ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే ఆరాంకో కంపెనీ షేర్ మార్కెట్లో అడుగుపెట్టడానికి ఐపీఓ తీసుకువస్తున్నట్లు ధ్రువీకరించింది. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కావచ్చు.
రియాద్ స్టాక్ ఎక్ఛేంజ్‌లో లిస్టింగ్ అయ్యేందుకు సౌదీ అరేబియా చమురు కంపెనీ ఆదివారం ప్రణాళికలు సిద్ధం చేసింది.
సౌదీ అరేబియా రాజ పరివారం యాజమాన్యంగా ఉన్న ఈ కంపెనీ పెట్టుబడిదారుల రిజిస్ట్రేషన్, ఆసక్తి ప్రకారం ఐపీఓ లాంచ్ ప్రైస్ నిర్ణయిస్తుంది.
పారిశ్రామిక ప్రపంచంలోని కొన్ని వర్గాల ప్రకారం కంపెనీకి ప్రస్తుతం ఉన్న షేర్ల నుంచి ఒకటి, లేదా రెండు శాతం షేర్లను అందుబాటులో ఉంచవచ్చని తెలుస్తోంది.
ఆరాంకో కంపెనీ విలువ 1.3 ట్రిలియన్ డాలర్లు అని చెబుతున్నారు. విదేశీ షేర్ మార్కెట్లో అడుగుపెట్టడానికి ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు లేవని ఆ కంపెనీ చెప్పింది.
ఆరాంకో బోర్డ్ చైర్మన్ యాసిర్ అల్-రుమ్యాన్ ఒక మీడియా సమావేశంలో "అంతర్జాతీయ షేర్ మార్కెట్లో అడుగుపెట్టడం గురించి మేం మీకు రాబోవు కాలంలో చెబుతాం" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అత్యధిక సంపాదన, అత్యధిక లాభాలు
1933లో సౌదీ అరేబియా, స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ ఆఫ్ కాలిఫోర్నియా(షెవ్రాన్) మధ్య ఒక డీల్ చెడినపుడు ఆరాంకో చరిత్ర ప్రారంభమైంది.
చమురు బావుల అన్వేషణ, తవ్వకాల కోసం కొత్త కంపెనీ ఏర్పాటుకు ఆ ఒప్పందం చేసుకోవాలని భావించారు. తర్వాత 1973-1980 మధ్య సౌదీ అరేబియా ఆ మొత్తం కంపెనీని కొనుగోలు చేసింది.
ఎనర్జీ కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్ వివరాల ప్రకారం వెనజ్యువెలా తర్వాత సౌదీ అరేబియాలో అత్యధిక చమురు నిల్వలు ఉన్నాయి. చమురు ఉత్పత్తిలో అమెరికా తర్వాత సౌదీ అరేబియా రెండో స్థానంలో ఉంది.
చమురు విషయంలో మిగతా దేశాలతో పోలిస్తే సౌదీ అరేబియాకు అంత ప్రాధాన్యం ఎందుకు లభిస్తుందంటే, దేశంలో మొత్తం చమురుపై దానికి గుత్తాధిపత్యం ఉంది. ఇక్కడ చమురు వెలికితీయడం మిగతా దేశాలతో పోలిస్తే చౌక.
"ఆరాంకో కచ్చితంగా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ. ఇది మిగతా ఆయిల్, గ్యాస్ కంపెనీల కంటే పెద్దది" అని షీనెడెర్ ఎలక్ట్రిక్(ఎనర్జీ మేనేజ్‌మెంట్ కంపెనీ)లో మార్కెట్ స్టడీస్ డైరెక్టర్ డేవిడ్ హంటర్ అన్నారు.
రోజూ 10 మిలియన్ బారెళ్ల ఉత్పత్తి, 356,000 మిలియన్ అమెరికా డాలర్ల సంపాదనతో ఆరాంకో ప్రపంచంలో అతిపెద్ద చమురు కంపెనీగా ఆవిర్భవించింది.
దీనితో ప్రపంచంలోని కొన్ని పెద్ద కంపెనీలను పోలిస్తే, 2018లో యాపిల్ సంపాదన 59.5 బిలియన్ డాలర్లు. దానితోపాటు మిగతా చమురు కంపెనీలు రాయల్ డచ్ షెల్, ఎక్సోన్ మొబిల్ కూడా ఈ రేసులో చాలా వెనకబడి ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఆరాంకో నుంచి 20 శాతం షేర్లు కొనుగోలు చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇది ఇప్పటివరకూ భారత్ నుంచి అతిపెద్ద విదేశీ పెట్టుబడి అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాదాలు, సవాళ్లు కూడా ఉన్నాయి
"ఆరాంకోలో పెట్టుబడులు పెట్టడంలో ప్రమాదం కూడా ఉంది. ఆ కంపెనీకి వ్యూహాత్మక, రాజకీయ ముప్పు ఉంది" అని ఐజీ గ్రూప్ చీఫ్ మార్కెట్ అనలిస్ట్ క్రిస్ బ్రౌన్ అన్నారు.
