కశ్మీర్‌లో ఆందోళన రేకెత్తిస్తున్న స్థానికేతరుల హత్యలు -బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, మాజిద్ జహంగీర్
- హోదా, బీబీసీ కోసం
జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో అయిదుగురు స్థానికేతర కూలీలను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
మృతులను రఫీక్ షేక్, రఫీక్ ఉల్ షేక్, ఖమారుద్దీన్ షేక్, మురస్లీన్ షేక్, నిజాముద్దీన్ షేక్‌లుగా అధికారులు గుర్తించారు. ఘటనలో గాయపడ్డ జహూరుద్దీన్ అనే మరో కూలీ శ్రీనగర్‌లోని ఎస్‌కే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సైస్‌లో చికిత్స పొందుతున్నారు.
బాధితులందరూ పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు. కుల్గాంలోని కట్రోసూ గ్రామంలో అద్దెకు ఉంటూ కూలీ పని చేసుకుంటున్నారు. ఈ గ్రామంలోనే వారు హత్యకు గురయ్యారు.
గత రెండు వారాల్లో ఆరుగురు స్థానికేతర డ్రైవర్లు, యాపిల్ పళ్ల వ్యాపారులు, ఓ కార్మికుడు దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో హత్యకు గురయ్యారు. ఈ ఘటనలు స్థానికులు, స్థానికేతరులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.
మిలిటెంట్ సంస్థలకు చెందినవారు ఈ హత్యలు చేసి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు.

కట్రోసోలో హత్యకు గురైనవారి బంధువు సదా సాగల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
''కట్రోసోలో కాల్పులు జరిగాయని ఎవరో అనుకుంటుంటే విన్నా. ఆ ఘటన గురించి అప్పటికి ఏమీ తెలియదు. బుధవారం ఉదయం బాధితులు ఉండే ఇంటికి వెళ్లా. వాళ్ల ఫోన్లు, ఇతర వస్తువులు పగిలిపోయి కనిపించాయి. ఇరుగుపొరుగువారిని ఆరా తీస్తే వాళ్లు చనిపోయారని చెప్పారు. ఆ తర్వాత మా ఇంట్లోవాళ్లు కూడా ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు'' అని సాగల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
బుధవారం అందరం తమ ఇంటికి వెళ్దామనుకున్నామని, వాళ్లను తీసుకువెళ్లేందుకే తాను వచ్చినప్పుడు ఈ దుర్ఘటన గురించి తెలిసిందని వాపోయారు.
కూలీ పనులు చేసేందుకు అక్టోబర్ 8న తాము కశ్మీర్‌కు వచ్చామని సాగల్ వివరించారు.
బాధితులు ఉండే చోటుకు సమీపంలో మరో గదిలో సాగల్ ఉంటున్నారు.
హంతకులను పట్టుకునేందుకు పోలీసులు, భద్రతాదళాలు గాలింపు ప్రారంభించాయి.

మంగళవారం రాత్రి 7 గంటలకు తాను హతుల మృతదేహాలను చూసినట్లు కట్రోసో గ్రామంలోని అధికారి అబ్దుల్ సలాం భట్ చెప్పారు.
''కాల్పుల చప్పుడు వినిపించినప్పుడు నేను ఇంట్లో ఉన్నా. బయటివాళ్లను అడిగితే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పారు. అరగంటలో ఘటనాస్థలానికి సైనికులు వచ్చారు. ఆ తర్వాత నన్ను అక్కడికి తీసుకువెళ్లారు. ఐదు మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను సైనికుల వాహనంలోకి ఎక్కించమన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు'' అని అన్నారు.
బాధితులు ఆగస్టు 5కు ముందు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారని, దాదాపు నెల క్రితమే తిరిగి ఇక్కడికి వచ్చారని కట్రోసో గ్రామస్థులు తెలిపారు.
ఆగస్టు 5న జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని భారత ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఆంక్షలు అమలవుతున్నాయి.

బాధితులు అద్దెకు ఉంటున్న గది యజమాని బిలాల్ అహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
బిలాల్ రెండేళ్లు జైల్లో ఉండి, ఇటీవలే విడుదలై బయటకు వచ్చినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.
మొత్తంగా ముగ్గురు వరకూ వ్యక్తులను ఈ హత్యలకు సంబంధించి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ హత్యల వెనుక హిజ్బుల్ ముజాహిదీన్ లేదా జైషే మహమ్మద్ మిలిటెంట్లు ఉండొచ్చని భావిస్తున్నట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు. విచారణ పూర్తయ్యాక, పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు.
ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించేందుకే ఈ హత్యలు చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

కట్రోసోలో ఐదుగురు స్థానికేతరులు హత్యకు గురవ్వడం పట్ల ఆ గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి ఘటన గ్రామంలో ఇదే మొదటిసారిన మంజూర్ అహ్మద్ అనే స్థానికుడు చెప్పారు.
''ఒకేసారి తూటాల వర్షం కురిసినట్లు చప్పుడు వచ్చింది. అందరినీ ఒకేసారి చంపి ఉంటారు. మేమంతా భయపడిపోయాం. హంతకులు ఎవరో పోలీసులు గుర్తించాలి. రోజూ పని కోసం వస్తూ, పోతూ ఆ బాధితులు నాకు కనిపించేవారు'' అని అన్నారు.
''ఈ క్రూర హత్యల గురించి బుధవారం ఉదయమే తెలిసింది. బాధితులు మా శత్రువులేమీ కాదు. వాళ్లతో మేం కలివిడిగా ఉండేవాళ్లం. అప్పుడప్పుడు కలిసి తినేవాళ్లం. పొట్టకూటి కోసం వారు ఇంత దూరం వచ్చారు. మాలాగే వాళ్లకూ కుటుంబాలు ఉన్నాయి. ఎంతో బాధగా ఉంది'' అని అబ్దుల్ రషీద్ అనే గ్రామస్థుడు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- క్షయ వ్యాధికి కొత్త టీకా... హైదరాబాద్ అంతర్జాతీయ సదస్సులో ఆవిష్కారం
- ఐఎస్ చీఫ్ బగ్దాదీ అండర్‌వేర్‌ను ఆ గూఢచారి ఎందుకు దొంగిలించారు?
- సౌదీ అరేబియా భారతదేశంతో స్నేహం ఎందుకు కోరుకుంటోంది...
- బగ్దాదీ హతమయ్యాడు... ఇప్పుడు ఐఎస్ పరిస్థితి ఏంటి?
- సినీడ్ బుర్కీ: ఫ్యాషన్ మ్యాగజీన్ ముఖచిత్రంగా ఎదిగిన ‘లిటిల్ పర్సన్’
- కాస్మటిక్ సర్జరీ ఫెయిల్... 97 లక్షల పరిహారం చెల్లించకుండా డాక్టర్ పరార్
- బగ్దాదీ: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ను అంతం చేసిన అమెరికన్ సీక్రెట్ ఆపరేషన్‌లో ఆ చివరి 15 నిమిషాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








