బీరు టబ్బులో స్నానం చేస్తే ఆరోగ్యం బాగుపడుతుందా? ఈ ట్రెండ్ ఎందుకు విస్తరిస్తోంది...

ఫొటో సోర్స్, WeWantMore/Bath&Barley
- రచయిత, నార్మన్ మిల్లర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆరోగ్యకరమైన జీవనశైలి అనే మాట ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా బాగా వినిపిస్తోంది. ఇందులో బీర్ స్పా వంటి ప్రత్యేక ట్రెండ్‌లు కూడా ఉన్నాయి.
అయితే, ఆరోగ్యం పేరుతో లైఫ్‌స్టైల్‌కు మద్యాన్ని మిళితం చేసే బీర్ స్పాలు నిజంగా ఆరోగ్య ప్రయోజనాలిస్తాయా? దాని చరిత్ర ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా దీని గురించి ఏమనుకుంటున్నారు?
చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఒక పాత సంప్రదాయం నుంచి ప్రేరణ పొంది ఐస్‌లాండ్, స్పెయిన్, అమెరికాలలో బీర్ స్పాలు ఇటీవలే మొదలుపెట్టారు.
నేను వెయ్యి లీటర్లు నీరుపట్టే ఓక్ చెక్క టబ్‌లోకి దిగడానికి సిద్ధమవుతున్నప్పుడు, 16వ శతాబ్దానికి చెందిన డానిష్ ఖగోళ శాస్త్రవేత్త టైకో బ్రే స్టెయిన్డ్ గాజు ఫోటో నా వైపు చూస్తోంది.
నికోలా స్కైపలోవా అనే మహిళ నాకు ఈ స్నానంలో సాయం చేస్తున్నారు. నీటిలో వేయడానికి ముఖ్యమైన పదార్థాలతో నిండిన వస్తువు (కట్టెతో తయారైనది)ను పట్టుకున్నారు.
ఆమె దానిని టబ్‌లోకి ఒంపుతూ ‘‘ఇది హాప్స్. మీ శరీరానికి ఒత్తిడిని తగ్గిస్తుంది, మీ స్వేద రంధ్రాలను ఓపెన్ చేస్తుంది. ఇది బ్రూవర్స్ ఈస్. దీనిలో బీ విటమిన్ అధికంగా ఉంటుంది. మిమ్మల్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది’’ అని చెప్పారు.
మరొక ఆరోగ్యకరమైన పదార్ధం అంటూ మాల్ట్‌ను కూడా దానిలో కలిపారు.


ఫొటో సోర్స్, Norman Miller
చెక్ రిపబ్లిక్.. వెల్‌నెస్ ట్రెండ్
నేను చెక్ రిపబ్లిక్‌లోని ఫేమస్ బీర్ స్పాలలో ఒకటైన ‘చాటేయు స్పా బీర్‌ల్యాండ్’లో ఉన్నాను. 1980లలో ఇలాంటి ప్రత్యేకమైన ఆధునిక వెల్‌నెస్ ట్రెండ్‌కు జన్మనిచ్చిన దేశమది.
ఇది చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్‌లోని యు జ్లాటే హ్రూస్కీ అనే పేరుతో పిలిచే షాండిలియర్డ్ నేషనల్ హెరిటేజ్ భవనంలో ఉంది. 1599లో ఇక్కడే టైకో బ్రే నివసించారు, పని కూడా చేశారు. ఈ బీర్ స్పాలలో ఇపుడు ఖగోళ కుడ్యచిత్రాలతో పాటు ఆకర్షించే గాజు కిటికీలు ఆకర్షణగా కనిపిస్తున్నాయి.
టబ్ పక్కన గడ్డితో నిండిన భారీ బెడ్ ఉంది. ఇది హాట్ టబ్‌లో మీకు సంప్రదాయ చెక్ అనుభవాన్ని అందిస్తుంది. స్నానం చేసిన తర్వాత, మంచం పైనున్న ఈ గడ్డి గరుకుదనంతో చర్మం మరింత ఉత్తేజితమవుతుంది.
నా బీర్ స్నానం కోసం నికోలా పెద్ద మొత్లంలో బీరును టబ్‌లో పోశారు. ఇది ఒట్టి బీర్ కాదు, ఫిల్టర్ చేయని ప్రీమియం చెక్ బీర్. దీనిలో ఈస్ట్‌తో పాటు విటమిన్లూ ఉంటాయి. ప్రపంచంలో బీర్‌ను అతిగా ఇష్టపడే దేశాల్లో రెండోదైన ఆస్ట్రియా కంటే చెక్ రిపబ్లిక్ రెండు రెట్లు అధికంగా బీరును వినియోగిస్తుంది.
కానీ, అంత నాణ్యతమైన బీర్‌ను అలా స్నానం కోసం పారబోయడం వృథా అని మీరు అనుకోవచ్చు.
నేను టబ్‌లోకి ప్రవేశించి, బటన్‌ను నొక్కాను. నా చుట్టూ ఉన్న గాలికి బీరు వాసన వచ్చింది. టేస్టీగా ఉండే డార్క్ క్రూసోవిస్ (1581లో తయారైన చెక్ బీర్ బ్రూవరీ) బీర్‌ను గ్లాసులో పోసుకున్నాను. బీర్ బ్రెడ్ ముక్కను తీసుకున్నాను. బీర్‌లో స్నానం చేయడమనే ప్రత్యేకమైన అనుభవం గురించి ఆలోచిస్తూ రిలాక్స్ అయ్యాను.
బీర్ బాత్ మద్దతుదారులు ఈ బాత్‌లో వాడే పదార్థాలు చర్మానికి మంచివని, కండరాల ఒత్తిడిని తగ్గించగలవని, రక్త ప్రసరణకు సహాయపడతాయని నమ్ముతారు. హాప్ బీర్ వాసనలు మిమ్మల్ని మరింత రిలాక్స్ చేసి, మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయని చెబుతారు.

