Giving up Alcohol: నేటి యువత మద్యం తాగడం తగ్గించేస్తున్నారా? కారణాలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మేగన్ కార్నెగీ
- హోదా, బీబీసీ వర్క్‌లైఫ్
టీనేజీ వయసులో ఉన్న లోలా మద్యం అలవాటులో సైకిల్స్ కనిపిస్తాయి. ఒక రోజు ఆమె విపరీతంగా తాగుతారు. ఆ తర్వాత రోజు ఆమె ముందు రోజు గురించి ఆలోచించి పశ్చాత్తాప పడుతుంటారు. విపరీతంగా మద్యంతాగే రోజుకు ముందు ఆమె ఇలానే ఆలోచిస్తుంటారు.
అయితే, కోవిడ్-19 వ్యాప్తి మొదలైనప్పుడు ఆమె లండన్‌లో తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేశారు. దీంతో ఒక్కసారి తన మద్యం తాగే అలవాటును ఆపేయాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌లో తన అలవాట్లను ఆమె మార్చుకోవాలని భావించారు. ఆందోళన సమస్యలను కూడా తగ్గించుకోవాలని అనుకున్నారు.
ఇప్పుడు 22ఏళ్ల ఆమెకు ఆల్కహాల్‌తో ఉన్న అనుబంధం పూర్తిగా మారిపోయింది. ఇప్పటికీ ఆమె మద్యం తాగుతారు. అయితే, అంత తరచుగా కాదు. ‘‘నేను డ్రింకింగ్‌కు వ్యతిరేకం కాదు. అయితే, విపరీతంగా తాగి, మరుసటి రోజు పశ్చాత్తాప పడటం నాకు నచ్చడం లేదు’’అని లోలా చెప్పారు. ‘‘నేను సురక్షితంగా ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నాను. మరీ అంత మత్తు లేకుండా ఇంటికి వెళ్లడమే నాకు చక్కగా అనిపిస్తుంది’’అని ఆమె వివరించారు.
ఇలా భావిస్తున్న వారు లోలా ఒక్కరే కాదు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత తన స్నేహితుల్లో చాలా మంది మద్యం తాగడం తగ్గించారని ఆమె చెప్పారు. అసలు తాగకపోయినా, స్నేహితులు తమవైపు కొత్తగా చూడటంలేదని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘కొందరు స్నేహితులు ఇప్పటికీ విపరీతంగా తాగుతున్నారు. అయితే, నేను ఎక్కువగా తాగకపోయినా వారేమీ అనుకోవడం లేదు’’అని ఆమె చెప్పారు. ‘‘మన అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు. మానసిక ఆరోగ్యం లేదా వేరే ఏదైనా కారణాలతో మనం మద్యం తాగడానికి తగ్గించాలని అనుకుంటే వారు మద్దతుపలుకుతారు’’అని ఆమె చెప్పారు.
అతిగా తాగడం అనేది వయసుకు వచ్చారని చెప్పడానికి సూచనగా పశ్చిమ దేశాల సంస్కృతుల్లో భావిస్తారు. ఇక్కడ చాలా మంది చట్టబద్ధంగా తాగే వయసుకు రాకముందే, మద్యం సేవించడం మొదలుపెడతారు. ముఖ్యంగా రోజువారి ఒత్తిడిని దూరం చేసేందుకు, ఫ్రెండ్స్‌తో సరదాగా మద్యం తాగడం ప్రారంభిస్తారు. ఆల్కహాల్ లేకుండా పార్టీలు ఉండవని కూడా చెప్పుకోవచ్చు.
