భారత్ బయోటెక్: జులై నుంచి మనుషులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే సంస్థ భారత్ బయోటెక్ తాము అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను జులై నుంచి మానవులపై పరీక్షించనుంది.
ఇప్పటికే జంతువులపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించగా సురక్షితమేనని తేలడంతో పాటు సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.
ప్రపంచవ్యాప్తంగా 120కిపైగా వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయి. భారత్‌కు చెందిన సుమారు 6 సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి.
స్థానికంగా సేకరించిన వైరస్ స్ట్రెయిన్‌ను ప్రయోగశాల పరిస్థితులకనుగుణంగా బలహీనపరిచి, అందులోనుంచి వాక్సిన్ తయారు చేశారు. ఇలాంటి తొలి భారతీయ వ్యాక్సిన్ ఇదే.

డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఏ) భారత్ బయోటెక్‌కు రెండు దశల్లో మానవులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతులిచ్చింది.
తాము జరిపిన ముందస్తు పరిశోధనల ఫలితాల ఆధారంగా ఇది ఎంతవరకు సురక్షితం, రోగనిరోధక ప్రతిస్పందన ఎలా ఉందనే వివరాలు సమర్పించడంతో తమకు అనుమతులు వచ్చాయని భారత్ బయోటెక్ వెల్లడించింది.
వ్యాక్సిన్ ఎంత సమర్థంగా పనిచేస్తుందనే అంశం కంటే ఇది ఎంత సురక్షితం అనేదే ప్రధానంగా ఈ ప్రయోగాలు జరుగుతాయి.
స్థానికంగా సేకరించిన వైరస్ భాగం ఈ వాక్సిన్ తయారీలో ముఖ్యపాత్ర పోషించింది అని ఆ సంస్థ తెలియజేసింది.
"ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో ఉన్న కరోనా వైరస్‌ల మధ్య భేదం ఏమిటి అనేదానిపై ఇంకా పరిశోధన జరుగుతోంది" అని భారత్ బయోటెక్ సంస్థ ప్రతినిధి బీబీసీకి తెలిపారు.
కోవాక్సిన్
దీని పేరు కోవాక్సిన్. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో ఈ వాక్సిన్ స్థానికంగా తయారు చేసినట్లు భారత్ బయోటెక్ సంస్థ చైర్మన్ కృష్ణ ఎల్లా తెలిపారు.
భారత్ బయోటెక్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ వివిధ వ్యాక్సిన్లను 400 కోట్ల డోసులకు పైగా పంపిణీ చేసింది.
హెచ్1ఎన్1, రోటావైరస్ మొదలైన వాటికి ఈ సంస్థ వ్యాక్సిన్లు తయారుచేసింది.

ఫొటో సోర్స్, Reuters
మిగతా సంస్థలూ
భారత్ బయోటెక్ మాత్రమే కాకుండా జైడస్ కాడిలా సంస్థ కూడా కరోనావైరస్‌కు రెండు వాక్సిన్లు తయారుచేసే పనిలో ఉంది. బయొలాజికల్ ఈ. ఇండియన్ ఇమ్యునాలజికల్స్, మైన్వాక్స్ సంస్థలు ఒక్కో వాక్సిన్ తయారీలో ఉన్నాయి. ఇవే కాకుండా మరో నాలుగైదు వాక్సిన్లు స్థానికంగా తయారవబోతున్నాయి. ఇవి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి.
ప్రపంచంలోనే అతి పెద్ద వాక్సిన్ తయారీ సంస్థ, పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ఒక వాక్సిన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ వాక్సిన్‌ను యూకే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం తయారచేస్తోంది.
ప్రపంచంవ్యాప్తంగా సాధారణ మందులు, వాక్సిన్ల తయారీలో భారతదేశం ముందజలో ఉంది. ఒక అరడజను ప్రధానమైన వాక్సిన్లకు ఇండియా పుట్టినిల్లు.
మరెన్నో పెద్ద, చిన్న వాక్సిన్లు కూడా ఇక్కడ భారీగా ఉత్పత్తవుతున్నాయి.
పోలియో, మెనింజైటస్, న్యుమోనియా, రోటావైరస్, బీసీజీ, మశూచి, రుబెల్లా వంటి అంటురోగాలకు మనదేశంలో పెద్దఎత్తున వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- మాస్క్‌లు వైరస్‌ల వ్యాప్తిని అడ్డుకోగలవా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








