నికోలస్ మదురో భార్య సిలియా ఫ్లోరెస్ ఎవరు, ఆమెను కూడా అమెరికా ఎందుకు బంధించింది?

సిలియా ఫ్లోరెస్, నికోలస్ మదురో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రథమ మహిళ కావడానికి ముందే, సిలియా ఫ్లోరెస్ సొంతంగా శక్తిమంతమైన రాజకీయ జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

వెనెజ్వెలాలో సుదీర్ఘకాలంపాటు సిలియా ఫ్లోరెస్ ఫస్ట్‌ లేడీకి మించిన స్థానంలో ఉన్నారు. అధ్యక్షుడు నికోలస్ మదురో భార్య సిలియా ఫ్లోరెస్ కేవలం 'ఫస్ట్ లేడీ' మాత్రమే కాదు. ప్రభుత్వంలో అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరు. మదురో అనుచరులు ఆమెను "తొలి యోధురాలు"గానూ పిలుస్తుంటారు.

సిలియా ఫ్లోరెస్ 1956లో జన్మించారు. భర్త రాజకీయ ప్రస్థానానికి సమాంతరంగా తన సొంతరాజకీయ జీవితం నిర్మించుకున్నారు. కొన్ని సందర్భాల్లో మదురోకన్నా ఉన్నతమైన పదవులు కూడా ఆమె నిర్వహించారు. 2013లో మదురో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక దేశ రాజకీయ దిశను నిర్ణయించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.

అమెరికా సైన్యం జనవరి 3న వెనెజ్వెలాలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో మదురోపాటు సిలియా ఫ్లోరెస్‌ను కూడా అదుపులోకి తీసుకుంది. డ్రగ్స్ అక్రమ రవాణా, ఆయుధాల కేసుల్లో న్యూయార్క్ కోర్టులో వీరిద్దరూ విచారణను ఎదుర్కోనున్నారు.

ఫ్లోరెస్, మదురో ఇద్దరూ వెనెజ్వెలా మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ నీడలోనే రాజకీయంగా ఎదిగారు. చావెజ్ మరణానంతరం 2013 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మదురోనే ఆమెను "ఫస్ట్ వారియర్"గా సంబోధించారు. "ఫస్ట్ లేడీ అనేది ఉన్నత వర్గాల భావన" అని ఆయన ఆ పదాన్ని తోసిపుచ్చారు.

వెనెజ్వెలా అధ్యక్షుడి సన్నిహిత వర్గాలను లక్ష్యంగా చేసుకున్న చర్యలలో భాగంగా, 2018 సెప్టెంబర్‌లో అమెరికా ట్రెజరీ విభాగం సిలియా ఫ్లోరెస్‌పై ఆర్థిక ఆంక్షలు విధించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నికోలస్ మదురో (కుడివైపు), ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2016 మార్చిలో వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురో (కుడివైపు), ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌తో కలిసి డ్యాన్స్ వేస్తోన్న దృశ్యం

సిలియా నేపథ్యం ఏమిటి?

సిలియా ఫ్లోరెస్ వెనెజ్వెలా రాజధాని కారకస్‌కు పశ్చిమాన సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని టినాక్విలో పట్టణంలో జన్మించారు.

"దుమ్ముకొట్టుకుపోయిన ఒక గుడిసెలో ఆమె పుట్టారు" అని మదురో ఒకసారి తెలిపారు. ఫ్లోరెస్‌కు నాలుగేళ్ల వయసున్నప్పుడు ఆమె కుటుంబం కారకస్‌కు వలస వెళ్లింది.

ఆరుగురి తోబుట్టువులలో చివరి వారైన ఫ్లోరెస్, కారకస్ పశ్చిమ ప్రాంతంలోని కాటియా, బోకెరాన్ అనే జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెరిగారు. 32 ఏళ్ల వయసులో సాంటా మారియా ప్రైవేటు విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం క్రిమినల్, కార్మిక చట్టాల్లో స్పెషలైజేషన్ చేశారు.

హ్యూగో చావెజ్ నేతృత్వంలో 1992 ఫిబ్రవరిలో జరిగిన విఫల తిరుగుబాటు ప్రయత్నమే ఆమె జీవితం మలుపు తిరగడానికి కారణమైంది.

ఆ తిరుగుబాటులో పాల్గొన్న సైనికాధికారుల తరఫున వాదించిన న్యాయవాదుల బృందంలో ఫ్లోరెస్ చేరారు. అదే సమయంలో ఆమె చావెజ్ రాజకీయ ఆలోచనలకు దగ్గరయ్యారు.

ఆ రోజుల్లోనే ఆమె మదురోను కలిశారు. అప్పట్లో చావెజ్‌కు మదురో భద్రతా సిబ్బందిలా కనిపించేవారు.

"నేను జీవితంలో సిలియాను కలిశాను. ఆమె జైల్లో ఉన్న దేశభక్త సైనికాధికారుల న్యాయవాది. చావెజ్ జైలులో ఉన్నప్పుడు ఆయన న్యాయవాదిగా ఉండటం చాలా కష్టం," . "ఆ పోరాట కాలంలోనే ఆమె నాకు నచ్చింది"అని మదురో ఒకసారి గుర్తు చేసుకున్నారు

అక్కడి నుంచే వారి ఇద్దరి జీవితాలు చావెజ్, ఆయన రాజకీయ ఉద్యమంతో విడదీయరాని బంధంగా మారాయి.