కాని కొత్త తరం వయసుకు వచ్చినప్పటికీ, ఆల్కహాల్‌ను ఇదివరకటి వారిలా విపరీతంగా తీసుకోవడం లేదు, లేదా పూర్తిగా మానేస్తున్నారు. 2019లో బ్రిటన్‌లో ఆల్కహాల్ తీసుకోవడంపై చేపట్టిన అధ్యయనంలో.. 16 నుంచి 25ఏళ్ల మధ్య వయసున్న(జనరేషన్ జడ్) వారిలో 26 శాతం మంది అసలు మద్యం తాగడంలేదని వెల్లడించారు. అంతకుముదు జనరేషన్ అంటే 55 నుంచి 74ఏళ్ల మధ్య వయసున్న వారిలో ఇది 15 శాతం మాత్రమే. ఇక అమెరికా విషయానికి వస్తే 35 నుంచి 54 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 70 శాతం మంది మద్యం తాగుతున్నారు. అయితే, 16 నుంచి25ఏళ్ల మధ్య వయసున్న వారిలో ఇది 60 శాతం మాత్రమేనని వెల్లడైంది. మరోవైపు కాలేజీకి వెళ్లే వయసున్న వారిలో మద్యం తాగనివారు ఒక దశాబ్దంలో 20 నుంచి 28 శాతానికి పెరిగారని మరో అధ్యయనం వెల్లడించింది. మరోవైపు యువ యూరోపియన్లలలో నెలలకు ఒకసారి మాత్రమే తాగేవారు 27 శాతం మంది ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు ఇలా?
ముఖ్యంగా అధిక ఆదాయం గల యూరప్ దేశాలతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లలో యువత మద్యం తాగడమనేది తగ్గడం స్పష్టంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో జనరేషన్ జడ్ ఆస్ట్రేలియన్లలో 44 శాతం మంది మద్యం తాగడం బాగా తగ్గించారు. మిగతా జనరేషన్లతో పోలిస్తే ఇక్కడ మద్యం తాగనివారి సంఖ్య రెట్టింపు ఉంది. మరోవైపు విపరీతంగా తాగే న్యూజీలాండ్ యువత సంఖ్య కూడా తగ్గిపోయింది.
అయితే, తాగడం తగ్గడానికి ఇది కారణం అని చెప్పడానికి అవకాశం లేకుండా ఉంది. నేడు జనరేషన్ జడ్ ప్రత్యేకమైన సామాజిక పరిస్థితుల మధ్య పెరుగుతున్నారు. వారికి ఆర్థిక, సామాజిక సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా మద్యం వారి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వారికి అవగాహన ఉంది. ‘‘గుడ్ నైట్ అవుట్’’లకే వారు ప్రాధాన్యం ఇస్తున్నారు. మద్యం లేకుండా కలిసి మాట్లాడేందుకు, బయటకు వెళ్లేందుకు వారు మొగ్గుచూపుతున్నారు.
అంతకుముందు జనరేషన్‌తో పోల్చినప్పుడు జనరేషన్ జడ్ మద్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. ముఖ్యంగా తమ స్నేహితులపై మద్యం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది, తమ ఆరోగ్యం ఎలా ప్రభావితం అవుతోంది? లాంటి అంశాలను వారు పరిగణలోకి తీసుకుంటున్నారు.
‘‘అయితే, మద్యం తాగడం తగ్గడానికి కారణం ఆల్కహాల్ నిబంధనలేనని అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ డ్రగ్స్, అసురక్షిత శృంగారం, ధూమపానం, నేరాలు లాంటి ముప్పులన్నీ తగ్గుతున్నాయి’’అని మెల్‌బర్న్‌లోని లా ట్రోబ్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆల్కహాల్ పాలసీ రిసెర్చ్ పరిశోధకురాలు అమీ పెన్నే చెప్పారు.
నేడు జరుగుతున్న పరిశోధనలు, అధ్యయనాలు, చర్చలు ఇలా అన్నీ వారిపై ప్రభావం చూపుతున్నాయని అమీ చెప్పారు. ‘‘ముఖ్యంగా మద్యంతో వచ్చే దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడం నేడు చాలా తేలిక. అయితే గూగుల్ సెర్చ్ లేదా సోషల్ మీడియా లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటం ద్వారా అన్ని విషయాలను తెలుసుకుంటున్నారు’’అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ముఖ్యంగా తమపై నియంత్రణ కోల్పోవడం లేదా మద్యానికి బానిస కావడం లాంటి ముప్పుల విషయంలో నేటి యువత చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. 2019లో గూగుల్ సెర్చ్ వివరాల ప్రకారం.. జనరేషన్ జడ్‌లో 41 శాతం మంది మద్యంతో వచ్చే ముప్పుల గురించి తెలుసుకుంటున్నారు.
