ఆ ఐదుగురు ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనలేరు ఎందుకు?

ఫొటో సోర్స్, AFZAL ANSARI/FB/ ANI/ GETTY
కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మొత్తం ఎంపీల్లో ఏడుగురు మాత్రం ప్రమాణ స్వీకారం చేయలేదు.
బుధవారం స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఓటింగ్ జరగలేదు. నిబంధనల ప్రకారం ఓటింగ్ జరిగి ఉంటే, ఈ ఎంపీలకు ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండేది కాదు.
ఆ ఏడుగురిలో పశ్చిమ బెంగాల్‌లోని ఘాటల్ స్థానం నుంచి గెలిచిన దీపక్ అధికారి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేరళలోని తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన శశి థరూర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
మిగిలిన ఐదుగురు ఎంపీల్లో అమృతపాల్ సింగ్ పంజాబ్‌లోని ఖడూర్ సాహిబ్ స్థానం నుంచి, ఇంజినీర్ రషీద్ కశ్మీర్‌లోని బారాముల్లా నుంచి గెలుపొందారు. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నుంచి శతృఘ్న సిన్హా, బసీర్‌హాట్ నుంచి షేక్ నూరుల్ ఇస్లాం, ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ నుంచి అఫ్జల్ అన్సారీ పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
వీరిలో అమృత్‌పాల్ సింగ్, ఇంజినీర్ రషీద్ జైలులో ఉన్నారు. వీరు ప్రమాణస్వీకారం చేసేందుకు మధ్యంతర బెయిల్ పిటిషన్లపై కోర్టులో విచారణ జరగాల్సి ఉంది.
అఫ్జల్ అన్సారీ గత ఏడాది ఒక కేసులో దోషిగా తేలినందున పార్లమెంటరీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. అందువల్ల ఆయన పార్లమెంటుకు వచ్చినా, ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు.
అసలు ఈ ఐదుగురు ఎంపీలు ఎందుకు ప్రమాణ స్వీకారం చేయలేకపోయారో తెలుసుకుందాం.


ఫొటో సోర్స్, Getty Images
అమృత్‌పాల్ సింగ్
ఖలిస్తాన్ మద్దతుదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లోని ఖడూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు.
దాదాపు రెండు లక్షల ఓట్ల తేడాతో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు. జైల్లో నుంచే అమృత్‌పాల్ సింగ్ ఎన్నికల్లో పోటీ చేశారు.
జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద అమృత్‌పాల్ సింగ్‌ను నిరుడు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన అసోంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు.
ఎన్‌ఎస్‌ఏ కేసులో, మరో ఏడాది పాటు నిర్బంధాన్ని పొడిగించారు.
ప్రమాణ స్వీకారం కోసం మధ్యంతర బెయిల్ పొందేందుకు ఈయనకు అర్హత ఉన్నప్పటికీ, జాతీయ భద్రతా చట్టం కారణంగా ఆయన బెయిల్ కోసం ప్రత్యేకంగా అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, WASEEM ANDRABI/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
ఇంజినీర్ రషీద్
అబ్దుల్ రషీద్ షేక్ అలియాస్ ఇంజినీర్ రషీద్ కశ్మీర్‌లోని బారాముల్లా స్థానం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై రెండు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
టెర్రరిస్టు కార్యకలాపాలకు నిధులు సమకూర్చారనే ఆరోపణలతో ఇంజినీర్ రషీద్‌ను చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (యూఏపీఏ) కింద 2019లో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన దిల్లీలోని తిహార్ జైలులో ఉన్నారు.
ఆయన జైలులో ఉండడంతో, ఆయన కుమారుడు అబ్రర్ రషీద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రమాణ స్వీకారం కోసం ఇంజినీర్ రషీద్ దిల్లీ కోర్టులో మధ్యంతర బెయిల్‌కి దరఖాస్తు చేసుకున్నారు.
దీనికి సంబంధించి ఎన్ఐఏ నుంచి సమాధానం కోరిన కోర్టు, తదుపరి విచారణను జులై 1కి వాయిదా వేసింది.

