షోపియాన్ ఎన్‌కౌంటర్: భద్రతా దళాలు పరిధిని దాటి ప్రవర్తించాయా? సైన్యంపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు?

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA
జమ్మూ-కశ్మీర్‌లోని షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు తొందరపాటుతో వ్యవహరించాయని గుర్తించిన ప్రభుత్వం వారిపై చర్యలకు ఉపక్రమించింది.
ఈ వివాదంపై విచారణ జరిపిన సైన్యం, ప్రాథమిక ఆధారాలనుబట్టి భారత సాయుధ దళాలు తమకున్న ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) అతిక్రమించి వ్యవహరించాయని గుర్తించింది. ఈ కేసులో ఆర్మీ చట్టాల కింద క్రమ శిక్షణా చర్యలు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది జూలైలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు యువకులు మరణించారు.
జూలై 18న దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా అమ్షిపురా గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని భద్రతా దళాలు అప్పట్లో ప్రకటించాయి.

ఫొటో సోర్స్, NurPhoto
సోషల్ మీడియాలో విమర్శల వెల్లువతో దర్యాప్తు
ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురు యువకులు జమ్మూలోని రజౌరీ జిల్లాకు చెందినవారని, అమ్షిపురా గ్రామంలో వీరు తప్పిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
“సోషల్ మీడియా కథనాలతో సైన్యం దర్యాప్తు ప్రారంభించింది’’ అని శ్రీనగర్‌లో రక్షణ శాఖ ప్రతినిధి రాజేశ్ కాలియా తెలిపారు. అయితే ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల ఆపరేషన్ల సమయంలో నైతిక విలువలను అనుసరించడానికి భారత సైన్యం కట్టుబడి ఉందని కాలియా స్పష్టం చేశారు.
వేగంగా దర్యాప్తు
రికార్డు స్థాయిలో అత్యంత వేగంగా ఈ కేసుపై విచారణ జరిగింది. నాలుగు వారాల్లో పూర్తయిన దర్యాప్తులో లభించిన ప్రాథమిక ఆధారాలనుబట్టి ఆపరేషన్ సమయంలో భద్రతా దళాలు నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తోందని రక్షణ శాఖ ప్రతినిధి రాజేశ్ కాలియా అన్నారు.

ఫొటో సోర్స్, NurPhoto
ఆర్మీ నిబంధనలను ఉల్లంఘించిందా?
భద్రతా దళాలు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం-1990, అలాగే సుప్రీం కోర్టు ఆమోదించిన చీఫ్ ఆర్మీ స్టాఫ్ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు దర్యాప్తులో తేలింది.
విచారణలో అందిన ప్రాథమిక ఆధారాల ప్రకారం అమ్షిపురా ఎన్‌కౌంటర్‌లో మరణించిన యువకులను ఇంతియాజ్ అహ్మద్, అబ్రార్ అహ్మద్, మహ్మద్ ఇబారాగా గుర్తించారు. వీరంతా జమ్మూలోని రజౌరి వాసులు.
ముగ్గురి డీఎన్‌ఏ నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఈ ముగ్గురు యువకుల ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయా అనే దానిపై కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- నేటి నుంచి ఐపీఎల్ 2020... ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడుతుంటే, టీవీల్లో చూసే జనాలకు ఆసక్తి ఉంటుందా?
- ఐపీఎల్ 2020: తొలి టైటిల్ కోసం ఉవ్విళ్లూరుతున్న దిల్లీ, పంజాబ్, బెంగళూరు.. బలమైన పొజిషన్లో ముంబయి, చెన్నై
- ఐపీఎల్ 2020: కోహ్లీ, ధోనీ.. ఈ రికార్డులు బద్దలు కొట్టేస్తారా?
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. వాటి వల్ల రైతులకు లాభమా, నష్టమా?
- 40 ఏళ్ల కిందట చోరీ అయిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు బ్రిటన్‌లో ఎలా దొరికాయి?
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన ఊరు కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








