ఆర్థిక మందగమనం: భారతదేశ ఆర్థికవ్యవస్థలోని ఎనిమిది ప్రాథమిక రంగాల్లో తీవ్రమైన పతనం - వాణిజ్య శాఖ గణాంకాలు

ప్రాథమిక రంగాలలో భారీ పతనం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మొహమ్మద్ షాహిద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశంలో మందగమనంలో నడుస్తున్న ఆర్థిక వ్యవస్థ పరిస్థితి గురించి చెప్పే ఒక కొత్త గణాంకాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. దేశ ఆర్థికవ్యవస్థలోని ఎనిమిది ప్రాథమిక రంగాల్లో తీవ్రమైన పతనం కనిపించింది. దీనిని 14 సంవత్సరాల్లో అత్యధిక పతనంగా చెబుతున్నారు.

ఈ ఎనిమిది రంగాల్లో బొగ్గు, ముడి చమురు, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ఉత్పత్తులు, గనులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ ఉన్నాయి. వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ గురువారం ఈ గణాంకాలు జారీ చేసింది. ఈ గణాంకాల ఆధారంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ రంగాల్లో 5.2 శాతం పతనం వచ్చింది.

గతేడాది సెప్టెంబర్లో ఇవే రంగాల్లో 4.3 శాతం వృద్ధి కనిపించింది. సెప్టెంబర్ 2019లో వచ్చిన గణాంకాల్లో ఒక్క రంగంలో మినహా మిగతా ఏడింటిలో భారీ పతనం కనిపించింది. వీటిలో అత్యధిక పతనం బొగ్గు రంగంలో కనిపించింది.

సెప్టెంబర్ నెలలో బొగ్గు రంగంలో 20.5 శాతం, నేచురల్ గ్యాస్ 4.9, విద్యుత్ 3.7, సిమెంట్ 2.1, స్టీల్ 0.3 శాతం పతనం నమోదైంది.

ప్రాథమిక రంగాలలో భారీ పతనం

ఫొటో సోర్స్, Getty Images

కొత్త గణాంకాలు ఎంత భయపెడుతున్నాయి

దేశ ఆర్థికవ్యవస్థ ప్రస్తుతం చాలా మందగమనంతో నడుస్తున్నప్పుడు, ఈ కొత్త గణాంకాలను ఎలా అర్థం చేసుకోవాలి? ఆర్థిక అంశాల నిపుణులు వివేక్ కౌల్ దేశంలో పారిశ్రామిక కార్యకలాపాలు తగ్గాయనే దీనికి అర్థం అన్నారు.

"దేశంలో పారిశ్రామిక కార్యకలాపాలను చూపించే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్‌లో ఈ 8 రంగాల్లో భాగస్వామ్యం 40 శాతం. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తగ్గిపోతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు తగ్గడంతో ఆ ప్రభావం ఈ రంగాలపై పడుతోంది. ఈ రంగాలను పారిశ్రామిక ఉత్పత్తి కోసం ఉపయోగిస్తారు. ప్రజలు వస్తువులు కొనడం తగ్గించేసినపుడు, దాని ప్రభావం నేరుగా ఆయా రంగాలపై పడుతుంది" అన్నారు.

మరోవైపు, ఈ పతనాన్ని ఆర్థిక నిపుణులు పూజా మెహ్రా ప్రజల కొనుగోలు శక్తికి జోడించి చూస్తున్నారు. "ప్రజలు కార్లు కొనడం లేదు. అంటే దానివల్ల ముడి చమురు, రీఫైనరీ ఉత్పత్తుల మీద ప్రభావం పడింది. దానితోపాటూ ప్రపంచంలో మన ఎగుమతులు తగ్గాయి. దానివల్ల ముడి చమురు, రీఫైనరీ ఉత్పత్తుల ఎగుమతుల్లో పతనం నమోదైంది" అన్నారు.

"విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. ఎందుకంటే పారిశ్రామికాభివృద్ధి జీరోకు దగ్గరగా చేరుకుంటోంది. విద్యుత్ డిమాండే లేనప్పుడు, దానిలో పతనం రావడం అనివార్యం. అలాగే సిమెంట్‌లో పతనానికి పెద్ద కారణం కన్‌స్ట్రక్షన్ తగ్గడం. ఎందుకంటే ప్రజలు ఇళ్లు కొనడం లేదు" అని ఆమె చెప్పారు.

దీనికి అర్థం ఒకటే, ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక రంగం కుదింపు ప్రారంభమైంది.

ఈ నెల ప్రారంభంలో వచ్చిన అధికారిక గణాంకాల వల్ల ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి 1.1 శాతానికి పడిపోయిందనే విషయం తెలిసింది. దీన్ని గత 26 నెలల్లో అత్యంత చెత్త ప్రదర్శనగా భావిస్తున్నారు.

ఈ 8 రంగాల్లో పతనం వల్ల తేడా ఏముంటుంది? దీనిపై వివేక్ కౌల్ "ఇలా వరుసగా జరుగుతూ ఉంటే పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడం వల్ల దాని ప్రభావం నేరుగా ఉపాధిపై పడుతుంది" అన్నారు.

ప్రాథమిక రంగాలలో భారీ పతనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎరువుల పరిశ్రమల్లో మాత్రమే వృద్ధి కనిపించింది

ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య వృద్ధి

సెప్టెంబర్లో ఈ 8 రంగాల్లో కచ్చితంగా పతనం కనిపించింది. కానీ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఈ రంగాల్లో 1.3 శాతం వృద్ధి ఉంది.

