బర్డ్ ఫ్లూ‌: ఈ భయం మళ్లీ ఎందుకు మొదలైంది, మనుషులకు ఇది ఎంత ప్రమాదం?

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, హెలెన్ బ్రిగ్స్ , విక్టోరియా గిల్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

అమెరికాలోని పశువుల మందలలో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోంది. ఇది శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ వైరస్ మానవుల్లో వ్యాప్తికి కారణమవుతుందనేందుకు ప్రస్తుతానికైతే ఆధారాలు లేవు. అయితే, అక్కడి అధికార యంత్రాంగం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది.

ఇంతకీ హెచ్5ఎన్1 వైరస్ గురించి మనకు ఏం తెలుసు, మనం దీని గురించి ఆందోళన చెందాలా?

బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి?

బర్డ్ ఫ్లూ అనేది వైరస్ వల్ల కలిగే వ్యాధి. ఇది పక్షులు, కొన్నిసార్లు నక్కలు, సీల్స్, ఓటర్స్ వంటి ఇతర జంతువులకు సోకుతుంది.

H5N1 అని పిలిచే ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా అడవి పక్షులలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇది 1990ల చివరలో చైనాలో వెలుగులోకి వచ్చింది.

పక్షుల వలస వైరస్ వ్యాప్తికి దారితీసింది. చాలా అరుదైన సందర్భాల్లో ఈ వైరస్ మనుషులకు సోకింది.

ప్రస్తుతం మనుషులకు బర్డ్ ఫ్లూ వచ్చే ప్రమాదం తక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పక్షుల నుంచి మానవులకు సంక్రమించడం చాలా అరుదు. మరోవైపు మనిషి నుంచి మనిషికి ఎక్కువగా వ్యాప్తి చెందింది కూడా లేదు.

ఇది మానవులలో మహమ్మారిని ప్రేరేపిస్తుందో లేదో అంచనా వేసే అవశామైతే ప్రస్తుతానికి లేదు. కానీ నిపుణులు దాని వ్యాప్తిని పర్యవేక్షిస్తున్నారు. అది ఎలా రూపు మార్చుకుంటుందో, ఎలా అభివృద్ధి చెందుతున్నదో తదితర విషయాలను అధ్యయనం చేస్తున్నారు.

అమెరికాలోని పాడి ఆవు మందలలో హెచ్5ఎన్1 ఇప్పుడు వేగంగా వ్యాపిస్తోంది. దీనిని అమెరికా సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అయిన సీడీసీ ‘మల్టీ స్టేట్ ఔట్ బ్రేక్‌’గా అభివర్ణించింది.

పశువుల్లోకి వైరస్ చేరడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆవులు ఆ వైరస్ బారిన పడవని వాళ్లు అనుకున్నారు.

కాగా, ఈసారి వైరస్‌ మరొక అసాధారణ పరిణామంతో వస్తోంది. జూన్ ప్రారంభంలో మెక్సికోలో 59 ఏళ్ల వ్యక్తి మరొక రకమైన బర్డ్ ఫ్లూ(హెచ్5ఎన్2) తో మరణించారు. ఈ వైరస్ మునుపెన్నడూ ప్రజలలో నమోదు కాలేదు.

మెక్సికోలోని కొన్ని పౌల్ట్రీ ఫామ్‌లలో ఈ కేసులు ఉన్నప్పటికీ, ఆయనకు అదెలా సోకిందో అస్పష్టంగా ఉంది.

వాట్సాప్
బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, Getty Images

'వైరస్ వ్యాప్తి చెందుతోంది'

డబ్ల్యూహెచ్‌వో, సీడీసీ వంటి ఆరోగ్య సంస్థలు బర్డ్ ఫ్లూ నుంచి ప్రజలకు తలెత్తే ప్రమాదాన్ని ఊహించ లేదు. అయితే వైరస్ వ్యాప్తిని నిశితంగా పరిశీలించాలని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఈ కేసు ఒక హెచ్చరిక వంటిదని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలోని పాండమిక్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సర్ పీటర్ హోర్బీ అన్నారు.

