డబుల్ ఏజెంట్: సీఐఏ ఏజెంట్‌గా పనిచేసిన ఓ రా అధికారి.. ఇండియా నుంచి ఎలా తప్పించుకు వెళ్లారు?

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇది 2004 ఏప్రిల్‌లో జరిగిన సంగతి.
రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ - రా - ఆఫీస్‌లో ఒక సాయంకాలం.
అందరూ పని ముగించుకుని ఇళ్లకు బయలుదేరుతున్నారు. ప్రధాన ద్వారం దగ్గర పెద్ద క్యూ. అందరి బ్రీఫ్‌కేసులు తనిఖీ చేస్తున్నారని సమాచారం వచ్చింది. మప్పై ఐదేళ్ల రా చరిత్రలో ఇలాంటి తనిఖీ ఎన్నడూ జరగలేదు.
ఇది జరిగిన ఒక వారం తరువాత ఒక సమావేశంలో.. ఇది ఎవరో ఒకరిని ఉద్దేశించి చేసిన తనిఖీ కాదని రా ముఖ్య అధికారి సి.డి.సహాయ్ చెప్పారు. రా భద్రతా వ్యవస్థను బలోపతం చెయ్యడం కోసమే తనిఖీలు నిర్వహించామని తెలిపారు.
ఆ సమావేశంలో రా జాయింట్ సెక్రటరీ రబీందర్ సింగ్ కూడా పాల్గొన్నారు. సీనియర్ అధికారులతో ఇలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని గట్టిగా అరుచుకుంటూ ఆ సమావేశం నుంచి బయటికొచ్చారు.
ఆ తనిఖీలన్నీ రబీందర్ సింగ్‌ను దృష్టిలో పెట్టుకునే చేశారని యతీష్ యాదవ్ ఇటీవల విడుదలైన తన పుస్తకం 'రా - ఎ హిస్టరీ ఆఫ్ కోవర్ట్ ఆపరేషన్’లో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ రోజు గేట్ దగ్గర తనిఖీలు చేస్తున్నారని రబీందర్ సింగ్‌కు అతని డ్రైవర్ ద్వారా తెలిసింది. కానీ అప్పటి తనిఖీలో రబీందర్ సింగ్ బ్రీఫ్‌కేసు లోంచి అనుమానించదగ్గవేమీ బయటపడలేదు.
రబీందర్ సింగ్ మీద రా ఎందుకు దృష్టి పెట్టింది?
రబీందర్ సింగ్ కొన్నేళ్లుగా అమెరికా గూఢచార సంస్థ సీఐఏకు డబుల్ ఏజెంట్‌గా పనిచేస్తూ భారత ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన సమాచారాన్ని అమెరికాకు చేరవేస్తున్నారనే అనుమానాలున్నాయి.
ఈ నేపథ్యంలో అప్పటికి కొద్ది నెలలుగా రాకు చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ రబీందర్ సింగ్‌పై నిఘా ఉంచింది. ఈ విషయాలేవీ రబీందర్‌కు తెలీదు.
తన ఇంటి ముందు పండ్లు అమ్మే నడి వయస్కుడు రా గూఢచారి అనీ, తన డ్రైవర్, తన కార్యకలాపాలన్నిటినీ సంబంధిత అధికారులకు చేరవేస్తున్నాడని ఆయన కలలో కూడా ఊహించి ఉండరు.

ఎవరీ రబీందర్ సింగ్?
రబీందర్ సింగ్, అమృత్‌సర్‌కు చెందిన జమీందార్ల కుటుంబం నుంచి వచ్చారు. వారు జాట్ సిక్కులైనప్పటికీ రబీందర్ సింగ్ జుత్తు కత్తిరించుకుని, భారత సైన్యంలో అధికారిగా చేరారు. ఆపరేషన్ బ్లూ స్టార్‌లో కూడా పాల్గొన్నారు. తరువాత డిప్యుటేషన్ మీద రాకు వచ్చారు.
రబీందర్ సింగ్ కెరీర్ మొత్తంలో తోటి ఉద్యోగులు, అధికారులు కూడా అతన్ని ఒక సగటు అధికారిగానే గుర్తించారని రాలో పనిచేసిన మేజర్ జనరల్ వినయ్ కుమార్ సింగ్ తన పుస్తకం 'ఇండియాస్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ - సీక్రెట్స్ ఆఫ్ రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆర్ఏడబ్ల్యూ)'లో తెలిపారు.
