అమ్మాయిలు నలుగురిలో చెప్పుకోలేని ఆ విషయాలు

ఫొటో సోర్స్, Kaviya Ilango @wallflowergirlsays
ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పులొచ్చినా, సమాజంలో ఇప్పటికీ అనేక మూఢనమ్మకాలు, అవాంఛనీయమైన నిషేధాలు అమలవుతున్నాయి.
అయితే, అలాంటి విషయాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కవియా ఇలాంగో అనే భారతీయ చిత్రాకారిణి తన కుంచెనే అస్త్రంగా చేసుకున్నారు.
అనాదిగా కొనసాగుతున్న మూస ధోరణులను తనదైన రీతిలో ప్రశ్నిస్తున్న కవియా బీబీసీ ప్రతినిధి కృతిక పాతితో మాట్లాడారు.

ఫొటో సోర్స్, Kaviya Ilango @wallflowergirlsays
"అమ్మాయిలు తమ భావాలను బాహాటంగా వ్యక్తీకరించొద్దని చాలా మంది సలహాలిస్తుంటారు, మహిళల 'మైల' బట్టలు ఆరుబయట ఆరేయకూడదని చెబుతుంటారు. అలాంటి దురభిప్రాయాలను ప్రశ్నించేందుకు నా చిత్ర కళనే మార్గంగా ఎంచుకున్నా" అని అంటున్నారు కవియా.
నేటి తరానికి అవగాహన కల్పించేందుకే ఇలా చేస్తున్నానని, తన చిత్రాలు ఎక్కువ మందికి చేరాలన్న ఆలోచనతో సోషల్ మీడియాను వేదికగా మార్చుకున్నట్టు ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Kaviya Ilango @wallflowergirlsays
పదునైన వ్యంగ్యంతో కూడిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆమె నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఆమె వేసే చిత్రాల్లో ఎక్కువగా కాళ్లూ, చేతులపై వెంట్రుకలతో చామనఛాయలో కనిపించే మహిళలే ఉంటారు.
కుర్చీపై ఓ పక్కకు ఒరిగి కింది నుంచి గాలి (అపానవాయువు) వదులుతున్న ఓ యువతి చిత్రం, మహిళ శరీర భాగాలను ఎర్రని గీతలతో వివరిస్తున్న మరో చిత్రం ఉంది. ఆ గీతల్లో ఒకటి ఆమె తొడల గురించి చెబుతుంది. అది 'బియాన్సే తొడ' అని రాసి ఉంది.

ఫొటో సోర్స్, Kaviya Ilango @wallflowergirlsays
శారీరక అందం పేరుతో సౌందర్య ఉత్పత్తుల సంస్థలు, సోషల్ మీడియా ప్రజల్లో లేనిపోని అభద్రతా భావాన్ని నూరిపోస్తున్నాయన్న విషయాన్ని తెలిపేందుకే అలాంటి చిత్రాలను వేస్తున్నట్టు ఆమె చెబుతున్నారు.
"ఎన్నో శతాబ్దాలుగా కొనసాగుతున్న మూఢ విశ్వాసాల గురించి ఇప్పుడు బెరుకు లేకుండా చర్చిస్తున్నామని అనుకుంటున్నా" అని ఆమె అన్నారు.
#100DaysOfDirtyLaundry పేరుతో మహిళల నెలసరి, వ్యక్తిగత సమస్యలు, ఒంటరితనం, మానసిక సమస్యలు వంటి అనేక అంశాలపైన ఆమె చిత్రాలు వేశారు.
"మొదట్లో 100 సవాళ్లపై పేరడీగా చిత్రాలు వేద్దామని అనుకున్నా. కానీ, ఈ చిత్రాలకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ వచ్చింది" అని కవియా అన్నారు.

ఫొటో సోర్స్, Kaviya Ilango @wallflowergirlsays
స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియాలో మునిగిపోతూ ఎలా ఒంటరితనానికి గురవుతున్నామో ఆమె వివరించారు.
ఈ చిత్రాల్లో చాలావరకు హాస్యం, వ్యంగ్యంతో కూడినవే అయినా, వాటిలో నేటి తరంలోని ఆవేదన కూడా కనిపిస్తుంది.
ఇలాంటి చిత్రాలతో పాటు, స్టాండప్ కామెడీ వంటి కార్యక్రమాల ద్వారా వేల ఏళ్లుగా పట్టిపీడిస్తున్న దురభిప్రాయాలను దూరం చేసే వీలుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Kaviya Ilango @wallflowergirlsays
ఈ విషయాలపై ప్రజల్లో అవగాహన పెంచడంపై భారత్‌లో ప్రధాన మీడియా దృష్టిపెట్టడంలేదని కవియా చెబుతున్నారు.
ఇప్పటి వరకూ తన చిత్రాలకు వీక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోందని ఆమె తెలిపారు.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