మరోవైపు నేడు ప్రతి విషయమూ సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేయడంతో ఆల్కహాల్‌తో నియంత్రణ కోల్పోవడం లాంటి అనర్ధాలను స్నేహితులు, కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులకు తెలియకూడదని వారు భావిస్తున్నారు. గూగుల్ సెర్చ్ అధ్యయనంలో పాల్గొన్నవారిలో 49 శాతం మంది జనరేషన్ జడ్ యువత ఆన్‌లైన్‌లో తమ ఇమేజ్ విషయంలో తాము అప్రమత్తంగా ఉంటున్నట్లు తెలిపారు. దాదాపు 76 శాతం తమ జీవితం అన్ని వేళలా తమ నియంత్రణలోనే ఉండాలని భావిస్తున్నారు.
ఆల్కహాల్ విషయంలో నేడు యువత అభిప్రాయాలు బాగా మారాయని షెఫ్ఫీల్డ్ యూనివర్సిటీలోని ఆల్కహాల్ పాలసీ ప్రొఫెసన్ జాన్ హోమ్స్ అన్నారు. ‘‘ఆల్కహాల్‌తో చుట్టుముట్టే ఆరోగ్య ముప్పులు జనరేషన్ జడ్‌కు బాగా తెలుసు. అదే సమయంలో విపరీతంగా మద్యంతాగి తమపై నియంత్రణ కోల్పోవాలని వారు అసలు అనుకోవడం లేదు. 2000ల్లో విపరీతంగా తాగడం అనేది ఒక ఫ్యాషన్‌లా ఉండేది. ముఖ్యంగా ఫ్రెండ్‌షిప్‌కు ఇది ప్రతీకగా భావించేవారు’’అని ఆయన చెప్పారు. ‘‘కానీ నేడు విపరీతంగా తాగడం అనే విషయంలో యువతకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి’’అని ఆయన వివరించారు.
ఉదాహరణకు విపరీతంగా తాగిన వారిని చూస్తే, లోలా కాస్త అసౌకర్యానికి గురవుతుంటారు. ‘‘నిజానికి నా స్నేహితుల్లో అంత తాగే వారు తక్కువ. నేడు యువతలో అభిప్రాయాలు మారుతున్నాయి. ముఖ్యంగా విపరీతంగా తాగడం మంచిదికాదని అంతా తెలుసుకుంటున్నారు’’అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నో సమస్యలు..
మరోవైపు నేడు యువత బాగా ఒత్తిడి తర్వాత సేద తీరడానికి భిన్నమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. దీనికి కారణం వారికి ఎదురయ్యే కొత్త సవాళ్లేనని నిపుణులు అంటున్నారు. ఎప్పుడూ టెక్నాలజీతో గడపడం, విపరీతంగా కంటెంట్ అందుబాటులో ఉండటంతో మద్యానికి వారు నెమ్మదిగా దూరం అవుతున్నారని చెబుతున్నారు.
2000 మొదట్లో ఎక్కువగా మద్యం తాగడం, డ్రగ్స్ ఉపయోగించడం లాంటి సమయాల్లో పరిశోధన చేపట్టినప్పుడు, ఇలాంటి అలవాట్లతో ప్రపంచం నుంచి దూరంగా వెళ్లిపోవచ్చని అప్పటి యువత భావించేవారని పెన్నే గుర్తుచేసుకున్నారు. కానీ, నేడు పరిస్థితి పూర్తిగా మారిందని ఆమె వివరించారు. ‘‘నేటి యువత తమ బ్యాటరీలను రీచార్జ్ చేసుకోవడానికే ఎక్కువ ప్రయత్నిస్తున్నారు. కొత్త అంశాలు, కోర్సులు నేర్చుకోవడం లేదా కొత్త నైపుణ్యాలపై దృష్టి పెట్టడం చేస్తున్నారు’’అని ఆమె అన్నారు.
వృత్తిపరంగా తాము ముందుకు వెళ్లాలని నేటి యువత పట్టుదలతో ఉంటోందని పరిశోధనలు చెబుతున్నాయి. తమలో ఆందోళనకు కారణమయ్యే అంశం ఏమిటని 15,000 మంది జనరేషన్ జడ్ యువతను ప్రశ్నించినప్పుడు.. 29 శాతం మంది పెరుగుతున్న ధరలని చెప్పారు. వాతావరణ మార్పులు, నిరుద్యోగం, లైంగిక వేధింపుల ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు 46 శాతం మంది తమకు డబ్బులేమీ మిగలడం లేదని చెబుతుంటే, మరో 43 శాతం రెండో ఉద్యోగం కూడా చేస్తున్నామని చెప్పారు. అంతకుముదు జనరేషన్‌తో పోలిస్తే ఇది దాదాపు పది శాతం ఎక్కువ.
