వెనెజ్వెలాపై అమెరికా చర్యను మలేసియా, దక్షిణాఫ్రికా మాదిరిగా భారత్ ఎందుకు బహిరంగంగా ఖండించలేకపోయింది?

భారత ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Getty Images

వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను రాజధాని కారకస్‌ నుంచి గత శనివారం అమెరికా అదుపులోకి తీసుకున్నప్పుడు.. ఈ ఘటనపై ప్రపంచ దేశాలన్ని రెండు వర్గాలుగా చీలిపోయాయి.

అమెరికా తీసుకున్న ఈ చర్యను చాలా దేశాలు ఖండించగా, మరోవైపు మరికొన్ని దేశాలు సమర్థించాయి.

అయితే, భారత్ మాత్రం ఏవైపూ లేదు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తీసుకొచ్చిన అలీన విధానానికి కట్టుబడి ఉంది.

మలేసియా, దక్షిణాఫ్రికా లాంటి దేశాలు వెనెజ్వెలాపై జరిగిన దాడిపై బహిరంగంగా సంఘీభావాన్ని ప్రకటించి, అమెరికా చర్యను తీవ్రంగా ఖండించాయి.

తనను తాను గ్లోబల్ సౌత్‌కు లీడర్‌గా చెప్పుకునే భారత్ ఎందుకు మలేసియా, దక్షిణాఫ్రికా మాదిరి గట్టిగా స్పందించలేకపోయిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఒక దేశం మరొక దేశంపై దాడి చేసినప్పుడు ఎలాంటి వైఖరినైతే అనుసరించిందో.. ప్రస్తుతం అలాంటి ధోరణిని భారత్ అనుసరిస్తోందని చాలామంది నిపుణులు భావిస్తున్నారు.

భారత్ ఏ దేశానికి మద్దతును లేదా వ్యతిరేకతను వ్యక్తం చేయలేదు.

అయితే, దక్షిణాసియాలో కేవలం భారత్ మాత్రమే కాక, దాదాపు అన్ని దేశాల స్పందన కూడా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంది.

వెనెజ్వెలాపై అమెరికా దాడిని ఏ దక్షిణాసియా దేశం కూడా ఖండించలేదు.

''వెనెజ్వెలాలో అమెరికా చర్యకు దక్షిణాసియా ప్రభుత్వాల స్పందనలు బ్యాలన్సింగ్‌గా ఉన్నాయి'' అని దక్షిణాసియా రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలించే మైఖేల్ కుగెల్‌మాన్ అన్నారు.

''ఇది పరోక్ష మద్దతు కాదు. కానీ, చాలా ఆర్థిక వ్యవస్థలు దయనీయమైన పరిస్థితిలో ఉండటంతో ఈ ప్రాంతం వ్యవహరించిన తీరు ఆచరణాత్మకతను, అప్రమత్తతను ప్రతిబింబిస్తోంది'' అని చెప్పారు.

''ముఖ్యంగా అమెరికా సుంకాలు, ఇతర సున్నితమైన వాణిజ్య చర్చలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. కొన్ని సందర్భాల్లో మునుపటి విధానానికి ఇది కొనసాగింపు అని కూడా చెప్పవచ్చు. పలు సైనిక దురాక్రమణలను, జోక్యాలను భారత్ వ్యక్తిగతంగా వ్యతిరేకించింది. కానీ, బహిరంగంగా ఖండించలేదు. ఇటీవల అత్యంత ప్రముఖమైన ఉదాహరణ యుక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ'' అని వివరించారు.

జైశంకర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వెనెజ్వెలాపై అమెరికా దాడి జరిగిన దాదాపు 24 గంటల అనంతరం, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదలైంది.

భారత్ ఎందుకు ఇలా స్పందించింది?

వెనెజ్వెలాపై అమెరికా ఈ ఘటనకు పాల్పడిన తర్వాతి రోజున భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి దీనిపై తొలి ప్రకటన వచ్చింది.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో, "వెనెజ్వెలాలో ఇటీవలి పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం" అని పేర్కొంది.

