స్టాకర్‌వేర్: భార్యాభర్తల పరస్పర నిఘా కోసం పెరుగుతున్న స్పైవేర్ వినియోగం.. రెండో స్థానంలో భారత్

ఫొటో సోర్స్, iStock
- రచయిత, జో టైడీ
- హోదా, సైబర్-సెక్యూరిటీ రిపోర్టర్
''నా స్నేహితుల గురించిన వ్యక్తిగత సాన్నిహిత్య వివరాలు నా భర్తకు తెలుస్తున్నట్లు అనిపించింది. అప్పుడు మొదలైంది.. ఇదంతా'' అంటారు అమీ.
''అతడు మాట్లాడేటపుడు అక్కడక్కడా కొన్ని విషయాలు ప్రస్తావిస్తుంటాడు. సారా కూతురు గురించి తెలుసన్నట్లు.. అటువంటి విషయాలు. అవి నిజంగా వ్యక్తిగత విషయాలు. ఆయనకు తెలిసివుండే అవకాశం లేదు. ఆ విషయాలు నీకు ఎలా తెలుసు అని నేను అడిగితే.. నేనే చెప్పానని అంటాడు.. నేనే చెప్పిన విషయం నేను మరచిపోయానని నన్ను నిందిస్తాడు'' అని ఆమె వివరించారు.
అమీ.. ఆమె అసలు పేరు కాదు. అంతేకాదు.. అసలు తాను ఎప్పుడు ఎక్కడ ఉన్నానో ఎప్పటకిప్పుడు తన భర్తకు ఎలా తెలిసిపోతుందని కూడా ఆమె ఆశ్చర్యపోయేది.
''ఒక్కోసారి.. నేను ఒక కేఫ్ దగ్గర స్నేహితులను కలిసినప్పుడు.. తను అనుకోకుండా అటుగా వెళ్తూ అక్కడ నన్ను చూశానని చెప్పేవాడు. ఇక నేను ప్రతి విషయాన్నీ అనుమానించటం మొదలుపెట్టాను. నా స్నేహితులను సైతం సందేహించేదానిని...'' అని చెప్పారామె.
ఇలా కొన్ని నెలల పాటు అనేక సంఘటనలు జరుగుతూ వచ్చాయి. అవి అంతకంతకూ పెరుగుతోంటే.. అమీ వైవాహిక బంధం వేధింపులతో పీడకలగా మారింది.
ఒక పండుగ నాడు కుటుంబంతో కలిసి పర్యటనకు వెళ్లినపుడు భయంకరమైన ఆ నిజం తెలిసింది.

ఫొటో సోర్స్, Getty Images
''మేం ఒక గుమ్మడి తోటను సందర్శించటానికి వెళ్లాం. ఆ వారాంతపు సెలవు సంతోషంగా గడుస్తోంది. అంటే నా మీద నా భర్త అనవసరంగా కోప్పడటం లేదు. మా ఆరేళ్ల కొడుకు నేల మీద ఆడుకుంటున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు'' అని అమీ చెప్పారు.
''తోటలో తీసిన ఒక ఫొటోను చూపించటానికి నా భర్త తన ఫోనును నాకు అందించాడు. ఆ అర క్షణంలోనే ఆయన ఫోను స్క్రీన్ మీద ఒక అలర్ట్ పాపప్ అయింది. 'అమీ మ్యాక్ మీద రోజు వారీ నివేదిక సిద్ధంగా ఉంది' అని ఆ అలర్ట్ చెప్తోంది'' అని ఆమె తెలిపారు.
''నా వెన్నులో వణుకుపుట్టింది. ఒక నిమిషం పాటు ఊపిరి తీసుకోవటం కూడా మరచిపోయాను. నేను టాయిలెట్‌కి వెళ్లాలంటూ పక్కకు వెళ్లి పోవాల్సి వచ్చింది. నా కొడుకు కోసం అక్కడ ఉండాల్సి వచ్చింది. ఏమీ చూడనట్లు నటించాల్సి వచ్చింది'' అని వివరించారు అమీ.
