తెలంగాణ ఆర్టీసీ సమ్మె: 5,100 ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు.. ఐదో తేదీలోగా కార్మికులు విధుల్లో చేరకపోతే మరో ఐదు వేల రూట్లు ప్రైవేటుకు - కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్

ఫొటో సోర్స్, Facebook/KCR

కేబినెట్ సమావేశంలో తెలంగాణ ఆర్టీసీ(టీఎస్‌ఆర్టీసీ) అంశంపై సుదీర్ఘంగా, లోతుగా చర్చించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు.

5100 బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఆర్టీసీ ఆధ్వర్యంలో 2,100 ప్రైవేటు అద్దె బస్సులు నడుస్తున్నాయని, అదనంగా అనుమతించేది మూడు వేల ప్రైవేటు బస్సులేనని వివరించారు. ఆర్టీసీ వద్ద 10,400 బస్సులు ఉన్నాయని, వీటిలో 2,100 బస్సులు ప్రైవేటు అద్దె బస్సులని తెలిపారు.

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్‌ను కేబినెట్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఇక ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడమనే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు.

శనివారం హైదరాబాద్‌లో మంత్రి మండలి భేటీ తర్వాత కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీని విలీనం చేస్తే అది అంతటితో ఆగదని, మిగతా కార్పొరేషన్లు కూడా అదే డిమాండ్ చేస్తాయని చెప్పారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొన్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయని ముఖ్యమంత్రి చెప్పారు. దేశాన్ని అతి తీవ్రమైన ఆర్థిక మాంద్యం పట్టిపీడిస్తోందని, దీనివల్ల తెలంగాణ కూడా దెబ్బతింటోందని, కానీ తిరోగమనంలోకి పోవడం లేదని తెలిపారు.

మహాత్మా గాంధీ బస్ స్టేషన్, హైదరాబాద్ (అక్టోబరు 28)

ఫొటో సోర్స్, Ravisankar Lingutla/BBC

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (అక్టోబరు 28)

ఆర్టీసీ యూనియన్లు అర్థరహితంగా, దురహంకారంతో, అంతులేని కోరికలతో సమ్మెకు పోయాయని ముఖ్యమంత్రి ఆరోపించారు. సమ్మెలతో తెలంగాణ ఇమేజ్, రాష్ట్ర రాజధాని ఇమేజ్ దెబ్బతినకూడదని చెప్పారు. బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలను జరగనీయబోమని చెప్పారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని ఆయన చెప్పారు. సమ్మె చట్టవిరుద్ధమని కార్మికశాఖ ఇప్పటికే ప్రకటించిందన్నారు.

సమ్మె చట్టవిరుద్ధమని కార్మికశాఖ ప్రకటిస్తే సంస్థ యాజమాన్యానికి, ఉద్యోగులకు మధ్య సంబంధం తెగిపోతుందని, అప్పుడు సంస్థ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని, ఈ డోలాయమాన పరిస్థితి కూడా ఈ అంశంలో ఏర్పడిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

నవంబరు ఐదో తేదీ మంగళవారం అర్ధరాత్రిలోపు ఆర్టీసీ కార్మికులు బేషరతుగా తిరిగి విధుల్లో చేరాలని, చేరితే వారి ఉద్యోగాలకు కూడా కొంత రక్షణ ఉంటుందని కేసీఆర్ చెప్పారు. కార్మికులు పునరాలోచించుకొని, యూనియన్ల మాయలోంచి బయటకు రావాలని సూచించారు. వారు నవంబరు ఐదో తేదీలోగా విధుల్లో చేరకపోతే మిగతా ఐదు వేల రూట్లను కూడా ప్రైవేటుకు ఇస్తామని ప్రకటించారు. ఐదో తేదీ వరకు ఆర్టీసీ కార్మికుల స్పందన కోసం వేచిచూస్తామని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

టీఎస్ ఆర్టీసీ

ఫొటో సోర్స్, FB/JANGAONDEPOT

ఆర్టీసీ, ప్రైవేటు రవాణా సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 5,100 ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోబోమని స్పష్టం చేశారు. లాభాలు వచ్చే రూట్లే ఆర్టీసీకి ఇస్తామని, నష్టదాయకమైన రూట్లే ప్రైవేటుకు ఇస్తామని తెలిపారు. ప్రైవేటు బస్సులు ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయని, ఇష్టం వచ్చినట్లు టికెట్ల ధరలు పెంచడానికి వీల్లేదని చెప్పారు. విద్యార్థుల పాస్‌లు, జర్నలిస్టుల పాస్‌లు, వికలాంగుల పాస్‌లు, ఇప్పుడున్న ఇతర పాస్‌లు ఇకపైనా ఉంటాయని వివరించారు.

ప్రభుత్వం తీరు తేటతెల్లమైంది

ఆర్టీసీ కార్మికులు చైతన్యవంతులని, అధైర్యపడాల్సిన అవసరం లేదని జేఏసీ సభ్యుడు పోరెడ్డి రవీందర్ రెడ్డి బీబీసీతో మాట్లాడుతూ అన్నారు.

"స్క్రాప్లో ఉన్న బస్సులు 3190 అని సీఎం అన్నారు. కిలోమీటరుకు రూ.1 చొప్పున డిప్రిసియేషన్ లెక్కగడితే... ఈ మొత్తం బస్సులు 650 కోట్ల కి.మీ. తిరిగి ఉంటాయి. ఒక బస్సు విలువ రూ.20 లక్షలు అనుకుంటే డిప్రిసియేషన్ ఫండ్ కింద తీసిపెట్టిన రూ.650 కోట్లు ఇస్తే సరిపోతాయి. కొత్త బస్సులు తేవచ్చు.

ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది కార్మికులు, ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యగా మేం భావిస్తున్నాం. ఈరోజుతో ప్రభుత్వం తీరు తేటతెల్లమైంది. కావాలనే మమ్మల్ని సమ్మెలోకి నెట్టినట్లు అనిపిస్తోంది.

ఇల్లీగల్ స్ట్రైక్ అని మళ్లీ మళ్లీ అనడం బాధాకరం. ఆరోగ్యకరమైన పోటీ కోసం ప్రైవేటీకరణ సరికాదు. ఇన్ని నిర్ణయాలు తీసుకున్నాక కార్మికులెవరూ విధుల్లో చేరరు" అని రవీందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Línea
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

Línea

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)