భారత్ - చైనా విదేశాంగ మంత్రుల ఫోన్ సంభాషణ.... సరిహద్దు ఉద్రిక్తతల నివారణకు చర్యలు

గాల్వాన్ వ్యాలీలో భారత, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ, ప్రాణ నష్టం తరువాత రెండు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులు ఎస్.జయశంకర్, వాంగ్ యి మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ సందర్భంగా భారత ప్రభుత్వం తరఫున విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. జూన్ 6న సీనియర్ మిలటరీ కమాండర్ల మధ్య జరిగిన సమావేశంలో ఉద్రిక్తతల నివారణ, వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ దళాలు కలహించుకోకుండా చూసుకోవాలన్న ఒప్పందం కుదిరిందని ఆయన గుర్తుచేశారు.
ఈ విషయంలో కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేసేందుకు గత వారమంతా గ్రౌండ్ కమాండర్లు నిత్యం సమావేశామయ్యారని.. ఉద్రిక్తతల నివారణ కొంత పురోగతి కనిపిస్తున్న సమయంలో వాస్తవాధీన రేఖ నుంచి భారత్ వైపు గాల్వాన్ వ్యాలీలో శిబిరాల ఏర్పాటుకు చైనా ప్రయత్నించిందని.. వివాదానికి ఇది కారణం కాగా చైనా సైనికులు హింస, మరణాలకు కారణమయ్యేలా ఘర్షణలను నేరుగా ప్రేరేపించారని జయశంకర్ చైనా మంత్రితో అన్నారు.
''యథాతథ స్థితిని మార్చరాదన్న అన్ని ఒప్పందాలను ఉల్లంఘిస్తూ వాస్తవాలను మార్చేసేందుకు చైనా ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించిన విషయాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.
ముందెన్నడూ లేని ఇలాంటి స్థితి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంద''ని జయశంకర్ అన్నారు.
చైనా తన చర్యలను మళ్లీ విశ్లేషించుకుని సరిదిద్దుకునేందుకు అడుగులు వేయాలని జయశంకర్ సూచించారు. జూన్ 6న సీనియర్ కమాండర్ల స్థాయిలో కుదిరిన ఒప్పందాలను రెండు పక్షాలు అత్యంత జాగ్రత్తగా, నిబద్ధతతో అమలుచేయాలన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ద్వైపాక్షిక ఒప్పందాలు, పద్ధతులకు కట్టుబడి ఉండాలి. వాస్తవాధీన రేఖను కచ్చితంగా గౌరవించాలి.. ఏకపక్షంగా దాన్ని మార్చే ప్రయత్నాలు చేయరాదని జయశంకర్ అన్నారు.
కాగా చైనా విదేశీ వ్యవహారాల మంత్రి తాజా పరిణామాల్లో చైనా స్థితిని తెలిపారు.రెండు దేశాలూ బాధ్యతాయుత రీతిలో పరిస్థితులను చక్కదిద్దుకోవాలని వారీ సంభాషణల్లో ఒక అవగాహనకు వచ్చారు. రెండు పక్షాలూ కలహించుకోరాదన్న జూన్ 6 నాటి ఒప్పందాన్ని రెండు పక్షాలూ అమలు చేయాలని.. ఉద్రిక్తతలను పెంచేలా ఎవరూ చర్యలకు దిగరాదని ఇద్దరు మంత్రులు నిర్ణయించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Atul Loke
'భారత సైన్యానికి ఎందుకు చెడ్డపేరు తెస్తున్నారు?' రక్షణ మంత్రికి రాహుల్ 5 ప్రశ్నలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అయిదు ప్రశ్నలు సంధించారు.రాజ్‌నాథ్ సింగ్‌కు రాహుల్ రీట్వీట్ చేస్తూ ఇలా ప్రశ్నించారు.ఇది చాలా బాధాకరం1.మీరు మీ ట్వీట్‌లో చైనా పేరు రాయకుండా, భారత సైన్యాన్ని ఎందుకు అవమానిస్తున్నారు. 2.నివాళులు అర్పించడానికి రెండు రోజులు ఎందుకు పట్టింది.3.సైనికులు అమరులైన సమయంలో మీరు ర్యాలీలో ఎందుకు మాట్లాడుతున్నారు.4.మీరు మౌనంగా ఎందుకున్నారు. క్రోనీ మీడియాతో సైన్యానికి ఎందుకు చెడ్డపేరు తెస్తున్నారు. 5.అమ్ముడుపోయిన మీడియా ప్రభుత్వాన్ని కాకుండా సైన్యాన్ని ఎందుకు నిందిస్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, ANI
భారత సైనికుల త్యాగం వృథాగా పోదు... దీటుగా బదులిస్తాం' - ప్రధాని మోదీ
సరిహద్దుల్లో భారత్ సైనికుల ప్రాణత్యాగం వృథాగా పోదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత్ శాంతిని కోరుకుంటుందఅయితే ఎవరైనా రెచ్చగొడితే దీటుగా సమాధానం ఇచ్చే సామర్థ్యం ఉందని ఆయన చెప్పారు.