''నాకు సమయం దొరికిన వెంటనే మొదట చేసిన పని.. లైబ్రరీకి వెళ్లి అక్కడ కంప్యూటర్‌లో సెర్చ్ చేయటం. నా భర్త ఉపయోగించిన స్పైవేర్ (నిఘా సాఫ్ట్‌వేర్) ఏమిటనేది తెలుసుకోవటానికి. ఇన్ని రోజులూ నాకు పిచ్చిపడుతోందేమో అనుకున్న నాకు.. అసలు ఏం జరుగుతోందనేది అప్పుడు తెలిసింది'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆన్‌లైన్‌లో విచ్చలవిడిగా లభ్యం...
స్టాకర్‌వేర్ - (స్పౌజ్‌వేర్ అని కూడా అంటారు) - అనేది ఒక శక్తివంతమైన నిఘా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్. దీనిని ఆన్‌లైన్‌లో బాహాటంగా అమ్ముతున్నారు.
దీని ద్వారా.. ఒక డివైజ్‌లోని మెసేజీలన్నిటినీ చదవొచ్చు. స్క్రీన్ యాక్టివిటీని రికార్డు చేస్తుంది. జీపీఎస్ లొకేషన్లను ట్రాక్ చేస్తుంది. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడనేది రహస్యంగా తెలుసుకోవటానికి కెమెరాలను ఉపయోగిస్తుంది.
ఇటువంటి స్పైవేర్ తమ డివైజ్‌లలో ఉందని కనుగొన్న వారి సంఖ్య గత ఏడాది 35 శాతం పెరిగిందని.. సైబర్ భద్రత సంస్థ కాస్పర్‌స్కీ చెప్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకూ 37,532 డివైజ్‌లలో స్టాకర్‌వేర్‌ను తమ భద్రతా సాంకేతిక పరిజ్ఞానం గుర్తించినట్లు ఆ సంస్థ పరిశోధకులు తెలిపారు.
''మనకు కనిపిస్తున్నది నీటిలో మునిగివున్న ఒక భారీ మంచు గుట్టపై కొన మాత్రమే'' అని కాస్పర్‌స్కీ ప్రిన్సిపల్ సెక్యూరిటీ రీసెర్చర్ డేవిడ్ ఎమ్ అంటారు. ''చాలా మంది సాధారణంగా తమ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లకు మాత్రమే రక్షణ కల్పిస్తారు. మొబైల్ డివైజ్‌కు రక్షణ పొందేవారు చాలా చాలా తక్కువ'' అని ఆయన పేర్కొన్నారు.
రష్యా తర్వాత భారత్‌లోనే అధికం...
''మా ఉత్పత్తిని ఇన్‌స్టాల్ చేసుకున్న డివైజ్‌ల (స్మార్ట్‌ఫోన్ల) ద్వారా లభించే సమాచారం ఇది. కాబట్టి.. ఈ సంఖ్య, మొత్తం ఎంత మంది స్పైవేర్ వాడుతున్నారనే సంఖ్యకు దరిదాపుల్లోకి కూడా రాదు'' అని చెప్పారు.
స్టాకర్‌వేర్ వినియోగం అత్యధిక స్థాయిలో ఉన్న దేశం రష్యా అని కాస్పర్‌స్కీ లెక్కలు సూచిస్తున్నాయి. రష్యా తర్వాతి స్థానాల్లో వరుసగా ఇండియా, బ్రెజిల్, అమెరికా, జర్మనీలు ఉన్నాయి. బ్రిటన్ ఎనిమిదో స్థానంలో ఉంది.
ఎవరైనా తమ మీద స్టాకర్‌వేర్ నిఘా ఉందని సందేహిస్తే.. కొన్ని చర్యలు తీసుకోవచ్చునని మరో సైబర్ భద్రతా సంస్థ చెప్తోంది.
''మీ మొబైల్ ఫోన్‌లో ఏ ఏ యాప్‌లు ఉన్నాయనేది తరచుగా తనిఖీ చేసుకోవటం మంచిది. అవసరమైనపుడు వైరస్ స్కాన్ చేస్తుండాలి. మీకు తెలియని యాప్‌లు ఏవైనా కనిపించినట్లయితే.. వాటి గురించి రివ్యూ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి.. డిలీట్ చేయటం ఉత్తమం'' అని ఎసెట్ సంస్థకు చెందిన జేక్ మూర్ పేర్కొన్నారు.