ఈ ప్రకటన తర్వాత.. భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ మంగళవారం లక్సెంబర్గ్‌లో ఇదే వైఖరిని పునరుద్ఘాటించారు.

వెనెజ్వెలా ప్రజల భద్రత, శ్రేయస్సుకు సంబంధిత అన్ని పక్షాలు ప్రాధాన్యమివ్వాలని అన్నారు.

‘‘ఈ పరిణామాలపై మేం ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. వెనెజ్వెలా ప్రజల భద్రత, శ్రేయస్సు కోసం సంబంధిత అన్ని పక్షాలు కలిసి కూర్చుని, ఒక పరిష్కారాన్ని కనుగొనాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం'' అని జైశంకర్ తెలిపారు.

‘‘భారత ప్రధాన ఆందోళన ఏంటంటే.. వెనెజ్వెలా ప్రజలు ఈ సంక్షోభం నుంచి సురక్షితంగా, మెరుగైన పరిస్థితుల్లో బయటపడాలి’’ అని అన్నారు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా దాడిని భారత్ ఎందుకు ఖండించలేదు?

భారత వైఖరి కొత్తదేమీ కాదని కౌన్సిల్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ (సీఎస్‌డీఆర్) ఫౌండర్ హ్యాపీమోన్ జాకబ్ తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన వరుస పోస్టులలో.. భారత్ ఈ స్పందనకు వెనుకున్న ఐదు కారణాలను చెప్పారు.

''కారకస్‌పై జరిగిన దాడి విషయంలో భారత్ మౌన వైఖరిపై బయట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది'' అని రాశారు.

''యుక్రెయిన్‌పై రష్యా దాడిని భారత్ ఖండించలేదు. అందుకే, వెనెజ్వెలాపై అమెరికా దాడిని ఖండించే అవకాశం తక్కువ. ప్రపంచంలో శక్తివంతమైన (సూపర్‌పవర్లుగా) దేశాలు తాము ఆధిపత్యం చెలాయించే ప్రాంతాల్లో ఇలానే వ్యవహరిస్తాయని భారత్‌కు తెలుసని నేను భావిస్తున్నా. యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తే.. ఇప్పుడు వెనెజ్వెలాపై అమెరికా దాడిని ఖండించాలి. ఇది న్యూదిల్లీకి నచ్చే విషయం కాదు'' అని జాకబ్ అన్నారు.

''ఇది ద్వంద్వ ప్రమాణమా? ఒకవేళ భారత్ ఒక పక్షాన్ని ఖండించి, మరో దాన్ని ఖండించకపోతే ఇలా జరిగి ఉండేది. ట్రంప్ విధానాన్ని పక్కనపెడితే.. భారత జాతి భద్రతకు వాషింగ్టన్, మాస్కోలు చాలా ముఖ్యమైన మిత్రదేశాలు. ఒకవేళ రెండు ముఖ్యమైన భాగస్వామ్య దశాలు ఒకదానిపై ఒకటి చర్యకు దిగితే, అది అతిపెద్ద తప్పిదమైనా, గట్టిగా స్పందించదు. కొన్నిసార్లు మీ ప్రయోజనాలను కాపాడుకునేందుకు మౌనంగా ఉండటం మంచిది. అలాగే, చర్చల మార్గాలను తెరిచి ఉంచాలి'' అని అన్నారు.

తన విదేశాంగ విధానంలో, దేశ అంతర్గత విధానాల్లో విదేశీ జోక్యాన్ని నిరోధించేలా భారత్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని, మెగాఫోన్ డిప్లొమసీని భారత్ నమ్మదని జాకబ్ అన్నారు.

''ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా నుంచి ఎలాంటి కచ్చితమైన మద్దతు రాకపోయిన తర్వాత.. వాషింగ్టన్ ధోరణి ఎంత ట్రాన్సాక్షనల్‌గా (ఇచ్చిపుచ్చుకునే ధోరణిగా) ఉంటుందో భారత్ పూర్తిగా అర్థం చేసుకుంది. ఒకవేళ ఇప్పుడు మనం అమెరికాను ఖండిస్తే.. రాబోయే సంక్షోభంలో అది కచ్చితంగా మన ప్రత్యర్థులవైపు నిల్చుంటుంది. అది దాదాపు ఖాయం'' అని జాకబ్ రాశారు.