"ఈ కష్ట సమయంలో అమరులైన సైనికుల కుటుంబాలకు సంఘీభావం వ్యక్తం చేస్తున్నా. నేడు దేశ మంతా మీ వెంట ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా.. భారత్ ప్రతి అంగుళాన్ని కాపాడుకుంటుంది. ఆత్మగౌరవాన్నీ నిలబెట్టుకుంటుంది."
"సంస్కృతి పరంగా భారత్ చాలా శాంతియుతమైన దేశం. మనం ఎప్పుడూ పొరుగు దేశాలతో సన్నిహిత, సహకార సంబంధాలనే కోరుకుంటున్నాం. వారి అభివృద్ధి కోసం కూడా పనిచేస్తున్నాం. విభేదాలెప్పుడూ వివాదాలుగా మారకుండా ప్రయత్నిస్తున్నాం. మనం ఎవరినీ ఊరికే రెచ్చగొట్టం. అయితే మన సార్వభౌమత్వం లేదా ఐక్యతకు భంగం కలిగిస్తే మన బలాన్ని కూడా ప్రదర్శించి చూపించాం. ధైర్యం, త్యాగం, వీరత్వం.. మన చరిత్రలో భాగమై ఉన్నాయి. మన సైనికుల ప్రాణత్యాగం వృథాగా పోదని దేశానికి భరోసా ఇస్తున్నాను. సార్వభౌమత్యం, ఐక్యతకు ఎవరూ భంగం కలిగించలేరు. భారత్ శాంతిని కోరుకుంటుంది. ఈ విషయంపై ఎవరికీ ఎలాంటి సందేహాలూ ఉండకూడదు. అయితే ఎవరైనా రెచ్చగొడితే దీటుగా సమాధానం ఇచ్చే సామర్థ్యం మనకు ఉంది."
అమరులైన సైనికుల గురించి ఓ విషయం మనం తెలుసుకోవాలి. దేశానికి వారు గర్వకారణం. ఎందుకంటే వారు చంపుతూ చంపుతూ అమరులయ్యారు."

ఫొటో సోర్స్, ANI
'గాల్వాన్ లోయ మాదే... భారత్ మాట మారుస్తోంది' - చైనా
"గాల్వాన్ లోయపై సార్వభౌమాధికారం చైనాకు ఉంది. కమాండర్ స్థాయి చర్చల్లో ఇదివరకు కుదిరిన అంగీకారాలు, ప్రోటోకాల్స్‌ను భారత సరిహద్దు బలగాలు ఉల్లంఘిస్తూ.. మాటలు మారుస్తున్నాయి" అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లినియాన్ వ్యాఖ్యానించారు.