అమీ తన కంప్యూటర్‌లో స్పైవేర్ ఉందని తెలుసుకున్న తర్వాత.. టెక్నాలజీ మీద ఆమెకు తీవ్ర అపనమ్మకం పెరిగిపోయింది. దాని నుంచి ఆమె ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు.
అటువంటి మనోవేదనకు సాధారణ మానసిక ప్రతిస్పందన ఇదని స్వచ్ఛంద సంస్థలు చెప్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
జీవితాంతం మానసిక ప్రభావం...
స్టాకర్‌వేర్ మరో బాధితురాలు జెస్సికా. ఆమె మాజీ భర్త ఆమె ఫోన్‌లోని మైక్రోఫోన్ ద్వారా ఆమె మీద నిరంతరం నిఘా పెట్టేవాడు. ఆమె, ఆమె స్నేహితుల వ్యక్తిగత సంభాషణల్లో ఉపయోగించిన వాక్యాలను ఆమె దగ్గర ప్రస్తావిస్తూ మైండ్ గేమ్ ఆడేవాడు.
ఆమె ఆ సంబంధం నుంచి బయటపడి చాలా సంవత్సరాలైంది. అయినా.. ఇప్పటికీ ఆమె తన స్నేహితులను కలిసేప్పుడు తన ఫోన్‌ను కారులో పెట్టేసి వెళుతుంటారు.
గృహ హింస విషయంలో పనిచేసే స్వచ్ఛంద సంస్థ 'సేఫర్ ప్లేసెస్'కు చెందిన జెమ్మా టోన్టన్.. తను పరిశీలించిన కేసుల్లో ఇది దీర్ఘకాలిక ప్రభావం చూపుతుండటం కనిపించిందని చెప్పారు.
''ఇది మనుషుల విశ్వాసాన్ని సడలిస్తుంది. వారికి ఫోన్ కానీ, ల్యాప్‌టాప్ కానీ ఒక ఆయుధంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాటిని అలా ఉపయోగిస్తున్నారు కనుక'' అని ఆమె పేర్కొన్నారు.
''సాంకేతిక పరిజ్ఞానం అనేది తమ చుట్టూ పన్నిన ఒక వల లాగా వారికి కనిపిస్తుంది. చాలా మంది ఇంటర్నెట్‌ను ఉపయోగించటం మానేస్తారు'' అని తెలిపారు.
ఇది జీవితాంతం ప్రభావం చూపుతుందని.. అటువంటి స్టాకర్‌వేర్ వినియోగం పెరుగుతుండటం ఆందోళనకరమని చెప్పారు.
అమెరికాకు చెందిన అమీ ఇప్పుడు భర్త నుంచి విడిపోయి.. అతడికి వేల మైళ్ల దూరంలో నివసిస్తున్నారు.
అతడు తనను నేరుగా కలవటం, సంప్రదించటం చేయరాదంటూ అధికారిక ఆంక్షలు తెప్పించుకున్నారు. అతడు వారి కుమారుడి సంరక్షణ విషయంలో కేవలం రాతపూర్వక లేఖల ద్వారా మాత్రమే ఆమెను సంప్రదించటానికి చట్టపరంగా అనుమతి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
మూడు నెలలకు రూ. 13,000...
అత్యంత ప్రజాదరణ గల ఒక స్టాకర్‌వేర్ ఉత్పత్తిని నేను పరీక్షించి చూశాను. దాని ద్వారా మూడు నెలలు నిఘా పెట్టటానికి 140 పౌండ్లు (దాదాపు రూ. 13,000) ఖర్చవుతుంది.
దానిని ఆన్‌లైన్‌లో కొని నా వర్క్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేశాను. అందుకు ఒక గంట సేపు పట్టింది. అందులో ఏదైనా సమస్య ఎదురైతే దానిని పరిష్కరించటానికి సదరు సంస్థ 24 గంటల లైవ్ సపోర్ట్ కూడా అందిస్తోంది. దానినీ నేను వాడుకున్నాను.