ఈ ఏడాది సెప్టంబర్లో ఆరాంకో యాజమాన్యం కింద ఉన్న చమురు ప్లాంట్లపై దాడి జరిగినపుడు ఆ ప్రమాదం వెలుగులోకి వచ్చింది. సౌదీ అరేబియాలో ఆరాంకో కంపెనీకి చెందిన రెండు క్షేత్రాలపై దాడులు జరిగాయి. దానివల్ల మంటలు చెలరేగడంతో చాలా నష్టం జరిగింది.
అయితే ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమీన్ నాసిర్ "మా కంపెనీ ప్రణాళికలు చారిత్రకం. ఆరాంకో ఇప్పుడు కూడా ప్రపంచంలో అత్యంత విశ్వసనీయమైన చమురు కంపెనీ" అన్నారు.
ఐపీఓ లాంచ్ సమయంలో మాట్లాడిన ఆయన "ఇటీవల జరిగిన దాడుల వల్ల ఆరాంకో పరిశ్రమ, ఆర్థిక స్థితి, ఆపరేషన్‌పై ఎలాంటి ప్రభావం పడలేదని చెప్పారు.
పశ్చిమాసియా అంశాల నిపుణులు కమర్ ఆగా బీబీసీతో మాట్లాడుతూ "ఆర్థిక మందగమనం, మార్కెట్లో డబ్బుల లోటు ఉండడం వల్ల అమెరికా, యూరోపియన్ పెట్టుబడిదారులు ఇప్పుడు ముప్పును ఎదుర్కునేందుకు ఉత్సాహంగా లేరన్నారు. యెమెన్‌లో కొనసాగుతున్న యుద్ధంలో సౌదీ అరేబియా పాత్రను చూసి కూడా పెట్టుబడులు పెట్టేందుకు సందేహిస్తున్నారని" చెప్పారు.
సౌదీ అరేబియా నేతృత్వంలోని సేనలు సుమారు గత నాలుగేళ్ల నుంచి యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాయి. సెప్టెంబర్‌లో సౌదీ చమురు క్షేత్రాలపై జరిగిన దాడులు మా పనే అని హూతీ తిరుగుబాటుదారులు కూడా ప్రకటించారు.
"ఇక్కడ కీలక ప్రశ్న ఏంటంటే, సౌదీ అరేబియా దగ్గర చమురు నిల్వలు ఎంత మిగిలాయి అనేదానిపై కూడా ఇది ఆధారపడుతుంది. ఎందుకంటే అవి రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. రెండోది, సౌదీ దేశీయ మార్కెట్లో కూడా చమురు వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది" అని కమర్ ఆగా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బీబీసీ బిజినెస్ ప్రతినిధి కేటీ ప్రెస్కాట్ విశ్లేషణ
ఒకప్పుడు ఆరాంకోను ఒక అంతుపట్టని కంపెనీగా భావించేవారు. కానీ గత కొన్నేళ్లుగా అది తనను తాను పూర్తిగా మార్చుకుంది. కంపెనీ ఈరోజు ఏ స్థాయికి చేరుకుందంటే, తనకు తాను అప్రమత్తంగా ఉంటోంది.
ఈ సన్నాహాలకు కంపెనీకి చాలా ఏళ్లు పట్టింది. ఫోర్బ్స్ పత్రిక కథనం ప్రకారం "2018లో ఆరాంకో దగ్గర అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం అకౌంట్ బుక్స్ కూడా లేవు. దాని దగ్గర సంస్థాగత చార్ట్, స్ట్రక్చర్, అధికారిక రికార్డులు కూడా ఉండేవి కావు.
సెప్టెంబర్లో డ్రోన్ దాడుల తర్వాత ఆరాంకో తన ఆర్థిక గణాంకాలను ప్రచురించడం ప్రారంభించింది. కంపెనీ జర్నలిస్టులతో కూడా ఇప్పుడు తరచూ ప్రశ్న-జవాబు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అంతే కాదు, జర్నలిస్టులను ఆరాంకో డ్రోన్ దాడులు జరిగిన ప్రాంతానికి కూడా తీసుకెళ్లింది.
కంపెనీ కొన్ని ఉన్నత పదవుల్లో మహిళలను కూడా నియమించింది. ఆదివారం ఆ కంపెనీ చేసిన ప్రకటనలో అది అంతర్జాతీయ ఆందోళనల గురించి కూడా ప్రస్తావించింది.
