ఆంధ్రప్రదేశ్‌‌లో 33 శాతం మద్యం షాపులు తగ్గినా ఆదాయం మాత్రం 21 శాతం పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?

మద్యం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వి. శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో దశలవారీగా మద్య నిషేధం తెస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చింది వైఎస్సార్సీపీ. తమ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రంలోని బెల్ట్ షాపులన్నీ మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత, ఏటా మద్యం షాపులను సంఖ్యను తగ్గించుకుంటూ వస్తామంటూ కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చింది.

అందులో భాగంగా ఏపీలోని మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించారు. మద్యం అమ్మకాలకు అనుమతించే సమయం కూడా తగ్గించారు.

కానీ, మద్యంపై ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం విషయంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. అనేక చోట్ల నాటుసారా అమ్మకాలు పెరుగుతున్నాయంటూ సామాన్యులు ఆందోళనలకు దిగుతున్నారు.

దీంతో రాష్ట్రంలో మద్యం నియంత్రణ అసలు లక్ష్యం నీరుగారుతుందా అన్న సందేహం వస్తోంది.

ప్రధాన ఆదాయవనరు ఇదే

దేశ వ్యాప్తంగా అత్యధిక రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలే ఆయా ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరులుగా మారాయి. దేశ వ్యాప్తంగా మద్యంపై వచ్చే ఆదాయం ఏటా 10 శాతానికి పైగా పెరుగుతూ వస్తోంది. కాగ్ నివేదిక ప్రకారం 2018-19లో దిల్లీ, పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాలు సహా మొత్తం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 2019-20లో అది ఏకంగా 16 శాతం పెరిగి, రూ. 1.75 లక్షల కోట్లకు చేరింది.

2018-19 లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ డ్యూటీ ద్వారా అత్యధికంగా రూ. 25,100 కోట్లు వచ్చింది.

మద్యం ఆదాయం విషయంలో తెలంగాణ రూ.10.31 వేల కోట్లతో దేశంలో ఐదో స్థానంలో నిలవగా, ఏపీ రూ.10 వేల కోట్లతో ఆరో స్థానంలో నిలిచింది.

2014-15లో ఏపీ ప్రభుత్వానికి మద్యంపై వచ్చిన ఆదాయం రూ. 3,839 కోట్లు మాత్రమే. అంటే, దాదాపు ఐదేళ్లలోనే మద్యం అమ్మకాల ద్వారా ఏపీ ప్రభుత్వ ఆదాయమే 150 శాతం పెరగింది.

జగన్

ఫొటో సోర్స్, AFP

ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్న జగన్

తమ హయంలో మద్యంపై నియంత్రణ తెస్తామని వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే 2019 అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం ప్రకటించారు.

అందులో భాగంగా మొదటి దఫా మద్యం షాపులను 4,380 నుంచి 3,500కి తగ్గించారు. రెండోసారి మరికొన్ని తగ్గించడంతో 4,380షాపులలో 33 శాతం తగ్గించినట్టయ్యింది. ప్రస్తుతం ఏపీలో 2934 షాపులు మాత్రమే ఉన్నాయి.

పర్మిట్ రూమ్‌లకు అనుమతి నిరాకరించారు. మద్యం అమ్మకాలు ఇదివరకు ఉదయం 10గం.ల నుంచి రాత్రి 10 గం.లవరకూ సాగేవి. వాటిని జగన్ ప్రభుత్వం ఉదయం 11గం.ల నుంచి రాత్రి 8గం.ల వరకే అమ్మకాలను పరిమితం చేసింది.

పెద్ద మొత్తంలో మద్యం నిల్వ చేసుకునే అధికారం లేకుండా కూడా నిబంధన విధించారు. మూడు మద్యం బాటిళ్లు లేదా ఆరు బీరు బాటిళ్ళకు మించి నిల్వ ఉంచుకునే అవకాశం లేదని నిబంధన తెచ్చారు.

ఏటా 20 శాతం చొప్పున మద్యం దుకాణాలు తగ్గిస్తామని, ఐదేళ్ల నాటికి రాష్ట్రంలో మద్యం కేవలం స్టార్ హోటళ్లలో మాత్రమే అందుబాటులో ఉండే విధంగా చేస్తామని జగన్ ప్రకటించారు. మద్యం ఖరీదైన సరుకుగా మార్చితే, కొనుగోలు చేసేందుకు భయపడే పరిస్థితి వస్తుందని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.

ధరలు పెంచి, మళ్లీ తగ్గించారు

మద్యం ధరలు పెంచి మద్యం ప్రియులను దానికి దూరం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దానికి తగ్గట్టుగా అనేక ఐఎంఎఫ్ఎల్ సహా బ్రాండెడ్ మద్యం, బీరు బాటిళ్ల ధరలను కూడా పెంచారు. ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్‌తో సుమారు నెలన్నర పాటు మద్యం దుకాణాలు మూతపడ్డాయి.