"సరిహద్దు బలగాలను క్రమశిక్షణలో పెట్టాలని భారత్‌కు సూచిస్తున్నాం. అలాగే సరిహద్దు అతిక్రమణలు, రెచ్చగొట్టే చర్యలను వెంటనే ఆపేయాలని కూడా చెబుతున్నాం. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు సరైన మార్గంలో రమ్మని పిలుస్తున్నాం."అని కూడా ఆయన చెప్పారు.
"దౌత్య, సైనిక మార్గాల్లో మనం చర్చలు జరుపుతున్నాం. ప్రస్తుత ఘటనలో తప్పుఒప్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఘటన వాస్తవాధీన రేఖకు చైనా వైపు జరిగింది. ఈ విషయంలో చైనాపై ఆరోపణలు చేయడం సరికాదు. మేం మరిన్ని ఘర్షణలను చూడాలని కోరుకోవట్లేదు."అని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
భారత్‌లో విపక్షం ఏమంటోంది?
"రెండు రోజుల క్రితం 20 మంది భారత సైనికులు మరణించారు. భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించింది. ప్రధాన మంత్రి మోదీజీ మీరు ఇంకా మౌనంగా ఎందుకు ఉన్నారు? మీరు ఎక్కడ దాక్కున్నారు?
దేశమంతా మీ వెనక నిలబడుతోంది. మీరు ముందు బయటకు రండి. నిజం చెప్పండి." అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. "మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు దాగుంటున్నారు? ఇప్పటికే జరిగింది చాలు. ఏం జరిగిందో మేం తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మన సైనికుల్ని హతమార్చడానికి చైనాకు ఎంత ధైర్యం? ఎంత ధైర్యముంటే వారు మన భూభాగాన్ని తీసుకుంటారు?" అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
భారత్ రక్షణ మంత్రి ఏమన్నారు?
"గాల్వాన్ లోయలో సైనికుల్ని కోల్పోవడం చాలా బాధాకరం. కర్తవ్య నిర్వహణలో భాగంగా మన సైనికులు అసామాన ధైర్య సాహసాలు, పరాక్రమం ప్రదర్శించారు. భారత్ కోసం వారు ప్రాణ త్యాగం చేశారు. వారి త్యాగాలను దేశం ఎప్పటికీ మరచిపోదు. అమరుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతున్నాం. ఈ కష్ట సమయంలో దేశం మొత్తం వారితో నిలబడుతుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి ధైర్యసాహసాలను చూసి గర్వపడుతున్నాం."అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
నేపాల్ ఏం అంటోంది?
భారత్-చైనా ఘర్షణల వార్తవిని విశ్మయానికి గురైనట్లు నేపాల్ సీనియర్ దౌత్య నిపుణులు వ్యాఖ్యానించారు.రెండు దేశాలూ ప్రశాంతంగా ఉండాలని వారు అభ్యర్థించారు. ఈ సైనిక ఘర్షణ మరింత పెరిగితే.. ఈ ప్రాంతం మొత్తం పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
నేపాల్ విదేశాంగ శాఖ మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు. అయితే సరిహద్దు వివాదాలు పరిష్కరించుకొనే దిశగా భారత్, చైనా దౌత్యపరమైన చర్చలను వేగవంతం చేయాలని మాజీ డిప్యూటీ ప్రధాని, మాజీ విదేశాంగ మంత్రి సుజాతా కోయిరాలా వ్యాఖ్యానించారు. "మాకు భారత్, చైనాలతో మంచి సంబంధాలున్నాయి. వారి మధ్య కూడా బంధాలు బలపడాలని మేం కోరుకుంటున్నాం. అది నేపాల్‌కు కూడా మంచిది. భారత్ చైనాల మధ్య ఏ ఘర్షణ అయినా.. ఆసియా మొత్తంపై ప్రభావం చూపుతుంది."
అమెరికా, బ్రిటన్ ఏం చెబుతున్నాయి?
"వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి అన్ని అంశాలు జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఇలాంటి ఘర్షణపూరిత వాతావరణాన్ని కొనసాగించాలని అనుకోవడంలేదని భారత్, చైనా రెండువైపులా స్పష్టంచేశాయి.