ప్రారంభంలో రబీందర్ సింగ్‌ను తన సొంత ఊరు అమృత్‌సర్‌లో అధికారిగా నియమించారు. అక్కడ సిక్కు వేర్పాటువాదులకు పాకిస్తాన్, ఐఎస్ఐ ఇస్తున్న శిక్షణ గురించి సమాచారం సేకరించే పని అప్పగించారు. తరువాత అతన్ని పశ్చిమాసియాకు, ఆ పైన హాలండ్‌లోని హేగ్‌కు బదిలీ చేసారు. అక్కడి సిక్కు ఉగ్రవాదుల కార్యకలాపాలపై నిఘా ఉంచడం అతని పని.
రాకు చెందిన ప్రముఖ అధికారి ఏఎస్ దులత్ తన పుస్తకం 'కశ్మీర్ - ద వాజ్‌పేయి ఇయర్స్'లో రబీందర్ సింగ్ గురించి ప్రస్తావిస్తూ.. "హాలండ్‌లో రబీందర్ సింగ్‌కు చాలా చెడ్డ పేరు ఉందని భారత విమానాన్ని హైజాక్ చేసిన హాషిం ఖురేషీ’’ తనతో చెప్పినట్లు రాశారు.
"ఆయన అధిక సమయం మగువుల వెనక, మద్యం సేవించడంలోనూ గడిపేవాడు. అతని మాట తీరు అనుచితంగా ఉండేది. ఒక్కోసారి అపరిచితుల దగ్గర చెప్పకూడని విషయాలు చెప్పేవాడు" అని కూడా రాశారు.

ఫొటో సోర్స్, PUBLICATION
సీఐఏకు, రబీందర్ సింగ్‌కు సంబంధం ఏమిటి?
1970ల నుంచీ అమెరికా గూఢచార సంస్థ సీఐఏ భారత ప్రభుత్వంలో తన అడుగు మోపడానికి ప్రయత్నిస్తూ ఉందన్న విషయం భారత ఇంటెలిజెన్స్ వర్గంలో అందరికీ తెలుసు.
'ద మ్యాన్ హూ కెప్ట్ ద సీక్రెట్స్' పేరుతో థామస్ పవర్స్ రాసిన సీఐఏ ముఖ్య అధికారి రిచర్డ్ హెల్మ్స్ జీవిత చరిత్రలో.. 1971లో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో ఒక సీఐఏ ఏజెంట్ ఉండేవారని స్పష్టంగా తెలిపారు.
ప్రముఖ కాలమిస్ట్ జాక్ ఆండర్సన్ కూడా ఈ విషయాన్ని తన వ్యాసంలో ప్రస్తావించారు. 1979 నవంబర్ 22న వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన సంచికలో కూడా "హూ వాజ్ ది సీఐఏ ఇన్ఫార్మర్ ఇన్ ఇందిరా గాంధీ క్యాబినెట్" పేరుతో ఒక కథనం వచ్చింది.
అలాగే 1998లో కూడా సీఐఏ పేరు మరోసారి వార్తల్లోకొచ్చింది. ఆ సంవత్సరం మేలో భారతదేశం నిర్వహించిన అణు పరీక్షల గురించి అమెరికాకు ముందే సమాచారం అందించలేదని సీఐఏపై విమర్శలు వచ్చాయి.
అప్పట్లో, అమెరికాలో దీన్ని అతి పెద్ద ఇంటెలిజెన్స్ వైఫల్యంగా పరిగణించారు. వెంటనే.. భారత్ ఇంటెలిజెన్స్ సమాచారం ఎప్పటికప్పుడు తమకు అందేలా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని అమెరికా భావించింది.
అప్పుడే 90వ దశకంలో హాలండ్‌లోని భారత రాయబార కార్యాలయంలో కౌన్సిలర్‌గా పనిచేస్తున్న రబీందర్ సింగ్‌ను సీఐఏ ఏజెంట్‌గా నియమించిందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు భావించాయి.

ఫొటో సోర్స్, PUBLICATION
సీఐఏ ఏజెంట్‌గా..
రబీందర్ సింగ్‌పై నిఘా ఉంచిన రా అధికారుల్లో ఒకరైన అమర్ భూషణ్ ఈ సంఘటనల ఆధారంగా 'ఎస్కేప్ టు నో వేర్' నవల రాశారు. అందులో ఆయన (రబీందర్ సింగ్), వేరే విభాగాల్లో పనిచేస్తున్న జూనియర్ అధికారుల నుంచీ సమాచారాన్ని రాబట్టడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించేవారో చెప్పుకొచ్చారు.
