చైనా: 'భారత్ తన తప్పుడు చర్యలను వెంటనే సరిదిద్దుకుని పరిస్థితి చేయిదాటి పోకుండా చూడాలి'

ఫొటో సోర్స్, AFP
భారతదేశం తన తప్పుడు చర్యలను వెంటనే సరిదిద్దుకోవాలని, సరిహద్దు వెంబడి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని చైనా విదేశాంగ శాఖ బుధవారం ప్రకటించింది. ఇటీవలి ఘర్షణలకు బాధ్యత వహించాల్సింది భారతదేశమేనని కూడా ఆ ప్రకటనలో తెలిపింది.
చైనాలోని అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ పత్రిక ఈ ప్రకటనను ప్రచురించింది. చైనా-భారత్ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారతదేశం వెంటనే స్పష్టమైన చర్యలు తీసుకోవాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెంబిన్ మీడియాతో అన్నారని ఆ పత్రిక వెల్లడించింది.
ఇటీవలి ఘర్షణలకు చైనా బాధ్యత లేదని, దైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించింది భారతదేశమేనని ఆయన అన్నారు. సరిహద్దు వద్ద యథాతథ స్థితిని భారతదేశం ఏకపక్షంగా ఉల్లంఘించిందని, సరిహద్దు దాటి వచ్చి కాల్పులు జరపడం ద్వారా చైనా భద్రతా దళాల రక్షణను ప్రమాదంలో పడేసిందని కూడా వెంబిన్ అన్నారు.
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నాడు పార్లమెంటులో మాట్లాడిన తరువాత వాంగ్ వెంబిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-చైనా సరిహద్దు వివాదం ఇప్పటికీ "అపరిష్కృతంగా"నే ఉందని, సరిహద్దు ఒప్పందాలను చైనా ఉల్లంఘించిందని రాజ్‌నాథ్ అన్నారు.
దీనిపై స్పందిస్తూ, ఇరు దేశాధినేతల మధ్య కుదిరిన కీలక ఒప్పందాలకు భారత్ కట్టుబడి ఉంటుందని తాము ఆశిస్తున్నామని వెంబిన్ అన్నారు. పరిస్థితి మరింత తీవ్రం కాకుండా ద్వైపాక్షిక సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు. రెండు దేశాలు ఉమ్మడిగా సరిహద్దు ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేసేందుకు వీలుగా చైనా ఎప్పుడూ దౌత్య, సైనిక పరమైన చర్చలకు సిద్ధంగా ఉంటుందని వెంబిన్ ఈ ప్రకటనలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పార్లమెంటులో రాజ్‌నాథ్ సింగ్ ఏమన్నారు...
భారత - చైనా సరిహద్దు ఉద్రిక్తతల గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నాడు పార్లమెంటులో వివరణ ఇచ్చారు. ఇప్పటికీ తూర్పు లద్దాఖ్‌లోని గోగ్రా, కోంగ్కా లా ప్రాంతాలలో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా భారీగా బలగాలను మోహరించిందని రాజ్‌నాథ్ తెలిపారు.
పాంగాంగ్ సరస్సు ఉత్తర - దక్షిణ తీరాల వెంబడి కూడా చైనా సేనలు ఉన్నాయని రక్షణ మంత్రి తెలిపారు. చైనా చర్యలకు దీటుగా సరిహద్దు రక్షణ కోసం ఆయా ప్రాంతాలలో భారత సైనిక దళాలను కూడా మోహరించామని, భారత సైనిక దళాలు ఎలాంటి సవాళ్లనైనా సమర్థంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని పార్లమెంటు పూర్తి విశ్వాసంతో ఉండాలని ఆయన కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ మేరకు రక్షణ శాఖ విడుదల చేసిన ప్రకటనలో రాజ్‌నాథ్ సింగ్, "ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇది చాలా సున్నితమైన విషయం కాబట్టి, దీని మీద మరిన్ని వివరాలు ఇవ్వలేకపోతున్నా. కోవిడ్ వ్యాపిస్తున్న సమయంలో ఈ ప్రాంతాలతో పాటు ఐటీబీపీ వద్ద కూడా సైనిక దళాలు అప్రమత్తంగా ఉన్నాయి" అని అన్నారు
చైనాతో సరిహద్దు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నామని, అయితే ఆ దేశం కూడా అందుకు సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు.
తాజా పరిస్థితులను పార్లమెంటుకు నివేదిస్తూ ఆయన ఇంకా, "గత కొన్నేళ్లుగా భారత ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవలి కాలంలో చైనా సరిహద్దు వద్ద సైనిక మోహరింపు సామర్థ్యాన్ని పెంచుకోవడానికి చాలా నిర్మాణాలు చేపట్టింది. దాంతో, భారత ప్రభుత్వం కూడా సరిహద్దు ప్రాంత అభివృద్ధి కోసం బడ్జెట్‌ను గణనీయంగా పెంచింది. దీనివల్ల ఆయా ప్రాంత ప్రజలకు సౌకర్యాలు లభించడమే కాకుండా, సైనికులకు వ్యూహాత్మక మద్దతు లభించినట్లయింది" అని అన్నారు.

