మహిళలు బ్రా ధరించడం ఎప్పుడు, ఎలా మొదలైంది?

మహిళలు, బ్రా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సింధువాసిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆడపిల్లలూ, దయచేసి 'స్కిన్ కలర్' బ్రా వేసుకోండి. దాని మీద సమీజ్ కూడా వేసుకోండి.

కొన్ని రోజుల క్రితం దిల్లీలోని ఓ పాఠశాలలో విద్యార్థినులకు ఈ సర్క్యులర్ జారీ చేశారు.

ఇంతకూ ఈ సర్క్యులర్ లక్ష్యం ఏమిటి? బ్రా స్కిన్ కలర్‌లోనే ఎందుకు ఉండాలి? దిల్లీలోని ఇంత వేడిమిలో కూడా బ్రా మీదుగా స్లిప్ వేసుకోవాల్సిన అవసరం ఏముంది?

ఈ ఆదేశాలు కేవలం బాలికలకే ఎందుకు?

మహిళలు, బ్రా

ఫొటో సోర్స్, Getty Images

ఇలాంటి ఆదేశాలు మొదటిసారేం కాదు...

మహిళల అండర్ గార్మెంట్లు, మరీ ప్రత్యేకించి బ్రా చాలా తీవ్రమైన లైంగిక వాంఛలు రేపుతుందనే అభిప్రాయం జనాల్లో ఉంది.

నేటికీ చాలా మంది మహిళలు బ్రాలను ఇతర దుస్తుల కింద దాచి ఆరబెట్టుకుంటారు. పురుషులు కూడా తమ బనియన్లను అలాగే దాస్తారా అన్నదానిపై పరిశోధన చేయాలి.

ఇప్పటికీ ఎక్కడైనా ఒక బ్రా స్ట్రాప్ కనిపించిందంటే జనం గింజుకుంటారు. పురుషులే కాదు, మహిళలు కూడా దాన్ని దుస్తుల కింద దాచి పెట్టమని ఆ బాలికకు సైగలు చేస్తారు.

ఇవన్నీ గతంలో జరిగిన సంఘటనలు అనుకుంటున్నారేమో, కాదు. ఆఖరుకు సెన్సార్ బోర్డు కూడా 'క్వీన్' సినిమాలో కంగనా రనౌత్ బ్రాను కనిపించకుండా బ్లర్ చేసింది.

మహిళలు, బ్రా

ఫొటో సోర్స్, Getty Images

బ్రాలు, పాంటీలు

గత ఏడాది సాహిత్య కళా పరిషత్ నాటక ప్రదర్శనను ఇలాంటి అసహజమైన కారణం వల్లనే నిలిపివేశారు.

ఆ నాటకంలో కొన్ని చోట్ల 'బ్రా', 'పాంటీ' అన్న పదాలను ఉపయోగించారు. ఆ రెండు పదాలే కాకుండా, ఇంకా అనేక అభ్యంతరకర పదాలను ఉపయోగించినట్లు నిర్వాహకులు ఆరోపించారు.

కానీ మహిళలతో మాట్లాడితే, బ్రాలను వేసుకోవడం తమకు అవసరమే కానీ అది ఏ ఇతర జంఝాటం కన్నా తక్కువేమీ కాదని వారంటారు.

మహిళలు, బ్రా

ఫొటో సోర్స్, Getty Images

క్రమక్రమంగా అలవాటైంది...

24 ఏళ్ల రచనకు మొదట్లో బ్రా వేసుకోవడమంటే చిరాకు. కానీ క్రమక్రమంగా ఆమెకు అది అలవాటైపోయింది.

''టీనేజ్‌లో మా అమ్మ బ్రా వేసుకోమంటే నాకు చాలా కోపం వచ్చేది. దాన్ని వేసుకుంటే శరీరాన్ని బంధించినట్లు అనిపించేది. కానీ ఇప్పుడు అది ఒక అలవాటుగా మారింది. అది లేకుంటే ఇప్పుడు చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది'' అన్నారు రచన.

రీవా అనే మరో యువతి, ''గ్రామాలలో బ్రాలను 'బాడీ'లు అంటారు. ఇక పట్టణాలలో కొంత మంది దానిని 'బీ' అని పిలుస్తారు. కొన్నిచోట్ల 'బ్రా' అన్న పేరు పలికితేనే భూకంపం వచ్చినట్లు ఉలిక్కిపడతారు'' అన్నారు.

మహిళలు, బ్రా

ఫొటో సోర్స్, Facebook

వేల రకాల బ్రాలు

గీత అనే మరో మహిళ, ''మనం మన శరీరాన్ని సహజమైన విషయంగా తీసుకుంటే ఇతరులూ అదే విధంగా ప్రవర్తిస్తారు.'' అంటారు.

