అరుణ్‌ శౌరి: వాజపేయి కేబినెట్‌లో మంత్రి.. మోదీ ప్రభుత్వం వచ్చాక సీబీఐ కేసులో నిందితుడు ఎలా అయ్యారు?

అరుణ్ శౌరి

ఫొటో సోర్స్, PTI

    • రచయిత, మానసీ దాశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ శౌరితోపాటు మరో నలుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని జోధ్‌పూర్‌లోని సీబీఐ కోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు చెందిన 'లక్ష్మి విలాస్ ప్యాలెస్' హోటల్‌ ప్రైవేటీకరణకు సంబంధించినది.

ఈ ఒప్పందంలో 1999-2002 మధ్య పెట్టుబడుల మంత్రిగా ఉన్న అరుణ్‌శౌరి, పెట్టుబడుల కార్యదర్శి ప్రదీప్ బైజల్‌ తమ పదవులను దుర్వినియోగం చేసి, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేందుకు కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇండియన్‌ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (ఐటీడీసీ)లో భాగమైన ఈ హోటల్‌ను 2002లో కేంద్ర ప్రభుత్వం 7.52 కోట్లకు భారత్‌ హోటల్స్ లిమిటెడ్‌కు అమ్మింది. ఐటీడీసీలో నష్టాల్లో ఉన్న పాతిక వరకు హోటళ్లలో ఇది కూడా ఒకటి.

నిందితులపై విచారణ జరిపేందుకు తమ వద్ద ఆధారాలు లేవంటూ కేసును మూసి వేసేందుకు సీబీఐ ఇంతకు ముందు క్లోజర్‌ రిపోర్ట్‌ ఇచ్చింది.

ఉదయ్ పూర్ లోని లక్ష్మీవిలాస్ హోటల్ ను అతి తక్కువ ధరకు ప్రైవేటు సంస్థకు ఇచ్చారని శౌరీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు

ఫొటో సోర్స్, Harvey Meston/Archive Photos/Getty Images

ఫొటో క్యాప్షన్, ఉదయ్ పూర్ లోని లక్ష్మీవిలాస్ హోటల్ ను అతి తక్కువ ధరకు ప్రైవేటు సంస్థకు ఇచ్చారని శౌరీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు

జిల్లా యంత్రాంగానికి హోటల్‌ అప్పగింత

అయితే సీబీఐ ఇచ్చిన ఈ రిపోర్టును సీబీఐ కోర్టు తిరస్కరించింది. "అరుణ్ శౌరీ, ప్రదీప్‌ బైజల్ కుదిర్చిన ఈ ఒప్పందం వల్ల కేంద్ర ప్రభుత్వం రూ. 244 కోట్ల నష్టం చవి చూసినట్లు కనిపిస్తోంది" అని కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ కేసు పునర్విచారణకు ఆదేశిస్తూ “సీబీఐ ఈ దేశంలో అత్యంత గౌరవనీయమైన సంస్థ. ప్రాథమిక విచారణలో కుమ్మక్కు జరిగినట్లు ఆధారాలు కనిపిస్తున్నప్పటికీ, కేసు మూసివేతకు నిర్ణయించడం ఆందోళన కలిగించే విషయం” అన్నారు జడ్జి పూరన్‌ కుమార్‌ శర్మ.

ఈ హోటల్‌ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని, ఈ విషయం తేలే వరకు అది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని కోర్టు ఆదేశించింది.

అవినీతి నిరోధక చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120బి ( నేరపూరిత కుట్ర), 420 (మోసం) కింద నిందితులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ఈ కేసులో అరుణ్ శౌరి, ప్రదీప్‌ బైజల్, లాజార్డ్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశిష్ గుహా, కాంతి కరమ్‌సే & కో కు చెందిన కాంతీలాల్ కరమ్‌సే వికమ్‌సే, భారత్ హోటల్స్‌ లిమిటెట్‌ చైర్మన్ జ్యోత్స్నాసూరిపై అభియోగాలున్నాయి.

అరుణ్ శౌరి, నరేంద్రమోదీ

ఫొటో సోర్స్, ANI

అసలు వివాదమేంటి?