ఫొటో సోర్స్, WeWantMore/Bath&Barley
పెరుగుతున్న బ్రాంచ్‌లు
వెల్‌నెస్‌లో ఈ కొత్త ట్రెండ్ జనాదరణ పొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా బీర్ స్పాలు తెరుస్తున్నారు. ఇటీవల ఐస్‌లాండ్, స్పెయిన్‌లో బీర్ స్పాలు ప్రారంభించారు.
డెన్వర్‌లో 2021లో ‘ఓక్వెల్ బీర్ స్పా’ ప్రారంభమైన తర్వాత, 2023 చివరి నాటికి అమెరికాలోని బాల్టిమోర్‌లో బీర్‌బాత్ ప్రారంభించారు. యూకే మొదటి బీర్ స్పా.. 2024లో తూర్పు ఇంగ్లాండ్‌లోని ‘ది నార్ఫోక్ మీడ్’లో తెరిచారు.
యూరోపియన్ ప్లాట్‌ఫారమ్‌తో స్పా రిలాక్సేషన్, బీర్ అనే రెండు ఆనందాలను ఒకచోట చేర్చే అవకాశాన్ని అందించడం వల్ల బీర్ స్పా కాన్సెప్ట్ అంతర్జాతీయంగా ప్రజాదరణ పొందుతోంది.
ప్రపంచవ్యాప్తంగా బీర్ స్పాలు ఎందుకు గుర్తింపు పొందాయనే విషయంపై ‘ది నార్ఫోక్ మెయిడ్’లో మేనేజర్ అయిన ఎలిజా ఓక్‌డన్ స్పందిస్తూ...."మహిళలు స్పాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. కాబట్టి ఈ రకమైన స్పాలు పురుషులు, జంటలను ఆకట్టుకుంటున్నాయని మేం భావిస్తున్నాం" అని చెప్పారు.
బాత్ అండ్ బార్లీని 2023లో బ్రూగెస్‌లో ప్రారంభించారు. ఇది బెల్జియంలోని మొట్టమొదటి బీర్ స్పా. ఇక్కడ బీర్ ప్రియులు తమకు నచ్చిన బీర్ రకాన్ని పొందవచ్చు.
‘’ఔత్సాహికులు స్నానం కోసం రైతులు పండించిన హాప్ నుంచి మీకు కావాల్సిన ‘బాత్ బ్రూ’ ఎంచుకోవచ్చు. ప్రయోజనాల్లో ఎలాంటి తేడాలూ ఉండవు" అని కంపెనీ సహ వ్యవస్థాపకులు లూయిస్ రేసౌవ్ వివరించారు.
"మా సౌకర్యాలు కొన్ని చెక్ రిపబ్లిక్ స్పాల కంటే మరింత విలాసవంతమైన అనుభవాన్ని కల్పిస్తామని మేం నమ్ముతాం" అని లూయీస్ అంటున్నారు. ఇందులో బెల్జియన్ బీర్‌లతో రుచికరమైన ఫుడ్ కూడా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఫ్రాన్స్‌లో తాకా బీర్ స్పా..
స్ట్రాస్‌బర్గ్‌లోని ‘తాకా బీర్ స్పా’ 2022లో ప్రారంభమైంది, అప్పటి నుంచి ఫ్రాన్స్‌లో బీర్ స్పా జనాలకు చేరువైంది.
"ఈ ఆలోచన స్థానిక ప్రజలలో చాలా ఆసక్తిని కలిగించింది, చాలామంది స్పాని ప్రయత్నించడానికి వస్తున్నారు" అని స్పా వ్యవస్థాపకులు నవోమీ క్రాషా అన్నారు.
ప్రజలు బీర్ సంస్కృతిలో కొత్తదనాన్ని స్వాగతించడం ఆనందంగా ఉందని నవోమీ అన్నారు.

