలుంటాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ ఎప్పుడు వస్తాయో, వాటి ప్రభావం ఎన్ని గంటలు ఉంటుందో తెలియదు. వచ్చే వరదను నిల్వ చేయడానికి ప్రాజెక్టును ఖాళీ చేయాలో వద్దో ఇంజనీర్లు సరైన నిర్ణయం తీసుకోలేరు. అందుకు పై అధికారుల నుంచి ఆర్డర్స్ కోసం వేచిచూడాల్సి ఉంటుంది.’’ అన్నారు శ్రీధర్ రావ్ దేశ్‌పాండే.

ఫొటో సోర్స్, P.Srinivas
‘‘నీటి విడుదల సామర్థ్యం పెరగకపోతే అసలు సమస్య పరిష్కారం కానట్టే. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఎగువన కుప్టి ప్రాజెక్ట్ పూర్తయితే కొంతమేర వరద నియంత్రించవచ్చు. అదే సమయంలో, అవసరమైతే అక్కడి నీటితో కడం ప్రాజెక్టును నింపే అవకాశం ఉంటుంది.’’ అని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
‘‘రూ.10 కోట్ల నిధులతో ఆరు నెలల్లో రిపేర్ వర్క్స్ పూర్తిచేశాం. ఇంకో 10 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. గేట్లు సరిగ్గా పనిచేస్తే ఎంత వరద వచ్చినా ఇబ్బంది ఉండదు. కుప్టి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైంది. దాని నిర్మాణంపై ఇంకా తుది నిర్ణయం జరగలేదు. దిగువన అదనపు గేట్ల నిర్మాణం కోసం సాయిల్ టెస్ట్ జరుగుతోంది. ఈసారి రెండు పంటలకు నీళ్లిస్తామని ఆయకట్టు రైతులకు వాగ్దానం చేస్తున్నాం.’’ అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు బీబీసీకి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- బెరిల్: ‘మా ద్వీపం మొత్తాన్ని తుడిచిపెట్టేసిన హరికేన్ ఇది’ అంటున్న బాధితులు, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే....
- పిల్లల కోసం తల్లిదండ్రులు ఒక చిన్న సెల్లో తమను తాము బంధించుకుంటున్నారు, ఎందుకు?
- వీళ్లు ఏటా లీటర్ల కొద్దీ మద్యం తాగేస్తున్నారు, అత్యధికంగా ఆల్కహాల్ తాగే దేశాలు ఇవే..
- వరల్డ్ వార్ 2: జర్మనీ సముద్రంలో లక్షల టన్నుల పేల్చని బాంబులు, ఇప్పుడు బయటకు తీసి ఏం చేస్తారు?
- ‘60’ మందిని ఉరి తీసిన తలారి మృతి
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














