ట్రంప్ ఇంత దూకుడుగా ఉన్నా పుతిన్ మౌనంగా ఎందుకున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బ్రియాన్ విండ్సర్, దారియా మోసోలోవా
- హోదా, బీబీసీ మానిటరింగ్
గతంలో ఒక విదేశీ గడ్డపై అమెరికా ఇలాంటి దురాక్రమణ చర్యలకు పాల్పడితే.. రష్యా నుంచి తక్షణమే, తీవ్రమైన స్పందన వచ్చేది.
కానీ, 2026 ప్రారంభం నుంచి పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది.
వెనెజ్వెలా నేత నికోలస్ మదురోను అదుపులోకి తీసుకోవడం, రష్యా జెండాతో వెళ్తోన్న ఆయిల్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నందుకు అమెరికా వేడుకలు చేసుకుంది.
గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకుంటానంటూ బెదిరింపులకూ పాల్పడుతోంది.
ఇంత జరుగుతున్నప్పటికీ.. క్రెమ్లిన్, సంబంధిత ప్రభుత్వ ప్రతినిధులు ఆశ్చర్యకరంగా మౌనంగా ఉంటున్నారు.

అమెరికా ప్రాబల్యాన్ని బ్యాలెన్స్ చేసేందుకు వెనెజ్వెలా, ఆర్కిటిక్ వంటి ప్రాంతాల్లో రష్యా భారీగా పెట్టుబడులు పెట్టింది.
అయితే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఈ పరిణామాలపై ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయలేదు.
కొత్త ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి.. జనవరి 6న ఆర్థోడాక్స్ క్రిస్మస్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మాత్రమే పుతిన్ బహిరంగంగా కనిపించారు.
ఆయన అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్, రష్యా ప్రభుత్వ టీవీ చానళ్లు కూడా ఈ విషయంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
ఈ మౌనం బహుశా.. యుక్రెయిన్ విషయంలో అమెరికాతో రష్యా జరుపుతోన్న ఆచరణాత్మకమైన, సున్నితమైన చర్చలకు విఘాతం కలిగించకూడదని పుతిన్ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రత్యేక సైనిక చర్యలు
డోనల్డ్ ట్రంప్ 2026ను నాటకీయ బల ప్రదర్శనతో ప్రారంభించారు.
వెనెజ్వెలా నేత నికోలస్ మదురోను అదుపులోకి తీసుకుని, డ్రగ్ అక్రమ రవాణా అభియోగాల కింద న్యూయార్క్‌కు తరలించారు.
అంతేకాక, ప్రస్తుతం ఈ లాటిన్ అమెరికా దేశం తాత్కాలికంగా అమెరికా నియంత్రణలో ఉందని తెలిపారు.
సెలవుల కారణంగా రష్యా ప్రభుత్వ టీవీల్లో కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్‌ల సంఖ్య తగ్గినప్పటికీ.. ప్రధాన ప్రభుత్వ మీడియాతో సంబంధం ఉన్న విశ్లేషకులు.. మదురోను త్వరితగతిన ప్రభుత్వం నుంచి తొలగించడం రష్యా ప్రయోజనాలకు అనుగుణంగానే ఉందని చెబుతున్నారు.
అమెరికా తన ప్రాబల్యమున్న ప్రాంతంలో ఇలాంటి ఆధిపత్యాన్ని ప్రదర్శించడం ద్వారా.. పరోక్షంగా క్రెమ్లిన్‌కు తాను కూడా ఇలా చేయొచ్చనే స్వేచ్ఛను ఇచ్చినట్లు అయిందని కొందరు విశ్లేషకులు అంటున్నారు.
క్రెమ్లిన్ అనుకూల వ్యాఖ్యాతలు ఈ చర్యను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్తగా తీసుకొచ్చిన జాతీయ భద్రత వ్యూహానికి చెందిన ఒక ఆచరణాత్మక ఉదాహరణగా పేర్కొంటున్నారు.
ఈ నూతన జాతీయ భద్రత వ్యూహాన్ని ట్రంప్ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేసింది.