ఈ స్పైవేర్ కంపెనీలు తమ ఉత్పత్తులను ''ఎంప్లాయీ మానిటరింగ్'' అని.. ''పేరెంటల్ కంట్రోల్'' అని ప్రచారం చేస్తాయి.
బ్రిటన్ సహా చాలా దేశాల్లో జీవిత భాగస్వామి మీద వారి అనుమతి లేకుండా స్పైవేర్‌ను ఉపయోగించటం చట్ట విరుద్ధం. కాబట్టి.. తమ ఉత్పత్తులను అలా ఉపయోగించరాదని సలహా ఇస్తూ.. అలా ఉపయోగిస్తే తమకు సంబంధం లేదని చాలా కంపెనీల వెబ్‌సైట్లు చెప్తుంటాయి.
కానీ.. అవే వెబ్‌సైట్లు కొన్నిటిలో.. ''మోసం చేసే భార్యలు, భర్తల'' మీద నిఘా కోసం ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలని సిఫారసు చేస్తూ రాసిన వ్యాసాల లింకులు కనిపిస్తాయి. వీటిని ఆయా సంస్థలతో సంబంధం ఉన్నవారే రాసినట్లు కనిపిస్తుంది.
నేను ఉపయోగించిన ఉత్పత్తిని ''నా భార్య ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాను. అది రహస్యంగా ఉంటుందా?'' అని సదరు కంపెనీతో ఒక లైవ్ చాట్‌లో నేను నేరుగా అడిగాను.
సదరు కస్టమర్ సర్వీస్ ప్రతినిధి.. ''ఈ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసిన తక్షణమే రహస్యంగా పనిచేయటం ప్రారంభిస్తుంది. నేను సంతోషంగా సాయం చేస్తాను'' అని బదులిచ్చారు.
ఈ స్పైవేర్‌ను ఇన్‌స్టాల్ చేసిన ఫోన్‌లో.. ఐదు టాప్ సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తులను కూడా డౌన్‌లోడ్ చేసి ఫ్రీ స్కాన్ చేశాను.
అవన్నీ ''ప్రమాదకరం కాగల సాఫ్ట్‌వేర్'' ఉందని నన్ను అప్రమత్తం చేశాయి.
ఇటువంటి నిఘా సాంకేతికత వినియోగానికి వ్యతిరేకంగా చట్టాలు చేయటానికి మరింత కృషి జరగాల్సి ఉందని అమీ అంటారు.
ఇవి కూడా చదవండి:
- స్మార్ట్ ఫోన్లు మన మాటలు, సంభాషణలను రహస్యంగా వింటున్నాయా?
- క్యామ్ స్కానర్ యాప్ వాడుతున్నారా... తస్మాత్ జాగ్రత్త
- మీ చేతిలోని స్మార్ట్ ఫోనే మీకు శత్రువుగా మారితే...
- ఫేస్ యాప్ ఉపయోగిస్తున్నారా... తస్మాత్ జాగ్రత్త
- జింకని చంపుదామనుకుంటే అదే వేటగాడిని చంపేసింది
- హిందుత్వ రాజకీయాలకు రామాయణం టీవీ సీరియల్ ఊపిరి పోసిందా?
- ఇలా చేస్తే మీ భాగస్వామిని మోసం చేయడమా? కాదా?
- బీజేపీ విజయాలకు కారణం కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ లేకపోవడమేనా
- లారీ కంటైనర్‌లో 39 మృతదేహాలు.. 25 ఏళ్ల లారీ డ్రైవర్ అరెస్ట్
- ‘భాగస్వామిని ఆకట్టుకునే కళను మర్చిపోతున్న భారతీయులు’
- ఆర్టీసీ బస్ నంబర్ ప్లేట్ మీద Z ఎందుకుంటుందో తెలుసా
- గుడ్లు ఎక్కువగా తింటే గుండె జబ్బులు వస్తాయా...
- అబార్షన్ పిల్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా రోజూ 10 మంది మృతి
- మహిళలు బ్రా ధరించడం ఎప్పుడు, ఎలా మొదలైంది?
- ‘ఆమెతో సెక్స్ అంటే ఓ కొట్లాట... ఆమె ఒంటి మీది దుస్తులన్నీ చింపేసేవాడ్ని’
- "చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








