ఇక టిక్ టాక్ పాఠాలు.. విద్యారంగంలోకి అడుగుపెడుతున్న చైనా యాప్

టిక్ టాక్ కంపెనీ లోగో

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఒస్మాన్ ఇక్బాల్
    • హోదా, బీబీసీ క్లిక్

సోషల్ మీడియా దిగ్గజం టిక్ టాక్.. ఇక విద్యారంగంలో కూడా అడుగుపెట్టబోతోంది. ఈ మేరకు విద్యా సంబంధమైన కంటెంట్‌ను సిద్ధం చేసే పనిని వందలాదిమంది విద్యా వేత్తలకు, విద్యా సంస్థలకు అప్పగిస్తున్నట్టు ప్రకటించింది.

టిక్ టాక్ కోసం ప్రత్యేకంగా కంటెంట్‌ను సిద్ధం చేసే సంస్థల్లో వివిధ విశ్వ విద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి.

2017లో టిక్ టాక్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంలలో 200 కోట్ల సార్లకు పైగా డౌన్ లోడ్ అయ్యింది.

ఇప్పటి వరకు వినియోగదారులు 15 సెకన్ల నిడివి ఉండే కంటెంట్‌ను ఈ యాప్ ద్వారా రూపొందించగల్గేవారు. ఈ సమయంలో పూర్తి స్థాయిలో విద్యా సంబంధమైన కంటెంట్‌ను రూపొందించేందుకు టిక్ టాక్ సిద్ధపడటం చెప్పుకోదగ్గ నిర్ణయం అని చెప్పవచ్చు.

లాంచింగ్ వీడియోల్లో బ్రిటిష్ నటుడు సేన్ సగర్ ఆడిషన్స్ కోసం ఇచ్చే టిప్స్‌, గణితంలో నైపుణ్యాన్ని పెంచుకునేందుకు ప్రముఖ టీవీ ప్రెజెంటర్, గణిత శాస్త్రవేత్త రేచల్ రేలీ ఇచ్చే సూచనలు సలహాలు ఉంటాయి.

“టిక్ టాక్ యూజర్లు విద్యా సంబంధమైన వీడియోల పట్ల చాలా ఆసక్తిగా ఉన్నట్లు మేం గమనించాం. హ్యాష్‌ట్యాగ్ #LearnOnTikTokకు సుమారు 700కోట్ల వ్యూస్ వచ్చాయి” అని టిక్ టాక్ యూరోప్ విభాగానికి చెందిన జనరల్ మేనేజర్ రిచ్ వాటర్ వర్త్ బీబీసీ క్లిక్‌తో అన్నారు.

ప్రముఖ టీవీ ప్రెజెంటర్, గణిత శాస్త్రవేత్త రేచల్ రేలీ
ఫొటో క్యాప్షన్, ప్రముఖ టీవీ ప్రెజెంటర్, గణిత శాస్త్రవేత్త రేచల్ రేలీ

డిస్నీ మాజీ బాస్ మాయాజాలం

టిక్ టాక్ తీసుకున్న నిర్ణయం వల్ల యువ వీక్షకులు అనేక రకాల కథనాలను అన్వేషించి వాటి గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని ఇంగ్లిష్ హెరిటేజ్ సంస్థ సోషల్ మీడియా మేనేజర్ మార్టిన్ జెఫ్ఫరీస్ అభిప్రాయపడ్డారు. ఇంగ్లిష్ హెరిటేజ్ సంస్థ బ్రిటన్లోని సుమారు 400 చారిత్రక ప్రాంతాలను పరిరక్షిస్తోంది.

యూజర్ జనరేటెడ్ కంటెంట్‌తో పాటు ఇప్పుడు ప్రొఫెషనల్‌గా ప్రొడ్యూస్ చేసిన కంటెంట్ కూడా అందుబాటులోకి రానుంది. డిస్నీ సంస్థకు చెందిన మాజీ బాస్ టిక్ టాక్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ సంస్థ ఓ సరికొత్త దిశగా ప్రయాణం ప్రారంభించినట్టు కనిపిస్తోందని ఎండర్స్ ఎనాలసిస్‌కి చెందిన జేమీ మెక్ ఇవాన్ అభిప్రాయపడ్డారు.

“టిక్ టాక్ తన పరిధిని మరింత విస్తృత పరచుకోవడం ద్వారా నిర్మాణాత్మకంగా కనిపించాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. మున్ముందు మరింత ప్రీమియం కంటెంట్‌తో అడుగులు వేస్తోంది. డిస్నీ సంస్థ నుంచి టిక్ టాక్ కొత్త సీఈఓగా బాధ్యతలు తీసుకున్న కెవిన్ మేయర్ వచ్చిన తర్వాత ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కంటెంట్ విషయంలో ఓ డీల్ మేకర్‌గా ఆయన గురించి మాకు తెలుసు. కచ్చితంగా మున్ముందు మనం మరిన్ని భాగస్వామ్యాలను చూడబోతున్నాం” అని మెక్ ఇవాన్ చెప్పుకొచ్చారు.

డిస్నీ ప్లస్ స్ట్రీమింగ్ డివైస్‌ను లాంచ్ చేయడంలో మేయర్ విజయవంతమయ్యారు. 2019 నవంబర్లో ప్రారంభమైన డిస్నీ ప్లస్‌కు ఇప్పుడు సుమారు 5 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అలాగే లుకాస్ ఫిల్మ్, పిక్సర్, మార్వెల్ కంపెనీలను డిస్నీసొంతం చేసుకోవడంలోనూ మేయర్ కీలక పాత్ర పోషించారు.

అయితే ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉన్న ఆన్ లైన్ లెర్నింగ్‌నే టిక్ టాక్ ఫాలో అవుతోందని సండర్లాండ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ ఎలిజబెత్ హిడ్సన్ వ్యాఖ్యానించారు.

“మనలో చాలా మంది మనకు కావాల్సిన నిర్మాణాత్మక వీడియోల కోసం ఆన్‌లైన్లో వెతుకుతూ ఉంటాం. ఇప్పటికే చిన్న చితకా సంస్థలు ఈ పని ప్రారంభించి ఆన్ లైన్ ఎడ్యుకేషన్ విధానంలో పూర్తిగా స్థిరపడ్డాయి కూడా. ఈ విధానాన్ని మేం మైక్రో లెర్నింగ్ అని పిలుస్తాం” అని ఆమె చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)