పాకిస్తాన్: భారత్ విడుదల చేసిన కొత్త మ్యాపులు ఆమోదయోగ్యం కాదు

ఫొటో సోర్స్, Survey General of India
భారత ప్రభుత్వం విడుదల చేసిన కొత్త భారతదేశ మ్యాప్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, పాకిస్తాన్ తిరస్కరించింది. దీనికి సంబంధించి పాకిస్తాన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
జమ్మూ, కశ్మీర్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ శనివారం సాయంత్రం భారతదేశ నూతన మ్యాప్‌లను విడుదల చేసింది.
జమ్మూ, కశ్మీర్ రాష్ట్రానికి ఆర్టికల్ 370 రూపంలో ఉన్న స్వయం ప్రతిపత్తిని పార్లమెంటు ఉపసంహరించడం, దానికి రాష్ట్రపతి ఆమోదం తెలపడం తెలిసిందే. అలాగే, జమ్మూ, కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని కూడా రాష్ట్రపతి ఆమోదించారు. ఈ నేపథ్యంలో 2019 అక్టోబర్ 31వ తేదీ నుంచి జమ్మూ కశ్మీర్ రాష్ట్రం విడిపోయి.. జమ్మూ, కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం అమల్లోకి వచ్చాయి.
లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో రెండు జిల్లాలు.. కార్గిల్, లేహ్ ఉన్నాయి. పాత జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని మిగతా ప్రాంతం అంతా జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోకి వచ్చింది.

ఫొటో సోర్స్, Survey General of India
లద్దాఖ్‌లో పాక్ పాలిత గిల్గిత్
కేంద్ర హోం శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు.. 1947వ సంవత్సరంలో జమ్మూ, కశ్మీర్ రాష్ట్రంలో 14 జిల్లాలు.. కథువా, జమ్మూ, ఉదంపూర్, రేయాసి, అనంతనాగ్, బారాముల్లా, పూంచ్, మీర్పూర్, ముజఫరాబాద్, లేహ్, లద్దాఖ్, గిల్గిత్, గిల్గిత్ వజరత్, చిల్హస్-గిరిజన ప్రాంతం ఉండేవి.
జమ్మూ, కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం వీటిని 28 జిల్లాలు చేసింది. 2019 నాటికి కొత్త జిల్లాలు.. కుప్వారా, బందిపూర్, గన్దెర్బల్, శ్రీనగర్, బుడ్గాం, పుల్వామా, షుపియాన్, కుల్గాం, రాజౌరి, రాంబన్, దోడ, కిష్టివర్, సాంబ, కార్గిల్ కూడా మనుగడలో ఉన్నాయి.
వీటిలో కార్గిల్ జిల్లాను లేహ్, లదాఖ్ జిల్లా నుంచి విడగొట్టి ఏర్పాటు చేశారు.
ఇప్పుడు కార్గిల్ జిల్లా ఏర్పాటు తర్వాత మిగిలిన లేహ్ జిల్లాలో.. గిల్గిత్, గిల్గిత్ వజరత్, చిల్హస్-గిరిజన ప్రాంతాన్ని కూడా కలుపుతున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
ఈ మేరకు భారతదేశం, జమ్మూ, కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం మ్యాప్‌లను సర్వే జనరల్ ఆఫ్ ఇండియా తయారు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మ్యాపులను తిరస్కరించిన పాకిస్తాన్
అయితే, ఈ మ్యాపులపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన పాకిస్తాన్, వాటిని తిరస్కరిస్తున్నామని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
"నవంబర్ 2న భారత హోంశాఖ విడుదల చేసిన రాజకీయ మ్యాపులలో గిల్గిత్-బాల్టిస్తాన్, అజాద్ జమ్మూ, కశ్మీర్‌లను భారత్‌లో అంతర్భాగంగా చూపించడం సరికాదు, చట్టప్రకారం ఆమోదనీయం కాదు. ఇది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాల ఉల్లంఘనే అవుతుంది. పాకిస్తాన్ ఈ మ్యాపులను తిరస్కరిస్తోంది. ఇవి ఐక్యరాజ్య సమితి మ్యాపులకు అనుగుణంగా లేవు.
భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యా కూడా ఐరాస పేర్కొన్న జమ్మూ, కశ్మీర్‌పై ఉన్న 'వివాదాస్పద భూభాగం' ముద్రను మార్చలేవని మేం మరోసారి స్పష్టం చేస్తున్నాం. భారత పాలనలో ఉన్న జమ్ము, కశ్మీర్ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కుకు భారత ప్రభుత్వం తీసుకునే ఇలాంటి చర్యలు విఘాతం కలిగించలేవు.
ఐక్యరాజ్య సమితి భద్రతామండలి తీర్మానాలకు అనుగుణంగా స్వయం నిర్ణయాధికార హక్కును వినియోగించుకునేందుకు, భారత పాలనలో ఉన్న జమ్ము, కశ్మీర్ ప్రజల న్యాయబద్ధమైన పోరాటానికి పాకిస్తాన్ మద్దతు కొనసాగుతుంది" అని ఆ ప్రకటనలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి.
- భారతదేశ కొత్త మ్యాప్‌లో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎందుకు చూపించలేదు?
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- ఆకలితో ఉన్న 500 మేకలు రొనాల్డ్ రీగన్ లైబ్రరీని కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్ నుంచి ఇలా కాపాడాయి..
- మెక్ డోనల్డ్స్ బర్గర్లు: పదేళ్లైనా పాడవలేదు.. బూజు పట్టలేదు.. ఎందుకు?
- తెలంగాణ ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కుదరదు - కేసీఆర్
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
- మీకు ఇలాంటి వాట్సాప్ కాల్ ఎప్పుడైనా వచ్చిందా.. వస్తే అనుమానించాల్సిందే
- ఈ మహిళలు నల్లచీరలు కట్టుకుని ఎందుకు మాట్లాడుతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








