కేతీ సలివన్: భూగోళం అంచులను, మహా సముద్ర గర్భాన్ని తాకి చరిత్ర సృష్టించిన తొలి మహిళ

కేతీ సలివన్

ఫొటో సోర్స్, NASA

    • రచయిత, కెల్లీ లీ కూపర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మూడున్నర దశాబ్దాల కిందట 1984లో అంతరిక్షంలో ప్రయాణం చేసి వచ్చిన తొలి మహిళగా చరిత్ర పుస్తకాల్లో పేరు పొందిన అమెరికా మహిళ కేతీ సలివన్(68) సముద్ర గర్భంలో అత్యంత లోతు వరకు అంటే 11 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసిన తొలి మహిళగా వార్తల్లో నిలిచారు.

తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడమే ఆమె జీవితాశయం .

"నేనెప్పుడూ చాలా సాహసోపేతంగా ఉంటూ నా చుట్టు పక్కల ఉండే విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితో ఉండే అమ్మాయిని అని సలివన్ పసిఫిక్ మహా సముద్రం నుంచి ఫోన్ లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

కేతీ 1951లో న్యూ జెర్సీలో జన్మించారు. ఆమె బాల్యం అంతా కాలిఫోర్నియాలో గడిచింది. ఆమె తండ్రి కూడా వైమానిక ఇంజనీరుగా పని చేశారు. ఆమె తల్లి తండ్రులిద్దరూ పిల్లలు స్వేచ్ఛగా ఆలోచించి చర్చించే అవకాశం ఇచ్చారు.

కేథీ సలివన్

ఫొటో సోర్స్, KATHY SULLIVAN

"మా తల్లి తండ్రులు మాలో ఉన్న ఉత్సాహాన్ని పెంచడానికి మరింత ప్రోత్సహించారు. మాకున్న ఆశక్తులు మమ్మల్ని అభివృద్ధి పధంలో పెట్టడానికి ఎంత సహాయపడతాయో చూడటానికి కావల్సిన అవకాశాలన్నీ ఇచ్చారు. కొన్ని సార్లు మా ఇష్టాలు కొన్ని రోజుల్లోనే మాయమైపోయేవి, కొన్ని సార్లు మంచి కాలక్షేపంగా ఉండేవి, కొన్ని సార్లు అవి మా కెరీర్ ని తయారు చేసేవిగా ఉండేవి."

“మాకు ఐదారేళ్లు వచ్చేటప్పటికి మా సోదరుడుకి విమానాలను ఎగరవేయడంలో ఆసక్తి ఉందని అర్ధమైపోయింది. నాకేమోప్రపంచంలో ఉన్న వివిధ ప్రదేశాలను శోధించాలని ఉండేది”.

మా చిన్ననాటి కలలే మా కెరీర్ నిర్మించుకోవడానికి దోహదం చేశాయని, ఆమె అన్నారు.

తనకి ఇష్టమైన అంశానికి సంబంధించిన సమాచారం ఎక్కడ వచ్చినా వదలకుండా చదువుతూ, టీవీ లలో చూస్తూ ఉండేవారు కేతీ.

అంతరిక్ష పరిశోధనా రంగంలో ఎక్కువగా పురుషులే ఉండటం గురించి ఆమె పెద్దగా పట్టించుకోలేదు.

"ప్రపంచంలో సాహసోపేతమైన, ఆసక్తికరమైన పనులు చేస్తూ , ఎవరూ చూడని ప్రదేశాలకు వెళుతూ, కొత్త కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండే వ్యక్తులు ఉన్నారు."

"నేనెప్పుడూ నాకొక ఉద్యోగం కావాలి, నాకొక గుర్తింపు కావాలని అనుకోలేదు. కానీ, నా జీవితంలో ఎప్పుడూ ఒక తెలుసుకోవాలనే ఉత్సుకత, సాహసం, నైపుణ్యం ఉండాలనుకున్నాను”.

ఆమె మొదట విదేశీ భాషలు చదివి తర్వాత కాలేజీలో భూగర్భ శాస్త్రం చదివారు. 1970 లలో ఈ విభాగంలో

ఎక్కువగా పురుషులే ఉండేవారు.

ఆ సమూహంలో ఉండటం వలన ఆమెకి ఎటువంటి ఇబ్బంది ఎదురవ్వడం కానీ, లేదా ఈమెని ఏడిపించిన సందర్భాలు కానీ లేవని సలివన్ చెప్పారు.

