ఐపీఎల్‌ 2020: కోహ్లీ, ధోనీ.. ఈ రికార్డులు బద్దలు కొట్టేస్తారా?

ఐపీఎల్

ఫొటో సోర్స్, TWITTER / IPL

    • రచయిత, చిట్టత్తూరు హరికృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే క్రికెట్ అభిమానులకు పెద్ద పండుగ.

దేశ, విదేశీ ఆటగాళ్ల కలయికతో తమ ఫేవరెట్ జట్లు మైదానంలో చెలరేగిపోతుంటే, అభిమానులు దాదాపు రెండు నెలలపాటు టీవీలకు కళ్లప్పగించేస్తారు.

భారత్‌లోనే జరగాల్సిన ఈ మెగా టోర్నీ, ఈసారి కరోనా వల్ల వేదికను యూఏఈకి మార్చుకుంది. ఎడారి దేశంలోని మైదానాల్లో ఈసారి ఎవరు, ఏయే రికార్డులు బద్దలు కొడతారోననే ఆసక్తి అందరిలోనూ ఉంది.

13వ సీజన్‌లో నమోదయ్యే కొత్త రికార్డులు, బద్ధలయ్యే పాత రికార్డులు ఏవో మనకు తెలియకపోయినా, గత 12 సీజన్లలో ఇప్పటివరకూ ఐపీఎల్ టోర్నీలో ఎలాంటి రికార్డులు నమోదయ్యాయో ఓసారి చూద్దాం.

ఆర్‌సీబీ, కోహ్లీ

జట్టు రికార్డులు

అత్యధిక జట్టు స్కోర్

ఐపీఎల్‌లో జట్టు తరఫున అత్యధిక స్కోర్ 263.

ఇప్పటివరకూ ఐపీఎల్ ట్రోఫీని అందుకోలేకపోయినా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఈ రికార్డును మాత్రం సాధిందించింది.

2013లో తమ హోం గ్రౌండ్‌ చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ... పుణె వారియర్స్ మీద ఐదు వికెట్లకు 263 పరుగులు చేసింది.

ఆ జట్టు ఓపెనర్ క్రిస్ గేల్ 17 సిక్సర్లు, 13 ఫోర్లతో 175 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో నాటౌట్‌గా నిలిచాడు.

అత్యధిక జట్టు స్కోర్ల జాబితాలో రెండో స్థానం కూడా ఆర్‌సీబీ (248)దే.

విచిత్రం ఏంటంటే. ఐపీఎల్‌ టోర్నీలో అత్యల్ప స్కోరు చేసిన చెత్త రికార్డును కూడా ఆర్‌సీబీనే మూటకట్టుకుంది.

2017లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ పది ఓవర్లు కూడా ఆడకుండానే 49 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్

ఫొటో సోర్స్, THECHENNAISUPERKINGS/FACEBOOK

అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్

2010లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్‌లో రెండు జట్లూ కలిపి 469 పరుగులు చేశాయి. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్ ఇదే.

పదేళ్లైనా ఈ రికార్డు చెక్కు చెదరకుండా అలాగే ఉంది.

ఆ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) 246 పరుగుల లక్ష్యాన్ని విధిస్తే, దాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ 223 పరుగులు చేయగలిగింది.

ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓపెనర్ మురళీ విజయ్ 127 పరుగులు చేశాడు.

ముంబయి ఇండియన్స్

ఫొటో సోర్స్, Getty Images

అత్యధిక పరుగుల తేడాతో విజయం

ఈ రికార్డ్ ముంబయి ఇండియన్స్ పేరున ఉంది.

2017లో ముంబయి 146 పరుగుల తేడాతో దిల్లీ డేర్ డెవిల్స్ మీద విజయం సాధించింది.

మొదట 212 పరుగులు చేసిన ముంబయి తన ప్రత్యర్థిని 14 ఓవర్లలోపే 66 పరుగులకు ఆలౌట్ చేసింది.

ఇప్పటివరకూ ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల తేడాతో సాధించిన విజయం ఇదే.

విరాట్ కోహ్లీ, ఎబీ డివిలియర్స్

ఫొటో సోర్స్, Getty Images

బ్యాటింగ్ రికార్డులు

ఐపీఎల్‌లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు

ఈ రికార్డ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరున ఉంది.

ఐపీఎల్‌లో మొత్తం 177 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 5 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలతో 5,412 పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లీ ఖాతాలో 190 సిక్సర్లు కూడా ఉన్నాయి.