''గతంలో నాకు బ్రా వేసుకోకుండా బైటికి వెళ్లాలంటే ఇబ్బందిగా అనిపించేది. అయితే క్రమక్రమంగా అది అలవాటైపోయింది.'' అన్నారామె.

నేడు మార్కెట్లో వేలాది రకాల బ్రాలు లభిస్తున్నాయి.

ప్యాడెడ్ బ్రాలు, అండర్‌వేర్ బ్రాలు, స్ట్రాప్‌లెస్ బ్రాలు, స్పోర్ట్స్ బ్రాలు.

కొంతమందికి శరీర భాగాలు పైకి కనిపించేలా కావాలి, కొంత మందికి వాటిని దాచేవి కావాలి.

మహిళలు, బ్రా

ఫొటో సోర్స్, Getty Images

మొదట బ్రా వేసుకోవడం ఎలా అలవాటైంది?

  • 'బీబీసీ కల్చర్‌'లో ప్రచురించిన ఒక వ్యాసం ప్రకారం, ఫ్రెంచి పదం 'బ్రేసియర్' నుంచి బ్రా పుట్టింది. బ్రేసియర్ అంటే శరీర పైభాగం.
  • మొదటి ఆధునిక బ్రాను కూడా ఫ్రాన్స్‌లోనే తయారు చేశారు.
  • ఫ్రాన్స్‌కు చెందిన హెర్మినీ కెడోల్ 1869లో బ్రాను తయారు చేశారు. ఒక డ్రస్సును రెండు ముక్కలుగా చేసి దానితో ఆమె బ్రాను తయారు చేశారు.
మహిళలు, బ్రా

ఫొటో సోర్స్, Underwood Archives/UIG/REX

వక్షస్థలాన్ని దాచుకోవడానికే..

గ్రీసు చరిత్రలో బ్రా లాంటి చిత్రాలు కనిపిస్తాయి. రోమన్ స్త్రీలు తమ వక్షాలు కనిపించకుండా ఒక వస్త్రాన్ని బిగించుకునేవారు.

దానికి భిన్నంగా గ్రీకు మహిళలు ఆ భాగం బాగా కనిపించడానికి ఒక బెల్టును నడుముకు కట్టుకునేవాళ్లు.

నేడు మనకు కనిపించే బ్రాలన్నీ 1930లలో అమెరికాలో తయారయ్యాయి.

అయితే ఆసియాలో బ్రా చరిత్ర గురించి మాత్రం మనకు స్పష్టంగా తెలీదు.

బ్రా

ఫొటో సోర్స్, Getty Images

బ్రా రావడంతోనే దానిపై వ్యతిరేకత

1907 ప్రాంతంలో 'వోగ్' పత్రిక 'brassiere' అన్న పదానికి ప్రాచుర్యం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించింది.

ఆసక్తికరంగా, అదే సమయంలోనే బ్రాకు వ్యతిరేకత కూడా ప్రారంభమైంది.

ఆ సమయంలో ఫెమినిస్టు సంస్థలు మహిళలు 'బ్రా'లు ధరిస్తే వచ్చే ప్రమాదాల గురించి ప్రచారం చేశాయి.

మహిళలను సామాజిక, రాజకీయ బంధనాల నుంచి విముక్తి చేసే దుస్తులు ధరించాలని వాళ్లు సూచించారు.

మహిళలు, బ్రా

ఫొటో సోర్స్, Pictorial Press Ltd / Alamy

ఫొటో క్యాప్షన్, 1990లో ప్రచురించిన ఈ బ్రా ప్రకటనపై బాగా చర్చ జరిగింది.

ఆధునిక బ్రా మొదటి దశ

1911లో 'బ్రా' అన్న పదాన్ని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చేర్చారు.

1913లో అమెరికా సోషలైట్ మేరీ ఫెల్ప్స్ మొదటిసారిగా తన కోసమే సిల్కు వస్త్రం, రిబ్బన్లతో బ్రాను తయారు చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాది ఆమె దానికి పేటెంట్ తీసుకున్నారు.

మేరీ ఫెల్ప్స్ బ్రాలను మొదటి ఆధునిక బ్రాలుగా పేర్కొనవచ్చు. అయితే దానిలో అనేక లోటుపాట్లు ఉండేవి. వక్షోజాలను సపోర్ట్ చేయడానికి బదులు, అవి వాటిని అణచి ఉంచేవి. అంతే కాకుండా కేవలం ఒకే ఒక సైజులో లభ్యమయ్యేవి.

మహిళలు, బ్రా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1949లో బ్రా వాణిజ్య ప్రకటనలో ఒక మహిళ

బ్రాలను మహిళలు చెత్తబుట్టలో పారేసిన వేళ..