1999-2002 మధ్యకాలంలో పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖకు చెందిన కొందరు అధికారులు లక్ష్మీవిలాస్‌ ప్యాలెస్‌ను మరమ్మతు చేసి, తక్కువ ధరకు అమ్మేందుకు ఒక ప్రైవేట్‌ హోటల్‌ యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై 2014 ఆగస్టు 13 సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది.

ప్రాథమిక దర్యాప్తు తరువాత ఎలాంటి ఆధారాలు దొరకలేదంటూ సీబీఐ ఈ కేసు మూసివేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. అయితే ఈ క్లోజర్‌ రిపోర్టును జోధ్‌పూర్‌లోని సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఈ నివేదిక ప్రకారం భూమి ధర 151 కోట్ల రూపాయలు కాగా, ఈ ఒప్పందంలో ప్రభుత్వం రూ.143.48 కోట్లను నష్టపోయింది.

ఈ కేసుపై ఇప్పటికే సీబీఐ మూడుసార్లు క్లోజర్‌ రిపోర్టులు ఇచ్చింది. చివరిసారిగా 2019 ఆగస్టు 13న క్లోజర్‌ రిపోర్టు ఇవ్వగా కేసును మూసివేయడానికి వీల్లేదని సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది. మళ్లీ దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది.

ఈ కేసులో అవినీతికి జరిగిందనడానికి సీబీఐకి కొన్ని ఆధారాలు లభించాయని, ఒక నివేదిక ప్రకారం హోటల్ ఆస్తి విలువ రూ. 252 కోట్లు ఉంటుందని, కానీ దానిని చాలా తక్కువ ధరకు అమ్మారని 2020 సెప్టెంబర్‌ 15న జరిగిన విచారణ సందర్భంగా సీబీఐ న్యాయమూర్తి అన్నారు.

కేసును మూసేయాలన్న సీబీఐ నివేదిక ఆందోళన కలిగిస్తోందని, దీనిపై మరోసారి దర్యాప్తు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

సీబీఐ

ఫొటో సోర్స్, Getty Images

ఎఫ్ఐఆర్‌లో కొత్తగా పేరు

ఆగస్టు 2014లో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అరుణ్ శౌరి పేరు లేదు "ఎటువంటి ఆధారాలు లేనందున సీబీఐ ఇప్పటికే కేసును మూసివేసింది. ఎఫ్‌ఐఆర్‌లో నా పేరు లేదు. కానీ తర్వాత ఎలా వచ్చి చేరిందో నాకు తెలియదు’’ అని అరుణ్‌ శౌరి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు.

“హోటల్‌ విలువను అంచనా వేసే వారిని ప్రభుత్వం ఎంపిక చేసిన జాబితా నుంచే తీసుకున్నారు. దీనిపై రాజస్థాన్‌ హైకోర్టులో కూడా విచారణ జరిగింది. ఇది నిరాధారమని కోర్టు తేల్చింది’’ అని 2014లో ఒక ఇంటర్వ్యూలో అరుణ్‌ శౌరి అన్నారు.

"ఒక హోటల్లో‌ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం తీసుకున్న 12 సంవత్సరాల తరువాత, పేరులేని వ్యక్తి ఇచ్చిన మౌఖిక ఫిర్యాదు ఆధారంగా ఈ దర్యాప్తును నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది" అంటూ 2014లో అరుణ్ శౌరి రాశారు.

"హిందూస్థాన్‌ జింక్‌ను 2002లో ప్రైవేటీకరించారు. దీనిని సుప్రీంకోర్టులో కొందరు సవాలు చేశారు. ఈ కేసును కోర్టు కొట్టివేసింది. 2002లో లక్ష్మీ విలాస్ హోటల్‌ను కూడా ఇదే పద్దతిలో అమ్మకానికి పెట్టాం" అన్నారు శౌరి.

“అధికారులు దీనిపై విచారణ మొదలు పెట్టినటప్పుడు ఆధారాలేంటని నేను అడిగాను. రాత పూర్వక ఆధారాలు లేవని, కేవలం మౌఖిక ఫిర్యాదు ఆధారంగా మాత్రమే దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు’’ అని అరుణ్‌ శౌరి వెల్లడించారు.