హెచ్5ఎన్1 గత కొన్ని సంవత్సరాలుగా శాస్త్రవేత్తల దృష్టిలో ఉంది. ఇది అన్ని ఖండాలలో వ్యాపించింది. పౌల్ట్రీ, అడవి పక్షులలో వేలసంఖ్యలో వ్యాప్తి చెందింది. బొచ్చు కోసం పెంచుకొనే మింక్ వంటి జంతువులలోనూ వ్యాప్తి చెందింది.

2023 చివరలో పెరూలో 5,000 కంటే ఎక్కువ సీ లయన్స్ (ఒక రకమైన నీటి జంతువులు) ఈ వైరస్‌తో చనిపోయాయి. వైరస్ సోకిన అడవి పక్షులతో ప్రత్యక్ష సంబంధం కారణంగా వీటికి ఈ పరిస్థితి తలెత్తిందని శాస్త్రవేత్తలు చెప్పారు.

నక్కలు, ఎలుగుబంట్లు, రకూన్లు, పిల్లులు, కుక్కలు, మేకలు తదితర వాటిలో కూడా ఈ వైరస్ కనుగొన్నారు.

"ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది, కాబట్టి మేం దానిని నిశితంగా పరిశీలిస్తున్నాం, ఆందోళన పడుతున్నాం." అని ఎంఆర్సీ యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్గో సెంటర్ ఫర్ వైరస్ రీసెర్చ్ సీనియర్ లెక్చరర్ డాక్టర్ ఎడ్ హచిన్సన్ చెప్పారు.

ఫ్లూ వైరస్‌ కాలక్రమేణా మార్పులు చెందుతూ ఉంటుంది.

పౌల్ట్రీ, అడవి పక్షులు కాకుండా, H5N1 వైరస్ ఎక్కడైనా శాశ్వతంగా స్థిరపడగలదా అని శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు.

ఆవులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఆవులకు H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు గుర్తించారు.

ఆవులలోకి..

పశువులలో వైరస్‌ను కనుగొనడం నిజంగా షాక్‌కు గురిచేసిందని డాక్టర్ హచిన్సన్ చెప్పారు.

"పెద్ద సంఖ్యలో పెంచుతున్న జంతువులో వైరస్ కనిపించింది. ఆ జంతువు మానవులతో సన్నిహితంగా ఉండటమే దీని గురించి ఆందోళన చెందడానికి, దృష్టి పెట్టడానికి కారణం." అని ఆయన తెలిపారు.

వైరస్ ‘కృత్రిమ’ మార్గంలో వ్యాప్తి చెందిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆవులు సహజ సంపర్కం ద్వారా లేదా గాలిలో కణాల ద్వారా వైరస్‌ను ఒకదానికొకటి పంపుకోవడం లేదనేది వారి అభిప్రాయం.

వైరస్ వ్యాప్తి మిల్కింగ్ పార్లర్‌లలో జరుగుతోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

"ఇది పాలు పితికే యంత్రాలలోని కాలుష్యం ద్వారా వచ్చినట్లు కనిపిస్తోంది" అని పిర్‌బ్రైట్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ థామస్ పీకాక్ వివరించారు.

అంటే, ప్రస్తుతానికి ఈ వైరస్‌కు జంతువు నుంచి జంతువుకు సహజంగా వ్యాపించే సామర్థ్యం లేదు. పాడి పశువుల ద్వారా ఎక్కువ కాలం వ్యాపిస్తే, అది అభివృద్ధి చెందడానికి కావాల్సిన సామర్థ్యాన్ని పొందే అవకాశం అంత ఎక్కువ ఉంటుందని డాక్టర్ పీకాక్ అభిప్రాయపడ్డారు.

పాశ్చురైజేషన్ వైరస్‌ను నాశనం చేస్తుంది. అయితే దాదాపు 5 శాతం మంది అమెరికన్లు పచ్చి, పాశ్చురైజ్ చేయని పాలను తీసుకుంటారని అంచనా.

కెనడా సరిహద్దులో, శాస్త్రవేత్తలు ఈ పాలను పరీక్షించడం ప్రారంభించారు.

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బర్డ్ ఫ్లూలో ఇటీవలి పెరుగుదల ముఖ్యంగా గానెట్ వంటి రక్షిత సముద్ర పక్షుల జాతులకు హానికరం.

బర్డ్ ఫ్లూ మనుషులకు వ్యాపిస్తుందా?