ఫ్లోరెస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జాతీయ అసెంబ్లీకి 2000లో ఎన్నికైన ఫ్లోరెస్, రెండోసారి గెలిచిన తర్వాత 2006లో ఆ సభకు తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు.

ఎంపీ నుంచి అటార్నీ జనరల్ వరకూ

చావిస్మోకు అనుబంధంగా ఉన్న వివిధ సంస్థలలో 1990లలో ఫ్లోరెస్ చురుగ్గా పనిచేశారు. 1998లో చావెజ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆమె కీలక పదవులు చేపట్టడం ప్రారంభించారు.

జాతీయ అసెంబ్లీకి 2000లో ఎన్నికైన ఫ్లోరెస్, రెండోసారి గెలిచిన తర్వాత 2006లో ఆ సభకు తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు.

ప్రధాన ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించడంతో దాదాపు ఒకే పార్టీ ఆధిపత్యంతో ఉన్న పార్లమెంట్‌ను ఆమె ఆరేళ్లు నడిపించారు.

చావెజ్‌కు గట్టి మద్దతుదారుగా వ్యవహరించిన ఫ్లోరెస్, పార్లమెంట్‌లో మీడియా ప్రవేశాన్ని నిషేధించడం వంటి వివాదాస్పద నిర్ణయాలు కూడా తీసుకున్నారు. 2016 జనవరిలో ప్రతిపక్షాలు శాసనసభపై నియంత్రణ సాధించిన తర్వాతనే ఆ నిషేధం తొలగింది.

మదురో, ఫ్లోరెస్

ఫొటో సోర్స్, Getty Images

బంధుప్రీతి ఆరోపణలు కూడా ఫ్లోరెస్‌ను వెంటాడాయి. 40మందికి ఇచ్చిన ఉద్యోగాల్లో ఎక్కువభాగం ఆమె కుటుంబసభ్యులకే ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి.

"వారు నా కుటుంబం కావడం నాకు గర్వం ఉంది. కార్మికులుగా వారి హక్కులను నేను కాపాడతాను" అని ఆమె అప్పట్లో స్పందించారు.

చావెజ్ ఆమెను 2012లో దేశ అటార్నీ జనరల్‌గా నియమించారు. 2013 మార్చిలో చావెజ్ మరణించే వరకు ఆమె ఆ పదవిలో కొనసాగారు.

అదే ఏడాది జూలైలో మదురోతో వివాహం జరగడంతో ఆమె అధికారికంగా ఫస్ట్ లేడీ అయ్యారు. మదురోకు మునుపటి సంబంధం ద్వారా పుట్టిన ఒకరిని, ఫ్లోరెస్‌కు మునుపటి సంబంధం ద్వారా పుట్టిన ముగ్గురిని, ఇద్దరూ కలిసే పెంచారు.

2015 ఎన్నికల్లో ఫ్లోరెస్ మళ్లీ జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పుడే 15 ఏళ్ల కాలంలో తొలిసారి చావిస్మో మైనార్టీలో పడింది. రెండేళ్ల తరువాత 2017లో ఆమె ఆ పదవి నుంచి తప్పుకుని వివాదాస్పద జాతీయ రాజ్యాంగ సభ సభ్యురాలిగా మారారు.

మదురో, ఫ్లోరెస్

ఫొటో సోర్స్, Getty Images

కుటుంబం

ప్రభుత్వ టీవీలో 'విత్ సిలియా, యాజ్ ఎ ఫ్యామిలీ' అనే కార్యక్రమాన్ని 2015 మేలో ఆమె ప్రారంభించారు.

అయితే ఇటీవలి కాలంలో ఆమెకన్నా ఎక్కువగా వార్తల్లో నిలిచింది ఆమె కుటుంబమే. 2015 నవంబర్‌లో ఆమె ఇద్దరు మేనల్లుళ్లను హైతీలో అరెస్టు అయ్యారు. వారిని అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్‌కు (డీఈఏ) అప్పగించారు.

అమెరికా తమ మేనల్లుళ్లను "అపహరించింది" అని ఫ్లోరెస్ ఆరోపించారు.

కానీ 2017 డిసెంబరులో కోర్టు వారిని డ్రగ్ రవాణా నేరాల్లో దోషులుగా తేల్చి 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

కారకస్ విమానాశ్రయంలోని అధ్యక్ష హ్యాంగర్ ద్వారా 800 కిలోల కొకైన్‌ను హోండురస్‌కు అక్కడి నుంచి అమెరికాకు తరలించేందుకు కుట్ర పన్నారనేది వారిపై మోపిన అభియోగం.

వీరిద్దరికి 2022 అక్టోబర్‌లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్షమాభిక్ష ఇవ్వడంతో వారు విడుదలయ్యారు. ఆ ఒప్పందంలో భాగంగా వెనెజ్వెలాలో నిర్బంధంలో ఉన్న ఏడుగురు అమెరికన్లు విడుదలయ్యారు.

డోనల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా రావడంతో ఆ ఇద్దరు మేనల్లుళ్లతో పాటు ఇతర కుటుంబ సభ్యులపై మళ్లీ ఆంక్షలు విధించారు.

అయితే ప్రస్తుతం అత్యంత తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నది మదురో, సిలియా ఫ్లోరెస్ దంపతులే.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)