ఫొటో సోర్స్, @DEFENCEMININDIA
రాజ్‌నాథ్ ఇంకా ఏమన్నారు? ఆయన మాటల్లోనే...
కల్నల్ సంతోష్ బాబు సహా 19 మంది భారత సైనికులు దేశ సరిహద్దును కాపాడే పోరాటంలో ప్రాణ త్యాగం చేశారు. వారి మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ పార్లమెంటు నిన్న రెండు నిమిషాలు మౌనం పాటించింది.
ఈ ఏడాది ఏప్రిల్ నెల నుచి చైనా దళాలు సరిహద్దు వెంబడి మోహరించడం మొదలైంది. మే నెల ప్రారంభంలో చైనా దళాలు గల్వాన్ లోయలో గస్తీ తిరుగుతున్న భారత సైనికులను అడ్డగించాయి. అది ఘర్షణకు దారి తీసింది. ఎల్ఏసీ వద్ద ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు దేశాల సీనియర్ కమాండర్లు తమ సైన్యాలను వెనక్కి తీసుకోవడానికి అంగీకారానికి వచ్చాయి. కానీ, చైనా దళాలు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడం జూన్ 15న ఇరు పక్షాల సైనికుల మధ్య బాహాబాహీ పోరుకు దారితీసింది. ఆ హింసాత్మక పోరులో మన వీర జవాన్లు కొందరు ప్రాణాలు కోల్పోయారు. చైనా వైపు కూడా భారీగానే ప్రాణ నష్టం జరిగింది.

ఫొటో సోర్స్, ANI
ఈ పరిస్థితులను శాంతియుతంగా పరిష్కరించేందుకు కృత నిశ్చయంతో ఉన్నాం. సెప్టెంబర్ 4న మాస్కోలో చైనా రక్షణ మంత్రితో ఈ సమస్యను లోతుగా చర్చించాం. ఈ సమస్యను మేం శాంతియుతంగా పరిష్కరించాలని భావిస్తున్నాం కాబట్టి, చైనా అందుకు సహకరించాలని కోరాం. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా సెప్టెంబర్ 10న మాస్కోలో చైనా విదేశాంగ మంత్రితో చర్చలు జరిపారు. సరిహద్దు ప్రాంతం నుంచి సైనికులు పూర్తిగా వెనక్కు వెళ్లడానికి, శాంతిని పునరుద్ధరించడానికి వారిద్దరూ అంగీకారానికి వచ్చారు.
గతంలో కూడా ఇలాంటి చైనాతో ఇలాంటి సరిహద్దు ఘర్షణలు తలెత్తాయి. అయితే, ఈసారి వాటి తీవ్రత ఎక్కువగా ఉంది. పైగా, చాలా ప్రాంతాలకు విస్తరించింది. అయితే, మన సైనికులు దృఢంగా, సాహసంతో వ్యవహరిస్తున్నారు. సరిహద్దు ప్రాంతంలో ప్రధాని పర్యటించడం వారి నైతిక స్థయిర్యాన్ని పెంచింది. దేశమంతా వారి వెనుక ఉందనే భావన కలిగించింది.
లద్దాఖ్‌లో మనం సవాళ్లను ఎదుర్కొంటున్నామని చెప్పడానికి నేనేమీ సందేహించడం లేదు. దేశ భద్రత కోసం అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో, కఠినమైన వాతావరణంలో దేశ రక్షణ కోసం నిలబడిన భారత సైన్యానికి మద్దతుగా పార్లమెంటు ఒక తీర్మానాన్ని ఆమోదించాలని కోరుతున్నాను.
కాంగ్రెస్ ప్రతిస్పందన
పార్లమెంటులో రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. చైనా అతిక్రమణ విషయంలో ప్రధాని మోదీ దేశ ప్రజలను తప్పుదారి పట్టించారని రక్షణ మంత్రి మాటలతో స్పష్టమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భారత సైన్యానికి మన దేశ ప్రజలంతా ఎప్పుడూ అండగా నిలబడతారు, మీరెప్పుడు నిలబడతారు మోదీజీ అని రాహుల్ ఈ ట్వీట్‌లో ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- చైనా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్ సింగ్ ఏం మాట్లాడారు?
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- మీడియా జడ్జి పాత్ర పోషించొచ్చా.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అలాంటి కేసులివే
- కరెంట్ లేనప్పుడు సెల్‌ఫోన్ చార్జ్ చేయడమెలా?
- చైనా యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది... తరువాత ఏంటి?
- చైనా యాప్స్ బ్యాన్‌తో అయోమయంలో పడిన టిక్‌టాక్ స్టార్ భవితవ్యం
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం - ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