‘‘ఇదివరకటి జనరేషన్‌లతో పోల్చినప్పుడు జనరేషన్ జడ్ ఆర్థిక పరమైన ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటున్నాయి’’అని పెన్నే వివరించారు. ‘‘కొందరు ఆల్కహాల్ ధర మరీ ఎక్కువగా ఉందని భావిస్తున్నారు’’అని ఆమె చెప్పారు.
లోలాకు మాత్రం మద్యం తాగడం తగ్గించడానికి మానసిక ఆరోగ్యం కూడా ఒక కారణం. కానీ, ఆల్కహాల్ ధర కూడా ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తోంది. పారిస్‌లో ఉండేటప్పుడు ధర తక్కువగా ఉండటంతో ఆమె ఎక్కువగా తాగేవారు. ‘‘పారిస్‌లో 20 యూరోలు (రూ.1500) వరకు ఖర్చుపెట్టేదాన్ని. కానీ, లండన్‌లో ధరలు ఎక్కువ. నేను తాగాలని అనుకున్నా, అంత డబ్బులు ఉండేవికాదు’’అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మంచి అనుభవాలు..
కారణాలు ఏమైనప్పటికీ నేటి యువతలో చాలా మంది ఆల్కహాల్‌కు దూరంగా ఉంటున్నారు. వారి చుట్టుపక్కల పరిస్థితులు కూడా దీనికి అనుగుణంగానే ఉంటున్నాయి. న్యూయార్క్‌కు చెందిన 24ఏళ్ల జేసన్ విపరీతంగా తాగి మూడేళ్లకుపైనే అయ్యింది. నేడు ఆయన స్నేహితుల్లో చాలా మంది మద్యం తాగనివారే ఉన్నారు. ‘‘మద్యం తాగడం అనేది న్యూయార్క్ సంస్కృతిలో భాగం. ఆ విషయంలో నాకు కాస్త ఒత్తిడి ఉండేది. కానీ, నా వయసు వారు నా అభిప్రాయాలను గౌరవించేవారు. నాకు అండగా నిలిచేవారు’’అని ఆయన చెప్పారు.
మితంగా మద్యం సేవించడం అనేది నెమ్మదిగా చాలా మందికి అలవడుతోందని హోమ్స్ భావిస్తున్నారు. ‘‘20వ శతాబ్దం రెండో అర్ధ భాగంలో మద్యం తాగడం అనేది విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా 1990, 2000లో మరీ ఎక్కువైంది’’అని ఆయన చెప్పారు. ‘‘అయితే, ఇక్కడ ఆల్కహాల్ వినియోగం అనేది స్థిరంగా ఎప్పుడూ ఉండదు. ఒకసారి పెరుగుతుందని, ఆ తర్వాత తగ్గుతుంది. నేడు యువత తగ్గే దిశగా వెళ్తున్నారు’’అని ఆయన అన్నారు.
అయితే, రెండేళ్ల లాక్‌డౌన్‌తో యువత భవిష్యత్ సామాజిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతోందో స్పష్టంగా తెలియనప్పటికీ, మహమ్మారి తర్వాత మళ్లీ మునుపటిలా అంత మొత్తంలో యువత అల్కహాల్ వైపుకు రారని పెన్నే భావిస్తున్నారు. ‘‘ఇప్పుడు 17ఏళ్ల వయసులో పిల్లలు తాగకపోవడం అనేది సాధారణంగా మారిపోయింది. ఆ తర్వాత 18, 19ఏళ్ల వయసులోనూ ఇది సాధారణం అవుతుంది’’అని పెన్నే వివరించారు.