మార్చి 24 తర్వాత మూసేసిన మద్యం దుకాణాలను మే 4న మళ్లీ తెరిచారు. ఆసమయంలో మరోసారి లిక్కర్‌పై పన్నులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత 25 శాతం పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ తర్వాత దానికి మరో 50 శాతం చేర్చి మొత్తం 75 శాతం పన్నులను పెంచింది.

ఈ పెంపకం పట్ల పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కాహాల్ బేవరేజెస్ కంపెనీస్ ( సీఐఏబీసీ) ఈ పన్నులు తగ్గించాలని ఏపీ ప్రభుత్వానికి విన్నవించాయి. ప్రస్తుతం పెంచిన ధరలను కొద్దిమేరకు సవరించారు. మే నెలలో పెంచిన ధరలలో సెప్టెంబర్ 3న తగ్గుదల నమోదయ్యింది. కొన్ని బాటిళ్లపై రూ. 10 చొప్పున తగ్గించారు. కొన్ని బ్రాండెడ్ మద్యం ధరలు అత్యధికంగా రూ. 280 వరకూ తగ్గాయి. మద్యం నియంత్రణ కోసం ధరలు పెంచినట్టు ప్రకటించిన ప్రభుత్వం, ఆ తర్వాత ఇతర రాష్ట్రాలలో ధరలతో క్రమబద్ధీకరణ కోసం తగ్గించినట్టు చెప్పింది.

మద్యం

ఫొటో సోర్స్, Reuters

ప్రభుత్వ ఆదాయంలో మార్పు లేదు

ఏపీలో కొత్త మద్యం విధానం అమలులోకి వచ్చి ఈ నెలాఖరుతో ఏడాది పూర్తవుతుంది. ఈ సమయంలోనే లాక్‌డౌన్ కారణంగా నెలన్నర పాటు మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. అయినా, ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం విషయంలో పెద్దగా మార్పు లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

2019 ఆగస్టులో మద్యం ద్వారా రూ.1747.29 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో ఆదాయం రూ. 1635.07 కోట్లుగా ఉంది. అంటే, 6.42 శాతమే తగ్గింది.

ఇక గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇప్పటికే 21.27 శాతం ఎక్కువ ఆదాయం వచ్చింది. 2019 సెప్టెంబర్ మొత్తం నెలకు గానూ రూ. 1205.39 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెలలో మొదటి 24 రోజుల్లోనే రూ.1461.8 కోట్ల ఆదాయం వచ్చిందని ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వెబ్‌సైట్ లెక్కలు చెబుతున్నాయి.

ఈ లెక్కలను గమనిస్తుంటే ప్రభుత్వం చెబుతున్నట్టుగా మద్యం దుకాణాలు తగ్గినా, మద్యం ద్వారా ప్రభుత్వానికి లభిస్తున్న ఆదాయంలో మార్పులు లేవని స్పష్టం అవుతోంది. పెంచిన ధరల కారణంగానే ప్రభుత్వ ఆదాయానికి లోటు లేకుండా పోతోందనే అభిప్రాయం వినిపిస్తోంది.

మద్యం బ్రాండ్లపై అవినీతి జరుగుతోందా?

ఏపీలో ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టింది. జీవో నెం. 411 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,500 మంది సూపర్ వైజర్లు, మరో 8,033 మంది సేల్స్ మేన్లను నియమించింది. ఎక్సైజ్ శాఖ తరుపున వారిని నియమించి ప్రభుత్వం ద్వారానే మద్యం అమ్మకాలు సాగిస్తోంది.

అయితే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ప్రముఖమైన బ్రాండ్లకు అనుమతి లభించడం లేదు.

ఏపీలో మద్యం బ్రాండ్ల వింత పేర్లపై సోషల్ మీడియాలో చాలా జోకులు పేలాయి.

ప్రభుత్వ మద్యం అమ్మకాల పేరుతో రాష్ట్రంలో పెద్ద కుంభకోణం జరుగుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. అన్ని రకాల బ్రాండ్లకూ అనుమతివ్వాలని గతంలోనే టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ వంటి వారు అసెంబ్లీలో ప్రస్తావించారు.

"ఏపీ ప్రభుత్వం మద్యం పేరుతో మాఫియా నడిపిస్తోంది. సమాంతరంగా లిక్కర్ మాఫియా ఈ మద్యం అమ్మకాలను నియంత్రిస్తోంది. అత్యంత నాసిరకం మద్యం అమ్మకాలను అనుమతించి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వ మద్యం విధానం విఫలమైంది. నాసిరకం మద్యం కారణంగా అనేక మంది ఇతర మార్గాలకు మళ్లుతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఏపీలో మద్యం మాఫియా తీరు మీద జ్యుడీషియల్ దర్యాప్తు జరపాలి" అని టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ అన్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో మల్లాం గ్రామవాసుల ఆందోళన
ఫొటో క్యాప్షన్, తూర్పు గోదావరి జిల్లాలో మల్లాం గ్రామవాసుల ఆందోళన

శానిటైజర్లు తాగి ప్రాణాలు కోల్పోతున్నారు

ఏపీలో మద్యం విధానం అసమగ్రంగా ఉందని మద్యం వ్యతిరేక ప్రచార సమితి నాయకుడు ఎన్ సూర్యనారాయణ బీబీసీతో అన్నారు. ధరలు పెంచి, మద్యం ప్రియులను నియంత్రిస్తామని చెబుతూనే... మరోవైపు నాసిరకం మద్యంతో ప్రజలను ఇతర మార్గాల వైపు మళ్లిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గడిచిన కొన్ని నెలల్లో పలు చోట్ల మద్యానికి బదులుగా శానిటైజర్లు సేవించి సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. విశాఖ జిల్లా తాళ్లపాలెం, ప్రకాశం జిల్లా కురిచేడు, తిరుపతి సమీపంలో కూడా శానిటైజర్లు తాగి జనాలు మృతి చెందిన ఘటనలున్నాయి.