ఈ హోటల్‌ అమ్మకంపై 2014లో ఎకానామిక్‌ టైమ్స్‌ పత్రిక ఒక కథనం ప్రచురించింది. అందులో అరుణ్‌శౌరీ చెప్పిన వివరాల ప్రకారం, పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన క్యాబినెట్ కమిటీలో అప్పటి న్యాయమంత్రి అరుణ్‌జైట్లీ కూడా ఉన్నారు.

ఆయన మంత్రిత్వ శాఖ ఈ ఫైలును మూడుసార్లు క్లియర్‌ చేసింది. “ఈ మొత్తం ప్రక్రియకు నేను సాక్షిని. ఇందులో పెట్టుబడుల ఉపసంహరణ పారదర్శకంగా జరిగింది’’ అని జైట్లీ చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది.

ప్రదీప్ బైజల్

ఫొటో సోర్స్, Getty Images

ప్రదీప్‌ బైజల్‌ ఏమంటున్నారు?

కొన్ని రోజుల తరవాత ప్రదీప్‌ బైజల్‌ కూడా ఈ అంశంపై ఓ వార్తాపత్రికతో మాట్లాడారు. అప్పటి ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి, అరుణ్‌ శౌరి ఈ హోటల్‌ అమ్మకంపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

పెట్టుబడుల ఉపసంహరణ రోజులనాటి అనుభవాలపై 'ది కంప్లీట్ స్టోరీ ఆఫ్ ఇండియన్ రిఫార్మ్స్‌: టూజీ, పవర్ అండ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్' పేరుతో ప్రదీప్‌ బైజల్ ఒక పుస్తకం రాశారు.

అరుణ్ ‌శౌరి, రతన్‌ టాటాలకు వ్యతిరేకంగా ఒక స్టేట్‌మెంట్‌ ఇవ్వాల్సిందిగా సీబీఐ తనను కోరిందని ప్రదీప్‌ బైజల్‌ వెల్లడించారు. 2004-2007 మధ్య కాలంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆయన భారత టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌) చైర్మన్‌గా పని చేశారు.

నరేంద్రమోదీ, అద్వానీ, అరుణ్‌శౌరి

ఫొటో సోర్స్, Getty Images

అరుణ్‌ శౌరి - జర్నలిస్టు నుంచి డిజిన్వెస్ట్‌మెంట్ ఛాంపియన్ దాకా..‌

అరుణ్‌ శౌరీ వృత్యిరీత్యా జర్నలిస్ట్, రచయిత. ఎమర్జెన్సీ కాలంలో వార్తాపత్రికలకు ఆయన రాసిన వ్యాసాలు చాలా ప్రసిద్ధి పొందాయి. ఆయన కథనాలకు మెచ్చి ఎగ్జిక్యుటివ్‌ ఎడిటర్‌గా పని చేయాలనంటూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆయన్ను ఆహ్వానించింది.

1981లో ఆర్ధిక అవకతవకలపై అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.ఆర్‌.అంతులేపై అరుణ్ శౌరి తీవ్రమైన ఆరోపణలు చేశారు. చివరకు అంతులే తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

1982లో అరుణ్‌ శౌరి రామన్ మాగ్ససే అవార్డు, 1990లో దేశంలో మూడవ అత్యున్నత గౌరవం పద్మభూషణ్ అందుకున్నారు.

1998లో ఆయన బీజేపీలో చేరారు. రాజ్యసభ సభ్యునిగా నామినేట్ అయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో పెట్టుబడుల ఉపసంహరణ, సమాచార, ఐటీ మంత్రి పదవులను నిర్వహించారు.

పెట్టుబడుల ఉపసంహరణ శాఖ‌ మంత్రిగా మారుతి, వీఎస్‌ఎన్‌ఎల్‌, హిందుస్థాన్‌ జింక్‌లలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచారు. ఆ సమయంలో ఆయనకు ప్రదీప్‌ బైజల్‌ కార్యదర్శిగా పనిచేశారు.