1921లో అమెరికన్ డిజైనర్ సంస్థ రోజెంథాల్ వేర్వేరు 'కప్ సైజ్'లతో కూడిన బ్రాలు అన్న ఆలోచనతో వివిధ రకాల శరీర ఆకృతుల కోసం వేర్వేరు రకాల బ్రాలు తయారు చేయడం ప్రారంభించింది.

నాడు ప్రచారమైన బ్రాల ప్రచారం నేటి వరకు కొనసాగుతోంది.

అయితే 1968లో మిస్ అమెరికా బ్యూటీ పజెంట్ పోటీలను నిరసిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

ఆ సందర్భంగా వారు మేకప్ సామాగ్రి, హైహీల్స్‌తో పాటు బ్రాలను చెత్త బుట్టలో పడేశారు.

మహిళలు, బ్రా

ఫొటో సోర్స్, Getty Images

'నో బ్రా? నో ప్రాబ్లమ్'

1960లలో 'బ్రా బర్నింగ్' మహిళల్లో చాలా పాపులర్ అయింది. అయితే నిజానికి కేవలం కొద్ది మంది మహిళలే బ్రాలను తగలబెట్టారు.

అది కేవలం ప్రతీకాత్మక నిరసన మాత్రమే. చాలా మంది మహిళలు బ్రాలను తగలబెట్టలేదు. అయితే తమ నిరసన తెలియజేయడానికి బ్రాలు లేకుండా బయటకు వచ్చారు.

2016లో సోషల్ మీడియాలో బ్రా వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.

17 ఏళ్ల కాటలీన్ జువిక్ బ్రా లేకుండా టాప్ మాత్రం వేసుకుని పాఠశాలకు వెళ్లినపుడు ప్రిన్సిపాల్, బ్రా ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించాడు.

కాటలీన్ ఈ విషయాన్ని స్నాప్‌చాట్ ద్వారా వెల్లడించడంతో ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఈ విధంగా 'నో బ్రా? నో ప్రాబ్లం' ప్రచారం ప్రారంభమైంది.

మహిళలు

ఫొటో సోర్స్, Twitter/"NoBraNoProblem

బ్రాలు - అపోహలు

బ్రా గురించి అనేక అపోహలు ఉన్నాయి. ఇన్నేళ్ల పరిశోధన తర్వాత కూడా బ్రా వల్ల నిజంగా లాభాలున్నాయా లేక నష్టాలా అన్నదానిపై స్పష్టత లేదు.

బ్రా వేసుకోవడం వల్ల రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశం ఉందని అంటున్నా, అమెరికన్ కేన్సర్ సొసైటీ ప్రకారం, అలాంటి దానికి సరైన సాక్ష్యాధారాలు లేవు.

అయితే 24 గంటలు బ్రా వేసుకోవడం వల్ల లేదా సరైన సైజు బ్రా ధరించకపోయినా దాని వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది.

అందువల్ల డాక్టర్లు మరీ టైట్‌గా లేదా మరీ లూజుగా ఉండే బ్రాలను వేసుకోవద్దని సూచిస్తున్నారు. అదే సమయంలో నిద్రపోయేటప్పుడు తేలికపాటి, లూజుగా ఉండే బ్రాలు వేసుకుంటే మంచిది.

మహిళలు వ్యాయామం చేసేటప్పుడు, ఆటలు ఆడేటప్పుడు, శారీరక శ్రమ చేసేటప్పుడు బ్రాలు మహిళలకు బాగా ఉపయోగపడతాయి.

సలోనీ చోప్రా, బ్రా

ఫొటో సోర్స్, Saloni Chopra/Instagram

ఫొటో క్యాప్షన్, నటి సలోనీ చోప్రా ఈ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

ఎందుకు సమాజంలో ఇంత వివాదం?

నేడు బ్రా అన్నది మహిళల దుస్తుల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. బ్రాకు వ్యతిరేకంగా ఇప్పుడు అనేక గొంతుకలు వినిపిస్తున్న మాట కూడా నిజం.

బ్రా అవసరమా, కాదా అన్న విషయం పక్కనబెడితే ఎందుకు బ్రా అన్న పదం వినపడగానే సమాజం ఇంతలా ఉలిక్కిపడుతోంది?

బ్రాల రంగుతో సమస్య, బ్రాల ఆకారంతో సమస్య, బ్రా అన్న పదంతో సమస్య.

ఎందుకు మహిళల శరీరాలను, వాళ్ల దుస్తులను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు?

చొక్కా, ప్యాంట్, బనియన్‌లాగే లాగే బ్రాలు కూడా దుస్తులే. వాటిని అలానే చూడొచ్చుగా!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)