టిక్‌టాక్‌ స్టార్‌ గీత్: చైనా యాప్స్ బ్యాన్‌తో అయోమయంలో పడిన భవితవ్యం

Geet
    • రచయిత, సౌత్విక్‌బిశ్వాస్‌
    • హోదా, ఇండియా కరస్పాండెంట్

భారత దేశవ్యాప్తంగా ఉన్న అభిమానుల నుంచి వస్తున్న సందేశాలతో గీత్‌ మెసేజ్ బాక్స్‌ నిండిపోయింది.

టిక్‌టాక్‌లో తన ఫాలోయర్స్‌కు గీత్‌గానే ఆమె బాగా పరిచయం. జాతీయ భద్రతకు ఇబ్బందికరమంటూ డజన్ల సంఖ్యలో చైనీస్‌ యాప్‌లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గీత్‌ ఆశ్చర్య పోయారు.

గతంలో న్యాయవాదిగా పనిచేసిన గీత్‌ ఇండియాలో టిక్‌టాక్‌ స్టార్‌లలో ఒకరు. తన మూడు ఛానళ్ల ద్వారా దాదాపు కోటిమంది ఫాలోయర్స్‌కు ఆమె అమెరికన్‌ ఇంగ్లీష్‌, మానవ సంబంధాలు, వ్యక్తిత్వ వికాసంపై బోధనలు చేస్తుంటారు.

గత ఏడాది కాలంగా ఆమె రోజూ సుమారు 20 సెకండ్ల నిడివిగల 15కు పైగా వీడియోలను అప్‌లోడ్‌ చేశారు. తన సొంత మొబైల్‌ ఫోన్‌, లేదంటే ప్రొఫెషనల్‌ కెమెరాతో ఆమె ఒక్కరోజులో 120 వీడియోలు తయారు చేస్తారు. వారంలో మిగిలిన రోజుల్లో వాటికి స్క్రిప్ట్‌ రాయడం, వీడియోలను ఎడిటింగ్‌ చేసే పనిలో ఉంటారు. “ఈ వార్త వినగానే నేను షాక్‌కు గురయ్యాను. ఎందుకంటే ఇదే నా జీవితం. ఇది నా ఫుల్‌టైమ్‌ జాబ్‌’’ అన్నారామె. ఆమె ఫాలోయర్లు కూడా నిషేధంతో నిరాశకు గురయ్యారు. “నేనిప్పుడు ఇంగ్లీషు ఎలా నేర్చుకోను’’ అని ఒకరు ప్రశ్నించగా, “నాలో స్ఫూర్తి నింపేది ఎవరు’’ అని మరొకరు రాశారు.

చౌకలో డేటా లభించడం, యువత ఎక్కువగా ఇష్టపడటంతో గత మూడేళ్లలో భారతదేశంలో 20కోట్లమంది టిక్‌టాక్‌ యూజర్లుగా మారారు. చిన్నచిన్నవి, సులభంగా షేర్‌ చేసుకోదగిన వీడియోలు యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్‌లో ఫిల్టర్లు, సంగీతం, వివిధ రకాల శబ్దాలు, హ్యాష్‌ట్యాగ్‌లతో కోట్లాదిమంది యువతీ యువకులు వీడియోలను తయారు చేశారు. పాటలు, డాన్సులు, కామెడీ స్కిట్లు, ప్రాంక్‌లు, కెరీర్‌ టిప్స్, లాంగ్వేజ్‌ ట్రైనింగ్‌, యోగా క్లాసులు ఇలా వివిధ విభాగాలలో వీడియోలు రూపొందాయి.

వీటితోపాటు కొన్ని విద్వేషపూరితమైనవి, హింసను ప్రేరేపించేవి, ఆత్మహత్యలు, ప్రమాదకర విన్యాసాలతో కూడిన వీడియోలు కూడా ఉన్నాయి. నేరస్తులను పట్టించడంలో కొన్నిసార్లు టిక్‌టాక్‌ పోలీసులకు ఉపయోగపడింది.