వీరిద్దరి ఆధ్వర్యంలో ముప్పైకి పైగా కంపెనీలు ప్రైవేటు రంగం చేతుల్లోకి వెళ్లగా, ప్రభుత్వానికి రూ రూ. 5,000 కోట్లకు పైగా నిధులు సమకూరాయని చెబుతారు.

2002లో అరుణ్‌ శౌరి ఒక సందర్భంలో పార్లమెంటులో మాట్లాడుతూ, ప్రభుత్వం 31 పరిశ్రమలలో పెట్టుబడులను ఉపసంహరించుకుందని, 7 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించిందని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 5,114 కోట్లు చేరాయని తెలిపారు.

అరుణ్ శౌరి

ఫొటో సోర్స్, HARDIK CHHABRA/INDIA TODAY GROUP/GETTY

వాజ్‌పేయికి అనుకూలం - మోదీకి వ్యతిరేకం

అటల్‌ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో అరుణ్‌శౌరి ఉత్సాహంగా పని చేశారు. కానీ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు.

2014లో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు కావడానికి ముందు ఆయన ప్రధానమంత్రి మోదీని పొగిడారు. త్వరగా నిర్ణయాలు తీసుకుంటూ పని చేసే నాయకులలో ఒకరంటూ మోదీపై ప్రశంసలు కురిపించారు. కానీ తర్వాత ప్రభుత్వం పట్ల ఆయన వైఖరి మారడం ప్రారంభించింది.

“మోదీ, అమిత్‌షా, జైట్లీల నాయకత్వం తమ మిత్రపక్షాలతో పాటు ప్రజలను కూడా భయపెడుతోంది’’ అని 2015 అరుణ శౌరి వ్యాఖ్యానించారు.

మోదీ పదవీకాలంలో సామాజికంగా మైనారిటీలు ఒత్తిడికి గురవుతున్నారని శౌరి అన్నారు. నవంబర్ 2016లో ప్రకటించిన నోట్ల రద్దు పథకాన్ని "అతి పెద్ద మోసం"గా అభివర్ణించారు. డబ్బును బ్లాక్‌లో మార్చుకునే వారికి ఇది అవకాశం ఇచ్చిందన్నారు.

రఫేల్‌ యుద్ధ విమానాల కోనుగోలు ఒప్పందంపై 2018లో న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హాలతో కలిసి ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అక్టోబర్‌ 4న అరుణ్‌శౌరి, ప్రశాంత్ ‌భూషణ్‌, యశ్వంత్‌ సిన్హాలు సీబీఐ డైరక్టర్‌ అలోక్‌వర్మను కలుసుకుని దర్యాప్తు అవసరాన్ని చర్చించారు. అయితే ఈ ఘటన తర్వాత అలోక్ వర్మను సెలవుపై వెళ్లాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించగా, ఆయన దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు.

అరుణ్‌ శౌరి, సీబీఐ చీఫ్‌ల మధ్య సమావేశంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతారు. 2019 ఎన్నికల సందర్భంగా బీజేపీని మరోసారి ఎన్నుకోవడం సరికాదని పిలుపునిచ్చి అరుశ్‌ శౌరి సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికలు భారత రిపబ్లిక్‌కు చివరి ఎన్నికలని ఆయన వ్యాఖ్యానించారు.

ముంబైలో జరిగిన సమావేశంలో "దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు రాహుల్‌ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌ వంటి నాయకులు చెయ్యెత్తడానికి ఆలస్యం చేయవద్దు’’ అని వ్యాఖ్యానించారు.

2017 అక్టోబర్‌‌లో జరిగిన కుశ్వంత్‌ సింగ్‌ సాహితీ సమ్మేళనంలో మాట్లాడిన ఆయన, తాను రెండు తప్పులు చేశానని, మొదటిది వామపక్షాలు, జనతా పార్టీ మద్దతు ఇచ్చిన వీపీ సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు తెలపడమైతే, రెండోది ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీకి మద్దతు తెలపడమని అరుణ్‌ శౌరి అన్నారు.

"నాయకులు అధికారంలోకి రాగానే మారిపోతారని భావించకండి. వారు సత్యాన్నిఎంతగా సమర్ధిస్తారనే దానిపై వారిని అంచనా వేయండి" అని శౌరి వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)