కంబోడియా, చిలీ, చైనా, వియత్నాం, ఆస్ట్రేలియా, అమెరికా, యూకేతో సహా అనేక దేశాల్లో జబ్బుపడిన జంతువులతో దగ్గరగా ఉండటం వల్ల మనుషులకు హెచ్5ఎన్1 వైరస్ సోకింది. 1997 నుంచి మనుషుల్లో కొన్ని వందల కేసులు నమోదయ్యాయి. వారిలో సగం మంది మరణించారు.

ఇటీవల, అమెరికా డెయిరీ వర్కర్లలో కొన్ని కేసులు నమోదయ్యాయి. వీరిలో తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. అమెరికాలో అనేక రాష్ట్రాలు, వ్యవసాయ కార్మికులకు ఈ వైరస్ నుంచి రక్షణ కలిగించే దుస్తులు, కళ్లద్దాల వంటివి అందిస్తూ నివారణ చర్యలు తీసుకుంటున్నాయి.

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బర్డ్ ఫ్లూ గ్రీస్‌లో పెలికాన్‌ పక్షుల సంఖ్యను తీవ్రంగా తగ్గించింది.

కాగా, వైరస్‌పై అధ్యయనం చేస్తున్న నిపుణులు, ఇది మానవులకు పెద్ద ముప్పు కలిగించే రూపంలోకి మారినట్లు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు.

కానీ, ఇద్దరు ప్రముఖ ఫ్లూ నిపుణులు బ్రిటీష్ మెడికల్ జర్నల్‌తో ప్రధాన H5 N1 వ్యాప్తి ప్రమాదం ఎక్కువగా ఉందని, సమయం దగ్గరపడిందని, త్వరలో అది జరగవచ్చని హెచ్చరించారు.

మరోవైపు, ఇది యుఎస్ అంతటా వ్యాపిస్తే, వైరస్ మనుషుల్లోకి వచ్చే అవకాశం ఎక్కువ అని వైరాలజిస్ట్ టామ్ పీకాక్ చెప్పారు. ముఖ్యంగా అది బాతుల వంటి నీటిలోని జంతువులకు సోకే అవకాశం ఎక్కువని అన్నారు.

"అదే మా భయం." అని పీకాక్ బీబీసీకి చెప్పారు.

ఎందుకంటే ఆ పక్షులకు సోకడానికి చాలా అవకాశం ఉందని, దానిని అవి చాలా దూరాలకు తీసుకెళ్లొచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

ఒట్టర్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బర్డ్ ఫ్లూ సోకిన క్షీరదాలలో ఒట్టర్స్ కూడా ఉన్నాయి

బర్డ్ ఫ్లూ విషయంలో మనం ఏం చేయవచ్చు?

కొన్ని దేశాలు వ్యాక్సీన్‌లను ఉపయోగించడాన్ని పరిశీలిస్తున్నాయి లేదా వ్యాక్సీన్‌లను పొందే ప్రయత్నంలో ఉన్నాయి.

వ్యాక్సీన్‌ పరిమిత మోతాదు కారణంగా పౌల్ట్రీ రైతులు, పశువైద్యులు, వైరస్ పరిశోధకులు, జంతువుల జుత్తును సేకరించే ఫారాల్లో పనిచేసే కార్మికులకు మాత్రమే పంపిణీ కానుంది.

కొత్త బర్డ్ ఫ్లూ (ఏవియన్ ప్లూ) వ్యాక్సీన్‌లను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నామని యూకే రాయల్ వెటర్నరీ కాలేజీకి చెందిన జీవ శాస్త్రవేత్త డాక్టర్ జయనా రాఘవాని చెప్పారు.

రోగనిరోధక ప్రతిస్పందనను పెంచడానికి, రక్షణగా ఉండటానికి ఇప్పటికే ఉన్న ఫ్లూ వ్యాక్సీన్‌లు ఎలా పనిచేస్తాయో తెలుసుకున్నామని ఆమె తెలిపారు.

"నేను ఆవులలో ఫ్లూ గురించి ఆందోళన చెందాల్సిందేనంటాను. కానీ, వాటి ద్వారా మనుషులకు సోకుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మా అమ్మకు, బామ్మకు మాత్రం చెప్పగలను.’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)