ఈ పామును చంపితే రూ. 35 వేలు బహుమతి ఇస్తామని ఆ రాజకీయ నాయకుడు ఎందుకు ప్రకటించారు?

ఫొటో సోర్స్, Getty Images
గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్‌లో ‘రసెల్స్ వైపర్’(రక్తపింజరి) పాముల చుట్టూ చర్చ జరుగుతోంది. ఆ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రస్సెల్స్ వైపర్‌గా భావించి ఇతర జాతుల పాములనూ చంపేస్తున్నారు.
బంగ్లాదేశ్‌లో కనిపించే పాముల్లో 85 శాతానికి పైగా విషపూరితమైనవని అక్కడి అటవీ అధికారులు చెబుతున్నారు.
రస్సెల్స్ వైపర్ కూడా విషపూరిత పాముల జాబితాలో ఉంది. అయితే, బంగ్లాదేశ్ ప్రజలు భయంతో చంపేస్తున్న పాములలో ఏమాత్రం విషపూరితం కానివీ ఉంటున్నాయి.
నిజానికి జీవ వైవిధ్యంలో పాములు ముఖ్యమైన భాగమని జీవ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇతర జీవుల మాదిరిగానే, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో పాములు చాలా కీలకం.
అలాంటప్పుడు ఆలోచన లేకుండా ఇలా పాములను చంపడమనేది పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ప్రశ్న తలెత్తుతోంది.

గత కొన్నివారాలుగా మీడియాలో ఎక్కువగా చర్చిస్తున్న సమస్యలలో ‘రస్సెల్స్ వైపర్’ పాము ఒకటి. ఈ జాతి పామును బంగ్లాదేశ్‌లో చంద్రబోరా లేదా ఉలూబోరా అని పిలుస్తారు.
ఈ పాము ఒకప్పుడు బంగ్లాదేశ్‌లో అంతరించిపోయినట్లుగా భావించారు. కానీ పది పన్నెండేళ్ల కిందట ఈ రకం పాము కాటు వేయడంతో కొందరు మరణించారు. 2013 నుంచి బంగ్లాదేశ్‌లో ఈ పాములు మళ్లీ ఎక్కువయ్యాయని పరిశోధకులు చెబుతున్నారు.
2021లో బంగ్లాదేశ్‌లోని వాయువ్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా పద్మ నది వెంబడి ఉన్న కొన్ని జిల్లాల్లో రస్సెల్స్ వైపర్ గురించి చర్చ జరిగింది.
ఆ ఏరియాలో రస్సెల్స్ వైపర్ కాటు కారణంగా ఇద్దరు మరణించారు. చాలామంది అస్వస్థతకు గురయ్యారు. అప్పట్లో ఈ ఘటన చాలా వార్తల్లో నిలిచింది.
మాణిక్‌గంజ్‌లో గత మూడు నెలల్లో పాము కాటు కారణంగా ఐదుగురు మరణించారని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. వారిలో ఎక్కువ మంది రైతులే.
ఇప్పుడు వరి కోతల సీజన్.. పంటలతో నిండిన పొలాల్లో పాముల బెడద సహజం.
"రస్సెల్స్ వైపర్‌లు పద్మ నది పరివాహక ప్రాంతం వెంబడి మాణిక్‌గంజ్ తీర ప్రాంతాలకు చేరుకున్నాయి" అని చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలోని జంతుశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఫరీద్ అహ్సన్ బీబీసీ బంగ్లాతో చెప్పారు.
మరోవైపు ఈ వారం రాజ్‌షాహిలో పాము కాటు కారణంగా అక్కడి వర్సిటీ విద్యార్థి సహా ఇద్దరు మరణించారు. అయితే, ఈ వరికోత సీజన్‌లో ‘రస్సెల్స్ వైపర్’ పాములు రావడం పద్మ నది తీరప్రాంత రైతులను భయాందోళనలకు గురి చేస్తోంది.
ఆదివారం రాజ్‌షాహిలోని చార్‌ఘాట్ ఉపజిల్లాలో శారదాలోని పద్మ నది ఒడ్డున ఉన్న పోలీస్ అకాడమీ ప్రాంగణంలో ఎనిమిది రస్సెల్ వైపర్ పాము పిల్లలను స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసు సిబ్బంది వాటిని కొట్టి చంపారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఫొటో సోర్స్, ALAMY
ఏటా 7,500 మంది పాముకాటు మృతులు
రస్సెల్స్ వైపర్ పాములను చంపితే.. ఒక్కొక్కదానికి దాదాపు 50 వేల టాకాలు(సుమారు రూ. 35,500) బహుమతిగా ఇస్తామని ఫరీద్‌పుర్‌కు చెందిన ఓ రాజకీయ నాయకుడు ప్రకటించారు.