ఫొటో సోర్స్, ANI
శతృఘ్న సిన్హా
ప్రమాణ స్వీకారం చేయలేకపోయిన వారిలో నటుడు, రాజకీయ నాయకుడు శతృఘ్న సిన్హా ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నుంచి ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
సిన్హా గతంలో బీజేపీలో ఉన్నారు. 2019లో ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. 2022లో కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.
అసన్‌సోల్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి సురేంద్రజిత్ సింగ్ అహ్లువాలియాపై 60 వేల ఓట్ల తేడాతో సిన్హా విజయం సాధించారు.
తన కుమార్తె, నటి సోనాక్షి సిన్హా వివాహం కారణంగా శతృఘ్న సిన్హా ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదని తృణమూల్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు.
ఆయన త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఫొటో సోర్స్, @HAJINURULISLAM
షేక్ నూరుల్ ఇస్లాం
మరో టీఎంసీ ఎంపీ షేక్ నూరుల్ ఇస్లాం సైతం ప్రమాణ స్వీకారం చేయలేదు.
పశ్చిమ బెంగాల్‌లోని బసీర్‌హాట్ స్థానం నుంచి షేక్ నూరుల్ ఇస్లాం విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి రేఖా పాత్రపై 3.33 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
2019 ఎన్నికల్లో, బెంగాలీ నటి నుస్రత్ జహాన్ ఈ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే, ఈసారి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇస్లాంకు టిక్కెట్ కేటాయించారు.
నూరుల్ ఇస్లాం టీఎంసీ ఎమ్మెల్యేగానూ ఉన్నారు.
సందేశ్‌ఖాలీ ప్రాంతం బసీర్‌హాట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇక్కడ మహిళలపై వేధింపుల అంశం చర్చకు వచ్చింది.
వ్యక్తిగత కారణాల వల్ల నూరుల్ ఇస్లాం ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదని, ఆయన తరువాత ప్రమాణ స్వీకారం చేస్తారని టీఎంసీ నేత ఒకరు చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
అఫ్జల్ అన్సారీ
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ నుంచి ఎంపీగా గెలిచిన అఫ్జల్ అన్సారీ పార్లమెంట్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైనప్పటికీ, ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు.
సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన దాదాపు 1.25 లక్షల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి పరస్‌నాథ్ రాయ్‌పై విజయం సాధించారు.
2019 ఎన్నికల్లో ఆయన బీఎస్పీ నుంచి ఘాజీపూర్ ఎంపీగా విజయం సాధించారు.
నిరుడు ఒక కేసులో, గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద అన్సారీకి నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. ఈ తీర్పుపై అలహాబాద్ హైకోర్టులోనూ ఉపశమనం లభించకపోవడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీం కోర్టు నాలుగేళ్ల శిక్ష అమలుపై స్టే విధించింది. అయితే, కోర్టు నిర్ణయం వెలువడే వరకూ ఆయన పార్లమెంటు కార్యకలాపాల్లో పాల్గొనకూడదని షరతు విధించింది.
ఈ కేసు విచారణ వచ్చే నెలలో జరిగే అవకాశం ఉంది. కోర్టులో ఉపశమనం లభిస్తేనే ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, ANI
జైల్లో ఉండి ప్రమాణం చేయొచ్చా?
రాజ్యాంగం ప్రకారం, ఒక ఎంపీ 60 రోజుల పాటు పార్లమెంటుకు హాజరుకాకపోతే, ఆ స్థానం ఖాళీ అయినట్లుగా పరిగణిస్తారు. దీని ఆధారంగానే, గతంలో జైల్లో ఉన్న ఎంపీ ప్రమాణ స్వీకారానికి కోర్టు అనుమతించింది.
నిరుడు మార్చిలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ తీహార్ జైల్లో ఉన్నారు. ఆయన రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వీలుగా ప్రత్యేక బెయిల్ లభించింది.
గత లోక్ సభలో యూపీలోని ఘోసి నుంచి ఎన్నికైన బీఎస్పీ ఎంపీ అతుల్ కుమార్ సింగ్ అత్యాచార ఆరోపణలతో జైలుకి వెళ్లారు. 2020 జనవరిలో కోర్టు ప్రత్యేక బెయిల్ మంజూరు చేయడంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయగలిగారు.
ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచే ఎంపీలకు జీతాలు, ఇతర సౌకర్యాలు అందినా, ప్రమాణ స్వీకారం చేసేవరకు పార్లమెంట్ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు అవకాశం లేదు.
ఇవి కూడా చదవండి:
- బొడ్డులో దూదిలాంటి వ్యర్థాలు ఎలా చేరతాయి, అక్కడ ఇంకా బతికే జీవులు ఏంటి, వాటితో ప్రమాదమెంత?
- ఇల్లు కిరాయికి ఇస్తే నట్టింట్లో 3 అడుగుల మట్టిపోసి గంజాయి సాగు చేశారు
- పదేళ్ల పాత బియ్యం తినొచ్చా? బియ్యం ఎంతకాలం పాడవకుండా ఉంటుంది
- క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ: ‘నేను గర్భవతినని బిడ్డను కనడానికి నెల రోజుల ముందు వరకు నాకు తెలియలేదు’
- టీ20 వరల్డ్‌కప్: సూపర్-8 రౌండ్ పోటీలు ఎలా నిర్ణయించారు? సెమీస్, ఫైనల్లో వర్షం పడితే విజేతను ఎలా నిర్ణయిస్తారు?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