యుక్రెయిన్‌గానీ, వెనెజ్వెలాగానీ పక్కనే ఉన్న దేశాల మాదిరిగా వ్యూహాత్మకంగా భారత్‌కు అంత ముఖ్యమైనవి కావని జాకబ్ అన్నారు. అమెరికా చర్యలను ఖండించడం వల్ల రాబోయే ప్రయోజనాల కంటే ఇబ్బందులే ఎక్కువని చెప్పారు.

 వెనెజ్వెలా అధ్యక్షుడు

ఫొటో సోర్స్, Getty Images

వెల్లువెత్తుతోన్న ప్రశ్నలు

మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహ్మిం, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా స్పందనలు కూడా భారత్‌లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి.

''ఇలాంటి చర్యలు అంతర్జాతీయ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘిస్తున్నట్లే. ఒక సార్వభౌమ దేశంపై అన్యాయంగా బలప్రయోగానికి పాల్పడినట్లు అవుతుంది. ఆలస్యం చేయకుండా వెనెజ్వెలా అధ్యక్షుడు మదురోను, ఆయన భార్యను విడుదల చేయాలి. కారణం ఏదైనప్పటికీ, బాహ్య శక్తుల ద్వారా ఒక ప్రభుత్వ అధినేతను బలవంతంగా తొలగించడం ప్రమాదకరమైన ఉదాహరణ అవుతుంది'' అని అన్వర్ ఇబ్రహ్మిం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రాశారు.

''వెనెజ్వెలా ప్రజలే వారి రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించుకుంటారు'' అని అన్నారు.

''చరిత్రను చూస్తే.. బాహ్య శక్తుల ద్వారా అకస్మాత్తుగా అధికారాన్ని మార్చాలని చూసినప్పుడు, మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుంది'' అని రాశారు.

భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు మీడియా అడ్వయిజర్‌గా పనిచేసిన సంజయ్ బారు, అన్వర్ ఇబ్రహ్మిం పోస్టును కోట్ చేస్తూ.. ''మలేసియా మాదిరి భారత్ ఎందుకు స్పందించలేకపోతుంది? వావ్, మలేసియా ప్రధాని'' అని కొనియాడారు.

అదేవిధంగా సిరిల్ రామఫోసా కూడా అమెరికా చర్యను ఒక వీడియో మెసేజ్ ద్వారా ఖండించారు.

ఈయన ప్రకటనను అభినందిస్తూ ఒక యూజర్ రాసిన పోస్టులో, ''గ్లోబల్ సౌత్‌లో భారత్ ఒకప్పుడు చెప్పుకున్న నాయకత్వాన్ని దక్షిణాఫ్రికా మరోసారి ప్రదర్శిస్తోంది'' అని రాశారు.

‘‘లీడర్‌గా ఎదగాలని ఆశిస్తోన్న, గ్లోబల్ సౌత్ గొంతుకగా చెప్పుకుంటోన్న, వివాదాల పరిష్కారానికి చర్చలు, దౌత్యాన్ని సమర్థించే ఒక శక్తివంత దేశంగా ఉద్భవిస్తోన్న భారత్... వెనెజ్వెలాలో అమెరికా జోక్యంపై ఒక ప్రకటన చేస్తుందని ఊహించారు’’ అని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వల్ సిబల్ ఈ పరిణామంపై అన్నారు.

''యుక్రెయిన్‌లో రష్యా సైనిక జోక్యాన్ని మనం ఖండించలేదు. మనం చర్చలు, దౌత్యానికి మాత్రమే పిలుపునిచ్చాం. ఇవాళ యుద్ధానికి సమయం కాదని మాత్రమే నొక్కి చెప్పాం'' అని అన్నారు.