15 సెకన్ల నుంచి 1 నిమిషం నిడివిగల వీడియోలను ఈ యాప్‌లో తయారు చేసుకునే అవకాశం ఉంది. భారతీయ యువత తమ మనసులోని భావాలను, ఆకాంక్షలను, ఆక్రోశాలను ఇలా వీడియోల రూపంలో వ్యక్తీకరించే ప్రయత్నం చేశారు.

Young Indian men making a TikTok video in Hyderabad.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టిక్ టాక్ వీడియో చేస్తున్న హైదరాబాద్ యువకులు

“ఇదో అంతులేని వినోదప్రపంచం. తమ గురించి తాము చెప్పుకోలేనివారికి ఈ ప్లాట్‌ఫామ్‌ బాగా ఉపయోగపడింది. వివిధ లింగభేదాలున్న వ్యక్తులు తమను తాము స్వేచ్ఛగా ఆవిష్కరించుకునే అవకాశం దక్కింది. మహిళలు తమ సత్తాను చాటిచెప్పారు. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఎంతోమంది సృజనాత్మక వ్యక్తులు ఉన్నారు’’ అని టిక్‌టాక్‌లో పాఠాలు చెప్పే అమిత్‌ వర్మ అన్నారు.

గీత్‌నే ఉదాహరణకు తీసుకుంటే, తానెప్పుడు టిక్‌టాక్‌లో ఇంత ఫేమస్‌ కావాలని కలలు కనలేదు. ఇండియాలో పుట్టి సియాటెల్‌లో పెరిగిన ఆమె, దిల్లీ రావడానికి ముందు ఇంజినీరింగ్‌ చదివి, తర్వాత ఒక లా కంపెనీలో పని చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో టిక్‌టాక్‌ ఎకౌంట్ ఓపెన్‌ చేయక ముందు, మురికివాడల్లో పిల్లల కోసం పని చేశానని గీత్‌ చెప్పారు. ఆమె తల్లిదండ్రులు కూడా సామాజిక సేవ చేస్తుంటారు. “ నేను చేసే పనికి టిక్‌టాక్‌ ఒక కొనసాగింపు. నేను రూపొందించిన ఒక్క వీడియో ఎంతోమందికి చేరుతుంది. సమస్యల్లో ఉన్నవారికి సహాయపడుతుంది’’ అని గీత్‌ అన్నారు.

తన క్లయింట్లలో ఎక్కువమంది యువతే ఉంటారని గీత్‌ వెల్లడించారు. చాలామంది అమెరికన్‌ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఆమె నిర్వహిస్తున్న మూడు ఛానళ్లలో ఒకదానికి 60 లక్షలమంది ఫాలోయర్లు ఉన్నారు. ఈ ఛానల్‌లో ఆమె హిందీ సాయంతో ఇంగ్లీషును నేర్పుతుంటారు.

వైరల్‌ అయిన వీడియోలలో ఒకదాంట్లో చెప్పులను ఎన్నిరకాలుగా వర్గీకరించవచ్చో గీత్‌ చెబుతూ ఉంటారు. ఫ్లిప్‌ఫ్లాప్స్‌, లోఫర్స్‌, స్లిప్పర్స్‌, ఫ్లాట్స్‌, హైహీల్స్‌ ఇలా చెప్పుల్లో రకాలను ఆమె వివరిస్తుంటారు.

మరో వీడియోలో ఆమె తన తల్లి తప్పుగా ఉచ్ఛరించే బ్రేక్‌ఫాస్ట్‌, డజర్ట్‌, ఫుడ్‌, వెజిటెబుల్స్‌, పియర్స్‌లాంటి పదాలను సరిగ్గా ఎలా పలకాలో నేర్పిస్తుంటారు. మరో వీడియోలో హ్యాపీబర్త్‌ డేను ఏడు విధాలుగా ఎలా చెప్పవచ్చో ఆమె వివరిస్తుంటారు. “అన్నీ చిన్నచిన్న వీడియోలు. సరదాగా, నేర్చుకోడానికి వీలుగా ఉంటాయి’’ అని ఆమె వివరించారు.