ఈ జాబితాలో కోహ్లీ తర్వాతి స్థానాల్లో వరుసగా రైనా(5,368), రోహిత్ శర్మ(4,898), డేవిడ్ వార్నర్ (4,706), శిఖర్ ధవన్(4,579), క్రిస్ గేల్ (4,484), ఎం.ఎస్.ధోనీ(4432) ఉన్నారు.

క్రిస్ గేల్

ఫొటో సోర్స్, twitter/13kamilkhan

అత్యధిక వ్యక్తిగత స్కోరు

ఈ రికార్డ్ క్రిస్ గేల్ పేరున ఉంది.

బెంగళూరు తరఫున అజేయంగా 175 పరుగులతో క్రిస్ గేల్ సృష్టించిన అత్యధిక పరుగుల రికార్డ్.. 2013 నుంచి భద్రంగా ఉంది.

ఇతడి తర్వాతి స్థానంలో మెక్ కలమ్(158) ఉన్నాడు.

ఈ జాబితాలోని తొలి పది స్థానాల్లో నలుగురు భారతీయులకు చోటు దక్కింది. వాళ్లు రిషబ్ పంత్(128 నాటౌట్), మురళీ విజయ్(127), వీరేంద్ర సెహ్వాగ్(122), పాల్ వాల్తాటీ (120 నాటౌట్).

అత్యధిక సగటు

ఈ జాబితాలో టాప్‌లో సన్ రైజర్స్ ఆటగాడు జానీ బెయిర్ స్టో ఉన్నాడు.

పది మ్యాచ్‌లు మాత్రమే ఆడి 283 పరుగులు చేసిన ఇతడి యావరేజ్ 55.62.

ఐపీఎల్‌లో 190 మ్యాచ్‌ల్లో 170 ఇన్నింగ్స్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ 42.20 యావరేజితో ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు.

డేవిడ్ వార్నర్

ఫొటో సోర్స్, Getty Images

ఎక్కువసార్లు 50+ స్కోర్

ఈ రికార్డ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు డేవిడ్ వార్నర్ పేరున ఉంది.

4 సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలతో వార్నర్ 48 సార్లకు పైగా 50+ పరుగులు చేశాడు.

5 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు చేసిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మొత్తం 41 సార్లు 50+ పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు..

ఐపీఎల్‌లో అత్యధికంగా 6 సెంచరీలు చేసిన క్రిస్ గేల్ 28 హాఫ్ సెంచరీలే చేయడంతో ఈ లిస్టులో 34 సార్లు 50+ పరుగులతో 8వ స్థానంలో ఉండిపోయాడు..

హర్భజన్ సింగ్, సైమండ్స్

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE

అత్యధిక డకౌట్లు

ఈ రికార్డును స్పిన్నర్ హర్భజన్ సింగ్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్ పంచుకుంటున్నారు. ఇద్దరూ ఐపీఎల్‌లో 13 సార్లు డకౌట్ అయ్యారు.

వీరి తర్వాత 12 సార్లు డకౌట్ అయిన జాబితాలో... గౌతం గంభీర్, రోహిత్ శర్మ లాంటి టాప్ బ్యాట్స్ మెన్స్ కూడా ఉన్నారు.

అత్యధిక వ్యక్తిగత సిక్సర్లు

ఐపీఎల్ మ్యాచుల్లో ఎక్కువ సిక్సర్లు బాదిన రికార్డ్ క్రిస్ గేల్ పేరున ఉంది.

ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 124 ఇన్నింగ్స్ ఆడిన గేల్ మొత్తం 326 సిక్సర్లు కొట్టాడు.

ఈ రికార్డ్ ఇప్పట్లో బద్దలు కావడం కష్టంగానే కనిపిస్తోంది.

గేల్ తర్వాత అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో వరుసగా ఏబీ డివిలియర్స్(212), ధోనీ(209), రోహిత్ శర్మ(194), సురేశ్ రైనా(194), విరాట్ కోహ్లీ(190) ఉన్నారు.

ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు-

ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన రికార్డ్ కూడా క్రిస్ గేల్ పేరునే ఉంది.

పుణె వారియర్స్ మీద 175 పరుగులు చేసిన మ్యాచ్‌లో గేల్ ఏకంగా 17 సిక్సర్లు బాదాడు.

ఐపీఎల్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పదికిపైగా సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో భారతీయుడు మురళీ విజయ్(11) ఒక్కడే. క్రిస్ గేల్ నాలుగు సార్లు ఈ ఫీట్ సాధించాడు.