ఫొటో సోర్స్, Norman Miller
ఇది ఆరోగ్యకరమా లేదా అర్ధంలేనిదా?
దాదాపు ప్రతి స్పా ‘‘బీర్ స్నానం వేల సంవత్సరాల నాటిది.’’ అని చెబుతుంటుంది. అయితే బీర్ ఉనికితో స్పాల చారిత్రక ఉనికిని మిళితం చేసినట్లు కనిపిస్తోంది. పురాతన కాలంలో ఈ రెండింటిని విశ్రాంతి కోసం కలిపినట్లు పెద్దగా ఆధారాలు లేవు. కింగ్ వెన్సెస్లాస్ క్రమం తప్పకుండా బీరుతో స్నానం చేసేవారని స్పాలు చెబుతుంటాయి. దీనికి కూడా బలమైన ఆధారాలు లేవు.
"ఇది ఖచ్చితంగా నిజం కాదు. ఇది బీర్ స్పాలను నడపడానికి కంపెనీల మార్కెటింగ్ వ్యూహం. బీర్ స్పాల వంటి వ్యాపారాలు ఒక ఆధునిక ఆవిష్కరణ. మధ్య యుగాలలో బీర్‌ను బహుశా అనేక ఇతర వస్తువుల మాదిరే స్నానాలలో ఉపయోగించారు. కానీ ఖచ్చితంగా లోతైన కారణమైతే లేదు." అని లిబర్ జాజిక్ చెప్పారు.
లిబర్ బ్రనోలోని మసరిక్ విశ్వవిద్యాలయంలో యూరోపియన్ బ్రూయింగ్ హిస్టరీలో నిపుణులు. అయితే, 14వ శతాబ్దంలో రాయల్ వెన్సెస్లాస్‌లో ఒకరు చెక్ బీర్ తయారీదారుల కోసం పనిచేశారని లిబర్ చెప్పారు.

ఫొటో సోర్స్, BierBath
చర్మానికి మేలు చేసే పదార్థాలు
"బీర్‌లో చర్మానికి మేలు చేసే మూడు పదార్థాలు ఉన్నాయి. అవి నానబెట్టిన ధాన్యాలు, ఈస్ట్, హాప్‌లు (బీర్‌లో ఉపయోగించే పువ్వులు). నానబెట్టిన ధాన్యాలు, ఈస్ట్ రెండింటిలో విటమిన్ బీ ఉంటుంది. ఇది చర్మం నీటి స్థాయిని, స్థితిస్థాపకతను పెంచుతుంది. హైపర్ పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది." అని కొలరాడో అరోమాటిక్స్‌లో బయోకెమిస్ట్ అయిన డాక్టర్ సిండి జోన్స్ చెప్పారు.
హాప్స్‌లో శాంతోహూమోల్, హ్యూములోన్‌లు ఉంటాయి. శాంతోహూమోల్ అనేది ఒక బలమైన యాంటీఆక్సిడెంట్. ఇది క్యాన్సర్ నిరోధక, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాలను చూపుతుంది.
హ్యూములోన్ అనేది చర్మ సంబంధిత వైద్యానికి వాడే యాంటీ బాక్టీరియల్ సమ్మేళనం. హాప్ ఎక్స్‌ట్రాక్ట్‌లు ఆందోళన, తేలికపాటి డిప్రెషన్, ఒత్తిడిని తగ్గించవచ్చని కూడా పలు అధ్యయనాలు కనుగొన్నాయి. నిద్ర కోసం సంప్రదాయ వైద్యంలో హాప్‌లను ఉపయోగించేవారనడానికి శాస్త్రీయ ఆధారాలున్నాయి.
‘ఇటీవల, చర్మ ఆరోగ్యం కోసం సైంటిఫిక్ వరల్డ్ హాప్స్’పై ఎక్కువ శ్రద్ధ పెడుతోంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, చర్మంలో మంటను తగ్గిస్తుంది, చర్మం ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది" అని సిండి జోన్స్ అన్నారు.
బిజినెస్ విస్తరణ
ప్రపంచంలోనే అతిపెద్ద బ్రూవర్ కంపెనీ కార్ల్స్‌బర్గ్. బీర్ కాస్మెటిక్ ట్రెండ్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని 2015లో బీర్ బ్యూటీ లైన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. లాంచ్ సమయంలో ప్రమోట్ చేయడానికి అది ఒక ఫన్నీ వీడియోను కూడా విడుదల చేసింది.
చెక్ రిపబ్లిక్‌కు చెందిన మనుఫక్తురా అనే సౌందర్య సాధనాల సంస్థ, దాని ఉత్పత్తులను విక్రయించడానికి దేశవ్యాప్తంగా తన స్టోర్‌లను విస్తరించింది. వీటిలో హాప్స్, బార్లీ ఎక్స్‌ట్రాక్ట్స్ వంటి బాత్ సాల్ట్స్ కూడా ఉన్నాయి.
అయితే, మీరు ఇంట్లో స్నానం చేయడానికి ఈ పదార్థాలను ఉపయోగించినట్లయితే, మీకు అపరిమిత ప్రీమియం బీర్, రుచికరమైన బీర్ బ్రెడ్ లేదా గడ్డి మంచంపై విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండదు. వీటిని ఆఫర్ చేస్తున్న బీర్ స్పాలు ఈ సౌకర్యాలను ఒక స్పెషాలిటీగా మార్చాయి.
ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్: ‘డిప్యూటీ సీఎం’ అని ఎందుకు ప్రమాణం చేయలేదు, ఈ పదవి గురించి రాజ్యాంగంలో ఏముంది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