"అందుకోసం వారికి తన ఇంట్లోనే లేదా ఖరీదైన హొటళ్లల్లోనూ విందు ఏర్పాటు చేసేవారు. 1992లో నైరోబీలో పోస్టింగ్ అయినప్పుడు రబీందర్ సింగ్‌కు గుండెజబ్బు వచ్చింది. కానీ బైపాస్ సర్జరీ చేయించుకునేందుకు అవసరమైన డబ్బు అతని దగ్గర లేదు’’ అని పేర్కొన్నారు.
"అమెరికా, కెనడా స్నేహితుల ద్వారా అతనికి డబ్బు సమకూరింది. వియన్నాలో ఆపరేషన్ జరిగింది. ఈ డబ్బు అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ద్వారా సమకూరిందని తెలియడం ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదు" అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
రబీందర్ సింగ్‌పై రా నిఘా..
రబీందర్ సింగ్‌పై రా నిఘా ఉంచిన తరువాత ఆయన ఎవరితో ఏం మాట్లాడుతున్నారో సమాచారం సేకరించడం మొదలుపెట్టింది.
యతీష్ యాదవ్ ఈ విషయాల గురించి చెప్తూ..."రబీందర్ పనితీరు చాలా మామూలుగా ఉంటుంది. ఆయన సేకరించిన రహస్య సమాచారాన్ని ఇంటికి తీసుకువెళతారు. అమెరికన్లు సమకూర్చిన నాణ్యమైన కెమెరాతో వాటి ఫొటోలు తీస్తారు. అవన్నీ ఒక హార్డ్ డిస్క్‌లో సేవ్ చేసి సురక్షిత ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా వారికి పంపిస్తారు. తరువాత హార్డ్ డిస్క్‌నుంచీ, ల్యాప్‌టాప్ల నుంచీ మొత్తం డాటా డిలిట్ చేసేస్తారు" అని తెలిపారు.
మేజర్ జనరల్ వినయ్ కుమార్ సింగ్ కూడా తన పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. "రబీందర్ చాలాసార్లు తన ఆఫీస్ గది తలుపులు మూసుకుని రహస్య సమాచారాన్ని ఫొటో కాపీలు తియ్యడం కొంతమంది చూశారు. అమెరికాలో ఉన్న తన కూతురి ఎంగేజ్మెంట్‌లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లడానికి అనుమతి అడిగారు, కానీ రా అందుకు తిరస్కరించింది" అని పేర్కొన్నారు.
రబీందర్ సంవత్సరానికి రెండుసార్లు నేపాల్ వెళుతుండేవారు. దీని గురించి కూడా రాకు అనుమానాలున్నాయి. ఖట్మాండూలో అమెరికన్లను కలవడానికి, ముఖ్యంగా అక్కడి సీఐఏ స్టేషన్ చీఫ్‌ని కలవడానికి వెళుతుండేవారని నమ్మడానికి రా దగ్గర స్పష్టమైన కారణాలున్నాయి.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
భారత్‌కు జరిగిన నష్టం
రబీందర్ చేసిన పని వల్ల భారత్‌కు ఎంత నష్టం చేకూరింది అనేది ముఖ్యమైన విషయం. విదేశాల్లో పనిచేస్తున్న రా ఏజెంట్ల పేర్లను సీఐఏకు చేరవేసేవారని రబీందర్ పారిపోయిన తరువాతే తెలిసిందని భారత ఇంటెలిజెన్స్ అధికారుల్లో ఒకరు తెలిపారు.
రా కౌంటర్ ఇంటెలిజెన్స్ జరిపిన దర్యాప్తులో రబీందర్, సీఐఏకు 600 ఈమెయిల్స్ పంపారని, అందుకోసం వేరు వేరు ఐడీలు వాడారని తెలిసింది.
అయితే, రబీందర్ చేస్తున్న రహస్య కార్యకలాపాల గురించి తెలిసిన తరువాత కూడా భారత ఇంటెలిజెన్స్ అధికారులు అతనికి కావాలనే రహస్య సమాచారాన్ని అందించారా?