రష్యా అధికారులు ఈ జాతీయ భద్రత వ్యూహాన్ని బహిరంగంగానే ప్రశంసించారు.
క్రెమ్లిన్‌కు అత్యంత సన్నిహితుడైన విదేశీ విధానాల నిపుణులు ఫ్యోడోర్ లుక్యనోవ్, మదురోను అదుపులోకి తీసుకోవడంపై స్పందిస్తూ .. దీన్ని అమెరికా సరికొత్త భద్రతా వ్యూహానికి నిదర్శనంగా పేర్కొన్నారు.
''అంతర్జాతీయ సంబంధాల్లో 'శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే ప్రాబల్యమున్న ప్రాంతాలు' మరోసారి అత్యంత ముఖ్యంగా మారుతున్నాయని ట్రంప్ థియరీ స్పష్టం చేసింది'' అని బిజినెస్ న్యూస్‌పేపర్ కొమర్సెంట్‌తో అన్నారు.
రష్యాపై అమెరికా తాజా ఆంక్షలు వ్యూహాత్మక స్థాయిలో కొంత ''అసౌకర్యాన్ని'' కలగజేస్తున్నాయని, అయితే దీర్ఘకాలంలో రష్యాకు ఇవి ప్రయోజనాన్ని చేకూరుస్తాయని రష్యా ఎంపీ, ప్రభుత్వ టీవీ ప్రతినిధి యెవ్‌గెనీ పాపావ్ అభిప్రాయపడ్డారు.
కొందరు రష్యా అనుకూల వ్యాఖ్యాతలు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాత్మక చర్యలపై ఇష్టం లేకపోయినా తమ గౌరవాన్ని వ్యక్తం చేశారు.
రష్యా కూడా ఒక సమయంలో యుక్రెయిన్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడాలనే చూసింది. కానీ, పరిస్థితి చేయిదాటి పూర్తి స్థాయి యుద్ధంగా మారింది.
అమెరికా చర్యలపై తనకు అసూయగా ఉందని రష్యా ప్రభుత్వ మీడియా ఆర్‌టీ (RT) ఎడిటర్-ఇన్-చీఫ్ మార్గరిటా సిమోన్యాన్ టెలిగ్రామ్‌లో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
వెనెజ్వెలాలో భారీగా పెట్టుబడులు పెట్టిన రష్యా
దశాబ్దాలుగా వెనెజ్వెలాలో రష్యా భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే, తన వనరులను, పూర్తి దృష్టిని యుక్రెయిన్ యుద్ధం వైపుకు మరలించడంతో ఈ ప్రాంతంలో దీని ప్రభావం బలహీనపడింది.
జేమ్స్ మార్టిన్ సెంటర్ ఫర్ నాన్‌ప్రొలిఫరేషన్ స్టడీస్‌లో యూరేసియా నాన్‌ప్రొలిఫరేషన్ ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పనిచేస్తోన్న హనా నొటె దీనిపై బీబీసీ మానిటరింగ్‌తో మాట్లాడుతూ.. వెనెజ్వెలా విషయంలో రష్యా విమర్శలు చేయకుండా ఉండటానికి కారణం ఈ సమయంలో ట్రంప్‌కు కోపం తెప్పించకూడదని అధ్యక్షుడు కోరుకుంటున్నారని అనిపిస్తోంది. ఎందుకంటే, ఇంతకంటే పెద్ద సమస్యలను పుతిన్ డీల్ చేయాల్సి ఉందన్నారు.
యుక్రెయిన్ విషయంలో ట్రంప్‌ను తన వైపు ఉంచుకునేలా చేయడం లేదా పూర్తిగా రష్యాకు వ్యతిరేకంగా వెళ్లకుండా ఆయన్ను ఆపడం రష్యా ప్రాధాన్యత అని హనా అభిప్రాయపడ్డారు.
''గత ఏడాది కాలంగా ఈ విషయంలో క్రెమ్లిన్ విజయం సాధించింది. ఈ విజయాన్ని కొనసాగించాలని రష్యా కోరుకుంటోంది. ఎందుకంటే, యుక్రెయిన్ తన టాప్ ప్రయారిటీ'' అన్నారు.