మలింగ, ముంబయి ఇండియన్స్

ఫొటో సోర్స్, Getty Images

బౌలింగ్ రికార్డులు

టోర్నీలో అత్యధిక వికెట్లు

ఈ రికార్డ్ ముంబయి ఇండియన్స్ బౌలర్ లసిత్ మలింగ పేరు ఉంది.

మొత్తం 122 ఇన్నింగ్సుల్లో మలింగ 170 వికెట్లు పడగొట్టాడు.

యూఏఈలో జరుగనున్న ఐపీఎల్ 2020 నుంచి మలింగ తప్పుకున్నాడు. అతడి స్థానంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేమ్స్ పాటిన్‌సన్ జట్టులోకి వచ్చాడు.

అత్యధిక వికెట్ల జాబితాలో మలింగ తర్వాత స్పిన్నర్లు అమిత్ మిశ్రా(157), హర్భజన్ సింగ్(150), పీయూష్ చావ్లా(150) ఉన్నారు.

ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్

ఫొటో సోర్స్, THECHENNAISUPERKINGS/FACEBOOK

వికెట్ కీపింగ్ రికార్డులు

మోస్ట్ డిస్మిసల్స్

ఈ రికార్డ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ పేరున ఉంది.

ఐపీఎల్‌లో 183 ఇన్నింగ్స్‌ల్లో కీపింగ్ చేసిన ధోనీ మొత్తం 132 డిస్మిసల్స్ చేశాడు. వీటిలో 94 క్యాచ్‌లు, 38 స్టంపింగులు ఉన్నాయి.

131 డిస్మిసల్స్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, ధోనీకి అడుగు దూరంలో నిలిచాడు. కార్తీక్ 101 క్యాచ్‌లు, 30 స్టంపింగ్స్ చేశాడు.

ఐపీఎల్ 2020 తర్వాత ఈ రికార్డ్ దినేశ్ కార్తీక్ సొంతమవుతుందా, లేక ధోనీ దగ్గరే ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఒకే ఇన్నింగ్స్ ఎక్కువ డిస్మిసల్స్

ఈ రికార్డ్ 2011లో దక్కన్ చార్జర్స్ కోసం ఆడిన సంగక్కర పేరు మీదే ఉంది.

2011లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సంగక్కర ఐదు క్యాచ్‌లు పట్టాడు.

ఒకే సీజన్‌లో ఎక్కువ డిస్మిసల్స్

ఈ రికార్డ్ దిల్లీ కాపిటల్స్ యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేరున ఉంది.

గత ఏడాది ఐపీఎల్ 12వ సీజన్‌లో రిషబ్ మొత్తం 16 ఇన్నింగ్సుల్లో 24 డిస్మిసల్స్ చేశాడు. వీటిలో 18 క్యాచ్‌లు 6 స్టంపింగ్స్ ఉన్నాయి.

అత్యధిక క్యాచ్‌లు

ఈ రికార్డ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా పేరున ఉంది.మొత్తం 192 మ్యాచ్‌ల్లో ఇతడు 102 క్యాచ్‌లు పట్టాడు.

ఐపీఎల్‌లో వందకు పైగా క్యాచ్‌లు పట్టిన ఆటగాడు సురేశ్ రైనా ఒక్కడే.

ఐపీఎల్‌లో అత్యదిక మ్యాచ్‌లు ఆడిన రికార్డ్(193) కూడా సురేశ్ రైనా పేరు మీదే ఉంది.

190 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ రైనా తర్వాత స్థానంలో నిలిచాడు.

వ్యక్తిగత కారణాలతో సురేశ్ రైనా ఈసారి ఐపీఎల్‌కు దూరమయ్యాడు. కాబట్టి, అత్యధిక మ్యాచ్‌ల రికార్డు ధోనీ పేరిట మారడం దాదాపుగా ఖాయం.

రోహిత్ శర్మ, ధోనీ

ఫొటో సోర్స్, FACEBOOK/CHENNAI SUPER KINGS

ఈసారీ బ్యాటింగ్ రికార్డులు కష్టమేనా

ఐపీఎల్ అంటే సిక్సర్ల మోత, పరుగుల వర్షం. కానీ ఈసారీ యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్‌లో బ్యాటింగ్ రికార్డులు పెద్దగా ఉండకపోవచ్చని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.

యూఏఈలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే మూడు స్టేడియంలు భారత్‌తో పోలిస్తే పెద్దగా ఉంటాయని, స్పిన్‌కు అనుకూలంగా ఉండే ఈ పిచ్‌లపై పరుగులు రాబట్టడం కష్టం అవుతుందని క్రీడా విశ్లేషకులు సి.వెంకటేష్ చెప్పారు.

