దీపిక పదుకొణె: నాకైతే అలాంటి సమస్య ఎదురుకాలేదు

దీపిక పదుకొణె

ఫొటో సోర్స్, Getty Images

బాలీవుడ్ నటి దీపిక పదుకొణెకు చాలా అంశాల మీద ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరుంది. రకరకాల సామాజిక అంశాల మీద ఆమె స్పష్టమైన అభిప్రాయాలు చెబుతారు. తాజాగా బీబీసీ ప్రతినిధి అట్టికా చౌధురికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. స్త్రీ, పురుషుల మధ్య పారితోషికాల వ్యత్యాసం బాలీవుడ్‌లోనూ ఉందని, దానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు.

ప్రశ్న: ప్రస్తుతం #MeToo ఉద్యమం నడుస్తోంది. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. హాలీవుడ్‌లో చాలా తీవ్రమైన స్పందన కనిపించింది. బాలీవుడ్‌లోనూ ఒకరిద్దరు గళం విప్పుతున్నారు. భారత్‌లో ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించవచ్చు?

దీపిక: నాకు ఎప్పుడూ అలాంటి అనుభవాలు ఎదురుకాలేదు. కానీ, పశ్చిమ దేశాలలో మాదిరిగా ఇక్కడ కూడా అలాంటి తీవ్రమైన పరిణామాలు కనిపించి ఉంటే నా గుండె తరుక్కుపోయేది. నేను తట్టుకోలేకపోయేదాన్ని.

దీపిక పదుకొణె

ఫొటో సోర్స్, Getty Images

ప్రశ్న: మీరు స్త్రీ,పురుషుల మధ్య వేతనాల చెల్లింపుల్లో అసమానతల గురించి కూడా మాట్లాడారు. భారతదేశంలో అలాంటి వివక్ష ఉందా?

దీపిక: ఉంది.

ప్రశ్న: దీన్ని ఎలా మార్చగలం? మహిళలు ప్రతి విషయంలోనూ ఇతరులతో పోరాడాల్సి వస్తోంది కదా?

దీపిక: మహిళలు పోరాడాల్సిందే. ఒక్కోసారి పోరాడడానికి మనం భయపడుతుంటాం. ఇతరులు ఏమనుకుంటారోనని ఆలోచిస్తాం. యథాతథ స్థితికి అలవాటు పడిపోయాం కాబట్టే మనం మౌనంగా ఉంటున్నాం. మంచి మార్పు రావాలంటే మాత్రం పోరాడాల్సిందే.

వీడియో క్యాప్షన్, వీడియో: ఎవరికైనా ఇటువంటి స్థితి రావొచ్చు

ప్రశ్న: ఇక, మానసిక రుగ్మత ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సమస్యగా మారింది. మానసిక కుంగుబాటు నుంచి ఎలా బయటపడ్డారో మీరు గతంలో చెప్పారు. మీ అనుభవాలను వివరించారు. మీరు అలా బాహాటంగా చెప్పడం వల్ల దక్షిణాసియాలో ఆ విషయంలో చాలామంది అవగాహనలో మార్పు వచ్చింది. మీరు ఎలాంటి స్థితిలోకి వెళ్ళారు? ఎలా బయటకు వచ్చారు? ఆ విషయం మాట్లాడాల్సి రావడం గురించి మీకెలా అనిపించింది?

దీపిక: ఈ సమస్య ఎవరికైనా ఎదురుకావచ్చు. ఆ స్పృహ అందరిలో ఉండాలి. సినీతారలు, సంపన్నులు మాత్రమే మానసికంగా నలిగిపోతారనే అపోహ చాలా మందిలో ఉంది. ఇది సరికాదు. ఎవరికైనా ఇటువంటి స్థితి రావొచ్చనే విషయాన్ని గుర్తించడం చాలా ముఖ్యం.

ప్రశ్న: భారతీయ సమాజంలో ఈ సమస్య గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు కదా? దీన్ని వారు సమస్యగానే చూడటం లేదు కదా?

దీపిక: మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. జ్వరం వస్తే చికిత్స ఎలా ఉంటుందో మానసిక వ్యాధికి కూడా చికిత్స ఉంది. సమస్యను పదిమందితో పంచుకోవాలి. దానిపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడు సమస్యను చూసే దృక్పథంలో మార్పు వస్తుంది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)