నేడు జనరేషన్ జడ్ అనేది ప్రపంచ జనాభాలో మూడో వంతు వరకు ఉంది. అయితే, నేటి యువత అభిరుచులకు అనుగుణంగా ఆల్కహాల్ పరిశ్రమ కూడా మార్పులు చేస్తూ వస్తోంది. అయితే, నేటి యువత పరిమాణం కంటే నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తున్నారని లండన్‌లోని మూడు బార్లు నడుపుతున్న, స్వీట్ అండ్ చిల్లీ ఏజెన్సీ వ్యవస్థాపకురాలు ఎమ్మా హట్చిసన్ వివరించారు. 2021లో చేపట్టిన అధ్యయనంలో అమెరికాలో 21ఏళ్లకుపైబడిన యువత స్పిరిట్స్, షాంపేన్, ఇతర పానీయాలకు మొగ్గుచూపుతున్నారని వెల్లడైంది. ఆల్కహాల్, వైన్, బీర్‌లను ప్రాధాన్యం ఇస్తున్న వారి సంఖ్య తగ్గుతోందని తేలింది.
‘‘నేటి యువత మంచి అనుభవాలు కోరుకుంటున్నారు. తమ ఆలోచనా విధానాలను తగిన బ్రాండ్లను ఎంచుకుంటున్నారు. ఈ విషయంలో అన్నింటినీ ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు’’అని హట్చిసన్ చెప్పారు.
‘‘గతంలో మీరు ఆల్కహాల్ తాగకపోతే కొత్తగా చూసేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు’’అని హట్చిసన్ అన్నారు. ‘‘నేడు నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. అంతేకాదు ఈ విషయంలో మనముందున్న ఆప్షన్లు కూడా ఎక్కువే’’అని ఆమె వివరించారు. ఆస్ట్రేలియా, కెనడా, ప్రాన్స్, జర్మనీ, జపాన్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, బ్రిటన్, అమెరికాలలో వీటి వినియోగం 2024నాటికి 31 శాతం పెరగొచ్చని మార్కెట్ విశ్లేషణ సంస్థ ఐడబ్ల్యూఎస్ఆర్ అంచనా వేసింది.
మరోవైపు కరోనావైరస్ మహమ్మారి అనంతరం, బార్‌లు, రెస్టారెంట్లు కూడా జనరేషన్ జడ్‌ను ఆకట్టుకునేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా పింగ్‌పాంగ్, షఫిల్‌బోర్డ్స్‌ను లాంటి గేమ్స్ కూడా ఏర్పాటుచేస్తున్నాయి. నేడు కొత్తవారిని కలవడానికి, హాయిగా మాట్లాడుకోవడానికి, మంచి ఆహారం తీసుకోవడానికి, కొత్త పానీయాలు తాగడానికి ఇవి ఉపయోగపడుతున్నాయని హట్చిసన్ అన్నారు.
చాలా మంది 24ఏళ్ల యువతలానే జేసన్ సామాజిక జీవితం కూడా కాఫీ షాపులు, రెస్టారెంట్లు, స్పోర్ట్స్, స్నేహితులతో కలిసి జీవించడం లాంటి పనులతో బిజీబిజీగా గడుస్తోంది. ముఖ్యంగా ఆల్కహాల్‌తో సంబంధంలేని అంశాలకే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘‘నేను కూడా పార్టీలకు వెళ్తాను. అయితే, మద్యం తాగకుండా అప్రమత్తంగా ఉంటాను. నాపై నియంత్రణను అసలు కోల్పోను. నిజానికి ఇలా ఉండేటప్పటికీ స్నేహంలో మాధుర్యాన్ని ఆస్వాదించొచ్చు’’అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- డేటింగ్ సైట్లలో అందమైన అమ్మాయిల పేరుతో నకిలీ ప్రొఫైల్స్‌ను ఎలా నడిపిస్తారు?
- టీవీ చానెళ్లలో చర్చలే దేశంలో విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నాయా, యాంకర్లు ఏం చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది ?
- డిజిటల్ రేప్‌కు పాల్పడిన 75 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు, అసలేమిటీ కేసు?
- OSCAR: అమెరికన్ సినిమాల అవార్డులకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది? ఆస్కార్‌లో విదేశీ చిత్రాల ఎంట్రీకి నిబంధనలు ఏమిటి?
- ఇస్లాం నుంచి హిందూమతంలోకి మారిన ఒక కుటుంబం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది?- గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