కేకే శర్మ అనే మారు పేరు కలిగిన వ్యక్తి యతీష్ యాదవ్‌కు అందించిన సమాచారం ప్రకారం.. 2004 జనవరి నుంచీ ఏప్రిల్ వరకూ 55 మంది అధికారులు రబీందర్‌కు రహస్య సమాచారం అందించారు.
రబీందర్ సింగ్‌ను ఉద్దేశపూర్వకంగానే రా మానిటరింగ్ స్టేషన్ ద్వారా ఇస్లామాబాద్‌లోని అమెరికా మిషన్‌కు అనుసంధానం చేశారు. ఆయన ఈ విషయాల గురించి మరింత సమాచారం రాబట్టడానికి ప్రయత్నించినప్పుడే అతనిపై సందేహం దృఢపడిందని మేజర్ జనరల్ వినయ్ కుమార్ సింగ్ తన పుస్తకంలో తెలిపారు.

ఫొటో సోర్స్, PUBLICATION
తనపై నిఘా ఉందని రబీందర్‌కు తెలిశాక...
రబీందర్ పరార్ అవ్వడానికి రెండు వారాల ముందే తనపై నిఘా ఉంచారన్న సంగతి గ్రహించారు.
"తన ఆఫీస్ గది శుభ్రం చేయించాలని రా సిబ్బందిని కోరారు రబీందర్. ఎందుకంటే తనపై నిఘా ఉంచడానికి అక్కడ ఏవైనా ఉపకరణాలను ఉంచితే అవి బయటపడతాయని. ఆయన నేపాల్ పారిపోయిన రాత్రి రా బృందం అతని ఇంటి ముందు కాపలా కాసింది. అతని భార్య బయటకు వచ్చారు. తరువాత ఒక స్నేహితునితో కలిసి లోపలికి వెళ్లారు. భోజనాల తరువాత స్నేహితుడు ఒంటరిగా బయటికొచ్చారు. ఆ తరువాత రబీందర్, అతని భార్య బయటికి రావడం ఎవరూ చూడలేదు" అని యతీష్ యాదవ్ తెలిపారు.
"మర్నాడు వారి ఇంటినుంచి ఎలాంటి అలికిడి వినిపించకపోయేసరికి రా బృందంలో ఒకరు ఆ ఇంటి తలుపు తట్టారు. రబీందర్, అతని భార్య ఒక వివాహ వేడుక కోసం పంజాబ్ వెళ్లారని ఇంట్లో ఉన్న పనిమనిషి తెలిపారు" అని వివరించారు.

ఫొటో సోర్స్, R K YADAV
రోడ్డు ద్వారా నేపాల్, అక్కడి నుంచి అమెరికా పరారు
రబీందర్ అతని భార్య ముందుగా నేపాల్ వెళ్లారని, అక్కడ ఒక హొటల్లో బస చేశారని రా అధికారులకు తెలిసింది.
వాళ్లు ఎలా తప్పించుకున్నారనే విషయాలను ఆర్కే యాదవ్ తన పుస్తకం 'మిషన్ రా'లో వివరించారు.
"రబీందర్, అతని భార్య పర్మిందర్ రోడ్డు మార్గం గుండా నేపాల్ చేరుకున్నారు. సీఐఏ అక్కడ వాళ్లకు వసతి ఏర్పాట్లు చేసింది. తరువాత వారిని సీఐఏ భద్రతా గృహానికి తరలించారు. రాజ్‌పాల్ ప్రసాద్ శర్మ, దీపా కుమార్ శర్మ పేర్లతో వాళ్లకి వీసాలు ఏర్పాటు చేశారు. 2004 మే 7 న ఇద్దరు వాషింగ్టన్ వెళ్లే విమానంలో కూర్చున్నారు" అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రజేష్ మిశ్రా వల్ల ఆలస్యమైన అరెస్ట్
రా అధికారులు, రబీందర్‌ను అరస్ట్ చెయ్యడానికి అప్పటి జాతీయ భద్రతా సలహాదారులు బ్రజేష్ మిశ్రా అనుమతి కోరారు. కానీ ఆయన ఆ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోలేదు.
"బహుశా రబీందర్ నిశ్శబ్దంగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బ్రజేష్ కోరుకున్నారేమో! అప్పడు దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. రాలో సీఐఏ ఏజెంట్ ఉన్నారనే వార్త ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బ తీసే అవకాశం ఉంది. రబీందర్ సీఐఏ తరపున గూఢచర్యానికి పాల్పడినట్లు మరిన్ని రుజువులు కావాలని ఆయన అడిగారు. అదే పెద్ద తప్పు" అని యతీష్ యాదవ్ పేర్కొన్నారు.