"సాధారణంగా మనం ఐపీఎల్ అంటే బ్యాటింగ్ రికార్డులే చూస్తుంటాం. ఎందుకంటే టీ 20 ఫార్మాట్ అంటే బ్యాటింగ్ ఎక్కువ ప్రాదాన్యత ఉంటుంది. ఇప్పుడు యూఏఈలో జరుగుతోంది కాబట్టి అక్కడ పిచ్‌లుచాలా నెమ్మదిగా ఉంటాయి, మైదానం పరిమాణం కూడా పెద్దగా ఉంటుంది. అందుకే మనకు బ్యాటింగ్ రికార్డుల కంటే, ఈసారి బౌలర్లు రాణించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్పిన్ బౌలర్లు రాణించే అవకాశం ఉంది. బౌలింగ్ రికార్డులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది” అని వెంకటేష్ చెప్పారు.

ఐపీఎల్ 2020లో అన్ని మ్యాచ్‌లూ యుఏఈలోని దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, అబుదాబిలోని జయేద్ క్రికెట్ స్టేడియం, షార్జా క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి.

ఇప్పటికే ఐపీఎల్‌లో రికార్డులు సృష్టించిన గేల్, బ్రావో లాంటి ఆటగాళ్లు వాటిని మెరుగు పర్చుకునే అవకాశం కూడా ఉందని వెంకటేష్ చెబుతున్నారు. కానీ, యూఏఈ పిచ్‌లపై 200 పరుగుల స్కోర్ ఆశించడం కూడా కష్టమేనన్నారు.

“యూఏఈలో ఇప్పటివరకూ జరిగిన టీ20 మ్యాచ్‌లు చూస్తే 200 ప్లస్ స్కోర్లు చాలా తక్కువే వచ్చాయి. అక్కడి పిచ్‌లు కూడా చాలా స్లోగా ఉంటాయి. పరుగులు చేయడానికి అంత అనువుగా ఉండవు. అందుకే అక్కడ 200 స్కోర్ చేయడమే కష్టం” అంటారు వెంకటేష్.

ఈసారీ ఐపీఎల్‌ సీజన్‌లో విదేశీ ఆటగాళ్ల కంటే భారత ఆటగాళ్లు రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వెంకటేష్, దానికి కారణం కూడా చెప్పారు.

‘‘యూఏఈలో పరిస్థితులు, భారత్‌లో పరిస్థితులకు దగ్గరగా ఉంటాయి కాబట్టి భారత ప్లేయర్లు ఎక్కువగా రాణించే అవకాశం ఉంది. స్లో పిచ్ మీద ఎలా ఆడాలి, అనే టెక్నిక్ మన ఆటగాళ్లకు బాగా తెలుసు. స్పిన్నర్లను మన ప్లేయర్లు బాగా ఆడగలరు. భారత స్పిన్ బౌలర్లు కూడా ఈసారీ రాణించే అవకాశం ఉంది. అన్నీ చూస్తుంటే ఈసారీ విదేశీ ఆటగాళ్ల కంటే భారత ఆటగాళ్లే ఎక్కువ రాణించే అవకాశం ఉంది” అన్నారు.

ధోని, రైనా, చెన్నై సూపర్ కింగ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఈ సీజన్‌లో ఏ రికార్డులు బ్రేక్ కావచ్చు

ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీల(6) క్రిస్ గేల్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టే అవకాశం ఉంది.

ఇప్పుడు 5 సెంచరీలు చేసిన కోహ్లీ దానికి ఒక్క సెంచరీ దూరంలోనే ఉన్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో ఈ సీజన్‌లో 1500 పరుగులు, 150 వికెట్లు పూర్తి చేసి రికార్డు సెట్ చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం 1483 పరుగులు చేసిన బ్రావో ప్రస్తుతం 150 వికెట్ల మైలురాయికి మూడు వికెట్ల దూరంలో ఉన్నాడు.

దీనితోపాటూ చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ కెప్టెన్, వికెట్ కీపర్లు ఇద్దరూ అత్యధిక డిస్మిసల్స్ రికార్డుపై కన్నేశారు.

యూఏఈలో నిర్వహిస్తున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌లో దుబయిలో 24, అబుదాబిలో 20, షార్జాలో 12 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఈనెల 19న అబుదాబిలో జరిగే మొదటి మ్యాచ్‌లో నాలుగు సార్లు టైటిల్ దక్కించుకున్న ముంబయి ఇండియన్స్, మూడు సార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)