‘‘దీన్ని దృష్టిలో ఉంచుకుని, స్థిరత్వాన్ని ప్రదర్శించాలి. మనం ఖండన అనే భాషను ఉపయోగించాల్సిన అవసరం లేదు. కానీ, సంబంధిత పక్షాలన్ని కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని గుర్తు చేయొచ్చు. సార్వభౌమత్వం, సమానత్వం, దేశాల స్వతంత్రను గౌరవించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పవచ్చు. ఏకపక్ష చర్యలను నివారించాలని, యూఎన్ చార్టర్‌కు కట్టుబడి ఉండాలని, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించవద్దని మనం పిలుపునివ్వవచ్చు'' అని కన్వల్ సిబల్ రాశారు.

‘‘వివాదాలను పరిష్కరించేందుకు, ద్వంద్వ ప్రమాణాలను నివారించడానికి చర్చలకు, దౌత్యానికి మనం పిలుపునివ్వవచ్చు. భద్రతా, ఆర్థిక విషయాల్లో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోన్న అనిశ్చితులతో అభివృద్ధి చెందుతోన్న దేశాలు నలిగిపోతున్న తీరుపై ఆందోళనలను వ్యక్తం చేయొచ్చు'' అని తెలిపారు.

రష్యా, యుక్రెయిన్ నేతలతో భారత ప్రధాని

ఫొటో సోర్స్, Getty Images

భారత అలీన విధానం పాతదే..

2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా దాడికి దిగినప్పుడు కూడా భారత్ వైఖరి తటస్థంగా ఉంది. ఈ దాడికి రష్యాను బహిరంగంగా భారత్ ఖండించలేదు. కానీ, యుక్రెయిన్‌లో శాంతి కోసం పదేపదే పిలుపునిచ్చింది. దౌత్య మార్గం ద్వారా పరిష్కారం కనుగొనాలని కోరింది.

ఏ ఒక్క వర్గంతోనూ పొత్తు పెట్టుకోకూడదనే భారత విధానం ఇటీవలిది కాదు.

భారత విదేశాంగ విధానంలో ఈ అలీన విధానానికి పునాది వేసింది దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ.

ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని తమదైన రీతిలో అనుసరిస్తూ వచ్చాయి.

1957లో, హంగేరీలో సోవియట్ యూనియన్ జోక్యం చేసుకున్న సంవత్సరం తర్వాత, ఈ విషయంలో యూఎస్ఎస్ఆర్‌ను (యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్‌ను) భారత్‌ ఎందుకు ఖండించలేదో అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పార్లమెంటులో వివరించారు.

''ప్రతిరోజూ, ప్రతేడాది ప్రపంచంలో చాలా జరిగాయి. అవి మనకు నచ్చలేదు. కానీ, వాటిని మనం ఖండించలేదు. ఎందుకంటే, ఒక సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఈ ఖండన ఎలాంటి సాయం చేయదు'' అని నెహ్రూ అన్నారు.

''సంక్షోభాల సమయంలో ముఖ్యంగా భారత మిత్రదేశాల మధ్య సంక్షోభం నెలకొన్నప్పుడు.. నెహ్రూ విధానం భారత్‌కు ఒక మార్గాన్ని చూపింది'' అని ది హిందూ పత్రిక ఇంటర్నేషనల్ ఎడిటర్ స్టాన్లీ జానీ రాశారు.

1956లో హంగేరీలో సోవియట్ యూనియన్ జోక్యం అయినా, 1968లో చెకోస్లోవేకియాలో అయినా, 1979లో అఫ్గానిస్తాన్‌లో అయినా భారత్ వైఖరి దాదాపు అలాగే ఉంది.

2003లో ఇరాక్‌ను అమెరికా ఆక్రమించినప్పుడు భారత్ వైఖరి కూడా ఇలాగే ఉంది.

యుక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాను ఖండించకపోవడం, దానిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉండటం భారత్ చారిత్రక తటస్థ వైఖరికి భిన్నంగా లేదని స్టాన్లీ జానీ రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)