అయితే, ఒక రా అధికారి విదేశీ గూఢచర్యం చేస్తున్నారని తెలిశాక అతన్ని అరస్ట్ చెయ్యడానికి రా ఎందుకు ప్రభుత్వ అనుమతి కోరింది? అనే అనుమానాలు తలెత్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
సమాచారం ఇవ్వడానికి తిరస్కరించిన సీఐఏ
మేలో రా చీఫ్ సీడీ సహాయ్, సీఐఏ చీఫ్‌తో మాట్లాడారు. రబీందర్ అమెరికా పారిపోవడం గురించి అమెరికా ప్రభుత్వానికి ఏమైనా సమాచారం ఉందా అని అడిగారు. రబీందర్ గురించి ఎలాంటి సమాచారమైనా అందించడానికి సీఐఏ నిరాకరించింది. రా చేసిన ఆరోపణలన్నిటినీ కొట్టిపారేసింది.
2004 జూన్ 5న రాజ్యాంగంలో సెక్షన్ 311 (2) ప్రకారం భారత రాష్ట్రపతి, రబీందర్‌ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ సెక్షన్ ప్రకారం జాతీయ ప్రయోజనాల కోసం ఎలాంటి విచారణా జరగకుండా ఎవరినైనా ఉద్యోగం నుంచి తొలగించే అధికారం ఒక్క రాష్ట్రపతికే ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
రబీందర్ మరణం
"2016 చివర్లో రబీందర్ చనిపోయారని తెలియజేస్తూ వాషింగ్టన్ నుంచి ఒక సంకేత సమాచారం వచ్చింది. మెరీల్యాండ్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారని తరువాత తెలిసింది. రబీందర్ అమెరికా చేరిన కొద్ది రోజుల్లోనే సీఐఏ అతన్ని గూఢచర్యం నుంచి తొలగించింది" అని యతీష్ యాదవ్ తెలిపారు.
రబీందర్ చివరి రోజులు చాలా కష్టంగా గడిచాయి. సీఐఏ డబ్బు సహాయం అందించడం మానేశాక అతని ఆర్థిక పరిస్థితి దిగజారింది. సీఐఏ మాజీ అధికారి నిర్వహిస్తున్న ఒక థింక్ ట్యాంక్‌లో ఉద్యోగం పొందడానికి ప్రయత్నించారు. కానీ కుదరలేదు. జీవితంలో చివరి పన్నెండు ఏళ్లూ న్యూయార్క్, వర్జీనియా, మేరీల్యాండ్‌లలో గడ్డు కాలం గడిపారు.
రబీందర్‌పై ఇంత నిశితంగా నిఘా ఉంచినప్పటికీ ఆయన్ను పట్టుకోవడంలో రా విఫలమైంది. ఈ అంశం గురించి రా అధికారులు పెదవి విప్పడానికి నిరాకరించారు.
ఏది ఏమైనప్పటికీ రబీందర్ లాంటి అధికారులు రా చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతారు.
ఇవి కూడా చదవండి:
- మోదీ ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి కోట్ల డాలర్ల రుణం తీసుకుందా? నిజం ఏంటి? - BBC Fact Check
- కైలాస పర్వతాన్ని భారత్ ఆక్రమించిందా? అసలు నిజం ఏమిటి? - BBC Fact Check
- సముద్రపు దొంగలను పట్టిస్తున్న అరుదైన పక్షి
- 40 ఏళ్ల కిందట భారతదేశంలో చోరీకి గురైన సీతారాముల విగ్రహాలు బ్రిటన్‌లో ఎలా బయటపడ్డాయి?
- తిరుమలలో అన్యమతస్తుల ప్రవేశానికి ‘డిక్లరేషన్’ నిబంధన ఎప్పుడు, ఎలా మారింది? మార్చే అధికారం ఎవరిది?
- సైన్యంపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు? భద్రతా దళాలు పరిధిని దాటి ప్రవర్తించాయా?
- #విమెన్ హావ్ లెగ్స్: మహిళలు కాళ్లు కనిపించేలా బట్టలు ధరించకూడదా?
- లాక్డౌన్ ఎఫెక్ట్: విపరీతంగా పెరిగిన రివెంజ్ పోర్న్ కేసులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