ముడి చమురును ఎక్కువ కాలంపాటు రీసైకిల్ చేయడమే మా లక్ష్యం అని కంపెనీ చెప్పింది. ఆరాంకో పర్యావరణం పట్ల తమ బాధ్యత గురించి చెబుతూ ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ పర్యావరణానికి జరిగే నష్టాన్ని తగ్గిస్తామని చెప్పింది.
స్థానికులు, విడాకులు తీసుకున్న మహిళలు కూడా తమ షేర్లు కొనుగోలు చేయవచ్చని, ప్రతి 10 షేర్లు కొన్నవారికి ఒక బోనస్ ఇస్తామని ఆరాంకో చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆరాంకో- షేర్ల అమ్మకాల ప్రణాళికపై ఇంత వివాదం ఎందుకు
సౌదీ అరేబియా ఆరాంకో షేర్లు అమ్మాలనుకోవడం వెనుక ఒక కారణం ఉంది. తమ ఆర్థిక వ్యవస్థ చమురుపై ఆధారపడడాన్ని తగ్గించాలని ఆ దేశం భావిస్తోంది.
క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ తన 'విజన్ 2030' ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను వేరు వేరు రంగాల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు.
"సౌదీ అరేబియా తమ దేశంలో విస్తృతంగా ఉన్న ఎడారిని ఉపయోగించుకుని సౌర విద్యుత్తు ఉత్పత్తి చేయడం ద్వారా కూడా ముందుకు వెళ్లాలని భావిస్తోంది" అని డేవిడ్ హంటర్ చెబుతున్నారు.
"ప్రస్తుతం ఆరాంకో పరిస్థితి రాజకీయంగా జటిలంగా ఉంది. దీనికి పెద్ద కారణం, గత ఏడాది జరిగిన సౌదీ అరేబియా జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్య. మానవ హక్కుల అంశంలో సౌదీ అరేబియా రికార్డు సరిగా లేదు. అందుకే ఆ దేశానికి సంబంధించిన దేన్నైనా సందేహంగా చూస్తున్నారు" అని హంటర్ చెబుతున్నారు.
ఆరాంకోకు ఇది ముందు ముందు ఎందుకు కష్టం కావచ్చంటే, ప్రస్తుతం శిలాజ ఇంధనాలపై పెట్టుబడిదారులకు ఆసక్తి తగ్గిపోతూ వస్తోంది. వారు వాటికి ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు.
"ఆరాంకోకు చాలా సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. కానీ, అవి పెట్టుబడిదారులను ఆకర్షించడంలో ఏమేరకు విజయవంతం అవుతాయో చూడాలంటే, ఇంకొంతకాలం వేచిచూడాల్సి ఉంటుంది" అని కమర్ ఆగా చెప్పారు.
"కంపెనీ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో విఫలమైతే, దానివల్ల ఆ దేశంపై, సౌదీ అరేబియాపై అత్యధిక ప్రభావం పడుతుంది" అంటారు ఆగా.
ఇవి కూడా చదవండి:
- భూపత్ డాకూ: భారత్ నుంచి పారిపోయిన ఈ దోపిడీ దొంగకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది
- ఆర్సీఈపీ ఒప్పందానికి భారత పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయా?
- సౌదీ అరేబియాలో ఇకపై పెళ్ళికాని జంటలు హోటల్లో కలిసి ఉండవచ్చు...
- భారత్‌లో వ్యాపారం ఎంత ఈజీగా మారిపోయిందంటే..
- భారత్‌పై బంగ్లాదేశ్ తొలి టీ20 విజయం, ఖలీల్ అహ్మద్‌పై అభిమానుల ఆగ్రహం
- 30 ఏళ్ల కిందట సౌదీ కోట నుంచి దొంగిలించిన ఆభరణాలు ఏమయ్యాయి, ఆ దొంగ ఏమంటున్నాడు
- Xiaomi: భారత మార్కెట్లో ఈ చైనా బ్రాండ్ ఆధిపత్యం ఎలా సాధ్యమైంది?
- టర్కీ - సిరియా సంఘర్షణ: కుర్దు ఫైటర్ల మీద క్రూరమైన యుద్ధ నేరాలు... వెలుగులోకి దారుణమైన వీడియోలు
- హువావే: అమెరికా నిషేధం తర్వాత.. భవిష్యత్తు భారత్‌తో ముడిపడివుందా?
- మెక్ డోనల్డ్స్ బర్గర్లు: పదేళ్లైనా పాడవలేదు.. బూజు పట్టలేదు.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