"మద్యం నియంత్రణ మీద ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ఓసారి ధరలు పెంచి, అందరినీ మద్యానికి దూరం చేస్తామంటారు. మళ్లీ పక్క రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నందున తగ్గిస్తున్నామని అంటారు. పైగా కొన్ని బ్రాండ్లకు మాత్రమే అనుమతి ఇవ్వడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం కూడా అర్థం కావడం లేదు. చాలామంది మద్యం నాసిరకంగా ఉందని చెబుతూ, వాటికి బదులుగా శానిటైజర్లు సహా అనేక మార్గాలు ఆశ్రయిస్తున్నారు. నాటుసారా విచ్చలవిడిగా అమ్ముతున్నారు. అక్రమ మద్యం కూడా పెరిగిపోయింది. ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఎక్కడా నియంత్రణ కనిపించడం లేదు. పైగా ప్రజల ఆరోగ్యానికి భరోసా లేకుండా పోతోంది. గ్రామ సచివాలయాలు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బందిని ఉపయోగించి నాటుసారా తయారీని నియంత్రించాలి. లేదంటే, ప్రభుత్వం చెబుతున్న దానికి, ఆచరణకు పొంతనలేని పరిస్థితి ఏర్పడుతోంది" అని సూర్యనారాయణ బీబీసీతో అన్నారు.

నాటుసారా

నాటుసారా అమ్మకాలపై ఆందోళనలు

రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల నాటుసారా సహా అక్రమ మద్యం అమ్మకాలు విస్తృతమవుతున్నట్టు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట సమీపంలోని మల్లాం గ్రామ వాసులు వారం రోజుల పాటు నిరసనకు దిగారు. కృష్ణా, గుంటూరు, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా పలు చోట్ల మహిళలు రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు.

నాటుసారా తయారీ, అమ్మకాలపై నియంత్రణ ఉండటం లేదని మహిళలు వాపోతున్నారు.

"మా గ్రామంలో నాటుసారా పట్టపగలే అమ్ముతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మేము పట్టిస్తామని చెప్పినా స్పందన రాలేదు. దాంతో రోడ్డెక్కి దీక్షలు చేశాం. వారం రోజులు తర్వాత అధికారులు వచ్చారు. నాటుసారా తయారీని అరికడతామని హామీ ఇచ్చారు. మహిళలమంతా, అధికారులను వెంట తీసుకుని నాటుసారా కేంద్రాలపై దాడులు చేశాం. ప్రస్తుతానికి కొంత తగ్గింది. మళ్లీ పెరగకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలి. నాటుసారా తయారీదారులను నియంత్రించాలి. లేదంటే ఈ సారా అమ్మకాలను సహించలేం" అని మల్లాం గ్రామానికి చెందిన కూరాకుల లక్ష్మి బీబీసీతో అన్నారు.

ఎస్ఈబీ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్
ఫొటో క్యాప్షన్, ఎస్ఈబీ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్

కఠినంగా స్పందిస్తున్నాం

మద్యం, ఇసుక అక్రమాలను అదుపు చేసేందుకంటూ... ప్రభుత్వం స్పెషల్ ఎన్ ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ)ని రంగంలోకి దింపింది.

గడిచిన నాలుగు నెలలుగా ఎస్ఈబీ బృందాలు విస్తృతంగా దాడులు చేస్తున్నాయని, అక్రమ మద్యం అమ్మకాలను అడ్డుకుంటామని ఎస్ఈబీ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ బీబీసీతో అన్నారు.

"మూడు నెలల్లో అక్రమ మద్యం అమ్మకాలపై 35 వేలకు పైగా కేసులు పెట్టాం. వాటిలో 46,500 మంది వరకూ అరెస్ట్ అయ్యారు. 2.75 లక్షల లీటర్ల అక్రమ మద్యం, 2.5 లక్షల లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నాం. 1,400 వాహనాలు సీజ్ చేశాం. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశాం. నిత్యం తనిఖీలు జరుగుతున్నాయి. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. మారుమూల ప్రాంతాల్లో నాటుసారా తయారీకి కొందరు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి ఐఎంఎల్ కూడా వస్తోంది. ఈ రెండింటి విషయంలో ప్రత్యేకంగా స్థానికులు, మహిళా బృందాల సహకారంతో దాడులు చేస్తున్నాం. కఠిన చర్యలు తీసుకుంటున్నాం" అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)