ఈ సమస్యకు శాంతియుతంగా పరిష్కారం లభించేందుకు మేం మద్దతు అందిస్తున్నాం" అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రటకన విడుదల చేశారు. "జూన్ 2న, భారత్, చైనా సరిహద్దు పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భారత ప్రధాన మంత్రి మోదీ మాట్లాడారు."అని దానిలో పేర్కొన్నారు. మరోవైపు.. "ఈ పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయి. సరిహద్దు వివాదాలకు సంబంధించి భారత్, చైనా చర్చలు జరపాలని మేం కోరుకుంటున్నాం." అని భారత్‌లోని బ్రిటన్ హైకమిషన్ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.
ఐక్యరాజ్యసమితి ఏం అంటోంది?
భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణల వార్తవిని ఆందోళనకు గురైనట్లు ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి ఎరి కనెకో వ్యాఖ్యానించారు. రెండు దేశాలు నిగ్రహంతో ఉండాలని ఐరాస అభ్యర్థిస్తున్నట్లు చెప్పారు. ఉద్రిక్త పరిస్థితులను మరింత పెంచకుండా చూసేందుకు సంసిద్ధత వ్యక్తంచేయడాన్ని శుభ పరిణామంగా అభివర్ణించారు.

ఫొటో సోర్స్, ROUF BHAT
చైనా సరిహద్దులో ఘర్షణ... 20 మంది భారత సైనికుల మృతి
హిమాలయల పర్వతాల్లోని లద్ధాఖ్‌లోని గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో జూన్ 15 - 16వ తేదీ రాత్రి.. అంటే సోమవారం అర్ధరాత్రి సమయంలో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో మొత్తం 20 మంది భారత సైనికులు మరణించారని ఇండియన్ ఆర్మీ మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది.
తొలుత ఒక కల్నల్ సహా ముగ్గురు మరణించారని ప్రకటించిన సైన్యం.. ఆ తరువాత ఎత్తయిన ప్రాంతంలో చోటుచేసుకున్న ఆ ఘర్షణలో తీవ్రంగా గాయపడి అతి శీతల వాతావరణంలో చిక్కుకున్న మరో 17 మంది సైనికులూ మరణించారని వెల్లడించింది.
దీంతో మొత్తం మృతుల సంఖ్య 20కి పెరిగిందని అధికారికంగా వెల్లడించింది. ఈ ఘర్షణలో గాయపడిన మరో నలుగురు భారత సైనికుల పరిస్థితి విషమయంగా ఉందని మంగళవారం నాడు సైనిక వర్గాలు చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సైన్యం కట్టుబడి ఉందని ఆర్మీ అధికారిక ప్రకటనలో ఉద్ఘాటించింది.
ఈ హింసాత్మక ఘర్షణలో 40 మంది కన్నా ఎక్కువ మంది చైనా సైనికులు కూడా మరణించినట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయని ఏఎన్ఐ వార్తా సంస్థ చెప్పింది.
భారత సైనికులతో ఘర్షణలో పాల్గొన్న చైనా సైనిక విభాగం కమాండింగ్ ఆఫీసర్ కూడా చనిపోయినట్లు సైనిక వర్గాలు నిర్ధారించినట్లు పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
అసలు ఏం జరిగింది?
సోమవారం రాత్రి హింసాత్మక ఘర్షణకు దారితీసిన పరిస్థితులు ఏమిటనేది స్పష్టంగా తెలియటం లేదు. గాల్వన్ వ్యాలీలో ఇరు పక్షాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖను చైనా ఉల్లంఘించిందని భారత్ ఆరోపిస్తోంటే.. భారతదేశమే ఉల్లంఘించిందని చైనా ఆరోపిస్తోంది.