దీనిపై మాట్లాడిన వివేక్ కౌల్ "ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య వృద్ధి కేవలం ఆగస్టు నెల వల్లే వచ్చింది. ఆ నెల్లో ఈ 8 రంగాల నుంచి కొన్ని రంగాల్లో వృద్ధి ఉంది. కానీ సెప్టెంబర్‌లో ఒక్క ఫర్టిలైజర్ రంగం మినహా అన్నిటిలో పతనం నమోదైంది.

జూన్ త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు ఐదేళ్లలో అత్యంత తక్కువగా 5 శాతం ఉంది.

ఫర్టిలైజర్ రంగంలో వృద్ధి ఎందుకు?

ఈ 8 రంగాల్లో కేవలం ఒక రంగంలో మాత్రమే వృద్ధి కనిపించింది. అది ఫర్టిలైజర్ రంగం. అందులో 5.4 శాతం వృద్ధి నమోదైంది.

దీనిపై పూజా మెహ్రా "మాన్‌సూన్ సీజన్ ప్రభావంతో కొన్ని పరిశ్రమలపై ప్రత్యేక ప్రభావం పడింది. అందులో ఫర్టిలైజర్ కూడా ఒకటి. రైతు రబీ పంట వేస్తాడు. అందుకే ఫర్టిలైజర్స్‌లో వృద్ధి కనిపించింది. ముందు ముందు ఈ రంగంలో వృద్ధి ఉంటుంది అని చెప్పడం కష్టం" అన్నారు.

ముడి చమురు, రీఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్ ఏ పరిశ్రమకైనా అత్యంత అవసరమైన వాటిల్లో ఉంటాయి. ఈ మూడు రంగాల్లో చాలా పతనం నమోదైంది.

"సిమెంట్‌లో పతనానికి మనం ఒకప్పుడు వర్షాకాలమే కారణం అనుకునేవాళ్లం. కానీ పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఉత్పత్తులు, వాటి వినియోగం తక్కువవుతోంది. దానివల్ల ఆర్థికవ్యవస్థ మందగించిందని స్పష్టంగా తెలుస్తోంది" అని పూజా మెహ్రా చెప్పారు.

ప్రాథమిక రంగాలలో భారీ పతనం

ఫొటో సోర్స్, Getty Images

ఈ రంగాల్లో వృద్ధి ఎలా?

పారిశ్రామిక ఉత్పత్తి రంగంలో వరుసగా వస్తున్న పతనం నుంచి ఎలా బయటపడగలం. దీనికి వివేక్ కౌల్ "ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కాస్త కష్టం. ఎందుకంటే ఈ పరిశ్రమల్లో వృద్ధి కోసం అభివృద్ధితోపాటూ వినియోగం కూడా అవసరం" అన్నారు.

"ఏదైనా కంపెనీ డబ్బు సంపాదించగలం అనుకున్నప్పుడే పెట్టుబడి పెడుతుంది. కానీ ఇప్పుడు కంపెనీలకు అలా అనిపించడం లేదు. అందుకే అవి పెట్టుబడులు కూడా పెట్టడం లేదు. వ్యక్తిగత వినియోగం ప్రస్తుతం బాగా దెబ్బతింది. వ్యక్తిగత వినియోగం పెరిగేవరకూ పెట్టుబడులు జరగవు. పెట్టుబడులు లేకపోవడం వల్ల పారిశ్రామిక కార్యకలాపాలపై ఆ ప్రభావం పడుతుంది" అన్నారు.

ఇందులో సంస్కరణలకోసం విధానాలపై పనిచేయాలని పూజా మెహ్రా చెప్పారు.

"దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకోలేదు. వీటిలో కార్మిక చట్టం, భూసంస్కరణలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, టాక్స్ లాంటి అంశాలు ఉన్నాయి. అటు ఎఫ్ఎంసీజీ కంపెనీల ఉత్పత్తులు అమ్ముడు కావడం లేదు. గ్రామీణ రంగంలో వస్తువులు కొనలేకపోతున్నారు. దానికి అక్కడ డబ్బులు ఉండడం అవసరం" అని ఆమె చెప్పారు.

"గ్రామీణ భారతంలో ఈ డబ్బు వ్యవసాయం నుంచి వస్తుంది. కానీ దీనికోసం వేరే పద్ధతులు ఉపయోగించాలి. ఇటీవల మన్రేగాలో 18-30 ఏళ్లు వయసున్న వారి సంఖ్యలో వృద్ధి కనిపించింది. అందుకే ప్రభుత్వం వీరికి వీలైనంత త్వరగా డబ్బు ఇవ్వాల్సుంటుంది. పీఎం కిసాన్ యోజన కింద ప్రజలకు వీలైనంత త్వరగా డబ్బు అందించాలి. ఈ చానళ్లన్నిటి కింద ప్రభుత్వం గ్రామీణ భారతంలో నగదు ఉండేలా చేయాలి" అని పూజా మెహ్రా చెప్పారు.

ప్రాథమిక రంగంలోని ఈ 8 రంగాల్లో వృద్ధి తీసుకురావడం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ముందు ముందు తెలుస్తుంది. కానీ, వచ్చే వారం ఐఐపీ ప్రాథమిక రంగాల పూర్తి గణాంకాలను జారీ చేయనుంది. ఇందులో కూడా భారత ఆర్థికవ్యవస్థకు శుభవార్త వినిపించడం కష్టమేనని అంచనా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)