అయితే ఆ తరువాత ఆయన తన ప్రకటనను ఉపసంహరించుకున్నారు.
రస్సెల్స్ వైపర్ పాములనే అనుమానంతో శంఖిని, కొండచిలువ, ఘర్గిన్ని, దరాజ్, ధోండా వంటి వివిధ రకాల పాములను చంపేస్తున్నారని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇవన్నీ ప్రకృతి సమతుల్యతను కాపాడతాయి. కానీ ఈ ఉపయోగకరమైన పాములను చంపేస్తున్నారు.
రస్సెల్స్ వైపర్ పాములపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివ్ ప్రచారం జరగడంతో ప్రజలు భయాందోళనకు గురై ప్రకృతి నేస్తాలుగా భావించే వివిధ రకాల విషం లేని పాములను, సరీసృపాలను చంపేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.
చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ మొహమ్మద్ అమీర్ హుస్సేన్ చౌదరి బీబీసీతో మాట్లాడుతూ "రస్సెల్స్ వైపర్ దూకుడు స్వభావమున్న పాము కాదు. అది గాయపడినప్పుడే తిరిగి దాడి చేస్తుంది. పామును చంపాల్సిన అవసరం లేదు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రజలను ఆ విధంగా సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నాం" అని అన్నారు.
బంగ్లాదేశ్‌లో ఏటా పాము కాటుకు గురై సుమారు ఏడున్నర వేల మంది మరణిస్తున్నారని మెడికల్ సర్వీస్ డేటాను ఉటంకిస్తూ అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
వీరిలో 120 మంది ‘రస్సెల్స్ వైపర్’ కాటు కారణంగా మరణిస్తున్నారు.
హుస్సేన్ మాట్లాడుతూ.. ‘’పొలాల్లో పాముల బెడద ఎక్కువగా ఉందని, పాములను చంపకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, స్వచ్ఛంద సేవకులు కృషి చేస్తున్నారని, ప్రజల్లో అవగాహన పెరిగితే సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం తగ్గుతుంది" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పాములు పర్యావరణానికి ఎలా మేలు చేస్తాయి?
జీవవైవిధ్యాన్ని కాపాడటంలో పాముల పాత్ర కీలకమని నిపుణులు చెబుతున్నారు.
'స్నేక్స్ అండ్ స్నేక్ బైట్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్‌మెంట్ ఇన్ బంగ్లాదేశ్' అనే పుస్తకం ప్రకారం.. పాములకు మనుషులంటే భయం. వారిని చూడగానే ప్రాణాలను కాపాడుకోవడానికి పాములు పారిపోవాలనుకుంటాయి. కానీ తమపై దాడి జరిగితే ఆత్మరక్షణ కోసం కాటు వేస్తాయి.
మొహహ్మద్ అబూ సయీద్, మొహమ్మద్ ఫరీద్ అహ్సన్ సంయుక్తంగా ఈ పుస్తకాన్ని రచించారు.
ఈ పుస్తక రచయిత, చిట్టగాంగ్ యూనివర్శిటీ జంతుశాస్త్ర విభాగం ప్రొఫెసర్ మహ్మద్ ఫరీద్ అహ్సన్ బీబీసీ బంగ్లాతో మాట్లాడుతూ.. "ఈ చక్రంలో పాము వేటగాడు, ఎర కావచ్చు. దీనికి కారణం పాము పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం. ఇతర జీవులను తినడం ద్వారా, అదే విధంగా ఇతర జీవులకు ఆహారంగా మారడం ద్వారా పర్యావరణ సమతుల్యతలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది" అని అన్నారు.
"రస్సెల్స్ వైపర్ పాముల సంఖ్య పెరగడానికి కారణం పర్యావరణ వ్యవస్థలో మార్పు రావడం. వాటిని తినే జీవుల సంఖ్య తగ్గింది. అందుకే ఈ జాతికి చెందిన పాములు సంఖ్య పెరుగుతోంది" అని అహ్సన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- యజమాని నుంచి తప్పిపోయి అయిదేళ్లుగా అడవి జింకలతో తిరుగుతున్న గాడిద
- బ్రెయిన్: చనిపోతున్నప్పుడు మనిషి మెదడులో ఏం జరుగుతుంది? ఆ చివరి క్షణాల గురించి న్యూరో సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
- చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న స్కిల్ సెన్సస్ ఏంటి? ఇందులో ఏం చేస్తారు?
- రేవణ్ణ: కర్ణాటక రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం 60 రోజుల్లో ఎలా పతనావస్థకు చేరిందంటే...
- మగ తోడు లేకుండానే 14 పిల్లలను కన్న పాము
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