ఈ ఘర్షణలో ఇరుపక్షాల సైనికులూ వట్టి చేతులు, రాళ్లు, కర్రలు, ఇనుపచువ్వలతో పరస్పరం దాడిచేసుకున్నట్లు చెప్తున్నారు. ఎవరూ కాల్పులు జరపలేదని ఇరు దేశాలూ ఉద్ఘాటిస్తున్నాయి.
ఈ ఘర్షణలో గాయపడ్డ భారత సైనికులు మైనస్ డిగ్రీల్లో ఉండే అతి శీతల వాతావరణంలో చిక్కుకున్నారని.. అందువల్ల మృతుల సంఖ్య 20కి పెరిగిందని భారత సైన్యం చెప్పింది. మరో నలుగురు సైనికుల పరిస్థితి విషమంగా ఉందని బుధవారం వెల్లడించింది.
చైనా సైనికులు కూడా 40 మందికి పైగా చనిపోయారని భారత్ చెప్తున్నప్పటికీ.. చైనా ప్రభుత్వం కానీ, సైన్యం కానీ తమ సైనికుల మరణాల గురించి అధికారికంగా ఏ విషయమూ చెప్పలేదు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ ఏమంటోంది?
లద్ధాఖ్ సరిహద్దులో కొద్ది కాలంగా పెరిగిపోయిన ఉద్రిక్తతలను తగ్గించటానికి ఇరు దేశాలూ సైనిక, దౌత్య మార్గాలను అనుసరిస్తున్నాయని.. జూన్ 6వ తేదీన సీనియర్ కమాండర్ల సమావేశం ఫలప్రదంగా జరిగిందని భారత్ చెప్తోంది.
ఇరువురి మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రక్రియకు అంగీకారం కుదిరిందని.. దానిని అమలు చేయటానికి క్షేత్ర స్థాయిలో కమాండర్ల మధ్య పలు సమావేశాలు జరిగాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
అయితే.. ఈ ఒప్పందాన్ని చైనా గౌరవించలేదని.. చైనా బలగాలు వాస్తవాధీన రేఖ దాటి వచ్చేందుకు ప్రయత్నించడంతో భారత బలగాలు అడ్డుకున్నాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
భారత బలగాలు వాస్తవాధీన రేఖను దాటలేదని చెప్పింది. ఈ ఘర్షణలో రెండు వైపులా మరణాలు చోటు చేసుకున్నాయని.. భారత్ శాంతి కోరుకుంటుంది కానీ సరిహద్దు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
భారత్ ఎల్‌ఏసీ దాటబోదని, చైనా బలగాలు కూడా దాటకుండా ఉంటే మంచిదని భారత విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో హెచ్చరించింది.

ఫొటో సోర్స్, Getty Images
చైనా ఏం చెప్తోంది?
భారత సైనిక బలగాలే సోమవారం రాత్రి ఇరు పక్షాల ఏకాభిప్రాయాన్ని తీవ్రంగా ఉల్లంఘించాయని.. రెండు సార్లు సరిహద్దు దాటి చైనా సైనికుల మీద రెచ్చగొట్టే విధంగా దాడిచేశాయని చైనా ఆరోపిస్తోంది. దీంతో తీవ్ర భౌతిక ఘర్షణలు తలెత్తాయని చైనా విదేశాంగ మంత్రిని ఉటంకిస్తూ ఆ దేశానికి చెందిన 'గ్లోబల్ టైమ్స్' పేర్కొంది.
సరిహద్దులో పరిస్థితిని సంక్లిష్టంగా మార్చే విధంగా ఎటువంటి ఏకపక్ష చర్యలూ చేపట్టవద్దని.. సైనిక బలగాలు సరిహద్దు దాటకుండా ఖచ్చితంగా నియంత్రణ పాటించాలని భారతదేశానికి చైనా విజ్ఞప్తి చేసినట్లు ఆ మంత్రి తెలిపారని చెప్పింది.
చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ దీనిపై ట్విటర్‌లో స్పందిస్తూ.. ''తాజా పరిణామాలపై భారత్‌కు చైనా తన నిరసన తెలిపింది. సంబంధిత ఒడంబడికకు భారత్ కట్టుబడి ఉండాలని.. ఆ దేశ సరిహద్దు దళాలను అదుపులో పెట్టుకోవాలని మేం గట్టిగా కోరుతున్నాం. హద్దులు దాటరాదు'' అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
తాజా పరిస్థితి ఏమిటి?
లద్దాఖ్‌లోని గాల్వన్ వ్యాలీలో సరిహద్దులో ఉద్రిక్తతలను చల్లార్చటానికి భారత్, చైనా సైన్యాల మేజర్ జనరళ్లు చర్చలు జరుపుతున్నారని సైనిక వర్గాలు తెలిపాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్.. మంగళవారం మధ్యాహ్నం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు త్రివిధ దళాల అధిపతులు, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌లతో మంగళవారం సాయంత్రం సమావేశమై చర్చించారు. బుధవారం ఉదయం కూడా మళ్లీ వీరందరి సమావేశం జరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
వివాదానికి నేపథ్యం ఏమిటి?
గాల్వాన్ లోయ ప్రాంతం ఇండియా - చైనాల మధ్య లద్దాఖ్ సరిహద్దు రేఖ మీద ఉంది. సైనిక పరంగా బలమైన భారత్, చైనాల మధ్య చాలాకాలంగా గాల్వన్ ప్రాంతం విషయంలో వివాదం ఉంది.
రెండు దేశాల మధ్య 3,440 కి.మీ. పొడవున ఉన్న సరిహద్దులో అనేక ప్రాంతాలపై వివాదం ఉండడంతో గతంలోనూ పలు చోట్ల రెండు దేశాల సైనికులు బాహాబాహీ తలపడ్డ సందర్భాలున్నాయి.
గాల్వాన్ భారత్ తన భూభాగంగా పరిగణిస్తున్న ప్రాంతంలోకి.. మే ఆరంభంలో చైనా బలగాలు భారీగా వచ్చి టెంట్లు వేసుకుని, కందకాలు తవ్వాయని.. భారీ సామగ్రిని మోహరించాయని పలు కథనాలు చెప్తున్నాయి.
ఈ ప్రాంతంలో భారత్ గస్తీలో ఉన్న భూభాగంలో దాదాపు 60 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా గత నెలలో ఆక్రమించిందని భారతదేశానికి చెందిన ప్రముఖ రక్షణ రంగ విశ్లేషకుడు అజయ్ శుక్లా పేర్కొన్నారు. అయితే.. చైనా ఇప్పటికే తన భూభాగంలో 38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించుకుందని భారత్ చెప్తోంది.
భారతదేశం లద్ధాఖ్‌లో 2008లో పునఃప్రారంభించిన వైమానిక స్థావరాన్ని కలుపుతూ ఇటీవల భారీ రహదారిని నిర్మించిన అనంతరం చైనా ఈ ప్రాంతంలోకి చొచ్చుకువచ్చింది.
ఈ నేపథ్యంలో భారత్ - చైనాల మధ్య కొద్ది రోజులుగా ఉద్రిక్తతలు పెరుగుతూ వచ్చాయి. వీటిని తగ్గించటానికి ఇరు దేశాలూ తూర్పు లద్దాఖ్‌లో చర్చలు జరుపుతున్నాయి.
కానీ ఈ నెల 15వ తేదీ సాయంత్రం నుంచి ఇవి హింసాత్మక రూపందాల్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
45 ఏళ్లలో తొలి హింసాత్మక ఘర్షణ...
భారత్ - చైనాల మధ్య 1975 తర్వాత.. ప్రాణ నష్టానికి దారితీసిన తొలి హింసాత్మక సంఘటన ఇదేనని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
భారత్, చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, హింసాత్మక ఘర్షణ పరిస్థితులకు అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న అనేక పరిణామాలు కారణమవుతున్నాయని.. దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఫ్రొఫెసర్, చైనా వ్యవహారాల నిపుణుడు శ్రీకాంత్ కొండపల్లి 'బీబీసీ'తో చెప్పారు.