Geet

ఆమె నిర్వహిస్తున్న మరో రెండు ఛానెళ్ల ద్వారా కుటుంబ బాంధవ్యాలపై సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అలాగే యువకులు చాలమంది అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ స్పూర్తి నింపే ప్రయత్నం చేస్తుంటారు. “బ్రేకప్‌ బాధ నుంచి ఎలా బయటపడాలి అన్నదే నాకు ఎక్కువగా ఎదురయ్యే ప్రశ్న. నా భాగస్వామి నాకు ఎక్కువ సమయం కేటాయించకపోతే ఏం చేయాలి అన్నది మరో ముఖ్యమైన ప్రశ్న. పెళ్లయినవారు ఇంట్లోగొడవలు, గృహహింస గురించి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతుంటారు’’ అని చెప్పారు గీత్‌.

టిక్‌టాక్ ద్వారా తనకు తెలిసిన వారిలో చాలామంది జీవితాలను మార్చగలిగానని గీత్‌ చెప్పారు. ఎక్కువమంది ఫాలోయర్లు ఉన్నవారిని అడ్వర్టయిజర్లు సంప్రదిస్తారు. “నా స్నేహితుల్లో చాలామందికి ఈ యాప్‌ ఒక ఆదాయ వనరు’’ అని గీత్‌ చెప్పారు. “నా సేవలను అందరూ గుర్తించడమే నాకు చాలు. నేను సంతోషంగా ఉన్నాను’’ అన్నారామె.

ఒక ఆటో రిక్షా నడిపే వ్యక్తి సరిగా చదవని తన కొడుకు గురించి వీడియో ద్వారా సలహా ఇవ్వమని అడుగుతారు. ఒక్కోసారి ఆమె షాపింగ్‌ మాల్‌కు వెళ్లినప్పుడు ‘‘టిక్‌టాక్‌లో ఇంగ్లీషు నేర్పించేంది మీరే కదా’’ అని ఇంకొకరు గుర్తుపట్టి అడుగుతారు.

టిక్‌టాక్‌ యాప్‌ తన జీవితాన్నే మార్చేసిందంటారు గీత్‌. పదేళ్ల వయసులో వెన్నెముకకు గాయం కారణంగా ఆమె చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. “సమానత్వాన్నిఇవ్వడంలో ఇదొక మంచి ప్లాట్‌ఫామ్‌. అంగవైకల్యం ఉన్న అనేకమందికి టిక్‌టాక్‌లో మంచి ఆదరణ లభించింది’’ అని అన్నారు గీత్‌.

India mobile users

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో 20 కోట్లకు పైగా టిక్ టాక్ యూజర్లున్నారు.

కరోనాను అడ్డుకోడానికి విధించిన లాక్‌డౌన్‌ ఆమెకు ఇబ్బందులు తెచ్చింది. లాక్‌డౌన్‌కు ముందు మార్చి నెలలో ఆమె సియాటెల్‌లో ఉన్న తన సోదరుడి దగ్గరకు వెళ్లారు. అక్కడి నుంచే వీడియోలు తయారు చేయడం మొదలుపెట్టారు. తన ఫ్యాన్స్‌ను కోల్పోకుండా లైవ్‌ స్ట్రీమింగ్‌లతో ఆమె వారితో టచ్‌లో ఉంటూ వారికి పజిల్స్‌, గేమ్స్‌ నిర్వహిస్తూ వచ్చారు. “ఇది చాలా కష్టకాలం’’ అన్నారామె.

సోమవారం నుంచి ఆమె కష్టాలు మరింత పెరిగాయి. టిక్‌టాక్‌ మీద బ్యాన్‌ విషయంలో ఎంతో ఆందోళనలో ఉన్న ఫాలోయర్లను ఆమె పలకరించారు.

“భయపడవద్దు. ధైర్యాన్ని వీడవద్దు. ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని, మనమంతా తిరిగి కలుసుకుంటామని ఆశిద్దాం. అప్పటి వరకు ఎవరూ ఆందోళన చెందవద్దు, తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దు’’ అని ఆమె తన ఫాలోయర్లకు సూచించారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)