''ట్రంప్‌తో చర్చించేందుకు పుతిన్ వద్ద ఇంతకంటే పెద్ద సీరియస్ విషయం ఉంది. అదే యుక్రెయిన్'' అని కొమర్సెంట్‌తో చెప్పారు.
వెనెజ్వెలాకు తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్‌ను నియమించడాన్ని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్వాగతించింది.
బాహ్య ఒత్తిళ్ల నేపథ్యంలో స్థిరత్వం దిశగా వేసిన అడుగుగా దీన్ని రష్యా మంత్రిత్వ శాఖ అభివర్ణించింది.
అమెరికా పేరును నేరుగా ప్రస్తావించకుండా.. బాహ్య ఒత్తిళ్లు లేకుండా తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు వెనెజ్వెలాకు ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఫొటో సోర్స్, Reuters
సముద్రంలో రష్యా ట్యాంకర్ స్వాధీనం..
రష్యా జెండాతో వెళ్తోన్న ఆయిల్ ట్యాంకర్ మారినెరాను అమెరికా స్వాధీనం చేసుకోవడంపై కూడా ఆచితూచి స్పందించింది రష్యా.
మారినెరా నౌకలో ఉన్న రష్యన్ సిబ్బందిని సురక్షితంగా విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది రష్యా విదేశాంగ శాఖ. దీనికి ట్రంప్ అంగీకరించినట్లు కూడా తెలిపింది.
ఇంత జరుగుతున్నా.. ఈ ప్రాంతంలో రష్యన్ నౌకాదళ నౌకలు ఉన్నాయని నివేదికలు వస్తున్నప్పటికీ.. రష్యా ట్యాంకర్‌ను తిరిగి ఇవ్వాలని లేదా నౌకను పొందేందుకు తాము కూడా గట్టిగా పోరాడతామని చెప్పలేదు.
అమెరికాపై లేదా ఇతర విదేశీ జెండాలతో వెళ్తోన్న నౌకలపై ప్రతీకార చర్యలు తీసుకుంటామని కూడా రష్యా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు.
రష్యా పాటిస్తోన్న ఈ సంయమనంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
సైన్యం స్పందించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్‌మాన్ అలెక్సీ జురావ్లియోవ్.. ''ప్రతీకార చర్యల్లో భాగంగా అమెరికా కోస్టు గార్డు బోట్లను రెండింటిని టార్పెడోలతో (యుద్ధ పరికరాలు) ముంచివేయాలి'' అని అన్నారు.
అంతర్జాతీయ జలాల్లో ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకోవడాన్ని రష్యాపై పూర్తి స్థాయి దాడిగా పరిగణించవచ్చని క్రెమ్లిన్ అనుకూల టెలిగ్రామ్ బ్లాగ్ విజనర్ తన పాఠకులకు తెలిపింది.
గ్రీన్‌లాండ్ పరిణామాలను రష్యా నిశితంగా పరిశీలిస్తోందని 2025 జనవరిలో క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు.
డెన్మార్క్‌కు చెందిన ఈ ఆర్కిటిక్ ప్రాంతంలోని అమెరికా వాదనలను అమెరికా, డెన్మార్క్ మధ్య ద్వైపాక్షిక అంశంగా ఆయన అభివర్ణించారు.
ఈ ప్రాంతాన్ని అమెరికా నియంత్రణలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఉందని జనవరి 7న ట్రంప్ చెప్పినప్పటికీ.. ఇప్పటి వరకు క్రెమ్లిన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
గ్రీన్‌లాండ్‌ను తాము నియంత్రణలోకి తీసుకుంటామని ట్రంప్ చెప్పడంపై రష్యా అనుకూలవాదులు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఎందుకంటే, యూరప్ బలహీనతకు దీన్నొక సంకేతంగా చూస్తున్నారు. యుక్రెయిన్‌లో రష్యా చర్యలను సమర్థించడానికి ఇదొక బలమైన అంశంగా చూస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