1967, 75 సంవత్సరాల్లో కూడా రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణలు, సైనిక నష్టం జరిగాయని చెప్పారు. అయితే.. తాజా ఘటన కూడా తీవ్రమైనదేనని చెప్పారు.
''1967లో భారత్, చైనాల మధ్య సిక్కిం సరిహద్దుల్లో నాథూ లా, చో లా అనే రెండు ప్రదేశాల్లో కాల్పులు జరిగాయి. నాథూ లా వద్ద కాల్పుల్లో 36 మంది చైనా సైనికులు, 64 మంది భారతీయ సైనికులు మరణించగా.. చో లాలో భారత సైనికులు 36 మంది చైనా సైనికులు 160 మంది చనిపోయారు.
ఆ తరువాత 1975లోనూ రెండు దేశాల మధ్య కాల్పులు జరిగాయి. అనంతరం 2000లో గాల్వాన్ సమీపంలో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగినా కాల్పులు జరగలేదు. 1975 తరువాత రెండు దేశాల మధ్య సైనిక నష్టం జరిగే స్థాయిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం మళ్లీ ఇదే'' అని ఆయన గత ఘటనలను గుర్తు చేశారు.

ఫొటో సోర్స్, ANI
ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చు: ప్రొఫెసర్ శ్రీకాంత్ కొండపల్లి
తాజా ఘటన చాలా తీవ్రమైనదని, ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
''సరిహద్దుల్లోని యూనిట్‌కు కమాండింగ్ ఆఫీసర్ చనిపోయారు ఈ ఘటనలో.. కాబట్టి భారత ఆర్మీ తీవ్రంగా స్పందించే అవకాశాలూ ఉండొచ్చు'' అన్నారు.
''చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని మోదీ ఇప్పటికి రెండు సార్లు ప్రత్యేకంగా సమావేశం కావడంతో నాయకత్వం స్థాయిలో మంచి సంబంధాలున్నప్పుడు కనిపిస్తున్నప్పటికీ దేశ సార్వభౌమత్వం విషయానికొచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంటుంది.
పైగా మోదీ, జిన్‌పింగ్‌లు కలిసినప్పటికి, ఇప్పటికి అంతర్జాతీయంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కోవిడ్-19 పరిణామాలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి, ట్రంప్-చైనా సంబంధాలు, అమెరికాతో భారత్ సంబంధాలు, హాంకాంగ్, తైవాన్ వ్యవహారాలు వంటివన్నీ పరిస్థితులను మార్చేశాయి. ఈ అన్ని విషయాల్లో భారత్ వైఖరి, భారత్ పోషిస్తున్న పాత్ర వంటివన్నీ చైనా పరిగణనలోకి తీసుకుంటుంది.
ఇటీవల కోవిడ్-19 వ్యాప్తిలో చైనా పాత్రపై దర్యాప్తు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అసెంబ్లీలో ఆస్ట్రేలియా చేసిన ప్రతిపాదనకు భారత్ కూడా మద్దతిచ్చింది. దీనిపై చైనా గుర్రుగా ఉంది'' అని ఆయన విశ్లేషించారు.
ఇవి కూడా చదవండి:
- నేపాల్‌తో చైనా స్నేహం భారత్‌కు ప్రమాదమా
- "కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పైచేయి సాధించడానికి ఏకైక కారణం ఇదే"
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- 1990ల్లో 13 నెలలపాటు నేపాల్‌ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా..
- భారత్-చైనా సరిహద్దు వివాదంలో దూకుడు ప్రదర్శిస్తోంది ఎవరు? - మాజీ సైన్యాధికారి వీపీ మాలిక్ ఇంటర్వ్యూ
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: టీవీ అతనిని తారని చేసింది... అదే టీవీ అతనిని పదే పదే చంపింది...
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