సలివాన్(కుడి నుంచి రెండో వ్యక్తి)

ఫొటో సోర్స్, NASA

"నా ఆశయాల సాధన కోసం నాకు ప్రొఫెసర్ల నుంచి చాలా మద్దతు లభించేది. నన్ను అందరూ ఒక సమర్ధవంతమైన విద్యార్థిని గా చూసేవారు".

ఆమె తర్వాత ఓషియనోగ్రఫీ చదివారు.

1978 లో ఆమె నాసాలో చేరారు. భూమిని శిఖరాగ్రం నుంచి నా కళ్ళతో చూడటానికే నేను నాసాలో చేరాను.

మహిళలు నాసాలో చేరడం అప్పుడే మొదలయింది. నాసా ఇంజనీర్లు మహిళల కోసం ప్రత్యేకంగా మేక్ అప్ కిట్లు, టాంపన్లు సమకూర్చడం మొదలు పెట్టారు.

సలివన్ 1984 లో తొలి సారి అంతరిక్ష యానం చేశారు. నాసా స్పేస్ షటిల్ ప్రోగ్రాంలో ఇది 13 వది .

1984 లో అంతరిక్షయానం చేసిన తొలి అమెరికన్ మహిళగా సలివన్ నిలిచారు.

ఆమె తర్వాత మరిన్ని అంతరిక్షయానాల్లో పాలుపంచుకున్నారు.

నాసా వ్యోమగాములు

ఫొటో సోర్స్, NASA

“నా తర్వాత చాలా మంది మహిళలు అంతరిక్షయానం చేయడం, వివిధ పదవుల్లో ఉండటం నాకు చాలా ఆనందాన్నిచ్చింది”.

“ఇక్కడేమి దారంతా పూలు పరిచి ఉండవు. కృత నిశ్చయంతో ముందుకు వెళ్లడమే”.

“కొన్ని సార్లు పరిస్థితులతో పోరాడాల్సి వస్తుంది. తలుపులు మన కోసం తెరిచి ఉండవు. మనమే దారి చేసుకుని ముందుకు వెళ్ళాలి, “ అని ఆమె అన్నారు.

1993 లో నాసాని వదిలిపెట్టిన తర్వాత ఆమె నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మోస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్లో చీఫ్ సైంటిస్ట్ గా పని చేసారు. ఆమె ఒహియో యూనివర్సిటీ లో సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీలో అధ్యక్ష పదవిని చేపట్టారు.

కేథీ సలివన్

ఫొటో సోర్స్, NASA

ఆమె సముద్ర గర్భంలోకి వెళ్ళడానికి విక్టర్ వేస్కొవో అనే నావికాదళ ఆఫీసర్ నుంచి ఆహ్వానం వచ్చింది.

సముద్ర గర్భంలో ఛాలెంజర్ డీప్ అత్యంత లోతైన ప్రాంతం. ఇది గువామ్ దగ్గర మరియానా ట్రెంచ్ లో భాగమైన పసిఫిక్ మహా సముద్ర ఉపరితలం నుంచి 11 కిలోమీటర్ల లోతులో ఉంటుంది.

1960లో అమెరికాకి చెందిన ఒక వ్యక్తి, స్విస్ దేశానికి చెందిన మరో ఓషియనోగ్రాఫర్ సముద్ర అంతర్భాగాన్ని చేరారు. ఈ ప్రదేశానికి చేరిన వ్యక్తుల్లో సలివన్ 8 వ వ్యక్తి కాగా తొలి మహిళ.

"అక్కడ ఆంతా నాకు మాయాజాలంలా అనిపించింది. 31,000 అడుగుల లోతులో భోజనం తింటుంటే చాలా విచిత్రంగా అనిపించింది అని కేతీ అన్నారు.

"మనం నివసిస్తున్న ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మన విజ్ఞానపు సరిహద్దులు విస్తరించుకోవాలని”, సలివన్ నమ్ముతారు.

వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో మహిళల నిష్పత్తి పెరగాలని ఆమె అన్నారు.

ఆమె భవిష్యత్తు సాహస కార్యక్రమాల గురించి చెబుతూ, తెలుసుకోవాలనే జిజ్ఞాస కోసం సముద్ర గర్భాలకో, భూమి అంచులకో వెళ్లనవసరం లేదు. సాధించడానికి ప్రపంచంలో చాలా రకాల విషయాలు ఉన్నాయని అన్నారు.

"నన్నొక చిన్న చెక్క శవ పేటికలో పెట్టే క్షణం వరకు నేనిలా శోధిస్తూనే ఉంటాను”.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)